rajesh lakhani
-
ఒక ఫ్లాట్ అక్షరాలా రూ.100 కోట్లు.. ఎవరు కొన్నారో తెలుసా..?
-
దాదాపు రూ. 100 కోట్లు.. లగ్జరీ అపార్ట్మెంట్ కొన్న వజ్రాల వ్యాపారి
దేశంలోని ఖరీదైన రియల్ ఎస్టేట్ మార్కెట్‌కు పెట్టింది పేరు ముంబై. ముఖ్యంగా వర్లీ ప్రాంతం అత్యంత ఖరీదైన సీ వ్యూ లగ్జరీ అపార్ట్మెంట్లకు ప్రసిద్ధి చెందింది. అనేక మంది వ్యాపార ప్రముఖలు, సెలబ్రిటీలు ఇక్కడ నివాసాలు కొనుగోలు చేస్తుంటారు. ప్రపంచంలో అతిపెద్ద వజ్రాల కంపెనీల్లో ఒకటైన కిరణ్ జెమ్స్ డైరెక్టర్ రాజేష్ లభుభాయ్ లఖానీ తాజాగా ఇక్కడ రూ.97 కోట్లు పెట్టి లగ్జరీ సీ వ్యూ అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు.త్రీసిక్స్టీ వెస్ట్‌లోని సూపర్ ప్రీమియం రెసిడెన్షియల్ టవర్‌లో రాజేష్ లఖానీ కొనుగోలు చేసిన అపార్ట్మెంట్ 44వ అంతస్తులో ఉంది. దీని విస్తీర్ణం 14,911 చదరపు అడుగులు. ‘జాప్కీ’కి లభించిన పత్రాల ప్రకారం.. రాజేష్ లఖానీ ఈ అపార్ట్‌మెంట్‌ను మరో ఇద్దరు కుటుంబ సభ్యులతో కలిసి ఉమ్మడిగా కొనుగోలు చేశారు. దీనికి సంబంధించిన రిజిస్టేషన్ మే 29న జరగగా రూ.5.84 కోట్లు స్టాంప్ డ్యూటీ కింద చెల్లించినట్లు తెలుస్తోంది.కాగా ఏప్రిల్ నెలలో కిరణ్ జెమ్స్ మేనేజింగ్ డైరెక్టర్, ప్రమోటర్ మావ్జీభాయ్ పటేల్ ఇదే టవర్లోని 47వ అంతస్తులో రూ. 97 కోట్లు వెచ్చించి అపార్ట్మెంట్ కొనుగోలు చేశారు. త్రీసిక్స్టీ వెస్ట్ రెండు టవర్లుగా ఉంటుంది. ఒక దాంట్లో రిట్జ్-కార్ల్టన్ హోటల్ నిర్వహిస్తుండగా మరో టవర్‌లో లగ్జరీ నివాసాలను ఇదే సంస్థ నిర్వహిస్తోంది. ఇందులో ఏడు కార్ పార్కింగ్ స్లాట్లు సహా అత్యాధునిక విలాసవంతమైన సదుపాయాలు ఉన్నాయి. -
అభ్యర్థులపై ఐటీ కన్ను
♦ అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మికదాడులు ♦ 19న ఐటీ అధికారుల బృందం రాక ♦ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ వెల్లడి ఎన్నికల నగదు బట్వాడాను అరికట్టేందుకు ఇన్‌కంటాక్స్ అధికారులు సైతం రంగంలోకి దిగుతున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ తెలిపారు. ఎన్నికల అధికారులతో కలిసి అనుమానిత అభ్యర్థుల ఇళ్లలో, ప్రాంతాల్లోనూ ఆకస్మికదాడులు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ఈ బృందం ఈనెల 19వ తేదీన చెన్నైకి చేరుకోనున్నట్లు వివరించారు. సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల ఏర్పాట్లను శనివారం మీడియాకు వివరిస్తూ, సహజంగా ఎన్నికల పర్యవేక్షణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాత్రమే ఉంటారని, అయితే ఈసారి ఎన్నికల్లో ఐఆర్ఎస్ అధికారులను సైతం రంగంలోకి దించుతున్నామని ఈసీ లఖానీ చెప్పారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును లెక్కకట్టేందుకు మొత్తం 234 నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున ఐఆర్ఎస్ అధికారులను పరిశీలకులను నియమిస్తున్నామని అన్నారు. స్థానిక ప్రభావం ఉండకుం డా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు తెలిపారు. తొలివిడతగా 12 మందితో కూడిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్ఎస్ అధికారుల బృందం ఈనెల 19వ తేదీన చెన్నై చేరుకోనుందని అన్నారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు, పార్టీల బహిరంగ సభలు, ఓటర్లకు నోట్ల పంపిణీపై తీవ్రస్థాయిలో దృష్టిపెడతారని తెలిపారు. అంతేగాక అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను గుర్తించి చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారని చెప్పారు. ఆదాయపు పన్నుశాఖ ప్రత్యేక విభాగం తనిఖీ కమిషనర్ ప్రసేన్‌జిత్ సింగ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌లు విళుపురం, తిరుచ్చి, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆదాయపు పన్నుశాఖ ప్రత్యేక విభాగం తనిఖీ అధికారి రాజీవ్ సిన్హా, అంజూ ఆరోరా, పీవీ రావ్ ఈ ముగ్గురు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై, వేలూరు, కడలూరు జిల్లాలపై దృష్టి పెడతారని తెలిపారు. ఆదాయపు పన్నుశాఖ ప్రత్యేక విభాగం కమిషనర్ సునీల్‌శర్మ, పశండ్య, శశిభూషణ శుక్లా ఈ ముగ్గురు అధికారులు మదురై, విరుదనగర్, నెల్లై, తూత్తుకూడి, కన్యాకుమారి, శివగంగై, రామనాథపురం, దిండుగల్లు, తేనీ తదితర జిల్లాకు పరిశీలకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. కోవై, నీలగిరి, ఈరోడ్డు, తిరుప్పూరు, సేలం, నామక్కల్, ధర్మపురి, కృష్ణగిరి, కరూరు జిల్లాలకు సైతం అదే స్థాయి అధికారులు వస్తున్నారని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆదాయపు పన్నుశాఖ అధికారులు బృందంగా ఏర్పడి ఆకస్మికదాడులు నిర్వహిస్తారని అన్నారు. నగదు బట్వాడా, రహస్యంగా భద్రపరచడం వంటి ఫిర్యాదులు అందగానే దాడులు నిర్వహించి తక్షణ చర్యలు చేపడతారని తెలిపారు. ఈ అధికారులంతా నేరుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆధీనంలో పనిచేయడం వల్ల స్థానికంగా ఎటువంటి ప్రభావానికి లోన య్యే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. నిజాయితీగా ఎన్నికలకు అనుకూలంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలని డీఎంకే ఇచ్చిన విజ్ఞప్తిపై రహస్య విచారణ సాగుతోందని, విచారణ నివేదిక అందిన తరువాత బదిలీలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు. 40 రోజుల్లో రూ.25 కోట్లు స్వాధీనం: 40 రోజులుగా నిర్వహించిన దాడుల్లో రూ.25 కోట్లు పట్టుబడిందని చెప్పారు. అంతేగాక పెద్ద సంఖ్యలో బహుమతుల వస్తువులు, బంగారు, వెండి నగలు, మద్యం బాటిళ్లు లభ్యమైనాయని అన్నారు. అలాగే సేలంలో ఫ్లయింగ్ స్క్వాడ్ జరిపిన దాడుల్లో రూ.12 లక్షల విలువైన సిగరెట్ బండిల్స్ పట్టుబడ్డాయని తెలిపారు. సేలం సెవ్వాయ్పేటకు చెందిన మహేంద్రకుమార్ అనే వ్యక్తికి బెంగళూరు నుండి పార్శిల్ వచ్చినట్లు కనుగొన్నారు. అయితే సరుకుకు తగిన డాక్యుమెంట్లు లేకపోవడంతో రూ.12 లక్షల విలువైన ఆరు బండిళ్ల సిగరెట్‌ను స్వాధీనం చేసుకున్నారు. -
అవి..ఎల్ఈడీ రథాలు
సాక్షి, చెన్నై : నోట్ల కట్టలతో వచ్చినట్టుగా ఆరోపణలకు దారి తీసిన కంటైనర్లు ఎల్ఈడీ స్ర్కన్లతో కూడిన ప్రచార రథాలుగా తేలాయి. ఇదే విషయాన్ని స్ప ష్టం చేస్తూ కాంచీపురం జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి చిట్ల పా క్కం రాజేంద్రన్ ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు తక్షణం స్పం దించారు. ఆధార రహిత ఆరోపణలు చేసిన ఎండీఎంకే నేత వైగో, డీఎంకేకు చెందిన చానల్ పై కేసుల్ని ఆగమేఘాలపై నమో దు చేసి విచారణ చేపట్టారు. ఇక, వదంతులు, పుకార్లు, ప్రచారాల ఆధారంగా తాము ఎలాంటి చర్యలు తీసుకోలేమని రాష్ట్ర ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ సిరుదావూర్ వ్యవహారంలో స్పందించారు. కాంచీపురం జిల్లా తిరుప్పోరూర్ సమీపంలోని సిరుదావూర్ బంగళ్లాలో కో ట్లాది రూపాయల నగదు దాచి పెట్టినట్టు, కంటైనర్ల ద్వారా వాటిని రాష్ర్టంలోని నియోజకవర్గాలకు తరలించే వ్యూహంతో అన్నాడీఎంకే ఉన్నట్టుగా పుకార్లు బయలు దేరిన విషయం తెలిసిందే. డీఎంకేకు చెందిన ఓ చానళ్ అక్కడి దృశ్యాల్ని పదే పదే ప్రసారం చేయడంతో చర్చ బయలు దేరింది. ఆ బంగళాకు వెనుక వైపుగా ఉన్న లారీలను చూపిస్తూ నగదు తరలించే యత్నంలో ఉన్నట్టుగా కథనాల్ని ప్రసారం చేశారు. ఇక, ఎండీఎంకే నేత వైగో తీవ్ర స్థాయిలో ఆరోపణలు గుప్పించారు. ఒక్కో నియోజకవర్గానికి రూ. పది కోట్లు వెచ్చించేందుకుగాను, అక్క డి రహస్య గదుల్లో రూ. 2,340 కోట్లు దాచి పెట్టినట్టుగా ఆరోపణలు చేశారు. దీంతో అప్పుడప్పుడు సీఎం జయలలిత విశ్రాంతి తీసుకునే సిరుదావూర్ బంగళా వార్తల్లోకి ఎక్కింది. ఈ వ్యవహారం రాష్ట్ర ఎన్నికల యంత్రాంగానికి ఫిర్యాదుల రూపంలో చేరింది. అయితే, అవి కంటైనర్ లారీలు కావు అని, తమ ఎన్నికల ప్రచారం కోసం సిద్ధం చేసిన ఎల్ఈడీ స్క్రీన్లతో కూడిన ప్రచార రథాలుగా పేర్కొంటూ, తమ అమ్మ మీద ఆరోపణలు గుప్పించిన వారిపై పోలీసు స్టేషన్లో కాంచీపురం జిల్లా అన్నాడీఎంకే కార్యదర్శి చిట్ల పాక్కం రాజేంద్రన్ ఫిర్యాదు చేశారు. కేసుల నమోదు : సిరుదావూర్ బంగళాలకు విశ్రాంతి నిమిత్తం సీఎం జయలలిత వస్తుంటారని,అ యితే, ఆ బంగళా ఆమెకు సొంతం కాదని తన ఫిర్యాదులతో చిట్ల పాక్కం వివరించారు. అయితే, ఆమె పరువుకు భంగం కల్గే విధంగా ఆధార రహిత ఆరోపణలను ఎండీఎంకే నేత వైగో, డీఎంకే అనుకూల ఓ తమిళ న్యూస్ ఛానల్ వ్యవహరించాయని, వారిపై చర్యలు తీసుకోవాలని కోరుతూ తిరుప్పోరూర్ పోలీసు స్టేషన్లో గురువారం ఫిర్యాదు చేశారు. అలాగే, వారు ఆరోపిస్తున్న కంటైనర్ల తరహా లారీ వాహనాలు ఎంఏబీఐఎస్ శాట్ కామ్ సంస్థ నుంచి అద్దెకు రప్పించినట్టు వివరించారు. ఆ వాహనాలు ఎల్ఈడీ స్కీన్లతో కూడిన తమ ప్రచార రథాలు అని, అయితే, ఆధార రహిత ఆరోపణలతో అందర్నీ తప్పుదోవ పట్టించడంతో పాటుగా తమ అమ్మ పరువుకు భంగం కల్గించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఫిర్యాదుతో పోలీసులు తక్షణం స్పందించారు. ఎండీఎంకే నేత వైగో, ఆ న్యూస్ చానల్పైకేసులు నమోదు చేసి విచారణ వేగవంతం చేశారు. చర్యలు తీసుకోలేం : సిరుదావూర్ బంగళా మీద వస్తున్న ఆరోపణల మీద ఎట్టకేలకు రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారి రాజేష్‌లఖానీ స్పందించారు. ఢిల్లీలో గురువారం జరిగిన ఎన్నికల అధికారుల సమావేశానికి లఖాని హాజరు అయ్యారు. రాష్ట్రంలో సాగుతున్న ఎన్నికల ఏర్పాట్లను ఢిల్లీ వర్గాలకు వివరించారు. ముందుగా చెన్నై మీనంబాక్కం విమానాశ్రయంలో మీడియాతో ఆయన మాట్లాడారు. సిరుదావూర్ బంగళా వ్యవహారాన్ని ప్రస్తావించగా, వదంతులు, పుకార్లు, ప్రచారాల ఆధారంగా తాము చర్యలు తీసుకోలేమని వ్యాఖ్యానించారు. డీఎంకే నుంచే కాదు, ఇతర పార్టీల నుంచి తమకు ఫిర్యాదులు వస్తున్నాయని, వాటన్నింటినీ పరిశీలించి చర్యలు తీసుకుంటున్నామన్నారు. సిరుదావూర్ వ్యవహారంపై కాంచీపురం జిల్లా కలెక్టర్, ఎస్పీలు విచారణ జరుపుతున్నారని, వారు ఇచ్చే నివేదిక ఆధారంగా చర్యలు ఉంటాయని పేర్కొన్నారు. ఇప్పటి వరకు రూ. 16 కోట్ల మేరకు నగదు తనిఖీల్లో పట్టుబడ్డాయని మరో ప్రశ్నకు సమాధానం ఇచ్చారు. తిరుచ్చి సమీపంలో చెత్త కుప్పలో దర్శనం ఇచ్చిన నోట్ల కట్టలకు బ్యాంకుల్లో ఉపయోగించే లేబుల్స్ వ్యవహారంపై కూడా విచారణ వేగవంతం చేసి ఉన్నామన్నారు. -
నోటుకు జైలే!
చెన్నై, సాక్షి ప్రతినిధి: ఓటేసేందుకు నోటు తీసుకుంటే ఓటరు ఏడాది జైలు శిక్షకు గురికావాల్సి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ హెచ్చరించారు. ఈవిషయాన్ని ప్రతి ఓటరుకు తెలిపేందుకు, నిఘా కోసం ప్రత్యేక బృందం పనిచేస్తున్నదని ఆయన అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు పం చడం ఎంత నేరమో తీసుకోవడం కూడా అంతే నేరమని ఆయన అన్నారు. నోటు పంచిన నేతలను శిక్షిస్తున్నట్లే నోటు తీసుకున్న ఓటర్లకు సైతం ఏడాది శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లకు నోటు పంపిణీ జరగకుండా ఒక్కో పోలింగ్ బూత్‌కు ఒక బృందాన్ని నియమించినట్లు తెలిపారు. ఈ బృందంలో గుర్తింపుపొందిన పార్టీల బూత్ ఏజెంట్లు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఓటరు నగదు తీసుకున్నట్లుగా నిర్ధారణైన పక్షంలో ఈ బృందం సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వచ్చి ఓటరును అరెస్ట్ చేస్తారని తెలిపారు. ఈ కఠినమైన చర్య వల్ల నగదు బట్వాడాను కొంత వరకు అదుపుచేయవచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు. తొలిసారిగా ట్విట్టర్ సేవలు: భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నికల కమిషన్ ట్విట్టర్‌తో అనుసంధానమైనట్లు రా జేష్ లఖానీ చెప్పారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ట్వీట్టరు సేవల వినియోగంలోకి తీసుకున్నట్లు రానున్న మే 16వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఓటర్లలో చైతన్యం, ఓటు హక్కు ఆవశ్యకతపై అవగాహన కల్పించడం ద్వారా నూరుశాతం పోలింగ్ సాధించాలని ఎన్నికల కమిషన్ ఆశిస్తోంది. ఇందుకోసం విద్యాసంస్థలకు వెళ్లి విద్యార్థులతో సమావేశాలు నిర్వహించడంతోపాటూ అన్నిరకాల మాధ్యమాలను వాడుకుంటోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటువేయాలనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమమైన ట్విట్టర్‌తో ఎన్నికల కమిషన్ చేతులు కలిపింది. ఇందుకు సంబంధించి ట్విట్టర్ సామాజిక మాధ్యమం జాతీయ అధ్యక్షులు రేవల్ బుధవారం చెన్నై సచివాలయం చేరుకుని ఎన్నికల కమిషనర్ రాజేష్లఖానీతో చర్చలు జరిపారు. ఈ వివరాలను రాజేష్ లఖానీ మీడియాకు వివరించారు. ఎన్నికలను సజావుగా ముగించడమేకాదు వందశాతం పోలింగ్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ట్విట్టర్‌తో ఎన్నికల కమిషన్ అనుసంధానం అయినట్లు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ప్రజలకు చేరువకావడం ఎంతో సులువుగా ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. ట్విట్టర్లో ఇంటర్నెట్లో తమిళనాడు లేదా 100 నంబరును టైప్ చేసి ఈ గుర్తును డెక్ చేసినట్లయితే ప్రజల అకౌంట్ రిజిస్టర్ అవుతుందని తెలిపారు. ఎన్నికల అవగాహన కోసం ఎన్నికల కమిషన్ కొత్తరకమైన స్మైలీ ఇమేజ్ను ట్విట్టర్ కోసం సిద్ధం చేసిందని చెప్పారు. ఓటర్లకు సెలబ్రిటీల ఫొటోలు: ఓటు హక్కును వినియోగించుకున్నాను అంటూ ట్వీట్ చేసిన వారికి సెలబ్రిటీల సంతకంతో కూడిన ఫొటోలను ఓటర్లకు ట్విట్టర్ ద్వారా పంపుతామని తెలిపారు. ఎన్నికల కమిషన్ అవగాహనా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న కమల్‌హాసన్, సూర్య, నయనతార, శ్రుతిహాసన్, సమంత తదితరులు పలు డాక్యుమెంటరీ చిత్రాల్లో నటించారు. వీరి ఫొటోలను ఓటర్ల కోసం సిద్ధంగా ఉంచినట్లు రాజేష్ లఖానీ వివరించారు. రూ.3.3 కోట్లు స్వాధీనం: ఎన్నికల నేపథ్యంలో బుధవారం జరిగిన వాహనాల తనిఖీల్లో మొత్తం రూ.3.3 కోట్లు పట్టు బడింది. తమిళనాడు-కేరళ సరిహద్దులో వాహనాల తనిఖీ చేపడుతుండగా ఒక లగ్జరీ కారులో తరలిస్తున్న రు.2.97 కోట్లు స్వాధీనం చేసుకుని అది హవాలా సొమ్మని తేలడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే భవానీ నియోజకవర్గ పరిధిలోని ఏటీఎం మెషిన్లో సొమ్మును అమర్చేందుకు బ్యాంకు సిబ్బంది వెళుతున్న జీపు నుంచి రూ.13 లక్షలు పట్టుకున్నారు. బ్యాంకు సిబ్బంది వద్ద తగిన డాక్యుమెంట్లు లేకపోవడంతో సొమ్మును ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. కోవైకి చెందిన తంగరాజ్ అనే ఫైనాన్షియర్ దిండుగల్లు నుంచి తిరుప్పూరుకు బస్సులో రూ.20 లక్షలు తీసుకెళుతుండగా తనిఖీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17,350 మంది రౌడీషీటర్లను తాత్కాలికంగా వేరే ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. చెన్నై నుంచి 3,500 మంది రౌడీషీటర్లను గుర్తించి పంపే ప్రయత్నాలు సాగుతున్నాయి. -
తమిళనాడులో 42 మంది నేతలపై ఈసీ వేటు
ఖర్చులు సక్రమంగా చూపనందుకు ఎన్నికల్లో పోటీకి మూడేళ్ల నిషేధం సాక్షి, చెన్నై: తమిళనాడులోని వివిధ పార్టీలకు చెందిన 42 మంది రాజకీయ నాయకులపై ప్రధాన ఎన్నికల కమిషన్(సీఈసీ) మూడేళ్ల నిషేధం విధించింది. ఎన్నికల్లో పోటీ చేసి, ఖర్చుల వివరాలు సక్రమంగా చూపని వీరి పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగిస్తున్నట్లు ప్రకటించింది. 2011రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో పోటీచేసిన 10 మంది అభ్యర్థులు, 2014 పార్లమెంటు ఎన్నికల్లో పోటీ చేసిన 32 మంది అభ్యర్థులు ఎన్నికల ఖర్చులు సక్రమంగా చూపలేదని పేర్కొంటూ మొత్తం 42 మందిపై నిషేధం విధించింది. ఈ 42 మంది మరో మూడేళ్లపాటు ఎన్నికల్లో పోటీ చేసేందుకు వీలులేదని కమిషన్ ఆదేశాలు జారీ చేసినట్లు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ సోమవారం ప్రకటించారు. -
మార్చిలో ఎన్నికల తేదీ
పొంగల్ తరువాత ఎన్నికలపై సమావేశం వాట్సాప్, ఫేస్బుక్ప్రచారాలపైనా నిఘా మీడియాతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల తేదీని మార్చి మొదటి వారంలో వెల్లడించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ తెలిపారు. పొంగల్ పండుగ ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల బృందంతో చెన్నైలో సమావేశం కానున్నట్లు చెప్పారు. చెన్నై సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాల్లో ఓటరు కార్డులు దెబ్బతిన్నందున వాటి స్థానంలో కొత్త కార్డులను జారీచేస్తున్నామని తెలిపారు. కొత్త కార్డుల కోసం 43వేల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 18 వేల మందికి కొత్త కార్డులు జారీ చేశామని చెప్పారు. మిగిలిన వారి కోసం కార్డులు అచ్చు వేసే పనులు ఒకటి రెండు రోజుల్లో ముగుస్తాయని తెలిపారు. కొత్తగా ఓటరు కార్డులు కోరేవారు, కార్డు తొలగింపు, చిరునామా, వివరాల్లో తప్పులు వంటి మార్పులు చేర్పుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సేవా కేంద్రాల ద్వారా పనిపూర్తి చేసి అక్కడే కార్డులు జారీచేసేందుకు సీఈసీని అనుమతి కోరామని అన్నారు. ప్రస్తుతం బ్లాక్ అండ్ వైట్‌లో ఓటరు కార్డులు పొంది ఉన్న వారు కలర్ కార్డు కోసం ఈ సేవా కేంద్రాల నుంచి పొందే సౌకర్యాన్ని కల్పించే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. కలర్ కార్డుల కోసం రూ.15 లేదా రూ.20 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు. ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెల్లడికాగలదని చెప్పారు. తేదీ ఖరారు కంటే ముందుగా ప్రధాన ఎన్నికల అధికారి నేతృత్వంలోని కేంద్ర బృందం చెన్నైలో సమావేశమై ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షిస్తుందని తెలిపారు. పొంగల్ పండుగ తరువాత కేంద్ర బృందం ఏరోజైనా చెన్నైకి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికలకు అవాంతరం ఏర్పడకుండా రాష్ట్రంలో టెన్త్, ప్లస్‌టూ పరీక్షలను నిర్వహించే తేదీలను సేకరించి సీఈసీకి పంపనున్నామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే మే 22వ తేదీలోగా ఎన్నికల ఫలితాలను ప్రకటించి కొత్త ప్రభుత్వం ఏర్పడేలా పనులు సాగుతున్నాయని తెలిపారు. సామాజిక మాధ్యమాలపై నిఘా: ఎన్నికల సమయంలో అభ్యర్థులు సామాజిక మాధ్యమాల ద్వారా సాగించే ప్రచారంపై కూడా నిఘాపెడుతున్నాయని లఖాని తెలిపారు. వాట్సాప్, ఫేస్బుక్,ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశామని తెలిపారు. ఈ నిఘా ద్వారా అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను సైతం పర్యవేక్షిస్తామని చెప్పారు. అంతేగాక ప్రజలు, ఓటర్లు ఎన్నికల నిర్వహణపై తమ అభిప్రాయాలను సైతం తమ వెబ్సైట్లో పొందుపరిచే అవకాశం కల్పిస్తామని తెలిపారు. -
ఎన్నికల కసరత్తు!
చెన్నై : రాష్ట్రంలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణ కసరత్తుల్ని ఎన్నికల యంత్రాంగం వేగవంతం చేసింది. అన్ని పార్టీలతో ఎన్నికల నిర్వహణకు సంబంధించి సమావేశానికి ఏర్పాట్లు జరుగుతున్నాయి. జనవరిలో చెన్నైకు ఢిల్లీ నుంచి ప్రత్యేక అధికారుల బృందం రాబోతోంది. రాష్ట్ర అసెంబ్లీకి మేలో ఎన్నికలు జరగాల్సి ఉంది. ఓ వైపు రాజకీయ పక్షాలు వ్యూహ, ప్రతివ్యూహాలకు సిద్ధమయ్యాయి. ఇక, ఎన్నికల నిర్వహణకు తగ్గ కసరత్తుల్ని ఈసీ రాజేష్ లఖానీ నేతృత్వంలోని అధికార యంత్రాంగం వేగవంతం చేసింది. వరదల కారణంగా ఓటరు గుర్తింపు కార్డులు కోల్పోయిన వాళ్లకు కొత్త కార్డుల మంజూరుకు చర్యలు చేపట్టారు. 15 వేల మంది దరఖాస్తులు చేసుకోవడంతో వారికి జనవరి మొదటి వారంలో కార్డులు మంజూరు అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఇక, ఎన్నికల ఏర్పాట్లను వేగవంతం చేస్తూ, ఎన్నికల నిర్వహణకు సంబంధించి అన్ని పార్టీలతో సమాలోచనకు కసరత్తులు సాగుతున్నాయి. ఇందుకు తగ్గ ఏర్పాట్ల మీద రాజేష్ లఖాని దృష్టి పెట్టి ఉన్నారు. ఒకే విడతగా ఎన్నికలు నిర్వహించాలా..? లేదా, రెండు విడతలుగానా..? అన్న కోణంలో ఈ సారి సమాలోచన సాగే అవకాశాలు కన్పిస్తున్నాయి. తమిళనాడుతో పాటుగా పుదుచ్చేరి, కేరళ తదితర ఐదు రాష్ట్రాల అసెంబ్లీలకు సైతం మేలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో ముం దస్తుగా ఇక్కడికి అవసరమయ్యే ఈవీఎం ల మీద సైతం దృష్టి పెట్టారు. బిహార్ తదితర ఎన్నికలు ముగిసిన రాష్ట్రాల నుంచి 75 వేల ఈవీఎంలను తమిళనాడుకు తీసుకొచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు. అంతకు ముందుగా జనవరి మొదటి లేదా, రెండో వారంలో అన్ని పార్టీల నాయకులతో సమావేశాన్ని పూర్తి చేసి, ఎన్నికల నగారా మోగించేందుకు తగ్గ ఏర్పాట్లు వేగవంతం చేస్తున్నారు. ఇందు కోసం ఢిల్లీ నుంచి ఐదుగురు అధికారులతో కూడిన బృందం నెలాఖరులో లేదా, కొత్త సంవత్సరం వేళ చెన్నైకు రాబోతోంది. ఈ బృందం తొలి పర్యటన తదుపరి, పార్టీలతో సమాలోచన, తుది ఓటర్ల జాబితా ప్రకటన, ఎన్నికల నగరా ప్రక్రియ ..ఇలా అన్ని ఒకదాని తర్వాత మరొకటి సాగే విధంగా కార్యచరణను రాష్ట్ర ఎన్నికల అధికారులు సిద్ధం చేస్తున్నారు.