అభ్యర్థులపై ఐటీ కన్ను
♦ అనుమానిత ప్రాంతాల్లో ఆకస్మికదాడులు
♦ 19న ఐటీ అధికారుల బృందం రాక
♦ రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ వెల్లడి
ఎన్నికల నగదు బట్వాడాను అరికట్టేందుకు ఇన్‌కంటాక్స్ అధికారులు సైతం రంగంలోకి దిగుతున్నారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ తెలిపారు. ఎన్నికల అధికారులతో కలిసి అనుమానిత అభ్యర్థుల ఇళ్లలో, ప్రాంతాల్లోనూ ఆకస్మికదాడులు నిర్వహిస్తారని ఆయన చెప్పారు. ఈ బృందం ఈనెల 19వ తేదీన చెన్నైకి చేరుకోనున్నట్లు వివరించారు.
సాక్షి ప్రతినిధి, చెన్నై: ఎన్నికల ఏర్పాట్లను శనివారం మీడియాకు వివరిస్తూ, సహజంగా ఎన్నికల పర్యవేక్షణలో ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు మాత్రమే ఉంటారని, అయితే ఈసారి ఎన్నికల్లో ఐఆర్‌ఎస్ అధికారులను సైతం రంగంలోకి దించుతున్నామని ఈసీ లఖానీ చెప్పారు. అభ్యర్థుల ఎన్నికల ఖర్చును లెక్కకట్టేందుకు మొత్తం 234 నియోజకవర్గాలకు ఒక్కొక్కరు చొప్పున ఐఆర్‌ఎస్ అధికారులను పరిశీలకులను నియమిస్తున్నామని అన్నారు. స్థానిక ప్రభావం ఉండకుం డా ఇతర రాష్ట్రాల నుంచి వస్తున్నట్లు తెలిపారు. తొలివిడతగా 12 మందితో కూడిన ఐఏఎస్, ఐపీఎస్, ఐఆర్‌ఎస్ అధికారుల బృందం ఈనెల 19వ తేదీన చెన్నై చేరుకోనుందని అన్నారు.
అభ్యర్థుల ఎన్నికల ఖర్చులు, పార్టీల బహిరంగ సభలు, ఓటర్లకు నోట్ల పంపిణీపై తీవ్రస్థాయిలో దృష్టిపెడతారని తెలిపారు. అంతేగాక అధికార పార్టీలకు అనుకూలంగా వ్యవహరించే అధికారులను గుర్తించి చీఫ్ ఎలక్షన్ కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారని చెప్పారు. ఆదాయపు పన్నుశాఖ ప్రత్యేక విభాగం తనిఖీ కమిషనర్ ప్రసేన్‌జిత్ సింగ్, హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్, రాజస్థాన్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజీవ్‌లు విళుపురం, తిరుచ్చి, పుదుచ్చేరి, కారైక్కాల్ ప్రాంతాలను పర్యవేక్షిస్తారని తెలిపారు. ఆదాయపు పన్నుశాఖ ప్రత్యేక విభాగం తనిఖీ అధికారి రాజీవ్ సిన్హా, అంజూ ఆరోరా, పీవీ రావ్ ఈ ముగ్గురు చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, తిరువణ్ణామలై, వేలూరు, కడలూరు జిల్లాలపై దృష్టి పెడతారని తెలిపారు.
ఆదాయపు పన్నుశాఖ ప్రత్యేక విభాగం కమిషనర్ సునీల్‌శర్మ, పశండ్య, శశిభూషణ శుక్లా ఈ ముగ్గురు అధికారులు మదురై, విరుదనగర్, నెల్లై, తూత్తుకూడి, కన్యాకుమారి, శివగంగై, రామనాథపురం, దిండుగల్లు, తేనీ తదితర జిల్లాకు పరిశీలకులుగా వ్యవహరిస్తారని తెలిపారు. కోవై, నీలగిరి, ఈరోడ్డు, తిరుప్పూరు, సేలం, నామక్కల్, ధర్మపురి, కృష్ణగిరి, కరూరు జిల్లాలకు సైతం అదే స్థాయి అధికారులు వస్తున్నారని చెప్పారు. ఐఏఎస్, ఐపీఎస్ అధికారులతో ఆదాయపు పన్నుశాఖ అధికారులు బృందంగా ఏర్పడి ఆకస్మికదాడులు నిర్వహిస్తారని అన్నారు.
నగదు బట్వాడా, రహస్యంగా భద్రపరచడం వంటి ఫిర్యాదులు అందగానే దాడులు నిర్వహించి తక్షణ చర్యలు చేపడతారని తెలిపారు. ఈ అధికారులంతా నేరుగా చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఆధీనంలో పనిచేయడం వల్ల స్థానికంగా ఎటువంటి ప్రభావానికి లోన య్యే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు. నిజాయితీగా ఎన్నికలకు అనుకూలంగా ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను బదిలీ చేయాలని డీఎంకే ఇచ్చిన విజ్ఞప్తిపై రహస్య విచారణ సాగుతోందని, విచారణ నివేదిక అందిన తరువాత బదిలీలు జరిగే అవకాశం ఉంటుందని తెలిపారు.
40 రోజుల్లో రూ.25 కోట్లు స్వాధీనం:
40 రోజులుగా నిర్వహించిన దాడుల్లో రూ.25 కోట్లు పట్టుబడిందని చెప్పారు. అంతేగాక పెద్ద సంఖ్యలో బహుమతుల వస్తువులు, బంగారు, వెండి నగలు, మద్యం బాటిళ్లు లభ్యమైనాయని అన్నారు. అలాగే సేలంలో ఫ్లయింగ్ స్క్వాడ్ జరిపిన దాడుల్లో రూ.12 లక్షల విలువైన సిగరెట్ బండిల్స్ పట్టుబడ్డాయని తెలిపారు. సేలం సెవ్వాయ్‌పేటకు చెందిన మహేంద్రకుమార్ అనే వ్యక్తికి బెంగళూరు నుండి పార్శిల్ వచ్చినట్లు కనుగొన్నారు. అయితే సరుకుకు తగిన డాక్యుమెంట్లు లేకపోవడంతో రూ.12 లక్షల విలువైన ఆరు బండిళ్ల సిగరెట్‌ను స్వాధీనం చేసుకున్నారు.