పొంగల్ తరువాత ఎన్నికలపై సమావేశం
వాట్సాప్, ఫేస్‌బుక్‌ప్రచారాలపైనా నిఘా
మీడియాతో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ
చెన్నై, సాక్షి ప్రతినిధి: అసెంబ్లీ ఎన్నికల తేదీని మార్చి మొదటి వారంలో వెల్లడించనున్నట్లు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి రాజేష్ లఖానీ తెలిపారు. పొంగల్ పండుగ ముగిసిన వెంటనే కేంద్ర ఎన్నికల బృందంతో చెన్నైలో సమావేశం కానున్నట్లు చెప్పారు. చెన్నై సచివాలయంలో గురువారం మీడియాతో మాట్లాడుతూ ఇటీవల వర్షాలు, వరదలతో దెబ్బతిన్న చెన్నై, తిరువళ్లూరు, కాంచీపురం, కడలూరు జిల్లాల్లో ఓటరు కార్డులు దెబ్బతిన్నందున వాటి స్థానంలో కొత్త కార్డులను జారీచేస్తున్నామని తెలిపారు.
కొత్త కార్డుల కోసం 43వేల మంది దరఖాస్తు చేసుకోగా వీరిలో 18 వేల మందికి కొత్త కార్డులు జారీ చేశామని చెప్పారు. మిగిలిన వారి కోసం కార్డులు అచ్చు వేసే పనులు ఒకటి రెండు రోజుల్లో ముగుస్తాయని తెలిపారు. కొత్తగా ఓటరు కార్డులు కోరేవారు, కార్డు తొలగింపు, చిరునామా, వివరాల్లో తప్పులు వంటి మార్పులు చేర్పుల కోసం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఈ సేవా కేంద్రాల ద్వారా పనిపూర్తి చేసి అక్కడే కార్డులు జారీచేసేందుకు సీఈసీని అనుమతి కోరామని అన్నారు. ప్రస్తుతం బ్లాక్ అండ్ వైట్‌లో ఓటరు కార్డులు పొంది ఉన్న వారు కలర్ కార్డు కోసం ఈ సేవా కేంద్రాల నుంచి పొందే సౌకర్యాన్ని కల్పించే ప్రయత్నాలు సాగుతున్నాయని తెలిపారు. కలర్ కార్డుల కోసం రూ.15 లేదా రూ.20 చెల్లించాల్సి ఉంటుందని అన్నారు.
ఇందుకు సంబంధించి అధికారిక ప్రకటన త్వరలో వెల్లడికాగలదని చెప్పారు. తేదీ ఖరారు కంటే ముందుగా ప్రధాన ఎన్నికల అధికారి నేతృత్వంలోని కేంద్ర బృందం చెన్నైలో సమావేశమై ఎన్నికల నిర్వహణ ఏర్పాట్లను సమీక్షిస్తుందని తెలిపారు. పొంగల్ పండుగ తరువాత కేంద్ర బృందం ఏరోజైనా చెన్నైకి చేరుకునే అవకాశం ఉందని తెలిపారు. ఎన్నికలకు అవాంతరం ఏర్పడకుండా రాష్ట్రంలో టెన్త్, ప్లస్‌టూ పరీక్షలను నిర్వహించే తేదీలను సేకరించి సీఈసీకి పంపనున్నామని అన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనే మే 22వ తేదీలోగా ఎన్నికల ఫలితాలను ప్రకటించి కొత్త ప్రభుత్వం ఏర్పడేలా పనులు సాగుతున్నాయని తెలిపారు.
సామాజిక మాధ్యమాలపై నిఘా:
ఎన్నికల సమయంలో అభ్యర్థులు సామాజిక మాధ్యమాల ద్వారా సాగించే ప్రచారంపై కూడా నిఘాపెడుతున్నాయని లఖాని తెలిపారు. వాట్సాప్, ఫేస్‌బుక్,ట్విట్టర్ తదితర సామాజిక మాధ్యమాలపై నిఘా ఉంచేందుకు ప్రత్యేక సాఫ్ట్‌వేర్‌ను సిద్ధం చేశామని తెలిపారు. ఈ నిఘా ద్వారా అభ్యర్థుల ఎన్నికల ఖర్చులను సైతం పర్యవేక్షిస్తామని చెప్పారు. అంతేగాక ప్రజలు, ఓటర్లు ఎన్నికల నిర్వహణపై తమ అభిప్రాయాలను సైతం తమ వెబ్‌సైట్‌లో పొందుపరిచే అవకాశం కల్పిస్తామని తెలిపారు.
మార్చిలో ఎన్నికల తేదీ
Published Fri, Jan 8 2016 2:06 AM | Last Updated on Tue, Aug 14 2018 4:32 PM
Advertisement