నోటుకు జైలే! | Year prison Note Voter case | Sakshi
Sakshi News home page

నోటుకు జైలే!

Published Thu, Mar 17 2016 2:19 AM | Last Updated on Tue, Aug 14 2018 4:34 PM

నోటుకు జైలే! - Sakshi

నోటుకు జైలే!

 చెన్నై, సాక్షి ప్రతినిధి: ఓటేసేందుకు నోటు తీసుకుంటే ఓటరు ఏడాది జైలు శిక్షకు గురికావాల్సి వస్తుందని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి రాజేష్ లఖానీ హెచ్చరించారు. ఈవిషయాన్ని ప్రతి ఓటరుకు తెలిపేందుకు,  నిఘా కోసం ప్రత్యేక బృందం పనిచేస్తున్నదని ఆయన అన్నారు. బుధవారం మీడియాతో మాట్లాడుతూ ఓటుకు నోటు పం చడం ఎంత నేరమో తీసుకోవడం కూడా అంతే నేరమని ఆయన అన్నారు. నోటు పంచిన నేతలను శిక్షిస్తున్నట్లే నోటు తీసుకున్న ఓటర్లకు సైతం ఏడాది శిక్ష తప్పదని ఆయన స్పష్టం చేశారు. ఓటర్లకు నోటు పంపిణీ జరగకుండా ఒక్కో పోలింగ్ బూత్‌కు ఒక బృందాన్ని నియమించినట్లు తెలిపారు. ఈ బృందంలో గుర్తింపుపొందిన పార్టీల బూత్ ఏజెంట్లు, ప్రభుత్వ అధికారులు, స్వచ్ఛంద సేవా సంస్థల ప్రతినిధులు సభ్యులుగా ఉంటారని చెప్పారు. ఓటరు నగదు తీసుకున్నట్లుగా నిర్ధారణైన పక్షంలో ఈ బృందం సభ్యులు ఇచ్చిన సమాచారం మేరకు ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు వచ్చి ఓటరును అరెస్ట్ చేస్తారని తెలిపారు. ఈ కఠినమైన చర్య వల్ల నగదు బట్వాడాను కొంత వరకు అదుపుచేయవచ్చని ఆశిస్తున్నట్లు చెప్పారు.
 
 తొలిసారిగా ట్విట్టర్ సేవలు:                      
 భారతదేశ చరిత్రలోనే తొలిసారిగా ఎన్నికల కమిషన్ ట్విట్టర్‌తో అనుసంధానమైనట్లు రా జేష్ లఖానీ చెప్పారు. ప్రజలకు మరింత చేరువయ్యేందుకు ట్వీట్టరు సేవల వినియోగంలోకి తీసుకున్నట్లు రానున్న మే 16వ తేదీన ఎన్నికల పోలింగ్ జరుగనుంది. ఓటర్లలో చైతన్యం, ఓటు హక్కు ఆవశ్యకతపై అవగాహన కల్పించడం ద్వారా నూరుశాతం పోలింగ్ సాధించాలని ఎన్నికల కమిషన్ ఆశిస్తోంది. ఇందుకోసం విద్యాసంస్థలకు వెళ్లి విద్యార్థులతో సమావేశాలు నిర్వహించడంతోపాటూ అన్నిరకాల మాధ్యమాలను వాడుకుంటోంది. ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా ఓటువేయాలనే నినాదాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు ప్రముఖ సామాజిక మాధ్యమమైన ట్విట్టర్‌తో ఎన్నికల కమిషన్ చేతులు కలిపింది.
 
 ఇందుకు సంబంధించి ట్విట్టర్ సామాజిక మాధ్యమం జాతీయ అధ్యక్షులు రేవల్ బుధవారం చెన్నై సచివాలయం చేరుకుని ఎన్నికల కమిషనర్ రాజేష్‌లఖానీతో చర్చలు జరిపారు. ఈ వివరాలను రాజేష్ లఖానీ మీడియాకు వివరించారు. ఎన్నికలను సజావుగా ముగించడమేకాదు వందశాతం పోలింగ్ సాధించడం లక్ష్యంగా పెట్టుకున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా దేశ ఎన్నికల చరిత్రలో తొలిసారిగా ట్విట్టర్‌తో ఎన్నికల కమిషన్ అనుసంధానం అయినట్లు తెలిపారు. ట్విట్టర్ ద్వారా ప్రజలకు చేరువకావడం ఎంతో సులువుగా ఉంటుందని భావిస్తున్నామని అన్నారు. ట్విట్టర్‌లో ఇంటర్నెట్‌లో తమిళనాడు లేదా 100 నంబరును టైప్ చేసి ఈ గుర్తును డెక్ చేసినట్లయితే ప్రజల అకౌంట్ రిజిస్టర్ అవుతుందని తెలిపారు. ఎన్నికల అవగాహన కోసం ఎన్నికల కమిషన్ కొత్తరకమైన స్మైలీ ఇమేజ్‌ను ట్విట్టర్ కోసం సిద్ధం చేసిందని చెప్పారు.
 
 ఓటర్లకు సెలబ్రిటీల ఫొటోలు:
 ఓటు హక్కును వినియోగించుకున్నాను అంటూ ట్వీట్ చేసిన వారికి సెలబ్రిటీల సంతకంతో కూడిన ఫొటోలను ఓటర్లకు ట్విట్టర్ ద్వారా పంపుతామని తెలిపారు. ఎన్నికల కమిషన్ అవగాహనా కార్యక్రమాల్లో పాలుపంచుకున్న కమల్‌హాసన్, సూర్య, నయనతార, శ్రుతిహాసన్, సమంత తదితరులు పలు డాక్యుమెంటరీ చిత్రాల్లో నటించారు. వీరి ఫొటోలను ఓటర్ల కోసం సిద్ధంగా ఉంచినట్లు రాజేష్ లఖానీ వివరించారు.
 
 రూ.3.3 కోట్లు స్వాధీనం:
 ఎన్నికల నేపథ్యంలో బుధవారం జరిగిన వాహనాల తనిఖీల్లో మొత్తం రూ.3.3 కోట్లు పట్టు బడింది. తమిళనాడు-కేరళ సరిహద్దులో వాహనాల తనిఖీ చేపడుతుండగా ఒక లగ్జరీ కారులో తరలిస్తున్న రు.2.97 కోట్లు స్వాధీనం చేసుకుని అది హవాలా సొమ్మని తేలడంతో ఇద్దరిని అరెస్ట్ చేశారు. అలాగే భవానీ నియోజకవర్గ పరిధిలోని ఏటీఎం మెషిన్‌లో సొమ్మును అమర్చేందుకు బ్యాంకు సిబ్బంది వెళుతున్న జీపు నుంచి రూ.13 లక్షలు పట్టుకున్నారు. బ్యాంకు సిబ్బంది వద్ద తగిన డాక్యుమెంట్లు లేకపోవడంతో సొమ్మును ఇచ్చేందుకు అధికారులు నిరాకరించారు. కోవైకి చెందిన తంగరాజ్ అనే ఫైనాన్షియర్ దిండుగల్లు నుంచి తిరుప్పూరుకు బస్సులో రూ.20 లక్షలు తీసుకెళుతుండగా తనిఖీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 17,350 మంది రౌడీషీటర్లను తాత్కాలికంగా వేరే ప్రాంతాలకు తరలి వెళ్లాలని ఆదేశించారు. చెన్నై నుంచి 3,500 మంది రౌడీషీటర్లను గుర్తించి పంపే ప్రయత్నాలు సాగుతున్నాయి.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement