
సాక్షి, హైదరాబాద్: పార్లమెంటు ఎన్నికల్లో సెంటిమెంటు పనిచేయదని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె.లక్ష్మణ్ పేర్కొన్నారు. జాతీయ స్థాయిలో జరిగే ఎన్నికలను ప్రజలు దేశ ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకుని ఓటేస్తారని వివరించారు. శనివారం ముషీరాబాద్‌లోని బీజేపీ క్యాంపు కార్యాలయంలో పార్టీ కోర్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి మురళీధర్‌రావు, ఎంపీ దత్తాత్రేయ, ఎమ్మెల్సీ రాంచందర్‌రావు, మాజీ ఎమ్మెల్యే జి.కిషన్‌రెడ్డి తదితరులు హాజరయ్యారు. అనంతరం లక్ష్మణ్ మీడియాతో మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్, టీడీపీలకు ఓటేస్తే టీఆర్‌ఎస్‌కు ఓటేసినట్లేనని ఎన్నికల ప్రచారంలో బీజేపీ చెప్పిందని, ప్రస్తుత పరిస్థితులు చూస్తే అది స్పష్టమవుతోందన్నారు. రాష్ట్రంలో కాంగ్రెస్, టీడీపీలు ఖాళీ అయిపోతున్నాయని, టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే పార్టీ బీజేపీయేనని జోస్యం చెప్పారు. వచ్చేనెల 11న ఢిల్లీలో పార్లమెంటు ఎన్నికలపై జాతీయ కౌన్సిల్ సమావేశం జరుగుతుందని తెలిపారు. అమిత్‌షా అధ్యక్షతన జరిగే సమావేశంలో తీసుకునే నిర్ణయాల అనంతరం రాష్ట్రంలో పార్లమెంటు ఎన్నికలపై వ్యూహాత్మకంగా వ్యవహరిస్తామన్నారు.
Comments
Please login to add a commentAdd a comment