దేశవ్యాప్తంగా వాడీవేడిగా పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన వాతావరణం నెలకొన్న ప్రస్తుత సమయంలో కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేపట్టిన ‘భారత్ జోడో న్యాయ యాత్ర’ వల్ల ఉపయోగం లేదని ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ విమర్శలు గుప్పించారు. శుక్రవారం ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న ప్రశాంత్ కిషోర్ రాహుల్ యాత్రపై స్పందించారు.
రాహుల్ గాంధీ యాత్ర తనకు ఆశ్చర్యం కలిగిస్తోందన్నారు. పార్లమెంట్ ఎన్నికల సమయంలో ఇలా యాత్ర చేయమని ఏ ఎన్నికల వ్యూహకర్త చెప్పారోనని ఎద్దేవా చేశారు. ఢిల్లీలోని కేంద్ర పార్టీ కార్యాలయంలో ఉండాల్సిన రాహుల్.. ఎన్నికల సమయంలో ఇలా యాత్ర చేయటం ఒక చెత్త నిర్ణయమని, అసలు ఈ సమయంలో యాత్ర చేపట్టడం సరికాదన్నారు పీకే.
పార్లమెంట్ ఎన్నికలకు సుమారు ఆరు నెలల ముందు ఇటువంటి యాత్ర నిర్వహించాల్సి ఉండేదన్నారు. యాత్ర కాకుండా.. బహిరంగ సభలు, అభ్యర్థుల ఎంపిక ఖరారు, భాగస్వామ్య పక్షాలు కలుపుకుపోవటం, ఎన్నికల కోసం వనరుల సేకరణ, రోజువారి సమస్యలకు పరిష్కారాలపై కసరత్తు చేయాల్సిందన్నారు. కానీ యాత్ర చేయటంలో లాజిక్ ఏం లేదన్నారు.
ప్రస్తుతం ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయం, క్షేత్రస్థాయిలో అందుబాటులో ఉండాలి. కానీ, యాత్ర చేయమని సలహా ఇచ్చింది ఎవరని ఎద్దేవా చేశారు. ప్రతిపక్ష ‘ఇండియా కూటమి’లో నితీష్ కుమార్ వంటి కీలక నేతలు చేజారుతూ బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయేలో చేరుతుంటే.. రాహుల్ గాంధీ మాత్రం ఈశాన్య భారతంలో యాత్రలో ఉన్నారని ఎద్దేవా చేశారు.
దేశంలోని పలు ప్రాంతాల్లో పర్యటించటం కొంతమేరకు మంచిదే అయినప్పటికీ ఢిల్లీలోని కాంగ్రెస్ కేంద్ర కార్యాలయాన్ని వదలటం తెలివైన పని కాదని అన్నారు. రాహుల్ ఇటువంటి చెత్త సలహాలు ఎవరు ఇస్తున్నారో తనకు తెలియటం లేదని అన్నారు. జనవరి 14న మణిపూర్‌లో ప్రారంభమైన రాహుల్ గాంధీ ‘భారత్ జోడో న్యాయ యాత్ర’.. మార్చి 20న ముంబైలో ముగియనుంది. ప్రస్తుతం యాత్ర పశ్చిమ బెంగాల్‌లో కొనసాగుతోంది.
చదవండి: అలాంటి వాళ్లు కాంగ్రెస్ వీడాలనుకున్నా: రాహుల్ గాంధీ
Comments
Please login to add a commentAdd a comment