
లంక ప్రధానిగా మళ్లీ రణిల్!
శ్రీలంక ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘే(66) మరోసారి ప్రధాని పీఠం అలంకరించేందుకు రంగం సిద్ధమైంది.
పార్లమెంటు ఎన్నికల్లో యూఎన్‌పీ విజయం
కొలంబో: శ్రీలంక ప్రస్తుత ప్రధాని రణిల్ విక్రమసింఘే(66) మరోసారి ప్రధాని పీఠం అలంకరించేందుకు రంగం సిద్ధమైంది. ఆయన నేతృత్వంలోని యునెటైడ్ నేషనల్ పార్టీ(యూఎన్‌పీ) సోమవారం జరిగిన పార్లమెంటు ఎన్నికల్లో 106 స్థానాలు గెలుచుకుంది. 225 స్థానాల పార్లమెంట్లో మెజారిటీ సాధించేందుకు ఆ పార్టీకి మరో ఏడుగురు సభ్యుల మద్దతు అవసరం. సాధారణ మెజారిటీకి అవసరమైనన్ని స్థానాలు గెలుచుకోలేకపోయినప్పటికీ.. తమిళ పార్టీల మద్దతుతో విక్రమసింఘే మరోసారి ప్రధానిగా బాధ్యతలు స్వీకరించడం లాంఛనమే. మాజీ అధ్యక్షుడు, ప్రధాని పదవిపై ఆశ పెట్టుకున్న మహీంద రాజపక్స తుది ఫలితాలు వెలువడకముందే ఓటమి అంగీకరించారు.
ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న యునెటైడ్ పీపుల్స్ ఫ్రీడం అలయన్స్(యూపీఎఫ్‌ఏ) 95 స్థానాల్లో గెలిచి రెండో స్థానంలో నిలిచింది. లంక ఉత్తర, తూర్పు ప్రాంతాల్లో తమిళుల ప్రాబల్యమున్న మూడు జిల్లాలను తమిళ్ నేషనల్ అలయన్స్ క్లీన్‌స్వీప్ చేసింది. ఆ జిల్లాల్లోని 16 స్థానాలను గెల్చుకుంది.
లంక పార్లమెంటులోని మొత్తం 225 స్థానాలకు గాను 196 సీట్లకు సోమవారం ఎన్నికలు జరిగాయి. మిగతా 29 స్థానాలను జాతీయ స్థాయిలో సాధించిన ఓట్ల శాతం ఆధారంగా ఆయా పార్టీలకు కేటాయిస్తారు. ఈ గెలుపు తన సుపరిపాలనకు మద్దతుగా ప్రజలిచ్చిన తీర్పని విక్రమసింఘే అన్నారు.
మోదీ అభినందన..
మళ్లీ ప్రధాని కాబోతున్న విక్రమసింఘేను భారత ప్రధాని మోదీ ఫోన్ చేసి అభినందించారు. ఆయన నాయకత్వంలో ఇరు దేశాల సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ట్వీట్ చేశారు.