సాక్షి, కాకినాడ :వచ్చే నెల ఏడున జరగనున్న అసెంబ్లీ, పార్లమెంటు ఎన్నికలకు నామినేషన్ల కోలాహలం మొదలైంది. ఎన్నికల నోటిఫికేషన్ గత శనివారం జారీ కాగా, ఆ రోజు ఐదు నామినేషన్లు మాత్రమే దాఖలయ్యాయి. తరువాత వరుసగా రెండు రోజులు సెలవులు వచ్చాయి. తిరిగి మంగళవారం నామినేషన్ల స్వీకరణ మొదలైంది. జిల్లావ్యాప్తంగా మూడు ఎంపీ స్థానాలకు నలుగురు, 10 అసెంబ్లీ నియోజక వర్గాల పరిధిలో 17 మంది నామినేషన్లు దాఖలు చేశారు. పలు నియోజకవర్గాల్లో వైఎస్సార్ కాంగ్రెస్, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులు నామినేషన్లు వేయడంతో ఎన్నికల వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. భారీ ర్యాలీలు, పాదయాత్రలతో అభ్యర్థులు నామినేషన్లు దాఖలు చేయడంతో ఎటుచూసినా ఎన్నికల కోలాహలం కనిపించింది.
హోరెత్తిన అమలాపురం
అమలాపురం లోక్‌సభ స్థానానికి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి పినిపే విశ్వరూప్ ఉదయం 11.16 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. అమలాపురం ఆర్డీవో కార్యాలయంలో రిటర్నింగ్ అధికారి, జేసీ ఆర్.ముత్యాలరాజుకు రెండు సెట్ల నామినేషన్ పత్రాలు సమర్పించారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు కుడుపూడి చిట్టబ్బాయి నివాసం నుంచి కుటుంబ సభ్యులు, పార్టీ నాయకులతో కలిసి పాదయాత్రగా బయలుదేరిన విశ్వరూప్ సూర్యా నగర్‌లోని వినాయక ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. హైస్కూల్ సెంటర్‌లో మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్‌రెడ్డి విగ్రహానికి నివాళులర్పించారు. అక్కడ నుంచి చిట్టబ్బాయి, పార్టీ అసెంబ్లీ అభ్యర్థులు గొల్ల బాబూరావు, బొంతు రాజేశ్వరావు, గుత్తుల సాయి, చిర్ల జగ్గిరెడ్డిలతో పాటు మాజీ ఎమ్మెల్యేలు అల్లూరి కృష్ణంరాజు, వీవీఎస్‌ఎస్ చౌదరి, పార్టీ సీఈసీ సభ్యుడు రెడ్డి ప్రసాద్, రైతు విభాగం జిల్లా కన్వీనర్ రెడ్డి రాధాకృష్ణ, జిల్లా అధికార ప్రతినిధి పికె రావు, ఆల్డా చైర్మన్ యాళ్ల దొరబాబు తదితరులతో కలిసి ఓపెన్‌టాప్ వ్యాన్‌లో ర్యాలీగా బయలుదేరారు. మోటార్ బైకులపై వందలాదిగా వచ్చిన యువకులతో పాటు వేలాదిగా పార్టీ శ్రేణులు ఈ ర్యాలీలో పాల్గొన్నాయి. నల్లవంతెన నుంచి ఎర్రవంతెన వరకూ ఎన్టీఆర్ మార్గ్ రోడ్డు జనసందోహంతో కిక్కిరిసిపోయింది. విశ్వరూప్ మాట్లాడుతూ వైఎస్సార్‌సీపీ ప్రభంజనం సృష్టించడం ఖాయమని, జిల్లాలోని మూడు పార్లమెంటు, 19 అసెంబ్లీ స్థానాల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థులు ఘన విజయం సాధించనున్నారని చెప్పారు.
పాదయాత్రగా బోస్ నామినేషన్
రామచంద్రపురం అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్‌సీపీ అభ్యర్థిగా ఆ పార్టీ సీఈసీ సభ్యుడు, మాజీ మంత్రి పిల్లి సుభాష్‌చంద్రబోస్ ఉదయం 11.11 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు. తొలుత రామచంద్రపురం గాంధీపేటలోని పార్టీ కార్యాలయం నుంచి వేలాదిమంది కార్యకర్తలు, నాయకులతో కలిసి పాదయాత్రగా ఆర్డీవో కార్యాలయానికి చేరుకున్నారు. రిటర్నింగ్ అధికారి సుబ్బారావు వద్ద నామినేషన్ దాఖలు చేశారు. పార్టీ మండపేట, ముమ్మిడివరం అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థులు గిరజాల వెంకట స్వామినాయుడు, గుత్తుల సాయితో పాటు అనుబంధ విభాగాల కన్వీనర్లు డాక్టర్ యనమదల మురళీకృష్ణ, కర్రి పాపారాయుడు, గుత్తుల వెంకట రమణ, పార్టీ నాయకులు మట్టా శైలజ, కొవ్వూరి త్రినాధరెడ్డి పాల్గొన్నారు. బోస్ మాట్లాడుతూ గత ఉప ఎన్నికల్లో టీడీపీ-కాంగ్రెస్‌లు కుమ్మక్కు రాజకీయాలు చేశాయని, ఈసారి ఎవరెన్ని కుట్రలు.. కుతంత్రాలు పన్నినా ఫ్యాన్ గాలి ముందు నిలవలేవని అన్నారు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి నాయకత్వం కోసం రాష్ర్ట ప్రజలు ఎదురు చూస్తున్నారని, మే 7న ఫ్యాన్ గాలి సునామీగా మారుతుందని అన్నారు.
భారీ ర్యాలీగా విజయలక్ష్మి నామినేషన్
వైఎస్సార్‌సీపీ సీజీసీ సభ్యురాలు జక్కంపూడి విజయలక్ష్మి రాజానగరం అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు. తొలుత కోరుకొండ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం నాయకులు, వేలాదిగా కార్యకర్తలతో కలిసి దోసకాయలపల్లి, కందరాడ, నరేంద్రపురం మీదుగా రాజానగరం వరకూ భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే రౌతు సూర్యప్రకాశరావు, రాజమండ్రి పార్లమెంటు నియోజకవర్గ అభ్యర్థి బొడ్డు వెంకట రమణ చౌదరి, రాజమండ్రి సిటీ, రూరల్ పార్టీ అభ్యర్థులు బొమ్మన రాజ్‌కుమార్, ఆకుల వీర్రాజు తదితరులు ఈ ర్యాలీలో పాల్గొన్నారు. రాజానగరం తహశీల్దార్ కార్యాలయంలో మధ్యాహ్నం 12.45 గంటలకు రిటర్నింగ్ అధికారి మార్కండేయులు వద్ద విజయలక్ష్మి ఒక సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఆమె తనయుడు జక్కంపూడి రాజా డమ్మీగా మరో సెట్ నామినేషన్ వేశారు.
ఇంకా..
కాకినాడ పార్లమెంటు స్థానానికి టీడీపీ అభ్యర్థిగా మాజీ మంత్రి తోట నరసింహం నామినేషన్ దాఖలు చేశారు. ఆయన భార్య వాణి డమ్మీగా నామినేషన్ వేశారు. రాజమండ్రి లోక్‌సభ స్థానానికి సింగిశెట్టి శ్రీనివాసరావు (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), అమలాపురం అసెంబ్లీకి మాజీ ఐఆర్‌ఎస్ అధికారి పీఎస్‌ఆర్ మూర్తి (స్వతంత్ర), తుని నుంచి యనమల కృష్ణుడు(టీడీపీ), డమ్మీగా ఆయన కుమారుడు శివరామకృష్ణ; పెద్దాపురం నుంచి మాజీ జెడ్పీటీసీ సభ్యురాలు నల్లజర్ల హారతి (స్వతంత్ర), కుంచె నాగలక్ష్మి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా); మండపేట నుంచి కోనా సూర్యభాస్కరరావు (స్వతంత్ర) నామినేషన్లు వేశారు. ప్రత్తిపాడు నుంచి అత్యధికంగా నలుగురు నామినేషన్లు వేశారు. సిట్టింగ్ ఎమ్మెల్యే పర్వత చిట్టిబాబు(టీడీపీ), డమ్మీగా పర్వత గుర్రాజు, పర్వత శ్రీపూర్ణచంద్రప్రసాద్ (కాంగ్రెస్), రేచుపల్లి సింహాచలం (సీపీఐ (ఎంఎల్) లిబరేషన్) నామినేషన్లు వేశారు. అనపర్తి నుంచి కత్తి వీరలక్ష్మి (పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా), కొత్తపేట నుంచి దొడ్డిపట్ల శ్రీనివాస్ (స్వతంత్ర), కాకినాడ రూరల్ నుంచి రెడ్డి నారాయణస్వామి, కె.నూకరాజు నామినేషన్లు వేశారు.
కోలాహలంగా..
Published Wed, Apr 16 2014 12:12 AM | Last Updated on Wed, Aug 29 2018 8:54 PM
Advertisement
Advertisement