తెలంగాణ కమలం పార్టీ గత ఎన్నికల్లో గెలిచింది హైదరాబాద్‌లోని గోషామహల్ సీటు ఒక్కటే. తాజా ఎన్నికల్లో 8 స్థానాల్లో పాగా వేసింది. ఉత్తర తెలంగాణలోనే 7 సీట్లు గెలిచింది. దక్షిణ తెలంగాణలో ఒక్కటి కూడా దక్కలేదు. మరి దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పట్టు పెంచుకోవడానికి కాషాయ సేన ఏంచేయబోతోంది?
2018 అసెంబ్లీ ఎన్నికల్లో హైదరాబాద్ నగరంలోని గోషామహల్ నియోజకవర్గం ఒక్కటే బీజేపీ ఖాతాలో పడింది. ఆ తర్వాత జరిగిన రెండు ఉప ఎన్నికల్లో దుబ్బాక, హుజూరాబాద్ సీట్లు కూడా కాషాయ పార్టీ దక్కించుకుంది. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో సికింద్రబాద్‌తో పాటు.. కరీంనగర్, నిజామాబాద్, ఆదిలాబాద్ ఎంపీ సీట్లను బీజేపీ గెలుచుకుంది. ఉత్తర తెలంగాణలో బలంగా ఉన్నామని కమలం పార్టీ భావించింది. అయితే తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో నాలుగు, ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో మూడు అసెంబ్లీ సీట్లను గెలుచుకుంది. నిర్మల్‌లో గెలిచిన ఏలేటి మహేశ్వరరెడ్డి మినహా మిగిలినవారంతా కొత్తవారే. మొత్తం మీద అనుకున్నన్ని స్థానాలు రాకపోయినా.. ఉత్తర తెలంగాణ జిల్లాల్లో పట్టు తగ్గలేదని కమలం పార్టీ నాయకులు సంతోషంగానే ఉన్నారు.
ఇక గ్రేటర్ హైదరాబాద్ కార్పొరేషన్ ఎన్నికల్లో 48 మంది కార్పొరేటర్లను గెలుచుకుని గులాబీ పార్టీని దెబ్బతీశామని భావించిన బీజేపీకి..అసెంబ్లీ ఎన్నికల్లో మళ్లీ గతంలో గెలిచిన గోషామహల్ ఒక్కటే మిగిలింది. కార్పొరేటర్లను భారీగా గెలిచిన నియోజకవర్గాల్లో కూడా కమలం పార్టీ జెండా ఎగరేయలేకపోయింది. సికింద్రాబాద్ ఎంపీ సీటు గెలిచిన చోట కూడా అసెంబ్లీ సీట్లు దక్కలేదు. ఇక మహబూబ్‌నగర్, నల్గొండ, ఖమ్మం, వరంగల్, మెదక్ జిల్లాల్లో కూడా బీజేపీకి ఊహించనంత ఎదురుదెబ్బ తగిలింది. మరో ఐదు నెలల్లో లోక్‌సభ ఎన్నికలు రాబోతున్నాయి. అందుకే వెంటనే దక్షిణ తెలంగాణ జిల్లాలు, గ్రేటర్ హైదరాబాద్ మీద గట్టిగా దృష్టి పెట్టాలని కమలనాథులు భావిస్తున్నారు.
ప్రస్తుతం తెలంగాణలో నలుగురు ఎంపీలు బీజేపీకి ఉన్నారు. రానున్న పార్లమెంట్ ఎన్నికల్లో ఈ నాలుగుతో పాటుగా.. కనీసం మరో నాలుగైనా గెలుచుకోవాలని కమలం పార్టీ వ్యూహరచన చేస్తోంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఉత్తర తెలంగాణ జిల్లాల్లో ఉన్న ఎంపీ సీట్లు కాపాడుకుంటూ.. హైదరాబాద్ సహా దక్షిణ తెలంగాణ జిల్లాల్లో పాగా వేయాలని కమలనాథులు ప్లాన్ వేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment