
చైనాలో ప్రకంపనలు సృష్టిస్తున్నాడు!
ప్రపంచ అగ్రదేశాలలో ఒకటైన చైనా ప్రస్తుతం ఓ యువకుడి గురించి ఆందోళన చెందుతోంది.
చైనా ప్రస్తుతం ఓ యువకుడి గురించి ఆందోళన చెందుతోంది. సరిహద్దు దేశాలతో వివాదాలు, దేశంలో ఎన్నో విషయాలపై నిషేధాలతో తరచూ వార్తల్లో ఉండే చైనా ప్రస్తుతం హాంకాంగ్ యువనేత కారణంగా వర్రీ అవుతోంది. ప్రభుత్వానికి గానీ, దేశానికి వ్యతిరేకంగా ఎలాంటి ప్రచారం జరిగినా ఉపేక్షించని చైనా ప్రభుత్వం హాంకాంగ్ యువనేత ఎడ్వర్డ్ లుంగ్ చేపట్టిన ప్రచారంతో కాస్త ఆలోచనలో పడింది.
మెగా ఫోన్ చేతిలో పట్టుకుని నడివీధిలో నిల్చుని.. 'భవిష్యత్తు మన హాంకాంగ్ దే. మనం కచ్చితంగా గెలిచి తీరుతాం' అంటూ పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా గొంతెత్తారు. ఇతర పార్టీల నేతలు భారీ ఫ్లెక్సిలతో ప్రచారం చేస్తున్నా కేవలం ముగ్గురు వాలంటీర్లతో కలిసి ర్యాలీలో పాల్గొంటున్నారు. కొంతమంది ఎడ్వర్డ్ వద్దకు వెళ్లి షేక్ హ్యాండ్ ఇచ్చి, సెల్ఫీలు దిగుతుండటం బీజింగ్ అధికారులకు అంతగా రుచించడం లేదు.
హాంకాంగ్ పార్లమెంట్, లెజిస్లేటివ్ కౌన్సిళ్లకు త్వరలో జరగనున్న ఎన్నికల్లో లుంగ్ పోటీ చేయడం లేదు. కారణం.. ఎన్నికల కమిషన్ అతడి అభ్యర్థిత్వాన్ని తిరస్కరించింది. లుంగ్ ను నిషేధించడం ప్రభుత్వానికి, బీజింగ్ పెద్దలకు నష్టాన్ని కలిగించే అంశమని చైనా యూనివర్సిటీ ప్రొఫెసర్ మా ఎన్గాక్ తెలిపారు. స్వతంత్రులుగా ఎన్నికల బరిలో నిలిచిన వారికి మద్దతునిస్తూ లుంగ్ తన ప్రచారాన్ని కొనసాగిస్తూ ప్రకంపనలు సృష్టిస్తున్నాడు.