
పోస్టల్ బ్యాలెట్ల సందడి
నేటితో దరఖాస్తుకు గడువు పూర్తి
సత్తుపల్లి టౌన్ , న్యూస్‌లైన్: ఈ నెల 30న జరిగే అసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలకు ఓటర్లతో పాటు ఉద్యోగుల ఓట్లు కూడా కీలకం. వందల సంఖ్యలో ఉద్యోగుల పోస్టల్ బ్యాలెట్ ఓట్లు ఉండడంతో రాజకీయ పార్టీల దృష్టి వీరిపై పడింది. అసెంబ్లీ, పార్లమెంట్‌కు జరిగే ఈ ఎన్నికల్లో ఈ ప్రాంత ఉద్యోగులు సుదూరప్రాంతాల్లో విధులు నిర్వహించాల్సి ఉంటుంది. ఖమ్మం పార్లమెంట్ పరిధిలో ఉద్యోగులు..
ఇతర పార్లమెంట్ ప్రాంతానికి గానీ, సమీప జిల్లాల్లో గానీ పని చేయాల్సి ఉంటుంది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగులు తమ ఓటు హక్కును వినియోగించుకునేందుకు శిక్షణ కార్యక్రమంలోనే వారికి బ్యాలెట్ పత్రాల దరఖాస్తు చేసుకునేందుకు ఫాం-12, ఫాం-12ఏలను అందించారు. పోస్టల్ అడ్రస్, పోలింగ్ స్టేషన్ నంబర్ తదితర వివరాలతో ఈ దరఖాస్తులు పూర్తి చేసి స్థానిక తహశీల్దార్ కార్యాలయంలో ఈ నెల 15లోగా అందించాల్సి ఉంది.
ఉద్యోగుల కోసం బ్యాలెట్ పత్రాలు..
సార్వత్రిక ఎన్నికలకు ఈవీఎంలను వినియోగిస్తున్నప్పటికీ ఎన్నికల్లో పాల్గొనే ఉద్యోగుల కోసం బ్యాలెట్ పత్రాలు ముద్రించి వారి చిరునామాలకు పోస్టులో పంపిస్తారు. ఉద్యోగులు తమకు నచ్చిన అభ్యర్థి గుర్తుపై పెన్నుతో టిక్ చేసిన తర్వాత బ్యాలెట్ పత్రాలు తహశీల్దార్ కార్యాలయంలో ఏర్పాటు చేసే బ్యాలెట్ బాక్స్‌లో వేయాలి. ఈ నెల 30లోపే ఈ ప్రక్రియ పూర్తి అవ్వాలి. గడువు ఒక్కరోజు మాత్రమే ఉండడంతో ఉద్యోగులతో సత్తుపల్లి రెవెన్యూ కార్యాలయం సందడిగా మారింది.
పోస్టల్ బ్యాలెట్ ఇంటికి పంపితే ఒత్తిడి తప్పదు..
ఎన్నికల విధుల్లో పాల్గొనే ఉద్యోగులకు పోస్టల్ బ్యాలెట్ విధానంలో మార్పు చేసినట్లు సమచారం. రెవెన్యూ కార్యాలయంలో బ్యాలెట్ పత్రాలు ఇస్తారు. ఓటు వేసి వెంటనే అక్కడే ఉన్న బ్యాలెట్ బాక్స్‌లో వేయాలి. అయితే ఈ విధానం వల్ల ఉద్యోగులు స్వేచ్ఛగా, రహస్యంగా ఓటు వేసుకోవచ్చని భావిస్తున్నారు.
కానీ బ్యాలెట్ పత్రాలు ఇంటికే పంపించినట్లయితే ఉద్యోగులకు రాజకీయ పార్టీల నుంచి ఒత్తిడి తప్పదని వాపోతున్నారు. ఇప్పటికే కొందరు ఉద్యోగులు పోస్టల్ బ్యాలెట్లను సేకరించి అభ్యర్థుల నుంచి తగిన ఫలాన్ని పొందేందుకు సమాయత్తమవుతున్నట్లు తెలుస్తోంది.