మున్సిపల్ ఫలితాలు నేడే | Muncipal polls results today | Sakshi
Sakshi News home page

మున్సిపల్ ఫలితాలు నేడే

Published Mon, May 12 2014 12:49 AM | Last Updated on Tue, Oct 16 2018 6:33 PM

మున్సిపల్ ఫలితాలు నేడే - Sakshi

మున్సిపల్ ఫలితాలు నేడే

మున్సిపల్ ఫలితాలు నేడే
 మధ్యాహ్నానికే ఫలితాలు వెల్లడి: రమాకాంత్‌రెడ్డి
  కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమాణ స్వీకారం తరువాతే పురపాలక చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక
  మొత్తం 513 డివిజన్లు, 3,931 వార్డులకు ఓట్ల లెక్కింపు.. 
  155 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు 8,000 మంది సిబ్బంది
 
 సాక్షి, హైదరాబాద్:  రాష్ట్రంలో పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు మార్చి 30వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 145 మున్సిపాలిటీలు, 10 మునిసిపల్ కార్పొరేషన్‌ల ఫలితాలు వెల్లడవుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు.
 
ఫలితాలు వెల్లడైనప్పటికీ.. పురపాలక సంఘాలకు కొత్త పాలక మండళ్లు జూన్ ఐదో తేదీ తరువాత మాత్రమే ఏర్పాటు కానున్నాయి. ఈ నెల 16న శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక, కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే.. మునిసిపాలిటీలకు చైర్‌పర్సన్లు, వైస్-చైర్‌పర్సన్లు; కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్ల పరోక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు పరోక్ష ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నందున, వారి హక్కును కాపాడాల్సిన బాధ్యత  కమిషన్‌కు ఉందని ఆయన పేర్కొన్నారు.
 
ఎన్నికల తర్వాత నెలన్నర రోజులుగా ఈవీఎంలకు గట్టి భద్రత కల్పించామని, ఎక్కడా ఇబ్బందులులేవని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు జరగని తొమ్మిది కార్పొరేషన్లు, 17 మునిసిపాలిటీలకు రెండో దశలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల వివరాలను రమాకాంత్‌రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో వివరించారు. ముఖ్యాంశాలివీ... 
 
  • 145 మునిసిపాలిటీల్లో మొత్తం 3,970 వార్డులు ఉండగా.. అందులో 39 వార్డులకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 3,931 మునిసిపల్ వార్డులకు, 10 కార్పొరేషన్లలో 513 డివిజన్లకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. 
  • మునిసిపల్ ఎన్నికలకు దాదాపు 9,500 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వాడారు. ఓట్ల లెక్కింపుకు 8,000 మంది సిబ్బందిని నియమించారు. 
  • 65 ప్రాంతాల్లోని 155 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెవెన్యూ డివిజన్, డీఎస్‌పీ కార్యాలయ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ నిర్వహిస్తున్నారు. 
  •  ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరిస్తారు. ఫలితాలపై ఎవరైనా కోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు.. ఓట్ల లెక్కింపు తరువాత ఈవీఎంలను భద్రపరుస్తారు. 
  •  ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. 
 ప్రాదేశిక ఓట్ల లెక్కింపు 2,099 కేంద్రాల్లో
 మండల, జిల్లాపరిషత్ ప్రాదేశిక ఓట్ల లెక్కింపు ఈ నెల 13వ తేదీన 2,099 కేంద్రాల్లో చేపడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. 1,096 జడ్‌పీటీసీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఒక స్థానం ఏకగ్రీవం కాగా, రెండు స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఎన్నికలు జరిగిన 1,093 జడ్‌పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపడతామని చెప్పారు. అలాగే 16,589 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చినా 346 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 19 స్థానాల్లో ఎవరూ నామినేషనుల దాఖలు చేయకపోవడం, మరో ఆరు స్థానాలపై కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగలేదు. మంగళవారం 16,214 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని కమిషనర్ వివరించారు. ఓట్ల లెక్కింపుకు 15,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement