P.Ramakanth reddy
-
ఎన్నికల ఫలితాలపై మీడియాతో రమాకాంత్‌రెడ్డి
-
మున్సిపల్ ఫలితాలు నేడే
-
మున్సిపల్ ఫలితాలు నేడే
మున్సిపల్ ఫలితాలు నేడే మధ్యాహ్నానికే ఫలితాలు వెల్లడి: రమాకాంత్‌రెడ్డి కొత్తగా ఎన్నికయ్యే ఎమ్మెల్యేలు, ఎంపీల ప్రమాణ స్వీకారం తరువాతే పురపాలక చైర్మన్లు, కార్పొరేషన్ మేయర్ల ఎన్నిక మొత్తం 513 డివిజన్లు, 3,931 వార్డులకు ఓట్ల లెక్కింపు.. 155 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపునకు 8,000 మంది సిబ్బంది సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో పురపాలక సంఘాలు, నగరపాలక సంస్థలకు మార్చి 30వ తేదీన జరిగిన ఎన్నికల ఫలితాలు మరికొద్ది గంటల్లో వెలువడనున్నాయి. సోమవారం ఉదయం ఎనిమిది గంటల నుంచి ఓట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభం కానుంది. మధ్యాహ్నం 12 గంటల వరకు 145 మున్సిపాలిటీలు, 10 మునిసిపల్ కార్పొరేషన్ల ఫలితాలు వెల్లడవుతాయని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు. ఫలితాలు వెల్లడైనప్పటికీ.. పురపాలక సంఘాలకు కొత్త పాలక మండళ్లు జూన్ ఐదో తేదీ తరువాత మాత్రమే ఏర్పాటు కానున్నాయి. ఈ నెల 16న శాసనసభ, లోక్‌సభ ఎన్నికల ఫలితాలు వెల్లడయ్యాక, కొత్త సభ్యులు ప్రమాణ స్వీకారం చేసిన తరువాతే.. మునిసిపాలిటీలకు చైర్పర్సన్లు, వైస్-చైర్పర్సన్లు; కార్పొరేషన్లకు మేయర్లు, డిప్యూటీ మేయర్ల పరోక్ష ఎన్నికకు నోటిఫికేషన్ జారీ చేయనున్నట్లు రమాకాంత్‌రెడ్డి వెల్లడించారు. ఎమ్మెల్యేలు, ఎంపీలకు పరోక్ష ఎన్నికల్లో ఓటు హక్కు ఉన్నందున, వారి హక్కును కాపాడాల్సిన బాధ్యత కమిషన్‌కు ఉందని ఆయన పేర్కొన్నారు. ఎన్నికల తర్వాత నెలన్నర రోజులుగా ఈవీఎంలకు గట్టి భద్రత కల్పించామని, ఎక్కడా ఇబ్బందులులేవని చెప్పారు. ఇప్పుడు ఎన్నికలు జరగని తొమ్మిది కార్పొరేషన్లు, 17 మునిసిపాలిటీలకు రెండో దశలో ఎన్నికలు నిర్వహిస్తామని తెలిపారు. పురపాలక ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏర్పాట్ల వివరాలను రమాకాంత్‌రెడ్డి ఆదివారం మీడియా సమావేశంలో వివరించారు. ముఖ్యాంశాలివీ... 145 మునిసిపాలిటీల్లో మొత్తం 3,970 వార్డులు ఉండగా.. అందులో 39 వార్డులకు సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. మిగతా 3,931 మునిసిపల్ వార్డులకు, 10 కార్పొరేషన్లలో 513 డివిజన్లకు ఓట్ల లెక్కింపు జరుగుతుంది. మునిసిపల్ ఎన్నికలకు దాదాపు 9,500 ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు వాడారు. ఓట్ల లెక్కింపుకు 8,000 మంది సిబ్బందిని నియమించారు. 65 ప్రాంతాల్లోని 155 కేంద్రాల్లో ఓట్ల లెక్కింపు జరుగుతుంది. రెవెన్యూ డివిజన్, డీఎస్పీ కార్యాలయ కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో ఎక్కడ అనువుగా ఉంటే అక్కడ నిర్వహిస్తున్నారు. ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొత్తాన్ని వీడియో చిత్రీకరిస్తారు. ఫలితాలపై ఎవరైనా కోర్టుకు వెళ్లినా ఇబ్బంది లేకుండా ఉండేందుకు.. ఓట్ల లెక్కింపు తరువాత ఈవీఎంలను భద్రపరుస్తారు. ఓట్ల లెక్కింపు జరిగే ప్రాంతాల్లో మద్యం దుకాణాలు మూసేయాలని కలెక్టర్లకు ఆదేశాలు ఇచ్చారు. ప్రాదేశిక ఓట్ల లెక్కింపు 2,099 కేంద్రాల్లో మండల, జిల్లాపరిషత్ ప్రాదేశిక ఓట్ల లెక్కింపు ఈ నెల 13వ తేదీన 2,099 కేంద్రాల్లో చేపడతామని రాష్ట్ర ఎన్నికల కమిషనర్ రమాకాంత్‌రెడ్డి తెలిపారు. 1,096 జడ్పీటీసీలకు నోటిఫికేషన్ విడుదల చేయగా.. ఒక స్థానం ఏకగ్రీవం కాగా, రెండు స్థానాలకు ఎవరూ నామినేషన్లు దాఖలు చేయలేదు. దీంతో ఎన్నికలు జరిగిన 1,093 జడ్పీటీసీ స్థానాలకు ఓట్ల లెక్కింపు చేపడతామని చెప్పారు. అలాగే 16,589 ఎంపీటీసీ స్థానాలకు నోటిఫికేషన్ ఇచ్చినా 346 స్థానాలు ఏకగ్రీవం కాగా.. 19 స్థానాల్లో ఎవరూ నామినేషనుల దాఖలు చేయకపోవడం, మరో ఆరు స్థానాలపై కోర్టు కేసుల కారణంగా ఎన్నికలు జరగలేదు. మంగళవారం 16,214 స్థానాలకు ఓట్ల లెక్కింపు జరుగుతుందని కమిషనర్ వివరించారు. ఓట్ల లెక్కింపుకు 15,000 మంది సిబ్బందిని వినియోగిస్తున్నట్లు చెప్పారు. -
ఇంకు మార్కు.. చూపుడు వేలిపై
విజయవాడ సిటీ, న్యూస్‌లైన్ : త్వరలో నిర్వహించనున్న మున్సిపల్, జెడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికల్లో ఓటువేసే వారికి ఎడమచేతి చూపుడు వేలిపై ఇంకు మార్కు వేయాలని రాష్ట ఎన్నికల అధికారి పి.రమాకాంతరెడ్డి అధికారులను ఆదేశించారు. మంగళవారం ఆయన జిల్లా ఎన్నికల అధికారులు, పోలీసు అధికారులతో హైదరాబాద్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల నిర్వహణపై పలు సూచనలు ఇచ్చారు. పోలింగ్ ప్రశాంతంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సమస్యాత్మక, అత్యంత సమాస్యాత్మక ప్రాంతాలను గుర్తించేందుకు పోలీసు ఉన్నతాధికారులతో ఎన్నికల నిర్వహణ అధికారులు సమావేశాలు నిర్వహించాలని సూచించారు. శాంతిభద్రతల పర్యవేక్షణకు భారీ బందోబస్తు నిర్వహించాలన్నారు. మద్యం అమ్మకాలపై దృష్టి సారించి, అధిక మద్యం అమ్మకాలపై నిఘా ఏర్పాటు చేయాలని చెప్పారు. పోలింగ్‌కు సర్వం సిద్ధం : కలెక్టర్ జిల్లాలో పోలింగ్‌కు సర్వం సిద్ధం చేశామని జిల్లా కలెక్టర్ ఎం.రఘునందన్‌రావు రమాకాంతరెడ్డికి వివరించారు. మున్సిపల్, జెడ్పీపీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలకు సంబంధించి జిల్లాలో 49 మండలాల పరిధిలో 2,667 పోలింగ్ కే ంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. 4,347 పెద్ద, 2,217 చిన్న బ్యాలెట్ బాక్సులు సిద్ధం చేసినట్లు చెప్పారు. ఇవిగాక తమిళనాడు నుంచి మరో 700 బ్యాలెట్ బాక్సులు వచ్చాయన్నారు. విజయవాడ నగర పోలీసు కమిషనర్ బి.శ్రీనివాసులు మాట్లాడుతూ నగర పరిధిలో స్థానిక సంస్థల ఎన్నికలు ప్రశాంతంగా నిర్వహించేందుకు గట్టి భద్రతా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వీడియో కాన్ఫరెన్స్‌లో చీఫ్ సెక్రటరీ ఏకే మహంతి, సీనియర్ ఐఏఎస్ అధికారి నవీన్ మిట్టల్, రాష్ట్ర లా అండ్ ఆర్డర్ అధికారి కౌముది పాల్గొన్నారు. -
కోర్టులు తప్ప మమ్మల్నెవరూ ఆదేశించలేరు!: రమాకాంత్‌రెడ్డి
రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ రమాకాంత్‌రెడ్డి స్థానిక ఎన్నికల జాప్యానికి బాధ్యులెవరు? పలుమార్లు అడిగినా సర్కారు పంచాయతీ రిజర్వేషన్లు ఇవ్వలేదు ఇప్పుడు నోటిఫికేషన్ ఇచ్చి మేలో ఎన్నికలంటే చట్టం అంగీకరించదు సాక్షి, హైదరాబాద్: ఎన్నికల నిర్వహణ విషయంలో న్యాయస్థానాలు మినహా తమను ఎవరూ ఆదేశించలేరని, కోర్టుల ఆదేశాలు మాత్రమే తాము పాటిస్తామని రాష్ట్ర ఎన్నికల సంఘం కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి స్పష్టంచేశారు. రాష్ట్ర ఎన్నికల సంఘం రాజ్యాంగబద్ధ సంస్థ అని.. కేంద్ర ఎన్నికల సంఘానికి, రాష్ట్ర ఎన్నికల సంఘానికి రాజ్యాంగం వేర్వేరుగా అధికారాలు కల్పించిందని పేర్కొన్నారు. ఆయన శనివారమిక్కడ ‘సాక్షి’తో మాట్లాడారు. సాధారణ ఎన్నికల ముందు స్థానిక సంస్థల ఎన్నికలు రావడం రాజకీయ పార్టీలకు ఇబ్బంది కలిగించే అంశమే అయినా.. అందుకు బాధ్యులు ఎవరని ప్రశ్నించారు. పంచాయతీ ఎన్నికలకు సంబంధించి గతేడాది సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చిన తర్వాత రిజర్వేషన్లు ఇవ్వాలని పలుమార్లు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాసినప్పటికీ, స్పందించలేదని చెప్పారు. పంచాయతీ ఎన్నికలు ముగిసి ఎనిమిది నెలలవుతున్న విషయాన్ని ఈ సందర్భంగా ఆయన గుర్తు చేశారు. గత ప్రభుత్వం (కిరణ్‌కుమార్‌రెడ్డి సర్కారు) చేసిన తప్పిదం వల్లే ఇప్పుడు గందరగోళ పరిస్థితుల మధ్య ఎన్నికలు నిర్వహించాల్సిన పరిస్థితి ఏర్పడిందని అభిప్రాయపడ్డారు. ఒకేసారి నాలుగు ఎన్నికలు నిర్వహించడం అంటే కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, కమిషనర్లు, పోలీసు అధికారులు, సిబ్బంది, పంచాయతీ అధికారులు, పోలింగ్ సిబ్బందితోపాటు ఓటర్లు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందనే విషయం తమకు కూడా తెలుసన్నారు. కానీ ఈ పరిస్థితికి కారణం ప్రభుత్వమే కదా అని వ్యాఖ్యానించారు. అందుకు చట్టం ఒప్పుకోదు.. పంచాయతీ సంస్థలకు ఎన్నికల షెడ్యూల్ విడుదల చేసి మేలో ఎన్నికలు నిర్వహించాలని రాజకీయ పార్టీలు కోరుతున్నాయని, అలాగే మున్సిపల్ ఎన్నికల ఫలితాలు నిలిపివేయాలని కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరుతున్నారని, కానీ ఇందుకు చట్టం ఒప్పుకోదని రమాకాంత్‌రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ఎన్నికల నోటిఫికేషన్ జారీ అయిన తర్వాత నాలుగు నుంచి పది రోజుల్లోగా నామినేషన్ల ప్రక్రియ పూర్తి కావాలన్నారు. ఆ తర్వాత మూడు రోజులపాటు నామినేషన్ల ఉపసంహరణ, ప్రచారానికి వారం రోజులు గడువు, పోలింగ్, ఓట్ల లెక్కింపు, పరోక్ష పద్ధతిలో చైర్పర్సన్ల ఎన్నిక కార్యక్రమాలన్నింటినీ నోటిఫికేషన్లోనే ఏయే సమయంలో ఏమేమి చేయాలన్న తేదీలతో సహా ప్రకటించాల్సి ఉంటుందని చెప్పారు. ఒకసారి ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యాక ఫలితాలు నిలుపుదల చేయడానికి కూడా వీల్లేదన్నారు. ఎన్నికల ఫలితాలు ఆపేయాలని కేంద్ర ఎన్నికల సంఘం తమను ఆదేశించడం లేదా సూచించడానికీ వీల్లేదని స్పష్టం చేశారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కూడా తమకు అలాంటి ఆదేశాలు ఇవ్వలేవని పేర్కొన్నారు. కేవలం న్యాయస్థానాలకు మాత్రమే తమను ఆదేశించడానికి అధికారం ఉందని వివరించారు. కేంద్ర ఎన్నికల సంఘం సాధారణ ఎన్నికలను 28 రాష్ట్రాల్లో నిర్వహిస్తుందని.. ఒక్కో రాష్ట్రానికి ఒక్కోసారి నోటిఫికేషన్ జారీ చేస్తుందని, కానీ తమకు అలాంటి పరిస్థితి ఉండదన్నారు. రాష్ట్రం మొత్తానికి ఒకేసారి నోటిఫికేషన్ ఇవ్వాల్సి ఉంటుందని ఆయన తెలిపారు. -
పురపాలక నగారా
ఒంగోలు, న్యూస్‌లైన్: పురపాలక సంఘాల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పీ.రమాకాంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాలో చీరాల, మార్కాపురం మున్సిపాల్టీలతో పాటు అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీలకు కూడా ఈనెల 30న ఎన్నికలు జరుగుతాయి. చైర్మన్ ఎంపిక పరోక్ష పద్ధతిన జరుగుతుండడంతో వార్డు సభ్యుల ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిని ఆయన ప్రకటించారు. కార్పొరేషన్ పరిధిలో వార్డు సభ్యునికి రూ1.50లక్షలు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలలో వార్డు సభ్యుల గరిష్ట వ్యయ పరిమితి లక్ష రూపాయలకు మించడానికి వీల్లేదని పేర్కొన్నారు. ఎన్నికల షెడ్యూలు ఇదీ ఈనెల 10న ఎన్నికల అధికారి వార్డుల వారీగా ఓటర్ల వివరాల జాబితాను సంబంధిత వార్డులోని పోలింగ్ స్టేషన్ వద్ద ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అదే రోజునుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్లను ప్రతిరోజూ ఉదయం 11గంటలనుంచి సాయంత్రం 3గంటల వరకు స్వీకరిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే వార్డుకు పోటీచేసే ఎస్సీ, ఎస్టీ,బీసీ అభ్యర్థులకు ర.2,500లు, ఇతరులకు రూ.5వేలు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో వార్డులకు పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250లు, ఇతరులు రూ.2,500లు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. నామినేషన్ల స్వీకరణ ఈనెల 14వ తేదీ సాయంత్రం 3గంటలకు ముగుస్తుంది నామినేషన్ల పరిశీలన ఈనెల 15వ తేదీ ఉదయం 11గంటలనుంచి ప్రారంభం అవుతుంది ఈనెల 18న సాయంత్రం 3గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదేరోజు సాయంత్రం 3గంటల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను, వారికి కేటాయించిన గుర్తులను ప్రకటిస్తారు. ఈనెల 30వ తేదీ ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ నిర్వహిస్తారు ఈ పోలింగ్‌కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)లను ఉపయోగిస్తారు ఒకవేళ రీపోలింగ్ అవసరమైతే ఆ ప్రాంతంలో ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహిస్తారు ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 8గంటలనుంచి ఒట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై ఎంపికైన అభ్యర్థిని ప్రకటిస్తారు. జిల్లాలో పరిస్థితి: జిల్లాలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్న చీరాల, మార్కాపురం మున్సిపాల్టీలతోపాటు అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుపుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతి వార్డు పరిధిలో 1,200 మంది ఓటర్లు ఉండేలా ప్లాన్చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 1,400కు మించరాదు. ఒకవేళ అంతకన్నా మించితే అదే వార్డు పరిధిలో మరో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో పోలింగ్‌స్టేషన్‌కు ఒక ఎన్నికల అధికారి, నలుగురు ఇతర సిబ్బంది ఉంటారు. ఎక్కడైనా ఓటర్ల సంఖ్య 1,200కన్నా మించితే అక్కడ మరో ఎన్నికల అధికారిని కూడా కేటాయిస్తారు. ఇప్పటికే అన్నింటిలోను వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. ఎన్నికల విధులకు సంబంధించి: ఒక పోలింగ్స్టేషన్లో నియమించే ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఇరువురు ఒకే శాఖకు చెందిన వారై ఉండకూడదు ఎన్నికల విధుల్లో ఎట్టి పరిస్థితుల్లోను మున్సిపల్ ఉపాధ్యాయులు, మున్సిపాల్టీలలో పనిచేసే సిబ్బందిని నియమించరాదు. ఎన్నికల విధులకు నియమించే సిబ్బంది అదే రెవెన్యూ డివిజన్ పరిధిలోని వారై ఉండరాదు. అంటే ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలోని అధికారులను ఇతర రెవెన్యూ డివిజన్లలోని మున్సిపల్ ఎన్నికలకు నియమించాల్సి ఉంటుంది. ఒక వార్డుకు సంబంధించిన పోలింగ్ స్టేషన్లన్నీ తప్పనిసరిగా అదే వార్డు పరిధిలోనే ఏర్పాటుచేయాలి. ఓటరుకు అందుబాటులో ఉండేలా రెండు కిలోమీటర్లు లోపే పోలింగ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేయాలి. పోలీస్‌స్టేషన్, హాస్పిటల్, మత సంస్థలకు సంబంధించిన వాటిలో పోలింగ్స్టేషన్లను ఏర్పాటుచేయరాదు. లెప్రసీ వ్యాధిగ్రస్తులు ఉంటే తప్పనిసరిగా వారికోసం ఒక పోలింగ్‌స్టేషన్ ఏర్పాటుచేసి అక్కడ ఎన్నికల విధుల్లో మెడికల్ ఆఫీసర్‌ను, వైద్య విభాగానికి సంబంధించిన సిబ్బందిని నియమించాలి. పార్టీ గుర్తులతోనే పోలింగ్ సర్పంచ్ల ఎన్నిక పార్టీలరహితంగా జరిగితే, మున్సిపల్ ఎన్నికలు మాత్రం పార్టీలపరంగానే జరుపుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాజకీయ పార్టీ తరపున కాకుండా పోటీచేసిన వారికి స్వతంత్య్ర అభ్యర్థులుగా పరిగణించి ఇతర గుర్తులను వారికి కేటాయిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సమీక్ష మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ ఫ్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్ అన్ని జిల్లాల అధికారులతో సోమవారం సాయంత్రం 3గంటల నుంచి 6గంటలవరకు సమీక్షించారు. ఎన్నికలు పార్టీల పరంగా జరుగుతున్నందున గుర్తింపు కలిగిన పార్టీల జాబితాను వెబ్సైట్లో ఉంచామని తెలిపారు. ఆ పార్టీలన్నింటికి అన్ని వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాలను ఉచితంగా వెంటనే అందజేయాలన్నారు. ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్‌తో నిత్యం సమీక్షిస్తూ ఉండాలని మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణ సమయంలో విద్యుత్‌కోతలు ఉంటున్నందువల్ల తప్పనిసరిగా ప్రతి ఈవీఎంకు అనుసంధానంగా బ్యాటరీలను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఒంగోలు మున్సిపల్ కమిషనర్ సీహెచ్.విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 386 ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయని వాటన్నింటినీ 2013 ఆగస్టులో తనిఖీచేశామన్నారు. విద్యుత్ సమస్య రాకుండా ఉండేందుకు జిల్లాలో 240 ఈవీఎంలకు సంబంధించిన బ్యాటరీలు అవసరమని వివరించారు. -
నేడే మున్సిపల్ షెడ్యూల్!
30న ఎన్నికలు..ఏప్రిల్ 1న ఓట్ల లెక్కింపు? తర్వాత చైర్పర్సన్లు, మేయర్ల ఎన్నిక సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 146 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి సోమవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. ఈనెల 30వ తేదీన పోలింగ్, ఏప్రిల్ ఒకటో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో చైర్పర్సన్లు, మేయర్లను పరోక్ష పద్ధతిలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. చైర్పర్సన్ల ఎన్నికల్లో ఎంపిక చేసుకున్న మున్సిపాలిటీ /నగర పంచాయతీ/కార్పొరేషన్లో ఎమ్మెల్యేలు ఓటు వేసే హక్కు ఉంటుంది. శనివారంనాడు రాష్ట్ర ప్రభుత్వం చైర్పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్లు ఖరారు చేసిన సంగతి విదితమే. వార్డులు, డివిజన్లు, చైర్పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్ల తాజా జాబితాను పురపాలక శాఖ అధికారులు ఆదివారం ఉదయమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం యుద్ధ ప్రాతిపదికన ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి నెలాఖరునాటికి ఈ పోలింగ్ ప్రక్రియ ముగించేలా ప్రణాళిక రూపొందించింది. సోమవారం హైకోర్టులో మున్సిపల్ ఎన్నికలపై విచారణ ప్రారంభమయ్యే సరికల్లా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయూలని నిర్ణయించింది. మొదటి విడతలో 146 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, రెండో విడతలో తొమ్మిది కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు. రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే మున్సిపాలిటీల్లో రాజాం, శ్రీకాకుళం, కందుకూరు, రాజంపేట, కొల్లాపూర్, అచ్చంపేట, జడ్చర్ల, మేడ్చల్, దుబ్బాక, చేగుంట, సిద్దిపేట, నెల్లిమర్ల ఉన్నాయి. షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న మందమర్రి, పాల్వంచ, మణుగూరులకు రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. అనపర్తి నగర పంచాయతీపై హైకోర్టులో స్టే ఉన్నందున అధికారులు దీనిని పరిగణనలోకి తీసుకోలేదు.