30న ఎన్నికలు..ఏప్రిల్ 1న ఓట్ల లెక్కింపు?
తర్వాత చైర్‌పర్సన్లు, మేయర్ల ఎన్నిక
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రవ్యాప్తంగా 146 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలు, 10 మున్సిపల్ కార్పొరేషన్ల ఎన్నికలకు రాష్ట్ర ఎన్నికల సంఘం సర్వం సిద్ధం చేసింది. కమిషనర్ పి.రమాకాంత్‌రెడ్డి సోమవారం మున్సిపల్ ఎన్నికల షెడ్యూల్‌ను ప్రకటించనున్నారు. ఈనెల 30వ తేదీన పోలింగ్, ఏప్రిల్ ఒకటో తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుందని విశ్వసనీయ సమాచారం. ఆ తర్వాత నాలుగైదు రోజుల్లో చైర్‌పర్సన్లు, మేయర్లను పరోక్ష పద్ధతిలో కౌన్సిలర్లు, కార్పొరేటర్లు ఎన్నుకుంటారు. చైర్‌పర్సన్ల ఎన్నికల్లో ఎంపిక చేసుకున్న మున్సిపాలిటీ /నగర పంచాయతీ/కార్పొరేషన్‌లో ఎమ్మెల్యేలు ఓటు వేసే హక్కు ఉంటుంది. శనివారంనాడు రాష్ట్ర ప్రభుత్వం చైర్‌పర్సన్లు, మేయర్ల రిజర్వేషన్లు ఖరారు చేసిన సంగతి విదితమే. వార్డులు, డివిజన్లు, చైర్‌పర్సన్‌లు, మేయర్ల రిజర్వేషన్ల తాజా జాబితాను పురపాలక శాఖ అధికారులు ఆదివారం ఉదయమే రాష్ట్ర ఎన్నికల సంఘానికి సమర్పించారు. రాష్ట్ర ఎన్నికల సంఘం యుద్ధ ప్రాతిపదికన ఎన్నికల షెడ్యూల్‌ను ఖరారు చేసింది. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో మార్చి నెలాఖరునాటికి ఈ పోలింగ్ ప్రక్రియ ముగించేలా ప్రణాళిక రూపొందించింది. సోమవారం హైకోర్టులో మున్సిపల్ ఎన్నికలపై విచారణ ప్రారంభమయ్యే సరికల్లా ఎన్నికల షెడ్యూల్ విడుదల చేయూలని నిర్ణయించింది.
మొదటి విడతలో 146 మున్సిపాలిటీలు/నగర పంచాయతీలకు ఎన్నికలు నిర్వహిస్తుండగా, రెండో విడతలో తొమ్మిది కార్పొరేషన్లు, 12 మున్సిపాలిటీలకు ఎన్నికలు నిర్వహిస్తారు.
రెండో విడతలో ఎన్నికలు నిర్వహించే మున్సిపాలిటీల్లో రాజాం, శ్రీకాకుళం, కందుకూరు, రాజంపేట, కొల్లాపూర్, అచ్చంపేట, జడ్చర్ల, మేడ్చల్, దుబ్బాక, చేగుంట, సిద్దిపేట, నెల్లిమర్ల ఉన్నాయి.
షెడ్యూల్డ్ ప్రాంతంలో ఉన్న మందమర్రి, పాల్వంచ, మణుగూరులకు రాజ్యాంగ సవరణ చేస్తే తప్ప ఎన్నికల నిర్వహణ సాధ్యం కాదు. అనపర్తి నగర పంచాయతీపై హైకోర్టులో స్టే ఉన్నందున అధికారులు దీనిని పరిగణనలోకి తీసుకోలేదు.
నేడే మున్సిపల్ షెడ్యూల్!
Published Mon, Mar 3 2014 1:27 AM | Last Updated on Tue, Sep 4 2018 5:07 PM
Advertisement
Advertisement