గాంధీభవన్‌లో ఏఐసీసీ కార్యదర్శులతో భేటీలో ఉత్తమ్, జానా, భట్టి, సర్వే, సునీత, పొన్నం తదితరులు
సాక్షి, హైదరాబాద్ : వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొచ్చేలా చర్యలు తీసుకోవాలని.. టికెట్ల కేటాయింపు, ప్రజా ఉద్యమాల నిర్మాణంలో సరైన నిర్ణయాలు తీసుకోవాలని పార్టీ రాష్ట్ర ఇన్‌చార్జి కార్యదర్శులకు కాంగ్రెస్ నేతలు విజ్ఞప్తి చేశారు. గెలిచే వారికే టికెట్లు ఇచ్చి పార్టీని బతికించుకోవాలని, అంతా అనువుగా ఉన్న నియోజకవర్గాల్లో ఆరునెలల ముందే టికెట్లు ప్రకటించాలని కోరారు. టీఆర్‌ఎస్‌పై ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లేలా కార్యక్రమాలు రూపొందించాలని సూచించారు. ఇటీవల పార్టీ రాష్ట్ర వ్యవహారాలను పర్యవేక్షించేందుకు నియమితులైన ఏఐసీసీ కార్యదర్శులు ఎన్.ఎస్.బోసురాజు, సలీం అహ్మద్, శ్రీనివాస కృష్ణన్‌లతోపాటు టీపీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, టీపీసీసీ కార్యనిర్వాహక అధ్యక్షుడు మల్లు భట్టి విక్రమార్క తదితరులు శనివారం గాంధీభవన్‌లో లోక్‌సభ స్థానాల వారీగా పార్టీ పరిస్థితిపై సమీక్షించారు. ఈ సందర్భంగా పోలింగ్ బూత్ స్థాయి కమిటీలు, పార్టీ కమిటీలు, శక్తి యాప్ ద్వారా కార్యకర్తల రిజిస్ట్రేషన్ తదితర అంశాలను ప్రస్తావించిన ఏఐసీసీ కార్యదర్శులు.. వాటిని త్వరగా పూర్తి చేయాలని రాష్ట్ర నేతలకు సూచించారు. అనంతరం ఆయా నియోజకవర్గాల్లో రాజకీయ పరిస్థితులు, పార్టీలో సమన్వయం, నేతల మధ్య విభేదాలు తదితర అంశాలపై పలువురు నేతలు మాట్లాడారు.
ఆరు నెలల ముందే సంకేతాలివ్వండి
వచ్చే ఎన్నికల్లో గెలిచే అవకాశమున్న వారికే టికెట్లు ఇచ్చి పార్టీని బతికించాలని ఏఐసీసీ కార్యదర్శులకు నేతలు సూచించారు. తెలంగాణ ఇచ్చినప్పటికీ 2014 ఎన్నికల్లో ఓడిపోయే వారికి టికెట్లు ఇచ్చి బొక్కబోర్లా పడ్డామని, ఈసారైనా జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. పరిస్థితులన్నీ అనువుగా ఉన్న నియోజకవర్గాల్లో ఆరునెలల ముందే అభ్యర్థులను ప్రకటిస్తే వారు సులువుగా పనిచేసుకునే అవకాశం ఉంటుందని చెప్పారు. భారీ తేడాతో ఓటమి పాలైనవారికి ఈసారి అవకాశం ఇవ్వవద్దని రంగారెడ్డి జిల్లాకు చెందిన ఓ నేత పేర్కొన్నారు. మరో నేత మాట్లాడుతూ.. అప్పటి పరిస్థితుల్లో ఓట్లలో కొంత ఎక్కువ తేడా వచ్చిందని, అందరినీ ఒకే గాటిన కట్టొద్దని సూచించినట్టు సమాచారం. ఇక ఖమ్మం, మహబూబాబాద్ లోక్‌సభ నియోజకవర్గాల సమీక్షలో భాగంగా సీఎల్పీ ఉపనేత పొంగులేటి సుధాకర్‌రెడ్డి మాట్లాడుతూ..
వచ్చే ఎన్నికలలో ప్రతి సీటు ముఖ్యమేనని, కచ్చితంగా గెలుపే ధ్యేయంగా పార్టీ కేడర్‌ను ముందుకు తీసుకెళ్లే చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. రాష్ట్ర విభజన సందర్భంగా ఇచ్చిన హామీలను అమలు చేసేలా పోరాటం ఉధృతం చేయాలని ఆయన సూచించారు. జిల్లా నేతల మధ్య విభేదాలను తొలగించాలని, వెంటనే ఖమ్మం జిల్లా అధ్యక్షుడిని నియమించాలని కూడా కోరినట్టు తెలిసింది. ఇక పార్టీ జిల్లా కమిటీలకు స్వేచ్ఛ ఇచ్చి ఆందోళనా కార్యక్రమాలను ఉధృతం చేయాలని.. రిజర్వుడు నియోజకవర్గాలపై దృష్టి పెట్టాలని, పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడానికి ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని పలువురు నేతలు కోరారు. స్థానిక ఎమ్మెల్యేలు, టీఆర్‌ఎస్ పట్ల ఉన్న వ్యతిరేకతను ప్రజల్లోకి తీసుకెళ్లాలని.. కాంట్రాక్టులు, ఇసుక మాఫియా, పోలీసుల వేధింపులు, నిరుద్యోగ, మహిళా, యువజన, విద్యార్థి సమస్యలపై విస్తృతంగా ప్రజల్లోకి వెళ్లేలా కార్యాచరణ రూపొందించాలని సూచించారు.
సీనియర్లు డుమ్మా!
శనివారం గాంధీభవన్‌లో జరిగిన సమీక్షలకు ఐదారుగురు మినహా సీనియర్ నేతలంతా గైర్హాజరు కావడం చర్చనీయాంశంగా మారింది. ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీలు పొంగులేటి సుధాకర్‌రెడ్డి, ఆకుల లలిత, మాజీ ఎంపీలు వీహెచ్, సర్వే సత్యనారాయణ, అంజన్‌కుమార్‌యాదవ్, పొన్నం ప్రభాకర్‌లు హాజరుకాగా... మాజీ మంత్రులు డీకే అరుణ, గీతారెడ్డి, షబ్బీర్ అలీ, దామోదర రాజనర్సింహ, శ్రీధర్‌బాబు, కోమటిరెడ్డి బ్రదర్స్ తదితరులు సమావేశాలకు రాలేదు. మరోవైపు సమావేశంలో నర్సంపేట నియోజకవర్గం విషయంలో చిన్న వివాదం తలెత్తింది. ఇండిపెండెంట్‌గా పోటీ చేసి కాంగ్రెస్‌లో చేరిన ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డితోపాటు కాంగ్రెస్ నుంచి పోటీ చేసిన కత్తి వెంకటస్వామిని కూడా సమావేశానికి ఆహ్వానించారు. దీనిపై దొంతి సీరియస్ అయ్యారు. ఎమ్మెల్యేగా గెల్చిన తానుండగా.. వెంకటస్వామిని ఎందుకు ఆహ్వానించారని పీసీసీ పెద్దల్ని నిలదీశాడు. దీంతో ఉత్తమ్ జోక్యం చేసుకొని సమాచార లోపం వల్లే జరిగిందని సర్దిజెప్పడంతో వివాదం సద్దుమణిగింది.
జూలై 10లోపు జిల్లా కమిటీలు: మల్లు రవి
గాంధీభవన్‌లో సమావేశాల అనంతరం కాంగ్రెస్ సీనియర్ నేత మల్లు రవి విలేకరులతో మాట్లాడారు. కొత్తగా వచ్చిన ముగ్గురు కార్యదర్శులకు తెలంగాణ పార్టీ బాధ్యతలు అప్పగించామన్నారు. నియోజకవర్గాల వారీగా పార్టీ పరిస్థితిని సమీక్షించామని.. జిల్లా కమిటీల నియామకాన్ని జూలై 10 కల్లా పూర్తి చేయాలని నిర్ణయించామని తెలిపారు. జూలై 1 నుంచి 15లోపు జిల్లా స్థాయిల్లో ఏఐసీసీ ఇన్‌చార్జి కార్యదర్శులు సమావేశాలు నిర్వహిస్తారని... మూడు, నాలుగు రోజుల పాటు జిల్లాల్లోనే ఉండి నియోజకవర్గ నేతలతో పార్టీ బలోపేతంపై సమాలోచనలు చేస్తారని చెప్పారు. కాగా గాంధీభవన్‌లో భేటీకి సీనియర్లు చాలా మంది రాలేదేమని విలేకరులు ప్రశ్నించగా.. పెళ్లిళ్లు ఉన్న కారణంగా తాము సమావేశాలకు రాలేమని వారు పీసీసీకి వివరణ ఇచ్చినట్టు తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment