నయా జోష్‌! | Congress Party Full Josh In Vikarabad | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్‌లో ఉత్సాహం

Published Sun, Mar 25 2018 12:13 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Party Full Josh In Vikarabad - Sakshi

జిల్లాలో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఫుల్‌ జోష్‌లో ఉన్నారు. ఇటీవలSనిర్వహించిన ప్రజాచైతన్య యాత్ర సక్సెస్‌ కావడంతో వారిలో నూతన ఉత్సాహం నిండింది. దీనికి తోడు ఏఐసీసీ (ఆలిండియా కాంగ్రెస్‌ కమిటీ)లో జిల్లా నేతలకు చోటు దక్కడంతో కార్యకర్తలు, నాయకులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయం దగ్గర పడుతుండడంతో గ్రామాల్లో పర్యటించి ప్రజలకు చేరువయ్యేందుకు ప్రణాళికలు  రచిస్తున్నారు. ఇప్పటికే మాజీ మంత్రి ప్రసాద్‌కుమార్‌ ‘ప్రజల వద్దకు ప్రసాదన్న’ పేరుతో గ్రామాల్లో తిరుగుతూ జనంతో మమేకమవుతున్నారు. వచ్చే ఎన్నికల్లో ఎలాగైనా అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని ఢీకొని విజయం సాధించాలని ఉవ్విళ్లూరుతున్నారు.

సాక్షి, వికారాబాద్‌ : సార్వత్రిక ఎన్నికలకు గడువు సమీపి స్తున్న నేపథ్యంలో కాంగ్రెస్‌ నాయకులు దూకుడుగా ముందుకు సాగుతున్నారు. జిల్లాలోని వికారాబాద్, తాండూరు నియోజకవర్గ కేంద్రా ల్లో ‘ప్రజా చైతన్యయాత్ర‘ పేరుతో ఆ పార్టీ నిర్వహించిన రెండు సభలు విజయవంతం కావడంతో కార్యకర్తలు, నాయకులు నూతన ఉత్సాహంతో ఉన్నారు. దీంతోపాటు సభలకు ప్రజల నుంచి ఆశించినస్థాయిలో స్పందన రావడంతో కేడర్‌లో సమరోత్సాహం పొంగిపొర్లుతోంది. ఈనేపథ్యంలో గ్రామాల్లో విస్తృతంగా పర్యటించేందుకు ప్రణాళికలు సిద్ధం చేసుకుంటున్నారు. ప్రభుత్వంపై ఉన్న వ్యతిరేకతను ఓట్ల రూపంలో మలచుకునేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేశారు. వచ్చే ఎన్నికల్లో అధికార టీఆర్‌ఎస్‌ పార్టీని దీటుగా ఎదుర్కొనేందుకు నేతలు ఐకమత్యంగా ఉండాలని ద్వితీయశ్రేణి నాయకులు, కార్యకర్తలు అభిప్రాయపడుతున్నారు.  

జనానికి చేరువయ్యే యత్నం..  
కాంగ్రెస్‌ నేతలు ప్రజలకు చేరువయ్యే యత్నం చేస్తున్నారు. జిల్లా కేంద్రమైన వికారాబాద్‌ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి మాజీ మంత్రులు గడ్డం ప్రసాద్‌కుమార్, ఏ.చంద్రశేఖర్‌లు టికెట్‌ కోసం పోటీపడుతున్నారు. ఏడాదిగా ‘ప్రజల వద్దకు ప్రసాదన్న’ పేరుతో ప్రసాద్‌కుమార్‌ గ్రామాల్లో విస్తృతంగా పర్యటిస్తున్నారు. ఇటీవల వికారాబాద్‌లో జరిగిన కాంగ్రెస్‌ ప్రజాచైతన్యయాత్ర సభకు ఆయనే నేతృత్వం వహించారు. అదేవిధంగా నెలకు నాలుగైదు గ్రామాల్లో పర్యటిస్తూ ప్రజా సమస్యలు తెలుసుకొని పరిష్కరించే ప్రయ త్నం చేస్తున్నారు. అదేవిధంగా మరో మాజీ మంత్రి ఎ.చంద్రశేఖర్‌ సైతం తరచూ గ్రామా ల్లో పర్యటిస్తున్నారు. ఇద్దరు నేతల పర్యటనలతో గ్రామాల్లో పార్టీ బలం పుంజుకుంటోం దని కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు.  

వీరికి ‘టికెట్‌’ పోటీ లేదు..  
పరిగి, కొడంగల్‌ నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే లు రామ్మోహన్‌రెడ్డి, రేవంత్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇటీవల ఎమ్మెల్యే రామ్మోహన్‌రెడ్డికి ఏఐసీసీలో చోటు దక్కింది. అదేవిధంగా కాంగ్రెస్‌ పార్టీ విప్‌గాను నియమించడంతో పార్టీ నాయకులు, కార్యకర్తలు హర్షం వ్యక్తం చేశారు. ఆయన వారంలో దాదాపు నాలుగైదు రోజులు గ్రామాల్లో విస్తృతంగా తిరుగుతున్నారు. రామ్మోహన్‌రెడ్డికి నియోజకవర్గంగా కాంగ్రెస్‌ పార్టీలో తిరుగులేకపోవడంతో ఆయనకు దాదాపుగా టికెట్‌ పక్కా అని ఆ పార్టీ శ్రేణులు అభిప్రాయపడుతున్నాయి. కొడంగల్‌ నియోజకవర్గ ఎమ్మెల్యే ఎనుముల రేవంత్‌రెడ్డి గతేడాది టీడీపీకి రాజీనామా చేసి హస్తం పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. కొడంగల్‌లో ఆయనకు టికెట్‌ ఖాయమని నేతలు చెబుతున్నారు. రేవంత్‌రెడ్డితోపాటు ఆయన సోదరులు తిరుపతిరెడ్డి నియోజకవర్గంలో బాగా పర్యటిస్తున్నారు. రేవంత్‌రెడ్డి కేసీఆర్‌ కుటుంబంపై వీలు చిక్కినప్పుడల్లా విమర్శల బాణాలు ఎక్కుపెడుతూనే ఉన్నారు.  

తాండూరులో పరిస్థితి ఇదీ..
తాండూరు నుంచి మంత్రి మహేందర్‌రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తాండూరు నుంచి కాంగ్రెస్‌లో మహారాజుల కుటుంబానికి చెందిన రమేష్‌కే టికెట్‌ లభించే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. ఇటీవల జరిగిన ప్రజాచైతన్యయాత్ర విజయవంతం కావడంతో నియోజకవర్గంలోని పార్టీ శ్రేణులు ఉత్సాహంగా ఉన్నాయి. అయితే, మహేందర్‌రెడ్డిని ఢీకొనడం అంత సులభసాధ్యం కాదనేది వాస్తవమని ఆ పార్టీ నాయకులే పేర్కొంటున్నారు.  

డీసీసీ అధ్యక్షుడి నియామకం ఎప్పుడో..?
పరిపాలనా సౌలభ్యం కోసం వికారాబాద్‌ జిల్లాను అక్టోబరు 11, 2016న ఏర్పాటు చేశారు. అయితే, ఇప్పటికీ ఉమ్మడి జిల్లాకు కాంగ్రెస్‌ అధ్యక్షుడిగా క్యామ మల్లేష్‌ కొనసాగుతున్నారు. ఆయన జిల్లాలో ఎప్పుడూ పర్యటించిన దాఖలాలులేవు. సభలు, సమావేశాలు జరిగిప్పుడు, లేదా రాష్ట్ర, జాతీయస్థాయి నేతలు వచ్చినప్పుడు మినహాయించి ఏనాడూ పర్యటించలేదు. ఈనేపథ్యంలో కాంగ్రెస్‌ పార్టీకి జిల్లా అధ్యక్షుడిని నియమించాలని ఆ పార్టీ నాయకులు, కార్యకర్తల నుంచి డిమాండ్‌ పెరుగుతోంది. త్వరలో పంచాయతీ ఎన్నికలు, త్వరలో సాధారణ ఎలక్షన్స్‌ సమీపిస్తున్న నేపథ్యంలో డీసీసీ అధ్యక్షుడిని నియమించాలని విజ్ఞప్తి చేస్తున్నారు. గతంలో మాజీ మంత్రి గడ్డం ప్రసాద్‌కుమార్‌ పేరు వినిపించినా కార్యరూపం దాల్చలేదు. ఇటీవల పలువురు జిల్లా నేతలకు ఏఐసీసీలో చోటు దక్కింది. ఎమ్మెల్యేలు టి.రాంమోహన్‌రెడ్డి, ఎ.రేవంత్‌రెడ్డి, మాజీ మంత్రులు ప్రసాద్‌కుమార్, ఏ.చంద్రశేఖర్‌లకు ఏఐసీసీ కో ఆప్షన్‌ సభ్యులుగా నియమించడంతో పార్టీ కేడర్‌లో ఉత్సాహం నెలకొంది.   

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement