
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ కాంగ్రెస్‌లో మళ్లీ ముసలం మొదలైంది. ఆ పార్టీ అసంతృప్త నేతల అత్యవసర భేటీపై హై కమాండ్ సీరియస్ అయ్యింది. సమావేశాలు పెట్టి పార్టీని ఇబ్బందుల్లో నెట్టొందని ఏఐసీసీ హెచ్చరించింది. సమావేశం రద్దు చేసుకోకపోతే తీవ్ర పరిణామాలు ఉంటాయని స్పష్టం చేసింది. సీనియర్లకు ఫోన్ చేసిన ఏఐసీసీ కార్యదర్శి బోస్ రాజు.. సమస్య ఉంటే అధిష్టానం దృష్టికి తీసుకురావాలన్నారు. కాగా, ఎట్టి పరిస్థితుల్లోనూ సమావేశం పెట్టి తీరతామని చెప్పిన సీనియర్ నేత వీహెచ్‌తో సహా అసంతృప్త నేతలంతా ఆదివారం హైదరాబాద్‌లోని హోటల్ అశోకలో భేటీ అయ్యారు.
చదవండి: కేసీఆర్ మాటలు నమ్మొద్దు
వీహెచ్‌పై చర్యలు!
కాంగ్రెస్ సీనియర్ నేత, మాజీ ఎంపీ వి.హనుమంతరావు (వీహెచ్)పై పార్టీ పరమైన క్రమశిక్షణ చర్యలు తీసుకునే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇటీవల మాజీ మంత్రి మర్రి శశిధర్‌రెడ్డి నివాసంలో కాంగ్రెస్ విధేయుల ఫోరం పేరుతో సమావేశమైన మరుసటి రోజున ఎమ్మెల్సీ ఫారూఖ్ హుస్సేన్‌తో కలిసి మంత్రి హరీశ్‌రావును కోకాపేటలోని ఆయన నివాసంలో వీహెచ్ కలిశారనే ఆరోపణలున్నాయి.
ఇరువురు రెండు గంటలకు పైగా సమావేశమయ్యారని పార్టీ నాయకత్వానికి సమాచారం అందింది. ఈ నేపథ్యంలోనే హరీశ్‌ను కలిసిన విషయాన్ని గోప్యంగా ఉంచడపై టీపీసీసీ క్రమశిక్షణా సంఘం వీహెచ్‌కు షోకాజ్ నోటీసులు జారీచేసింది. దీంతోపాటు పార్టీ నుంచి సస్పెండ్ చేయాలనే సిఫారసు చేయనున్నట్లు చర్చ జరుగుతోంది. అయితే, మాజీ ఎంపీ హోదాలో వీహెచ్ సస్పెన్షన్‌పై ఏఐసీసీ నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని పార్టీ నేతలు చెబుతున్నారు. కాగా, పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి వ్యవహారశైలిని వ్యతిరేకిస్తున్న అసంతృప్త నేతలంతా ఆదివారం హైదరాబాద్‌లోని హోటల్ అశోకలో భేటీ అయ్యారు.
Comments
Please login to add a commentAdd a comment