ఒంగోలు, న్యూస్‌లైన్: పురపాలక సంఘాల ఎన్నికల షెడ్యూల్‌ను సోమవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ పీ.రమాకాంత్‌రెడ్డి విడుదల చేశారు. ఈ మేరకు జిల్లాలో చీరాల, మార్కాపురం మున్సిపాల్టీలతో పాటు అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీలకు కూడా ఈనెల 30న ఎన్నికలు జరుగుతాయి. చైర్మన్ ఎంపిక పరోక్ష పద్ధతిన జరుగుతుండడంతో వార్డు సభ్యుల ఎన్నికల గరిష్ట వ్యయ పరిమితిని ఆయన ప్రకటించారు. కార్పొరేషన్ పరిధిలో వార్డు సభ్యునికి రూ1.50లక్షలు, మున్సిపాల్టీలు, నగర పంచాయతీలలో వార్డు సభ్యుల గరిష్ట వ్యయ పరిమితి లక్ష రూపాయలకు మించడానికి వీల్లేదని పేర్కొన్నారు.
ఎన్నికల షెడ్యూలు ఇదీ
ఈనెల 10న ఎన్నికల అధికారి వార్డుల వారీగా ఓటర్ల వివరాల జాబితాను సంబంధిత వార్డులోని పోలింగ్ స్టేషన్ వద్ద ప్రజలకు అందుబాటులో ఉంచుతారు. అదే రోజునుంచి నామినేషన్ల స్వీకరణ ప్రారంభమవుతుంది. నామినేషన్లను ప్రతిరోజూ ఉదయం 11గంటలనుంచి సాయంత్రం 3గంటల వరకు స్వీకరిస్తారు. మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో అయితే వార్డుకు పోటీచేసే ఎస్సీ, ఎస్టీ,బీసీ అభ్యర్థులకు ర.2,500లు, ఇతరులకు రూ.5వేలు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది. మున్సిపాల్టీలు, నగర పంచాయతీల్లో వార్డులకు పోటీచేసే ఎస్సీ, ఎస్టీ, బీసీ అభ్యర్థులు రూ.1,250లు, ఇతరులు రూ.2,500లు డిపాజిట్‌గా చెల్లించాల్సి ఉంటుంది.
నామినేషన్ల స్వీకరణ ఈనెల 14వ తేదీ సాయంత్రం 3గంటలకు ముగుస్తుంది
నామినేషన్ల పరిశీలన ఈనెల 15వ తేదీ ఉదయం 11గంటలనుంచి ప్రారంభం అవుతుంది
ఈనెల 18న సాయంత్రం 3గంటలలోపు నామినేషన్ల ఉపసంహరణకు అవకాశం ఉంటుంది. అదేరోజు సాయంత్రం 3గంటల అనంతరం పోటీలో ఉన్న అభ్యర్థుల వివరాలను, వారికి కేటాయించిన గుర్తులను ప్రకటిస్తారు.
ఈనెల 30వ తేదీ ఉదయం 7 గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు పోలింగ్ నిర్వహిస్తారు
ఈ పోలింగ్‌కు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్ల(ఈవీఎం)లను ఉపయోగిస్తారు
ఒకవేళ రీపోలింగ్ అవసరమైతే ఆ ప్రాంతంలో ఏప్రిల్ 1వ తేదీ ఉదయం 7గంటలనుంచి సాయంత్రం 5 గంటలవరకు నిర్వహిస్తారు
ఏప్రిల్ 2వ తేదీ ఉదయం 8గంటలనుంచి ఒట్ల లెక్కింపు ప్రక్రియ ప్రారంభమై ఎంపికైన అభ్యర్థిని ప్రకటిస్తారు.
జిల్లాలో పరిస్థితి:
జిల్లాలో ఇప్పటికే ఎన్నికలు జరుగుతున్న చీరాల, మార్కాపురం మున్సిపాల్టీలతోపాటు అద్దంకి, చీమకుర్తి, కనిగిరి, గిద్దలూరు నగర పంచాయతీలకు ఎన్నికలు జరుపుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఈ ఎన్నికలకు సంబంధించి ప్రతి వార్డు పరిధిలో 1,200 మంది ఓటర్లు ఉండేలా ప్లాన్‌చేసుకోవాల్సి ఉంటుంది. గరిష్టంగా 1,400కు మించరాదు. ఒకవేళ అంతకన్నా మించితే అదే వార్డు పరిధిలో మరో పోలింగ్ స్టేషన్‌ను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుంది. ఒక్కో పోలింగ్‌స్టేషన్‌కు ఒక ఎన్నికల అధికారి, నలుగురు ఇతర సిబ్బంది ఉంటారు. ఎక్కడైనా ఓటర్ల సంఖ్య 1,200కన్నా మించితే అక్కడ మరో ఎన్నికల అధికారిని కూడా కేటాయిస్తారు. ఇప్పటికే అన్నింటిలోను వార్డుల వారీగా ఓటర్ల జాబితాలను విడుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు.
ఎన్నికల విధులకు సంబంధించి:
ఒక పోలింగ్‌స్టేషన్లో నియమించే ప్రిసైడింగ్ ఆఫీసర్, అసిస్టెంట్ ప్రిసైడింగ్ ఆఫీసర్లు ఇరువురు ఒకే శాఖకు చెందిన వారై ఉండకూడదు
ఎన్నికల విధుల్లో ఎట్టి పరిస్థితుల్లోను మున్సిపల్ ఉపాధ్యాయులు, మున్సిపాల్టీలలో పనిచేసే సిబ్బందిని నియమించరాదు.
ఎన్నికల విధులకు నియమించే సిబ్బంది అదే రెవెన్యూ డివిజన్ పరిధిలోని వారై ఉండరాదు. అంటే ఒక రెవెన్యూ డివిజన్ పరిధిలోని అధికారులను ఇతర రెవెన్యూ డివిజన్లలోని మున్సిపల్ ఎన్నికలకు నియమించాల్సి ఉంటుంది.
ఒక వార్డుకు సంబంధించిన పోలింగ్ స్టేషన్లన్నీ తప్పనిసరిగా అదే వార్డు పరిధిలోనే ఏర్పాటుచేయాలి.
ఓటరుకు అందుబాటులో ఉండేలా రెండు కిలోమీటర్లు లోపే పోలింగ్‌స్టేషన్‌ను ఏర్పాటుచేయాలి.
పోలీస్‌స్టేషన్, హాస్పిటల్, మత సంస్థలకు సంబంధించిన వాటిలో పోలింగ్‌స్టేషన్లను ఏర్పాటుచేయరాదు.
లెప్రసీ వ్యాధిగ్రస్తులు ఉంటే తప్పనిసరిగా వారికోసం ఒక పోలింగ్‌స్టేషన్ ఏర్పాటుచేసి అక్కడ ఎన్నికల విధుల్లో మెడికల్ ఆఫీసర్‌ను, వైద్య విభాగానికి సంబంధించిన సిబ్బందిని నియమించాలి.
పార్టీ గుర్తులతోనే పోలింగ్
సర్పంచ్‌ల ఎన్నిక పార్టీలరహితంగా జరిగితే, మున్సిపల్ ఎన్నికలు మాత్రం పార్టీలపరంగానే జరుపుతున్నట్లు రాష్ట్ర ఎన్నికల కమిషన్ ప్రకటించింది. రాజకీయ పార్టీ తరపున కాకుండా పోటీచేసిన వారికి స్వతంత్య్ర అభ్యర్థులుగా పరిగణించి ఇతర గుర్తులను వారికి కేటాయిస్తారు.
వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ఏర్పాట్లపై సమీక్ష
మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ డెరైక్టర్ జనార్దన్‌రెడ్డి, ప్రభుత్వ ఫ్రధాన కార్యదర్శి నవీన్‌మిట్టల్ అన్ని జిల్లాల అధికారులతో సోమవారం సాయంత్రం 3గంటల నుంచి 6గంటలవరకు సమీక్షించారు. ఎన్నికలు పార్టీల పరంగా జరుగుతున్నందున గుర్తింపు కలిగిన పార్టీల జాబితాను వెబ్‌సైట్‌లో ఉంచామని తెలిపారు. ఆ పార్టీలన్నింటికి అన్ని వార్డులకు సంబంధించిన ఓటర్ల జాబితాలను ఉచితంగా వెంటనే అందజేయాలన్నారు.
ఈ సమీక్షలో జిల్లా కలెక్టర్‌తో నిత్యం సమీక్షిస్తూ ఉండాలని మున్సిపల్ అధికారులను హెచ్చరించారు. ఎన్నికల నిర్వహణ సమయంలో విద్యుత్‌కోతలు ఉంటున్నందువల్ల తప్పనిసరిగా ప్రతి ఈవీఎంకు అనుసంధానంగా బ్యాటరీలను ఏర్పాటుచేసుకోవాల్సి ఉంటుందన్నారు. దీనిపై ఒంగోలు మున్సిపల్ కమిషనర్ సీహెచ్.విజయలక్ష్మి మాట్లాడుతూ జిల్లాలో 386 ఈవీఎంలు అందుబాటులో ఉన్నాయని వాటన్నింటినీ 2013 ఆగస్టులో తనిఖీచేశామన్నారు. విద్యుత్ సమస్య రాకుండా ఉండేందుకు జిల్లాలో 240 ఈవీఎంలకు సంబంధించిన బ్యాటరీలు అవసరమని వివరించారు.
పురపాలక నగారా
Published Tue, Mar 4 2014 2:59 AM | Last Updated on Tue, Oct 16 2018 6:44 PM
Advertisement
Advertisement