సాక్షి, హైదరాబాద్: ‘‘మునుగోడు నియోజకవర్గంలో ఫోన్ పే, గూగుల్ పే వంటి పేమెంట్ యాప్స్ ద్వారా నగదు బదిలీ చేసి ఓటర్లను ప్రలోభాలకు గురి చేస్తున్నారన్న విషయం మా దృష్టికి వచ్చింది. దీనిపై నల్లగొండ జిల్లా కలెక్టర్ నుంచి సమగ్ర నివేదిక కోరాం. నివేదిక వచ్చాక కఠిన చర్యలు తీసుకుంటాం’’అని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) వికాస్‌రాజ్ తెలిపారు. ఓటర్లను ఇలా ప్రలోభాలకు గురిచేసే వారిని గుర్తించి, చర్యలు తీసుకునేందుకు రిజర్వు బ్యాంకు, ఇతర బ్యాంకుల సహకారాన్ని కోరే అవకాశాలను పరిశీలిస్తామని చెప్పారు. అయితే దీనిపై జాతీయ స్థాయిలో నిర్ణయం తీసుకుంటే బాగుంటుందన్నారు. మునుగోడు ఉప ఎన్నిక నేపథ్యంలో వికాస్‌రాజ్ ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. వివరాలు ఆయన మాటల్లోనే..
కొత్త ఓటర్లపై కోర్టు తీర్పు మేరకు నిర్ణయం
మునుగోడులో 24 వేలకుపైగా కొత్త ఓటర్ల నమోదుపై హైకోర్టులో విచారణ జరుగుతోంది. మా వాదనలు వినిపించాం. ఎన్ని దరఖాస్తులు వచ్చాయి? ఎప్పుడు వచ్చాయి? ఎన్ని ఆమోదించాం? ఎన్ని తిరస్కరించాం? కారణాలేమిటన్నది కోర్టుకు వివరించాం. కోర్టు తీర్పు ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటాం. వేలకోట్ల కాంట్రాక్టుల కోసమే కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి బీజేపీలో చేరారంటూ టీఆర్‌ఎస్ నేతలు చేసిన ఫిర్యాదుపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాకు ఎలాంటి ఆదేశాలు రాలేదు.
టీఆర్‌ఎస్ పేరుమార్పుపై సమాచారం లేదు
టీఆర్‌ఎస్ పార్టీని బీఆర్‌ఎస్‌గా మార్చాలంటూ ఆ పార్టీ నాయకత్వం కేంద్ర ఎన్నికల సంఘానికి నివేదించింది. పార్టీ పేరు మార్పునకు అనుమతిపై కేంద్ర ఎన్నికల సంఘం నుంచి మాకు ఎలాంటి సమాచారం కోరలేదు. పార్టీ పేరు మార్పునకు అనుమతి విషయంలో ఇంకా ఈసీఐ నుంచి మాకు ఎలాంటి సమాచారం లేదు. ఇక చండూరులో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంపై దాడి జరిగిందన్న ఫిర్యాదుపై డీజీపీ, జిల్లా ఎస్పీల నుంచి నివేదిక కోరాం. ఇంకా అందలేదు.
ఎక్కువ మంది ఉన్నా నిర్వహించగలం
గతంలో నిజామాబాద్ స్థానం నుంచి భారీ సంఖ్యలో అభ్యర్థులు పోటీ చేసినా విజయవంతంగా ఎన్నికలు జరిపాం. మునుగోడులో ఇప్పటివరకు 40 మందికిపైగా అభ్యర్థులు నామినేషన్లు వేశారు. ఎక్కువ సంఖ్యలో బ్యాలెట్ యూనిట్లను తెప్పించి సిద్ధంగా పెట్టాం. నియోజకవర్గంలో 298 పోలింగ్ కేంద్రాలకుగాను గురువారం నాటికి 2,40,287 మంది ఓటర్లు ఉన్నారు. ఈ ఎన్నికకు పాత ఈవీఎంలనే వాడుతున్నాం. ఒక పోలింగ్ కేంద్రానికి ఒక కంట్రోల్ యూనిట్ సరిపోతుంది. అభ్యర్థుల సంఖ్యను దృష్టిలో పెట్టుకుని 2,126 బ్యాలెట్ యూనిట్లను సిద్ధం చేస్తున్నాం. 1,500 మంది పోలింగ్ అధికారులు, సిబ్బందిని నియమిస్తున్నాం. 10 కంపెనీల కేంద్ర బలగాలు వస్తున్నాయి. రాష్ట్రం నుంచి 2,500 మందిని పోలింగ్ బందోబస్తు విధులకు వాడుకుంటాం.
ప్రలోభాల కట్టడికి కఠిన చర్యలు
మునుగోడు నియోజకవర్గం పరిసర ప్రాంతాల్లో 113 పోలీసు చెక్‌పోస్టులు ఏర్పాటు చేసి తనిఖీలు చేయిస్తున్నాం. మరో 45 ఫ్లైయింగ్ స్క్వాడ్స్, వీడియో స్క్వాడ్స్, అబ్జర్వర్ల బృందాలు పరిశీలన జరుపుతున్నాయి. ఇప్పటివరకు రూ.20 లక్షల నగదు, రూ.16.2 లక్షల విలువ చేసే మద్యం జప్తు చేశాం. రోజువారీ మద్యం విక్రయాలపై నిఘా పెట్టాం. నియోజకవర్గంలోని 70 బెల్ట్ షాపులను మూయించాం. మద్యం సంబంధిత కేసుల్లో 60 మంది అరెస్టయ్యారు. అనుమతి లేని ప్రాంతాల్లో బ్యానర్లు, పోస్టర్లు అంటించడం వంటి ఘటనల్లో 15వేలకుపైగా కోడ్ ఉల్లంఘన కేసులు నమోదయ్యాయి.
Comments
Please login to add a commentAdd a comment