కొత్తగా ఏర్పడే ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో ఎన్ని పార్టీలు ఉండబోతున్నాయో తెలుసా.. కేవలం మూడంటే మూడే. తెలుగుదేశం పార్టీ, భారతీయ జనతాపార్టీ పొత్తు పెట్టుకుని పోటీచేయగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒంటరిగా బరిలోకి దిగింది. ఈ రెండూ కాక.. కాంగ్రెస్ పార్టీ, జై సమైక్యాంధ్ర పార్టీ, లోక్సత్తా పార్టీ, సీపీఐ, సీపీఎం లాంటి పక్షాలు కూడా ఎన్నికల రణరంగంలో నిలిచాయి. అయితే.. టీడీపీ, వైఎస్ఆర్సీపీ, బీజేపీ తప్ప మిగిలిన పార్టీలేవీ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయాయి. తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న బీజేపీ నాలుగు స్థానాల్లో గెలిచింది. టీడీపీ 102 స్థానాలను గెలుచుకోగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు 67 స్థానాల్లో విజయపతాకం ఎగరేశారు. మరో రెండు స్థానాల్లో స్వతంత్ర అభ్యర్థులు గెలిచారు. తూర్పుగోదావరి జిల్లా పిఠాపురంలో తెలుగుదేశం పార్టీ రెబెల్ అభ్యర్థి వర్మ విజయం సాధించగా, ప్రకాశం జిల్లా చీరాలలో స్వతంత్ర అభ్యర్థి ఆమంచి కృష్ణమోహన్ విజయం సాధించారు. గతంలో కాంగ్రెస్ పార్టీ తరఫున పోటీ చేసి గెలిచిన కృష్ణమోహన్.. ఈసారి రాష్ట్ర విభజన అనంతర పరిణామాల్లో కాంగ్రెస్ నుంచి పోటీ చేయకూడదని నిర్ణయించుకున్నారు. అందుకే స్వతంత్రునిగా బరిలోకి దిగి విజయం సాధించారు.
అయితే పార్టీ పరంగా చూసుకున్నప్పుడు కేవలం మూడు పార్టీల అభ్యర్థులు మాత్రమే ఎన్నికల్లో విజయం సాధించారు కాబట్టి, ఈ మూడు పార్టీలు మాత్రమే కొత్త అసెంబ్లీలో అడుగు పెట్టేందుకు అర్హత సాధించినట్లయింది. అందులోనూ బీజేపీ సభ్యులు నలుగురే ఉండటం, వాళ్లు తెలుగుదేశం పార్టీ మిత్రపక్ష సభ్యులు కావడంతో ప్రజాసమస్యల మీద ప్రభుత్వాన్ని నిలదీయాలన్నా, ప్రభుత్వ చర్యలకు అసెంబ్లీలో నిరసన తెలియజేయాలన్నా ఇక ఉన్న ఏకైక పార్టీ.. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మాత్రమేనన్నమాట!!
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీలో మూడు పార్టీలే!!
Published Sat, May 17 2014 4:33 PM | Last Updated on Tue, Aug 14 2018 4:24 PM
Advertisement
Advertisement