ఏపీలో కాంగ్రెస్ని వీడిన 73 మంది ఎమ్మెల్యేలు
సభల్లో జనం లేరు... వచ్చిన వారు కూడా విమర్శల బాణాలు వేసి చీకాకు పెడుతున్నారు.... తోటి నాయకులు మొహం చాటేస్తున్నారు. ఏదైనా ఊరికి వెళ్తే ఆ ఊరి నాయకులు కొద్ది గంటల క్రితమే పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదీ సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి. రాష్ట్ర విభజన నిర్ణయం తరువాత సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చిల్లుకుండలా తయారైంది.
ఈ మధ్యకాలంలో మొత్తం 73 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టారు. వీరంతా 2009 లో కాంగ్రెస్ టికెట్ పైనే గెలిచారు. వీరిలో 33 మంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 27 మంది టీడీపీలో చేరారు. నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరారు. వీరిలో ఇద్దరు సోమవారం కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు 14 మంది టీఆర్ ఎస్ లో చేరారు.
స్థానిక ఎన్నికల తరువాత మరి కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని కథనాలు వినవస్తున్నాయి.
అందుకే నాయకులు చేజారకుండా ఉండేందుకు ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయినా 2019 లో వారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు వాగ్దానం చేస్తున్నారు. అయినప్పటికీ నాయకులు కాంగ్రెస్ లో ఉండేట్లు కనిపించడం లేదు. తాజాగా కాంగ్రెస్ నేతలు మరో మార్గం లేక చిరంజీవి అభిమాన సంఘాలకు పార్టీ సభ్యత్వం ఇస్తామని, జిల్లాకి ఇద్దరు చొప్పున టికెట్లు ఇస్తామని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు.
మొత్తం మీద నూట ఇరవై ఆరేళ్ల పార్టీకి సీమాంధ్రలో నూరేళ్లు నిండుతున్నాయేమోనన్న అనుమానం నానాటికి బలపడుతోంది.