Chiranjeevi Fans Association
-
వైఎస్సార్సీపీలోకి ఉత్తరాంధ్ర చిరంజీవి ఫ్యాన్స్ అధ్యక్షుడు
సాక్షి, హైదరాబాద్/నక్కపల్లి(పాయకరావుపేట): ఉత్తరాంధ్ర చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అధ్యక్షుడు, జనసేన నేత ఎం.రాఘవరావు బుధవారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగిన సభలో రాఘవరావుతో పాటు అనకాపల్లి మాజీ జెడ్పీటీసీ పూసపాటి భరత్‌బాబు, డాక్టర్ బోని తాతారావుకు వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాఘవరావు మాట్లాడుతూ.. టీడీపీతో, సీఎం చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తున్న పవన్ విధానాలు నచ్చకే జనసేన నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. అభిమానులను పవన్ ఘోరంగా మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయన్నారు. మైనార్టీల సమస్యలు తీరాలంటే జగన్ రావాలి.. హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో మాజీ మంత్రి మహ్మద్ జానీ, ఆయన కుమారులు డాక్టర్ అక్బర్, ఎండీ అలీ, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్, ఏపీ జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎం.రమణయ్య, మాజీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బీబీ రాజేంద్ర ప్రసాద్, మాజీ గౌరవాధ్యక్షుడు టీవీఎస్‌జీ రాజారెడ్డి తదితరులు జగన్ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు. మహ్మద్ జానీ మాట్లాడుతూ.. తాను కొంత కాలం కిందట టీడీపీలో చేరానని.. కానీ అక్కడి నాయకులకు మైనారిటీలంటే చాలా చులకన అని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఐదుగురు ముస్లింలకు టికెట్లివ్వడం హర్షణీయమన్నారు. జనసేనకి టీడీపీతో లోపాయికారీ పొత్తు ఉందని మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ చెప్పారు. ఇదిలా ఉండగా చిలకలూరిపేట టీడీపీ పట్టణ అధ్యక్షుడు మల్లెల రాజేశ్ నాయుడు, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు, మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ గాలి సుబ్బయ్య, పట్టణ టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్ జిలానీ, ఎంపీటీసీ ఎం.వీరయ్య, టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు షేక్ సలీం, పట్టణ టీడీపీ కార్యదర్శి బైరా శ్రీనివాసులు, ఇతర నేతలు రామిశెట్టి తాండేశ్వర్రావు, కటకం శెట్టి వీరబ్రహ్మం టీడీపీకి రాజీనామా చేశారు. బుధవారం వీరంతా చిలకలూరిపేట వైఎస్సార్సీపీ అభ్యర్థి విడదల రజని ఆధ్వర్యంలో.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ప్రకటించిన నవరత్న పథకాలతో ఆకర్షితులమై టీడీపీని వీడి వైఎస్సార్సీపీలో చేరినట్లు చెప్పారు. -
జనసేనలోకి ‘చిరు’ అభిమానులు
సాక్షి, హైదరాబాద్ : రాజకీయాల్లో తన వెంట నడవాలని చిరంజీవి అభిమానులతో జరిగిన ఆత్మీయ సమావేశంలో జనసేన పార్టీ అధినేత పవన్‌కల్యాణ్ కోరారు. బాధ్యతాయుతంగా చాలా క్రమశిక్షణతో రాజకీయాలు నిర్వర్తిస్తానని వారికి హామీ ఇచ్చారు. సోమవారం హైదరాబాద్‌లో పవన్‌కల్యాణ్ నేతృత్వంలో మెగా అభిమానుల ఆత్మీయ సదస్సు జరిగింది. పలువురు మెగా ఫ్యామిలీ అభిమానులు జనసేన పార్టీలో చేరారు. అఖిల భారత చిరంజీవి యువత వ్యవస్థాపక అధ్యక్షుడు ఆర్.స్వామినాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.రవీంద్రబాబు, తెలంగాణ చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు ఎ.నందకిషోర్, జనరల్ సెక్రటరీ బి.విల్సన్‌బాబు, జంట నగరాల చిరంజీవి యువత అధ్యక్షుడు నూర్‌అహ్మద్, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, కర్నాటక రాష్ట్రాల చిరంజీవి యువత అధ్యక్షులు కె.రామకృష్ణ, కె.నగేష్, బి.జి.నాగేంద్రకు పవన్ పార్టీ కండువా కప్పి ఆహ్వానించారు. జనసేన పార్టీ బయట వారిది కాదని, చిరంజీవి అభిమానులదేనని పవన్ తెలిపారు. -
కొట్టుకున్న చిరంజీవి అభిమాన సంఘం నేతలు
కరీంనగర్: చిరంజీవి అభిమాన సంఘం నేతల విభేదాలు కొట్లాటకు దారితీశాయి. దీనిపై పెద్దపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. కరీంనగర్ జిల్లా పెద్దపల్లి మండలం వెంకట్రావుపల్లిలో ఆదివారం చిరంజీవి అభిమాన సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర్లు ఇంట్లో జరిగిన ఒక కార్యక్రమానికి సంఘం రెండు రాష్ట్రాల అధ్యక్షులు కరాటే ప్రభాకర్, స్వామి నాయుడు తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జరిగిన విందు అనంతరం నాయకులంతా సాయంత్రం 5 గంటల సమయంలో తిరుగు ప్రయాణమయ్యారు. గ్రామం సమీపంలోని రైల్వేగేట్ సమీపంలో గోదావరిఖనికి చెందిన సంఘం నేత రాము, అతని అనుచరులు తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు కరాటే ప్రభాకర్‌పై దాడికి దిగారు. దీనిపై ప్రభాకర్ ఫిర్యాదు మేరకు పెద్దపల్లి పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా, ఈ ఘటనపై సినీ నటుడు చిరంజీవికి కూడా సమాచారం అందించినట్లు నాయకులు తెలిపారు. -
చిరంజీవి అభిమానుల సమావేశం
హైదరాబాద్: కాంగ్రెస్ నేత, రాజ్యసభ సభ్యుడు కొణిదెల చిరంజీవి అభిమాన సంఘాలు ఆదివారం సమావేశమవుతున్నాయి. చిరంజీవి ఇటీవలి కాలంలో పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్న విషయం తెలిసిందే. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో పాల్గొనే విషయంలోనూ ఆయన పెద్దగా ఆసక్తి చూపలేదు. బడ్జెట్ సమావేశాల్లో ఆయన కేవలం నాలుగు రోజులు మాత్రమే రాజ్యసభకు హాజరైనట్టు రికార్డులు చెబుతున్నాయి. ఆయన సోదరుడు పవన్ కల్యాణ్ జనసేన పార్టీ ఏర్పాటు, కార్యక్రమాల కొనసాగింపు నేపథ్యంలో తదనంతర కార్యాచరణపై చిరంజీవి అభిమానుల్లో తర్జనభర్జన సాగుతోంది. మరోవైపు చిరంజీవి 150వ చిత్ర నిర్మాణంపైనే దృష్టి సారించారని వార్తలొస్తున్న నేపథ్యంలో ఆయన అభిమానులు ఆదివారం హైదరాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో తాజా పరిణామాలతో పాటు భవిష్యత్తు కార్యక్రమాలపై చర్చించనున్నారు. అభిమాన సంఘాల ఎన్నికలపైన కూడా ఈ సమావేశంలో చర్చిస్తారు. -
కొందరివాడుగా మిగిలిపోయిన అందరివాడు
ఐదేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం, తమ అభిమాన నటుడి కోసం నిస్వార్థంగా పనిచేశారు. పాపం అభిమానులు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ తరపున ప్రచారం చేశారు. పలు ప్రాంతాల్లో బస్టాపుల వద్ద సిమెంటు బల్లల నిర్మాణం, బస్సు షెల్టర్ల నిర్మాణం, పలు సామాజిక కార్యక్రమాలు.. ఇలా అనేక పేర్లతో డబ్బులు వదిలించుకున్నారు. అయితే పీఆర్పీ నాయకులు ఓట్ల కోసం వారిని వాడుకున్నారు తప్ప వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు వినిపించాయి. పార్టీలోనూ వారికి పెద్దగా ఆదరణ లభించలేదు. ఆ తర్వాత ఎన్నికల్లో పీఆర్పీ చతికిల పడటం.. ఏదో సాధిస్తాడని అనుకున్న చిరంజీవి పార్టీని కాంగ్రెస్‌లో విలీనం చేయడం వంటి పరిణామాలను అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వెండితెరపై మెగాస్టార్‌ను గొప్పగా ఊహించుకున్న అభిమానులకు.. రాజకీయ జీవితంలో ఆయన వైఖరి చూసి భ్రమలు తొలగిపోయాయి. పీఆర్పీ ఆవిర్భావ సమయంలో సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి ఆ తర్వాత సమైక్యాంధ్ర అనడం.. హైదరాబాద్ యూటీ డిమాండ్.. చివరకు కాంగ్రెస్ హైకమాండ్‌కు విధేయత ప్రకటించి విభజనకు పూర్తిస్థాయిలో ఆమోదం తెలపడంతో చాలా మంది అభిమానులు ఆయనకు దూరమయ్యారు. ఒకప్పడు 'అందరివాడు'గా జననీరాజనం అందుకున్న చిరంజీవి ప్రస్తుతం 'కొందరివాడు'గానే మిగిలిపోయారు. కాంగ్రెస్‌లో పీఆర్పీని విలీనం చేశాక చిరంజీవితో పాటు కొంతమంది నాయకులకే అధికారిక, పార్టీ పదవులు దక్కాయి. చాలా మంది నిరాదరణకు గురయ్యారు. ఇక అభిమానుల సంగతైతే చెప్పనక్కర్లేదు. రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి అండతో మంత్రి పదవి పొందిన గంటా శ్రీనివాసరావు సహా గత ఎన్నికల్లో పీఆర్పీ తరపున గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌కు గుడ్ బై చెప్పారు. దీనికితోడు సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తరుణంలో చిరంజీవి ఇటీవల అభిమాన సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, వట్టి వసంతకుమార్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో చిరంజీవి అభిమాన సంఘాల నేతలకు టికెట్లు ఇస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. చిరంజీవి అభిమాన సంఘాలు కాంగ్రెస్‌వైపే ఉండాలని, ప్రచారాల్లో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా, పీసీసీ కార్యవర్గాల్లో వారికి అవకాశం కల్పిస్తామని రఘువీరా రెడ్డి హామీ కూడా ఇచ్చారు. అభిమాన సంఘాలకు ఎక్కడ వీలుంటే అక్కడ టికెట్లు ఇస్తామని చిరంజీవి తెలిపారు. ఓటమి భయంతో పెద్దపెద్ద నాయకులే కాంగ్రెస్ వీడి పోతుంటే అభిమానులను బలిపీఠంపై కూర్చోపెడుతున్నారే గుసగుసలు వినిపించాయి. పైగా ఇన్నాళ్లూ నిరాదరణకు గురైన అభిమానులు ఎన్నికల ముందే కాంగ్రెస్ నాయకులకు గుర్తొచ్చారనే విమర్శలు వచ్చాయి. పాపం అభిమానులపై ఉన్నది 'చిరు' ప్రేమేనా..! -
ఏపీలో కాంగ్రెస్‌ని వీడిన 73 మంది ఎమ్మెల్యేలు
సభల్లో జనం లేరు... వచ్చిన వారు కూడా విమర్శల బాణాలు వేసి చీకాకు పెడుతున్నారు.... తోటి నాయకులు మొహం చాటేస్తున్నారు. ఏదైనా ఊరికి వెళ్తే ఆ ఊరి నాయకులు కొద్ది గంటల క్రితమే పార్టీకి గుడ్ బై చెప్పేస్తున్నారు. ఇదీ సీమాంధ్రలో కాంగ్రెస్ పరిస్థితి. రాష్ట్ర విభజన నిర్ణయం తరువాత సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ పరిస్థితి చిల్లుకుండలా తయారైంది. ఈ మధ్యకాలంలో మొత్తం 73 మంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీని విడిచిపెట్టారు. వీరంతా 2009 లో కాంగ్రెస్ టికెట్ పైనే గెలిచారు. వీరిలో 33 మంది వైఎస్ ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. 27 మంది టీడీపీలో చేరారు. నలుగురు తెలంగాణ ఎమ్మెల్యేలు టీఆర్ ఎస్ లో చేరారు. వీరిలో ఇద్దరు సోమవారం కాంగ్రెస్ లోకి తిరిగి వచ్చారు. తెలంగాణలో టీడీపీ ఎమ్మెల్యేలు 14 మంది టీఆర్ ఎస్ లో చేరారు. స్థానిక ఎన్నికల తరువాత మరి కొంత మంది ఎమ్మెల్యేలు పార్టీని వీడే అవకాశం ఉందని కథనాలు వినవస్తున్నాయి. అందుకే నాయకులు చేజారకుండా ఉండేందుకు ఈ సారి ఎన్నికల్లో ఓడిపోయినా 2019 లో వారికే టికెట్లు ఇస్తామని కాంగ్రెస్ నేతలు వాగ్దానం చేస్తున్నారు. అయినప్పటికీ నాయకులు కాంగ్రెస్ లో ఉండేట్లు కనిపించడం లేదు. తాజాగా కాంగ్రెస్ నేతలు మరో మార్గం లేక చిరంజీవి అభిమాన సంఘాలకు పార్టీ సభ్యత్వం ఇస్తామని, జిల్లాకి ఇద్దరు చొప్పున టికెట్లు ఇస్తామని కూడా పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తం మీద నూట ఇరవై ఆరేళ్ల పార్టీకి సీమాంధ్రలో నూరేళ్లు నిండుతున్నాయేమోనన్న అనుమానం నానాటికి బలపడుతోంది. -
బాబాయ్‌కి చెక్ పెట్టాడానికే చరణ్ 'అలా' చేశాడా ?
-
'సినిమాలకైతే ఓకే... రాజకీయాలకూ అంటే...'
-
కోటె మా గుండెల్లో ఉన్నారు
బెంగళూరు, న్యూస్‌లైన్ :అఖిల కర్ణాటక అన్న య్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు కోటె వెంకటేశ్ యాదవ్ భౌతికంగా లేకపోయినా మా గుండెల్లో పదిలంగా ఉన్నారని వక్తలు పేర్కొన్నారు. ఇక్కడి కార్పొరేషన్ సమీపంలోని టౌన్హాల్లో శుక్రవారం రాత్రి కోటె వెంకటేశ్ సంతాపసభ జరిగింది. చిక్కపేట ఎమ్మెల్యే ఆర్.వీ. దేవరాజ్, ఆంధ్రప్రదేశ్ చిరంజీవి యువత రాష్ట్ర అధ్యక్షుడు రవణం స్వామి నాయుడు, కర్ణాటక తెలుగు ప్రజా సమితి రాష్ట్ర అధ్యక్షుడు బొందు రామస్వామి ముఖ్య అతిథులుగా హాజరై కోటె వెంకటేశ్‌కు ఘన నివాళి అర్పించారు. ఈ సందర్భంగా ఆర్.వీ. దేవరాజ్ మాట్లాడుతూ చిరంజీవి అభిమానుల సంఘాన్ని కర్ణాటకలో స్థాపించి ఎంతో సేవ చేశారన్నారు. కోటే కుటుంబ సభ్యులకు తాము అండగా ఉంటామన్నారు. రవణం స్వామి నాయుడు మాట్లాడుతూ వెంకటేశ్ యాదవ్ దూరం కావడం నమ్మలేకపోతున్నామన్నారు. చిరంజీవి యువత ఆధ్వర్యంలో సేకరించి వెంకటేశ్ కుమారుడు కోటే శ్రీనివాస్ బ్యాంకు ఖాతాలో డిపాజిట్ చేసిన రూ. 6లక్షలకు సంబంధించి ధ్రువీకరణ పత్రాన్ని ఈ సందర్భంగా కుటుంబ సభ్యులకు అందించారు. అఖిల కర్ణాటక అనయ్య చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు సేకరించిన రూ. 1.30 లక్షలను కోటే కుటుంబ సభ్యులకు ఆర్వీ. దేవరాజ్, స్వామి నాయుడు అందించారు. బొందురామస్వామి మాట్లాడుతూ బెంగళూరులో జరిగిన సమైక్యాంధ్ర ఉద్యమాలలో వెంకటేశ్ పాల్గొన్నారన్నారు. ఇదే నెలలో గాంధీనగరలోని కనిష్క హొటల్లో కోటే వెంకటేశ్ యాదవ్ సంతాప సభ నిర్వహించనున్నట్లు తెలిపారు. వెంకటేశ్ కుటుంబ సభ్యులకు తాము చేతనైన సహాయం చేస్తామన్నారు. ఇదిలా ఉండగా సంతాపసభకు హైదరాబాద్, అనంతపురం, బళ్లారి, బెంగళూరు, కోలారు, ముళబాగిలు, చిక్కబళ్లారం, చింతామణి తదితర ప్రాంతాలకు చెందిన అభిమానులతోపాటు చింతామణి మహేష్, మార్కండేయ, అంజి, రాజ్‌బాబు, నరసింహ, మార్టీన్, ఎన్. మురళి కళ్యాణ్, దాస్, బాబు, ప్రతాప్, సంతోష్, కలాసిపాళ్య దినేష్, బాబు రాజేంద్ర కుమార్, శివకుమార్, అంబరీష్‌రెడ్డి, అనంతపురం చంద్రమౌళి, జేడీఎస్ నారాయణ్, రామచంద్ర, బళ్లారి సాంబశివరావు, బళ్లారి రాజు, మొబైల్ బాబు హాజరయ్యారు. అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ర్ట అధ్యక్షుడిగా కోటె సతీష్ ఏకగ్రీవం అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా కోటే సతీష్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని ఆ సంఘం పదాధికారులు తెలిపారు. కోటే వెంకటేశ్ లేని లోటును ఆయన తమ్ముడు కోటే సతీష్ తీర్చుతాడని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈయనకు త్వరలోనే ధ్రువీకరణ పత్రం అందజేస్తామని రవణం స్వామినాయుడు హామీ ఇచ్చారన్నారు. -
వెంకటేశ్ కుటుంబానికి అండగా నిలుస్తాం : నాగబాబు
సాక్షి,సిటీబ్యూరో: రాజకీయాలకతీతంగా చిరంజీవి అభిమానులు ఏకంగా ఉండాలని సినీనటుడు కె.నాగబాబు తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా పాలెంలో జరిగిన వోల్వో బస్సు దుర్ఘటనలో మృతిచెందిన అఖిలభారత చిరంజీవి ఫ్యాన్స్‌వెల్ఫేర్ అసోసియేషన్ అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్‌యాదవ్ సంస్మరణసభ శుక్రవారం రవీంద్రభారతిలో జరిగింది. నాగబాబు ప్రసంగిస్తూ ఇబ్బందుల్లో ఉన్న చిరంజీవి అభిమానుల కుటుంబాలకు తాము అండగా ఉంటామన్నారు. వెంకటేశ్‌యాదవ్ పిల్లలు జీవితంలో స్థిరపడే వరకు చేదోడువాదోడుగా నిలుస్తామని హామీఇచ్చారు. చిరంజీవి తనయుడు రామ్‌చరణ్ మాట్లాడుతూ వెంకటేశ్‌యాదవ్ మృతి అభిమాన సంఘానికి తీరనిలోటన్నారు. సినీ నిర్మాత అల్లు అరవింద్ మాట్లాడుతూ చిరంజీవి అభిమాని చనిపోతే ఇంత స్పందన వస్తుందని అనుకోలేదని చెప్పారు. ఈసందర్భంగా మృతుల కుటుంబీకులకు రాష్ట్ర చిరంజీవి యువత ఆధ్వర్యంలో రూ.6లక్షల డీడీని, ఇతరులకు మరో రూ.3 లక్షలు అందజేశారు. ఈ కార్యక్రమంలో అల్లు అర్జున్, రాష్ట్ర చిరంజీవి యువత అధ్యక్షుడు ఆర్.స్వామినాయుడు, తమిళనాడు రాష్ట్ర చిరంజీవి యువసేన అధ్యక్షుడు కె.నాగేష్, తెలంగాణ అధ్యక్షుడు కె.ప్రభాకర్‌గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
పెళ్లి పత్రికలు పంచడానికి వెళ్లి... పరలోకానికి
బెంగళూరు, న్యూస్‌లైన్ : మేనకోడలు పెళ్లికి ఆహ్వాన పత్రికలు పంచడానికి వెళ్లిన అఖిల కర్ణాటక అన్నయ్య చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు కోటె వెంకటేశ్ యాదవ్ (45) జబ్బార్ ట్రావెల్స్ బస్సులో సజీవ దహనమయ్యారు. సోదరి అనిత కుమారి (43)తో కలసి మంగళవారం రాత్రి ఆయన హైదరాబాద్‌కు బయలుదేరారు. కేంద్ర మంత్రి చిరంజీవి కుటుంబ సభ్యులకు పత్రికలు పంచాలన్నది ప్రధానోద్దేశం. వారిద్దరి దుర్మరణం వార్త తెలియడంతో పెళ్లి ముచ్చట్లతో సందడిగా ఉన్న ఇంటిలో విషాద ఛాయలు అలుముకున్నాయి. వెంకటేశ్ నివాసం ఇక్కడి కళాసిపాళ్యలో ఉండగా, అనిత బాణసవాడిలో కాపురం ఉంటున్నారు. ఆమె కుమార్తె అనూషకు సతీశ్ అనే అబ్బాయితో వివాహం నిశ్చయమైంది. నవంబరు 14న ఇక్కడి బసవనగుడిలోని కళ్యాణ మంటపంలో వివాహానికి ఏర్పాట్లు చేసుకుంటున్నారు. వెంకటేశ్...చిరంజీవి, అల్లు అరవింద్ కుటుంబాలకు సన్నిహితుడు. వారిని ఆహ్వానించడానికే సోదరితో కలసి హైదరాబాద్‌కు బయలుదేరాడు. కుమారుడు శ్రీనివాస్ స్వయంగా బస్సు ఎక్కించాడు. బుధవారం వేకువ జామున వారు సజీవ దహనం అయ్యారని తెలుసుకున్న కుటుంబ సభ్యులు, ఆభిమానులు విషాదంలో మునిగిపోయారు. పెద్ద సంఖ్యలో చిరంజీవి అభిమానులు జబ్బార్ ట్రావెల్స్ దగ్గరకు చేరుకోవడంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. ట్రావెల్స్ సిబ్బందితో వాగ్వివాదానికి దిగారు. తరువాత పోలీసులు వారికి నచ్చజెప్పారు. 22 సంవత్సరాలుగా తెలుసు.... నాగేంద్రబాబు వెంకటేశ్ 22 సంవత్సరాలుగా తనకు తెలుసునని చిరంజీవి సోదరుడు, నిర్మాత నాగేంద్రబాబు అన్నారు. ప్రమాద స్థలికి వెళ్లిన ఆయన అక్కడి నుంచే ‘న్యూస్‌లైన్’తో ఫోన్లో మాట్లాడారు. వెంకటేశ్ మరణ వార్తను జీర్ణించుకోలేక పోతున్నామని విచారం వ్యక్తం చేశారు. ఆయన కుటుంబ సభ్యులను అన్ని విధాలా ఆదుకుంటామని హామీ ఇచ్చారు. వెంకటేశ్ కుటుంబాన్నిఆదుకుంటాం ...అల్లు అరవింద్ హామీ కోటె. వెంకటేశ్ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకుంటామని నిర్మాత అల్లు అరవింద్ హామీ ఇచ్చారు. బుధవారం రాత్రి ఆయనిక్కడ వెంకటేశ్ కుటుంబ సభ్యులను కలుసుకుని సాంత్వన వచనాలు పలికారు. వెంకటేశ్ మృతితో కుటుంబ సభ్యుని కోల్పోయామని, ఆయన 25 ఏళ్లుగా తమకు తెలుసునని గద్గద స్వరంతో అన్నారు. బెంగళూరులో చిరంజీవి కార్యక్రమాలు చేపట్టినప్పుడల్లా వెంకటేశ్ ముందుండే వారని తెలిపారు. అలాంటి వెంకటేశ్ కుటుంబాన్ని అనాథగా మిగలబోనివ్వమని అన్నారు. ఆయన పిల్లల చదువులు, పెళ్లిళ్లకు అండగా నిలబడతామని హామీ ఇచ్చారు. దశ దిన కర్మ లోపు మరో సారి ఇక్కడికి వచ్చి వారికి సాయం అందిస్తామని కూడా ఆయన చెప్పారు. తరలి వచ్చిన అభిమానులు, స్నేహితులు 1992 ఆగస్టు 22న వెంకటేశ్ కర్ణాటక చింరజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. అప్పటి నుంచి ఇప్పటి వరకు కర్ణాటక చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడిగా కొనసాగుతున్నారు. కేవలం చిరంజీవి అభిమానులే కాకుండా ఇతర హీరోల అభిమానులు కూడా ఆయనతో స్నేహ పూర్వకంగా వ్యవహరించే వారు. ఆయనిక లేరని తెలియడంతో చిరంజీవి అభిమానులతో పాటు నందమూరి తారక రామారావు, బాలకృష్ణ, జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు, బీజేపీ, కాంగ్రెస్, జేడీఎస్ పార్టీల నాయకులు, కర్ణాటక తెలుగు ప్రజా సమితి అధ్యక్షుడు బొందు రామస్వామి ప్రభృతులు వెంకటేశ్ నివాసం దగ్గరకు చేరుకున్నారు. జేడీఎస్ ఎమ్మెల్యే జమీర్ అహ్మద్ ఖాన్ వెంకటేశ్ తండ్రి సుందర్ రాజ్‌ను ఓదార్చారు. స్థానిక శాసన సభ్యుడు ఆర్వీ. దేవరాజ్ కుటుంబ సభ్యులు, బీజేపీ నాయకుడు చింతామణి మహేష్, జేడీఎస్ నాయకుడు రవిప్రసాద్, తమిళనాడు చిరంజీవి అభిమానుల సంఘం అధ్యక్షుడు నాగేష్, కర్ణాటక బాలకృష్ణ అభిమానుల సంఘం అధ్యక్షుడు మాణిక్య, చిరంజీవి అభిమానుల సంఘం నాయకులు అంజి, మార్కండేయ, కర్ణాటక రామ్‌చరణ్ అభిమానుల సంఘం అధ్యక్షుడు మార్టిన్, ప్రధాన కార్యదర్శి మురళి కళ్యాణ్, చిక్కబళ్లాపురం మొబైల్ బాబు, కేఆర్ పురం మార్కెట్ బాబు, ప్రేమ్, రాజబాబు, గోవిందస్వామి, సంతోష్, టెంట్ నాగేంద్ర, బాలాజీ, రమేష్,శీన, మోనిష్, కళ్యాణ్, మురళి, బాలయ్య అభిమానుల సంఘం నాయకులు మార్క్ శీను, అమ్ములు, శ్రీనివాస్, గోపీ, మిలటరి శివ, ఖాన్, హొసూరు బాబు, వీజీ. మంజునాథ్, గోపాల్ తదితరులు వెంకటేశ్ కుటుంబ సభ్యులకు ధైర్య వచనాలు పలికారు.