వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరుతున్న పంతం గాంధీ, మహ్మద్ జానీ, రాఘవరావు
సాక్షి, హైదరాబాద్/నక్కపల్లి(పాయకరావుపేట): ఉత్తరాంధ్ర చిరంజీవి ఫ్యాన్స్ ప్రెసిడెంట్, చిరంజీవి బ్లడ్ బ్యాంక్ అధ్యక్షుడు, జనసేన నేత ఎం.రాఘవరావు బుధవారం ప్రతిపక్షనేత వైఎస్ జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. విశాఖ జిల్లా పాయకరావుపేటలో జరిగిన సభలో రాఘవరావుతో పాటు అనకాపల్లి మాజీ జెడ్‌పీటీసీ పూసపాటి భరత్‌బాబు, డాక్టర్ బోని తాతారావుకు వైఎస్ జగన్ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు. రాఘవరావు మాట్లాడుతూ.. టీడీపీతో, సీఎం చంద్రబాబుతో జనసేన అధ్యక్షుడు పవన్‌కళ్యాణ్ లోపాయికారీ ఒప్పందం కుదుర్చుకున్నారని చెప్పారు. ఓటర్లను మభ్యపెట్టాలని చూస్తున్న పవన్ విధానాలు నచ్చకే జనసేన నుంచి బయటకు వచ్చినట్లు తెలిపారు. అభిమానులను పవన్ ఘోరంగా మోసం చేస్తున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. జగన్ ప్రకటించిన నవరత్నాలు ప్రజలకు ఎంతో మేలు చేస్తాయన్నారు.
మైనార్టీల సమస్యలు తీరాలంటే జగన్ రావాలి..
హైదరాబాద్‌లోని లోటస్‌పాండ్‌లో మాజీ మంత్రి మహ్మద్ జానీ, ఆయన కుమారులు డాక్టర్ అక్బర్, ఎండీ అలీ, మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ మోహన్, ఏపీ జ్యుడీషియల్ ఎంప్లాయీస్ అసోసియేషన్ మాజీ అధ్యక్షుడు ఎం.రమణయ్య, మాజీ ఆర్గనైజింగ్ కార్యదర్శి బీబీ రాజేంద్ర ప్రసాద్, మాజీ గౌరవాధ్యక్షుడు టీవీఎస్జీ రాజారెడ్డి తదితరులు జగన్ సమక్షంలో వైఎస్సార్‌సీపీలో చేరారు. కార్యక్రమంలో వైఎస్సార్‌సీపీ రాష్ట్ర కార్యదర్శి గులాం రసూల్ తదితరులు పాల్గొన్నారు. మహ్మద్ జానీ మాట్లాడుతూ.. తాను కొంత కాలం కిందట టీడీపీలో చేరానని.. కానీ అక్కడి నాయకులకు మైనారిటీలంటే చాలా చులకన అని మండిపడ్డారు. వైఎస్ జగన్ ఐదుగురు ముస్లింలకు టికెట్లివ్వడం హర్షణీయమన్నారు. జనసేనకి టీడీపీతో లోపాయికారీ పొత్తు ఉందని మాజీ ఎమ్మెల్యే పంతం గాంధీ చెప్పారు.
ఇదిలా ఉండగా చిలకలూరిపేట టీడీపీ పట్టణ అధ్యక్షుడు మల్లెల రాజేశ్ నాయుడు, వ్యవసాయ మార్కెట్ యార్డు చైర్మన్ బత్తినేని శ్రీనివాసరావు, మార్కెటింగ్ యార్డు డైరెక్టర్ గాలి సుబ్బయ్య, పట్టణ టీడీపీ మైనారిటీ విభాగం అధ్యక్షుడు షేక్ జిలానీ, ఎంపీటీసీ ఎం.వీరయ్య, టీడీపీ సాంస్కృతిక విభాగం అధ్యక్షుడు షేక్ సలీం, పట్టణ టీడీపీ కార్యదర్శి బైరా శ్రీనివాసులు, ఇతర నేతలు రామిశెట్టి తాండేశ్వర్‌రావు, కటకం శెట్టి వీరబ్రహ్మం టీడీపీకి రాజీనామా చేశారు. బుధవారం వీరంతా చిలకలూరిపేట వైఎస్సార్‌సీపీ అభ్యర్థి విడదల రజని ఆధ్వర్యంలో.. ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు. జగన్ ప్రకటించిన నవరత్న పథకాలతో ఆకర్షితులమై టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరినట్లు చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment