వైఎస్సార్ జిల్లా పులివెందులలో తన నివాసం వద్ద తనను కలిసేందుకు వచ్చిన స్థానిక మహిళలతో మాట్లాడుతున్న వైఎస్ జగన్. చిత్రంలో వైఎస్ అవినాశ్‌రెడ్డి తదితరులు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో మరో రాజకీయ విప్లవానికి నేడు ఓటర్లు శ్రీకారం చుట్టనున్నారు. జాతీయ స్థాయిలో ఆసక్తి రేకెత్తిస్తున్న రాష్ట్ర ఎన్నికల్లో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డికి జై కొట్టనున్నారు. తొమ్మిదేళ్లుగా నిత్యం ప్రజలతో మమేకమవుతూ, వారి సమస్యల పరిష్కారం కోసం నిబద్ధతతో పోరాడుతున్న జననేతకు ప్రజాశీర్వాదం లభించనుంది. చరిత్రాత్మక ఎన్నికల్లో జయభేరి మోగించేంది జగనేనని ఇప్పటికే నిర్ధారణ అయ్యింది. రాష్ట్రంలో వైఎస్సార్‌సీపీ ఘన విజయం సాధించనుందని జాతీయ సర్వేలు కుండబద్దలు కొట్టిన సంగతి తెలిసిందే. జగన్‌కు ఒక్క అవకాశం ఇద్దామని ఎప్పుడో నిర్ణయానికి వచ్చిన రాష్ట్రంలోని 3.93 కోట్ల మంది ఓటర్లు తమ తీర్పును గురువారం ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాల్లో నిక్షిప్తం చేయనున్నారు.
తొమ్మిదేళ్లుగా ప్రజల వెంటే...
కొత్తగా ఏర్పడ్డ రాష్ట్రాన్ని ఐదేళ్ల క్రితం అనుభవజ్ఞుడని నమ్మి చంద్రబాబు చేతిలో పెట్టి మోసపోయామన్న భావన ప్రజల్లో ఏర్పడింది. అందుకే ఈసారి ఆ పొరపాటు చేయద్దన్న నిర్ణయానికి వచ్చారు. గెలుపోటములతో నిమిత్తం లేకుండా తొమ్మిదేళ్లుగా ప్రజల వెంటే నడుస్తున్న జగన్ నిబద్ధత అందరి మనసులను గెలుచుకుంది. ఇచ్చిన మాట కోసం 2010లో కాంగ్రెస్ పార్టీని వీడి బయటకు వచ్చినప్పటి నుంచి జగన్ ప్రస్థానమంతా ప్రజలతోనే సాగిందన్నది నిర్వివాదాంశం. కాంగ్రెస్, టీడీపీలు కుమ్మక్కై అక్రమ కేసులు పెట్టినా ఆయన అదరలేదు, బెదరలేదు. 2014 ఎన్నికల్లో అసాధ్యమైన హామీలు ఇవ్వకుండా విశ్వసనీయతకు కట్టుబడ్డారు. చంద్రబాబు అబద్ధపు హామీలతో ప్రజల్ని మోసగించి, తనకు అధికారాన్ని దూరం చేసినా ఆయన మనోనిబ్బరం ఏమాత్రం చెక్కుచెదరలేదు. ఐదేళ్లుగా టీడీపీ ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ ప్రజల పక్షాన నిలిచారు. ప్రత్యేక హోదా అంశాన్ని చంద్రబాబు నీరుగార్చినా తాను మాత్రం అలుపెరుగని పోరాటం కొనసాగిస్తూ ఆ అంశాన్ని సజీవంగా ఉంచారు. ప్రజాస్వామ్య విలువలను కాలరాస్తూ 23 మంది వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు టీడీపీలో చేర్చుకున్నా జగన్ నిబ్బరంగానే నిలబడ్డారు.
కుట్రలన్నీ తట్టుకుని మున్ముందుకే...
ప్రజా సంక్షేమం, రాష్ట్ర ప్రగతే ధ్యేయంగా జగన్‌మోహన్‌రెడ్డి రెండేళ్ల క్రితమే నవరత్నాలను ప్రకటించారు. చరిత్రాత్మక పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. ఏకబిగిన 14 నెలలపాటు ఏకంగా 3,648 కిలోమీటర్లు పాదయాత్ర చేసి ప్రజల కష్టాలను స్వయంగా తెలుసుకున్నారు. అశేష ప్రజానీకం ఆదరణతో పాదయాత్ర చేస్తున్న జగన్‌ను భౌతికంగా అంతం చేసేందుకు ప్రభుత్వ పెద్దలు కుట్రలు పన్నారు. అయినా జగన్ ధైర్యం కోల్పోలేదు. ఇక ఎన్నికల షెడ్యూల్ విడుదల తరువాత కూడా ప్రభుత్వ పెద్దలు కుట్రలు కొనసాగించారు. కడప జిల్లాలో తమ అక్రమాలకు ఎదురు లేకుండా చేసుకునేందుకు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి చిన్నాన్న వైఎస్ వివేకానందరెడ్డిని హత్య చేయించారు. అంతటి ఆవేదనలోనూ జగన్ దృఢచిత్తంతో ముందడుగు వేశారు. అన్ని కుట్రలను ఎదుర్కొంటూ తమ సంక్షేమం కోసమే తపన పడుతున్న జగన్‌కు జనం జై కొడుతున్నారు.
సామాజిక న్యాయానికి జగన్ పెద్దపీట
వైఎస్సార్‌సీప తరపున ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థుల ఎంపికలో వైఎస్ జగన్ సామాజిక న్యాయానికి పెద్దపీట వేశారు. రాష్ట్రంలో అత్య«ధికంగా 43 మంది బీసీ నేతలకు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇచ్చారు. అతి సామాన్యులు, పేద వర్గాలకు చెందిన వారిని అభ్యర్థులుగా ఎంపిక చేయడం ద్వారా స్వచ్ఛమైన రాజకీయాలకు నాంది పలికారు. నందిగం సురేష్, గొడ్డేటి మాధవి, గోరంట్ల మాధవ్, తలారి రంగయ్య, బెల్లాన చంద్రశేఖర్, దువ్వాడ శ్రీనివాస్, డా.సంజీవయ్య, డా.సత్యవతి వంటివారిని ఎంపీ అభ్యర్థులుగా ఎంపిక చేయడం బడుగు వర్గాల పట్ల జగన్ నిబద్ధతకు నిదర్శనం. బోయ, కురబ, కాళింగ, తూర్పుకాపు, మాదిగ సామాజికవర్గాలకు ఎంపీ అభ్యర్థులుగా అవకాశం ఇచ్చారు. ఆయా వర్గాలకు తెలుగుదేశం పార్టీ ఎంపీ టిక్కెట్లు ఇవ్వకపోవడం గమనార్హం. ఇక బ్రాహ్మణ సామాజికవర్గానికి వైఎస్సార్‌సీపీ నాలుగు ఎమ్మెల్యే టిక్కెట్లు ఇవ్వగా, టీడీపీ ఒక్కరికి కూడా అవకాశం ఇవ్వలేదు. జగన్ పాటించిన సామాజిక న్యాయం అందరి దృష్టిని ఆకర్షించింది.
అచ్చంగా ప్రజల మేనిఫెస్టో
‘కులాలు చూడం... మతాలు చూడం... వర్గాలు చూడం...రాజకీయాలు చూడం. అందరికీ సంక్షేమ పథకాలు అందిస్తాం’ అన్న జగన్ రాజనీతిజ్ఞతతో ప్రజల మనసులు గెలుచుకున్నారు. పాదయాత్ర ద్వారా తాను తెలుసుకున్న ప్రజల కష్టాలు, రాష్ట్ర సమస్యల పరిష్కారానికి సశాస్త్రీయమైన విధానాలతో వైఎస్సార్‌సీపీ మేనిఫెస్టోను రూపొందించారు. రైతులు, మహిళలు, అన్ని సామాజిక వర్గాలు, ఉద్యోగులు, విద్యార్థులు, యువత అభ్యున్నతికి కాంక్షిస్తూ పథకాలను ప్రకటించారు. తనకు అవకాశం ఇస్తే మానవీయ, ప్రగతికారక పరిపాలనను అందిస్తానన్న ఆయన మాటలను ప్రజలు విశ్వసించారు. అందుకే ఈసారి తమ ఓటు జగన్‌కేనని నిర్ణయానికి వచ్చారు.
ప్రచారంలో ప్రభం‘జనం’
వైఎస్ జగన్ ఎన్నికల ప్రచారానికి జనం నీరాజనాలు పలికారు. టీడీపీ తరపున ప్రచారానికి చంద్రబాబు ఇతర రాష్ట్రాల నేతలను రప్పించారు. కానీ, జగన్ మాత్రం ప్రజలనే నమ్ముకున్నారు. ప్రచార భారాన్ని తానే భుజానికెత్తుకున్నారు. 13 జిల్లాల్లో 68 సభల్లో ప్రసంగించారు. జగన్‌మోహన్‌రెడ్డి ఎన్నికల ప్రచార సభలకు జనం పోటెత్తారు. సీఎం.. సీఎం.. అనే నినాదాలతో ప్రతి సభ మార్మోగిపోయింది. వైఎస్సార్‌సీపీ తరపున వైఎస్ విజయమ్మ, షర్మిల నిర్వహించిన ప్రచార సభలు విజయవంతం కావడం పార్టీకి నూతనోత్సాహానిచ్చింది. వైఎస్ విజయమ్మ 8 జిల్లాల్లో 27 సభల్లో పాల్గొన్నారు.షర్మిల 6 జిల్లాల్లో 36 సభల్లో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన తనయుడు లోకేశ్‌పై తనదైన శైలిలో ధ్వజమెత్తారు.
కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో వైఎస్సార్‌సీపీ కీలకపాత్ర
కీలక ఎన్నికల్లో ఏపీ ఓటర్లు ఏకక్షంగా వైఎస్సార్‌సీపీకే పట్టం కట్టనున్నారని జాతీయ చానళ్ల సర్వేలన్నీ స్పష్టం చేశాయి. జగన్ జాతీయ స్థాయి రాజకీయ శక్తిగా అవతరించనున్నారని తెల్చిచెప్పాయి. హంగ్ పార్లమెంట్ వచ్చే అవకాశాలున్నందున కేంద్ర ప్రభుత్వ ఏర్పాటులో వైఎస్సార్‌సీపీ కీలక పాత్ర పోషింనుందని స్పష్టమైన సంకేతాలు ఇచ్చాయి. ఏపీలో వైఎస్సార్‌సీపీ 110 నంచి 130 వరకు ఎమ్మెల్యే సీట్లు, 18 నుంచి 22 వరకు లోక్‌సభ సీట్లు గెల్చుకుంటుందని అన్ని సర్వేలు చెప్పడం గమనార్హం. వైఎస్సార్‌సీపీ 45 శాతం నుంచి 48 శాతం వరకు ఓట్లు సాధిస్తుందని సర్వేలు వెల్లడించాయి. అందుకే ఈ ఎన్నికలు రాష్ట్ర రాజకీయాల్లో నవశకానికి నాంది పలకనున్నాయని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు.
పులివెందులకు చేరుకున్న జగన్
పులివెందుల: ప్రతిపక్ష నేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బుధవారం సాయంత్రం పులివెందులకు చేరుకున్నారు. హైదరాబాద్ నుంచి కడపకు ప్రత్యేక విమానంలో వచ్చిన ఆయన అక్కడినుంచి రోడ్డు మార్గాన పులివెందులకు చేరుకున్నారు. జగన్‌తోపాటు ఆయన సతీమణి వైఎస్ భారతిరెడ్డి, కుమార్తె హర్షిణిరెడ్డిలతోపాటు ఇతర కుటుంబ సభ్యులు పులివెందుల చేరుకున్నారు. మరోవైపు పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, కుమార్తె షర్మిల బుధవారం సాయంత్రం ఇడుపులపాయకు చేరుకున్నారు. తిరిగి రాత్రికి పులివెందులకు వచ్చారు. గురువారం జరిగే సార్వత్రిక ఎన్నికల్లో పులివెందులలోని భాకరాపురంలో గల 134వ పోలింగ్ కేంద్రంలో వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి, వైఎస్ విజయమ్మ, షర్మిల, వైఎస్ భారతిరెడ్డి, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్ అవినాష్‌రెడ్డిలతోపాటు ఇతర కుటుంబసభ్యులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు.
Comments
Please login to add a commentAdd a comment