ఓటమి భయంతోనే బాబు కుట్రలు | YS Jaganmohan Reddy Press Meet After Polling | Sakshi
Sakshi News home page

ఓటమి భయంతోనే బాబు కుట్రలు

Published Fri, Apr 12 2019 3:17 AM | Last Updated on Fri, Apr 12 2019 11:43 PM

YS Jaganmohan Reddy Press Meet After Polling - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఓటమి తప్పదని భావించిన చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రి స్థాయిని కూడా మరిచి దిగజారి వ్యవహరించారని వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి వ్యాఖ్యానించారు. ఎన్నికలు శాంతియుతంగా జరగకుండా, ఓటింగ్‌ శాతం తగ్గించడానికి చంద్రబాబు అనేక కుట్రలు పన్నారని, ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారన్నారు. ముఖ్యమంత్రిగా ఇటువంటి పనులు చేసినందుకు ఆయన సిగ్గుతో తలదించుకోవాలన్నారు. అయితే ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటు వేయడానికి ముందుకు రావడం హర్షించదగ్గ విషయమని, ఇది ప్రజల విజయమని చెప్పారు. హైదరాబాద్‌లోని లోటస్‌ పాండ్‌లో గురువారం రాత్రి ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ఓటమికి కారణాలు వెతుక్కుంటున్నారని, వైఎస్సార్‌సీపీ అఖండ విజయం సాధించబోతోందన్నారు. వైఎస్‌ జగన్‌ ఇంకా ఏమన్నారంటే.. 

సీఎం స్థాయి వ్యక్తి ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు
‘‘చంద్రబాబుకు ఓటమి ఖాయమవడంతో ఏకంగా ఎన్నికల కమిషన్‌నే బెదిరించడం చూశారు. ప్రజలను తప్పుదోవ పట్టించాలని, ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు రకరకాల కుయుక్తులు పన్నడం, అరాచకాలు సృష్టించడం, డ్రామాలు చేయడమూ చూశాం. అయినప్పటికీ ప్రజలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొని ప్రజాస్వామ్యాన్ని రక్షించే కార్యక్రమంలో పాల్గొన్నందుకు అభినందనలు. దాదాపు 80 శాతం పోలింగ్‌ నమోదైంది. ఓటింగ్‌లో పాల్గొన్న ప్రతి అక్కా చెల్లెమ్మకు, ప్రతి అవ్వ, ప్రతి తాతకు, ప్రతి సోదరుడికీ హృదయపూర్వకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నా. ఈ ఆటుపోట్లు తట్టుకుని నిలబడ్డ ప్రతి కార్యకర్త, ప్రతి నాయకుడిని అభినందిస్తున్నా. గొడవల్లో కొంతమంది వైఎస్సార్‌సీపీ కార్యకర్తలకు గాయాలయ్యాయి. ఇద్దరు ప్రాణాలు కోల్పోయారు. వారి కుటుంబాలకు పార్టీ అన్ని విధాలా అండగా ఉంటుంది. వారి కుటుంబాలకు నా ప్రగాఢ సానుభూతి తెలుపుతున్నా. వ్యవస్థ పట్ల చంద్రబాబునాయుడు, తెలుగుదేశం పార్టీ ఎంత దారుణంగా వ్యవహరించిందో చూశాం.

ఒక వ్యక్తి ఓడిపోతున్నాడని తెలిసి, తనను తాను కాపాడుకోవడానికి ఏ రకంగా వ్యవహరించారో చూస్తుంటే చాలా బాధవుతోంది. చిత్తూరు జిల్లా పెద్దతిప్పసముద్రం టి.సొదుంలో టీడీపీ నాయకుల దాడిలో వైఎస్సార్‌సీపీ కార్యకర్త వెంకటరమణరెడ్డి చనిపోయారు. అనంతపురం జిల్లా తాడిపత్రిలో దివాకర్‌రెడ్డి వర్గీయులు వేట కొడవళ్లతో దాడి చేయడంతో వైఎస్సార్‌సీపీకి చెందిన పుల్లారెడ్డి చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతున్నారు. విజయనగరం జిల్లా జీయమ్మవలస మండలం చినకుదమలో వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణమ్మపై టీడీపీ నాయకుడు రామకృష్ణ, అతని అనుచరులు దాడి చేశారు. నెల్లూరు రూరల్‌లో ఆర్‌ఎస్‌ఆర్‌ స్కూల్‌ పోలింగ్‌ కేంద్రంలో టీడీపీ నేతలు ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తే వారిని వైఎస్సార్‌సీపీ అభ్యర్థి అనిల్‌ కుమార్‌ యాదవ్‌ అడ్డుకోవడంతో ఆయనతో పాటు కార్యకర్తలపై దాడి చేశారు. గుంటూరు జిల్లా గురుజాలలో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి కాసు మహేశ్వరరెడ్డిపై టీడీపీ వారు దాడి చేశారు.

నరసరావుపేటలో ఎమ్మెల్యే గోపిరెడ్డి కారును ధ్వంసం చేశారు. చిత్తూరు జిల్లా పూతలపట్టులో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి ఎంఎస్‌ బాబుపై దాడి చేసి, గాయపరిచారు. గుంటూరు జిల్లా చిలుకలూరిపేటలో అయితే మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు ఏకంగా సిబ్బందిని బెదిరించడం కనిపించింది. మంగళగిరిలో చంద్రబాబు కొడుకు, మంత్రి లోకేష్‌ ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించారు. ఏకంగా పదిమంది అనుచరులతో పోలింగ్‌ కేంద్రంలోకి వెళ్లడం చూశాం. గుంటూరు జిల్లా వేమూరు మండలం బూతుమల్లిలో పార్టీ అభ్యర్థి మేరుగ నాగార్జునపై దాడి చేశారు. కారు అద్దాలను ధ్వంసం చేశారు. గురజాల నియోజకవర్గం జంగమహేశ్వరపురంలో వాళ్లకు అనుకూలంగా ఓటింగ్‌ జరగలేదని టీడీపీ కార్యకర్తలు 600 మంది ఏకంగా దాడులకు దిగారు. ఇన్నిన్ని ఘటనలు జరిగాయి. ఎన్నికలు జరగకుండా చూసేందుకు, ఓటింగ్‌ శాతం తగ్గించేందుకు ఎటువంటి అన్యాయమైన కుట్రలు పన్నేందుకైనా చంద్రబాబు వెనకాడలేదు. ముఖ్యమంత్రిగా ఇలా వ్యవహరించడం సిగ్గుచేటు. దేవుడి దయ వల్ల 80 శాతం పైగా ప్రజలు ఓటింగ్‌లో పాల్గొనడం, బ్రహ్మాండంగా ఓట్లేయడం, ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు పెద్ద సంఖ్యలో ముందుకు రావడం అభినందనీయం. ఇది ప్రజల విజయం. ప్రజలందరికీ మరోసారి కృతజ్ఞతలు.

వారి ఆరోపణలు నిరాధారం
ఉదయం నుంచి 80 శాతం మంది ఓటర్లు పోలింగ్‌లో పాల్గొన్నారు. 3.93 కోట్ల పైచిలుకు మందిలో 80 శాతం పోలింగ్‌లో పాల్గొన్నారు. వారందరూ ఈవీఎంలో బటన్‌ నొక్కితే ఏ అభ్యర్థికి ఓటు వేసింది వీవిప్యాట్‌లో వారికి కనిపించింది. అంటే ఫ్యాన్‌ గుర్తుకు నొక్కితే ఫ్యాన్‌ గుర్తుకు ఓటేసినట్లు కనిపిస్తుంది. నాక్కూడా కనిపించింది. నాలాగే 80 శాతం మంది ఓటర్లు ఓటేస్తే వారు ఏ పార్టీకి ఓటేసింది వారికి కనిపించింది. ఆ తర్వాత వారు సంతృప్తి చెందారు. ఇప్పటికే 80 శాతం పోలింగ్‌ నమోదైంది. పోలింగ్‌ పూర్తిగా ముగిసే సరికి దాదాపు 85 శాతం వరకు వెళ్లొచ్చు. ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఓటేసి, ఎవరికి ఓటు వేసింది వారు వీప్యాట్‌లో స్పష్టంగా చూసుకున్నప్పుడు ఎవరైనా నెగటివ్‌గా ఎలా కామెంట్‌ చేస్తారు? వారి ఆరోపణలు నిరాధారం. కేవలం వారు ఓడిపోతున్నారు కాబట్టి బురద చల్లాలని ఏవో కారణాలు వెతుక్కుని ఇలా మాట్లాడుతున్నారు.

ఇంత పెద్ద సంఖ్యలో ప్రజలు ఓట్లు వేయడం అన్నది మంచి సంకేతం. చంద్రబాబు నాయుడు ప్రజలను తప్పుదోవ పట్టించాలని చూశారు. రకరకాల ప్రకటనలు చేశారు. అయితే ప్రజలు పరిస్థితిని అర్థం చేసుకున్నారు. ప్రజాస్వామ్యాన్ని రక్షించారు. దేవుడి దయ, ప్రజల ఆశీస్సులతో మంచి మెజారిటీతో గెలుస్తాం. చంద్రబాబునాయుడనే రాక్షసుడు ఉండటం వల్లే ఇప్పుడు సమస్యలు వచ్చాయి. ఈ మనిషి ఓడిపోతున్నాడని తెలిసి, మరీ దిగజారి.. ఎన్నికల కమిషన్‌ వద్దకు వెళ్లారు.. వారిని బెదిరించారు.. ఈవీఎంలపై కామెంట్‌ చేశారు.. పోలింగ్‌ జరగకుండా చేసేందుకు విశ్వప్రయత్నాలు చేశారు.. ఓటర్లను భయభ్రాంతులకు గురి చేయాలని చూశారు.. ఇన్నిన్ని అనైతిక కార్యక్రమాలు చేయడం సమంజసమేనా? 

డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఆ మోసాన్ని మరచిపోరు
అక్కచెల్లెమ్మలు పెద్ద సంఖ్యలో ఓటింగ్‌లో పాల్గొన్నారని చెబుతున్నారు. కచ్చితంగా పాల్గొంటారు. ఎందుకంటే.. రాష్ట్రంలో డ్వాక్రా అక్కచెల్లెమ్మలు ఒక్కో గ్రూపు కింద రూ.5 లక్షలు, రూ.7లక్షలు, రూ.10 లక్షల లోన్‌ తీసుకున్నారు. చంద్రబాబు వీరికి 2016 మే నుంచి సున్నా వడ్డీ వర్తించకుండా చేశారు. దీంతో రూ.5 లక్షల లోను తీసుకున్న వారు ఏటా ఒక రూపాయి వడ్డీ ప్రకారం రూ.60 వేలు, రూ.7 లక్షల లోన్‌ తీసుకున్న వారు రూ.84 వేలు, రూ.10 లక్షల లోన్‌ తీసుకున్న వారు రూ.1.20 లక్షలు వడ్డీ కట్టాల్సి వచ్చింది. 2016 మే నుంచి ఇప్పటిదాకా మూడేళ్లలో వారు (ఒక్కో గ్రూపు) వరుసగా రూ.1,80,000, రూ.2,52,000, రూ.3,60,000 వడ్డీ చెల్లించారు.

ఈయన (చంద్రబాబు) పసుపు–కుంకుమ డ్రామా కింద ఇచ్చింది కేవలం రూ.లక్ష మాత్రమే. వాస్తవానికి సున్నా వడ్డీ పథకాన్ని కంటిన్యూ చేసి ఉండింటే అక్కచెల్లెమ్మలకు ఇంకా ఎక్కువగా వచ్చి ఉండేది. రైతులదీ ఇదే పరిస్థితి. సున్నా వడ్డీ పథకాన్ని రైతులకు కూడా వర్తించకుండా చేశారు. రూ.87,612 కోట్ల అప్పులకు గాను రైతులు ఏటా ఏడెనిమిది వేల కోట్ల రూపాయలు వడ్డీగా చెల్లించారు. ఈ లెక్కన గత ఐదేళ్లలో రైతులు రూ.35 వేల కోట్ల నుంచి రూ.40 వేల కోట్లు వడ్డీ కింద చెల్లించారు. గతంలో ప్రభుత్వాలు రైతులు, డ్వాక్రా మహిళలకు సున్నా వడ్డీకే రుణాలు ఇచ్చేవి. చంద్రబాబు నాయుడు ఈ పథకాన్ని రద్దు చేయడం వల్ల రైతులు, డ్వాక్రా మహిళలు భారీగా నష్టపోయారు. అందువల్ల వారు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి ఓటింగ్‌లో పాల్గొన్నారు. కచ్చితంగా గుణపాఠం చెబుతారు. దేవుడి దయ, ప్రజల దీవెనలతో వైఎస్సార్‌ సీపీకి భారీ విజయం ఖాయం’’ అని వైఎస్‌ జగన్‌ అన్నారు. రిటర్న్‌ గిఫ్ట్‌ విషయం చంద్రబాబు – కేసీఆర్‌కు సంబంధించినదని, వారినే అడగాలని ఓ ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. 

ప్రజలు మార్పు కోరుకుంటున్నారు
పులివెందుల: రాష్ట్ర ప్రజలు మార్పు కోరుకుంటున్నారని, దేవుని దయ వల్ల రాష్ట్రంలో మార్పు వస్తుందని ఆశిస్తున్నానని ప్రతిపక్ష నేత, వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్‌ జిల్లా పులివెందులలోని భాకరాపురంలోని 134వ పోలింగ్‌ కేంద్రంలో గురువారం ఆయన ఓటు హక్కును వినియోగించుకున్న తర్వాత మీడియాతో మాట్లాడారు. సమాజంలో మార్పు రావాలంటే అందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలన్నారు. వైఎస్‌ జగన్‌ సతీమణి వైఎస్‌ భారతీరెడ్డి , వైఎస్సార్‌సీపీ గౌరవాధ్యక్షురాలు వైఎస్‌ విజయమ్మ, షర్మిలమ్మ, కడప ఎంపీ అభ్యర్థి వైఎస్‌ అవినాష్‌రెడ్డి, కుటుంబ సభ్యులు ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఉదయం 8 గంటలకు పోలింగ్‌ కేంద్రానికి చేరుకున్న వైఎస్‌ కుటుంబ సభ్యులు క్యూలైన్‌లో నిలబడి తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. అనంతరం వైఎస్‌ విజయమ్మ మీడియాతో మాట్లాడుతూ జగన్‌బాబు సీఎం అవుతారన్నారు. త్వరలో రాజన్న రాజ్యం వస్తుందని జగన్‌ సోదరి షర్మిలమ్మ పేర్కొన్నారు. ప్రజాశీస్సులతో వైఎస్సార్‌సీపీ విజయం తథ్యం అని వైఎస్‌ భారతీరెడ్డి అన్నారు. విలువలతో కూడిన రాజకీయాల కోసం ప్రజలు వైఎస్సార్‌సీపీకి పట్టం కట్టనున్నారని తెలిపారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement