
సాక్షి, అమరావతి: ప్రస్తుత సార్వత్రిక ఎన్నికల్లో తమ పార్టీ ఘన విజయం సాధించబోతోందనే గట్టి ధీమా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతల్లో వ్యక్తమవుతోంది. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి స్వయంగా తాము ఘన విజయం సాధించబోతున్నామని దృఢ విశ్వాసాన్ని వ్యక్తం చేయగా.. పార్టీ నేతలు సైతం అదే ధీమాతో ఉన్నారు. రాష్ట్రవ్యాప్తంగా గురువారం జరిగిన పోలింగ్ సరళిని పరిశీలిస్తే తమకు పూర్తి సానుకూల పరిస్థితులు కనిపిస్తున్నాయనే అంచనాతో వారున్నారు. 13 జిల్లాల్లో 80 శాతానికిపైగా ఓటర్లు ఓటుహక్కు వినియోగించుకున్నారన్న వార్త ఆ పార్టీ శ్రేణుల్లో అమితోత్సాహాన్ని కలిగిస్తోంది. పోలింగ్ శాతం పెరిగితే తమ గెలుపు ఖాయమని ఆ పార్టీ తొలినుంచీ అంచనా వేస్తోంది. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వంపై భారీ ఎత్తున వ్యతిరేకత కనిపిస్తోందని పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డితోసహా ఇతర నేతలంతా ఇప్పటివరకు చెబుతూ వచ్చారు. చంద్రబాబు ఐదేళ్ల పాలనపై జనం విసిగి వేసారి ఉన్నారనేది వారు గ్రహించారు. ఈ ప్రభుత్వ వ్యతిరేకతే గురువారం పోలింగ్ సందర్భంగా ఓట్ల రూపంలో బయట పడిందనే చర్చ పార్టీలో సాగుతోంది.
ముందునుంచే సన్నాహాలు..
గత(2014) ఎన్నికల్లో స్వల్ప ఓట్ల శాతం తేడాతో ఓడిపోయిన అనుభవం ఉండడంతో ఈసారి ఎట్టి పరిస్థితుల్లోనూ అందుకు అవకాశమివ్వరాదని పార్టీ అధ్యక్షుడు జగన్‌తో సహా అన్నిస్థాయిల నేతల్లోనూ పట్టుదల వ్యక్తమైంది. అందుకు తగ్గట్టుగా ఎన్నికలకు రెండేళ్ల ముందునుంచే వైఎస్ జగన్ సన్నాహాల్లో మునిగితేలారు. తన తొమ్మిదేళ్ల ప్రస్థానంలో ఆయనకు రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలూ కరతలామలకం అయ్యాయి. సామాజిక వర్గాలు, సామాజిక పరిస్థితులపై మంచి అవగాహన ఏర్పడింది. ఆయా ప్రాంతాల పరిస్థితులకు అనుగుణంగా జగన్ అభ్యర్థుల ఎంపికలో తిరుగులేదనిపించారు. ఒకేసారి 175 శాసనసభ, 25 లోక్‌సభ నియోజకవర్గాలకు అభ్యర్థులను ఎంపిక చేసి ప్రకటించడమనేది ఆయనకు ఈ ఎన్నికల్లో బాగా కలసివచ్చింది. ఆచితూచి వ్యవహరించి.. పకడ్బందీగా నిర్ణయం తీసుకునే సత్తా ఆయనకుందని ప్రజలు గుర్తించడానికి ఈ చర్య దోహదపడింది. తొమ్మిదేళ్లుగా ఆయన వివిధ సమస్యలపైన స్పందించిన తీరు, ప్రజలతో మమేకమైన తీరు కూడా జనంలోకి బాగా వెళ్లాయి. శ్రీకాకుళం నుంచీ గుంటూరు జిల్లా వరకూ తాము అంచనా వేసినట్టుగానే అసెంబ్లీ, లోక్‌సభ స్థానాలు లభించబోతున్నాయని ఆ పార్టీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. రాయలసీమ, దక్షిణ కోస్తాలో మునుపటి బలం చెక్కు చెదరకపోవడమేగాక అదనంగా మరిన్ని స్థానాలు వస్తాయని పార్టీ నేతలకు సమాచారం అందుతోంది.
నిబద్ధతతో పార్టీ శ్రేణులు
గత ఎన్నికలతో పోలిస్తే వైఎస్సార్‌సీపీ కార్యకర్తలు, దిగువస్థాయి నేతలు పోలింగ్ రోజున క్షేత్రస్థాయిలో గట్టి పోరాట పటిమను, నిబద్ధతను ప్రదర్శించారు. జగన్ కొంతకాలంగా పార్టీ శ్రేణులను ఉత్తేజపరుస్తూ తీసుకున్న చర్యలు పూర్తి సత్ఫలితాల్ని ఇచ్చాయనేది పోలింగ్ రోజున వెల్లడైంది. రాష్ట్రవ్యాప్తంగా నమ్మకమైన పోలింగ్ ఏజెంట్లను ఏర్పాటు చేసుకోవడంలో పార్టీ పూర్తి విజయం సాధించింది. పార్టీ కార్యకర్తలు సుశిక్షితులైన సైనికుల మాదిరిగా గురువారం తెల్లవారుజామునుంచే కార్యరంగంలోకి దిగి పోలింగ్ చేయించేందుకు కృషి చేశారు. పార్టీ అభ్యర్థులు సైతం ఏమరుపాటు లేకుండా వ్యవహరించారు. పోలింగ్ చివరి కంటా పార్టీ శ్రేణులు అప్రమత్తంగా ఉండడమేగాక టీడీపీ వారు దౌర్జన్యాలకు పాల్పడినా బెదరలేదు.