
కొందరివాడుగా మిగిలిపోయిన అందరివాడు
ఐదేళ్ల క్రితం మెగాస్టార్ చిరంజీవి ప్రజారాజ్యం పార్టీ స్థాపించినపుడు అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకున్నారు. పార్టీ కోసం, తమ అభిమాన నటుడి కోసం నిస్వార్థంగా పనిచేశారు. పాపం అభిమానులు సొంతంగా డబ్బులు ఖర్చు పెట్టుకుని పార్టీ తరపున ప్రచారం చేశారు. పలు ప్రాంతాల్లో బస్టాపుల వద్ద సిమెంటు బల్లల నిర్మాణం, బస్సు షెల్టర్ల నిర్మాణం, పలు సామాజిక కార్యక్రమాలు.. ఇలా అనేక పేర్లతో డబ్బులు వదిలించుకున్నారు. అయితే పీఆర్పీ నాయకులు ఓట్ల కోసం వారిని వాడుకున్నారు తప్ప వారి గురించి పట్టించుకున్న పాపాన పోలేదనే విమర్శలు వినిపించాయి. పార్టీలోనూ వారికి పెద్దగా ఆదరణ లభించలేదు.
ఆ తర్వాత ఎన్నికల్లో పీఆర్పీ చతికిల పడటం.. ఏదో సాధిస్తాడని అనుకున్న చిరంజీవి పార్టీని కాంగ్రెస్లో విలీనం చేయడం వంటి పరిణామాలను అభిమానులు జీర్ణించుకోలేకపోయారు. వెండితెరపై మెగాస్టార్ను గొప్పగా ఊహించుకున్న అభిమానులకు.. రాజకీయ జీవితంలో ఆయన వైఖరి చూసి భ్రమలు తొలగిపోయాయి. పీఆర్పీ ఆవిర్భావ సమయంలో సామాజిక తెలంగాణ అన్న చిరంజీవి ఆ తర్వాత సమైక్యాంధ్ర అనడం.. హైదరాబాద్ యూటీ డిమాండ్.. చివరకు కాంగ్రెస్ హైకమాండ్కు విధేయత ప్రకటించి విభజనకు పూర్తిస్థాయిలో ఆమోదం తెలపడంతో చాలా మంది అభిమానులు ఆయనకు దూరమయ్యారు. ఒకప్పడు 'అందరివాడు'గా జననీరాజనం అందుకున్న చిరంజీవి ప్రస్తుతం 'కొందరివాడు'గానే మిగిలిపోయారు.
కాంగ్రెస్లో పీఆర్పీని విలీనం చేశాక చిరంజీవితో పాటు కొంతమంది నాయకులకే అధికారిక, పార్టీ పదవులు దక్కాయి. చాలా మంది నిరాదరణకు గురయ్యారు. ఇక అభిమానుల సంగతైతే చెప్పనక్కర్లేదు. రాష్ట్ర విభజన తర్వాత చిరంజీవి అండతో మంత్రి పదవి పొందిన గంటా శ్రీనివాసరావు సహా గత ఎన్నికల్లో పీఆర్పీ తరపున గెలిచిన చాలామంది ఎమ్మెల్యేలు కాంగ్రెస్కు గుడ్ బై చెప్పారు. దీనికితోడు సోదరుడు పవన్ కల్యాణ్ పార్టీ పెట్టిన తరుణంలో చిరంజీవి ఇటీవల అభిమాన సంఘాల నేతలతో సమావేశమయ్యారు. ఈ సమావేశానికి ఆంధ్రప్రదేశ్ పీసీసీ అధ్యక్షుడు రఘువీరా రెడ్డి, వట్టి వసంతకుమార్ హాజరయ్యారు. రాబోయే ఎన్నికల్లో చిరంజీవి అభిమాన సంఘాల నేతలకు టికెట్లు ఇస్తామని రఘువీరారెడ్డి చెప్పారు. చిరంజీవి అభిమాన సంఘాలు కాంగ్రెస్‌వైపే ఉండాలని, ప్రచారాల్లో భాగస్వాములు కావాలని కోరారు. జిల్లా, పీసీసీ కార్యవర్గాల్లో వారికి అవకాశం కల్పిస్తామని రఘువీరా రెడ్డి హామీ కూడా ఇచ్చారు. అభిమాన సంఘాలకు ఎక్కడ వీలుంటే అక్కడ టికెట్లు ఇస్తామని చిరంజీవి తెలిపారు. ఓటమి భయంతో పెద్దపెద్ద నాయకులే కాంగ్రెస్ వీడి పోతుంటే అభిమానులను బలిపీఠంపై కూర్చోపెడుతున్నారే గుసగుసలు వినిపించాయి. పైగా ఇన్నాళ్లూ నిరాదరణకు గురైన అభిమానులు ఎన్నికల ముందే కాంగ్రెస్ నాయకులకు గుర్తొచ్చారనే విమర్శలు వచ్చాయి. పాపం అభిమానులపై ఉన్నది 'చిరు' ప్రేమేనా..!