కాంగ్రెస్+పీఆర్పీ= టీడీపీ | TDP names former congress, PRP leaders in 3rd list | Sakshi
Sakshi News home page

కాంగ్రెస్+పీఆర్పీ= టీడీపీ

Published Mon, Apr 14 2014 12:55 PM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

కాంగ్రెస్+పీఆర్పీ= టీడీపీ - Sakshi

కాంగ్రెస్+పీఆర్పీ= టీడీపీ

పీఆర్పీ విలీనమైంది కాంగ్రెస్లో కదా! తెలుగుదేశం పార్టీతో ఏమిటి సంబంధం? అనే సందేహం రావచ్చు. సీమాంధ్రలో తాజా రాజకీయ పరిణామాల నేపథ్యంలో టీడీపీ.. పీఆర్పీ, కాంగ్రెస్ల కలయికగా రూపాంతరం చెందింది. టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ప్రకటించిన సీమాంధ్ర అభ్యర్థుల మూడో జాబితా పరిశీలిస్తే ఈ విషయం నిజమేననిపించక మానదు. సొంతబలం లేక వలస నాయకుల్ని ప్రోత్సహిస్తున్న టీడీపీ అస్తిత్వాన్ని కోల్పోయి.. ఇతర పార్టీల నాయకులతో ఎన్నికల బరిలో దిగుతోంది.

ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినపుడు యువకులు, విద్యావంతులతో ఆంధ్రప్రదేశ్ రాజకీయ యవనికపై దూసుకొచ్చుంది. ఒకరిద్దరు మాత్రమే ఇతర పార్టీల నాయకులకు చోటు లభించింది. ఇదంతా గతం. ప్రస్తుతం టీడీపీకి వలస నాయకులే దిక్కు అన్నట్టుగా పరిస్థితి తయారైంది. ఆ మాటకొస్తే సాక్షాత్తూ పార్టీ అధినేత చంద్రబాబు కూడా వలస నాయకుడే. ఆయన కాంగ్రెస్ పార్టీ మాజీ నాయకుడు. ఆయన విడుదల చేసిన తాజా జాబితాలో సొంత నాయకుల కంటే.. వలస నాయకుల హవాయే కనిపిస్తోంది!

టీడీపీ తాజాగా ముగ్గురు లోక్సభ అభ్యర్థుల పేర్లను ప్రకటించగా వీరిలో ఇద్దరు ఇతర పార్టీల వారే. అనకాపల్లి అభ్యర్థి అవంతి శ్రీనివాసరావు గత ఎన్నికల్లో పీఆర్పీ తరపున అసెంబ్లీకి ఎన్నికయ్యారు. కాంగ్రెస్ ప్రభుత్వంలో మొన్నటిదాకా మంత్రిగా పనిచేసిన తోట నరసింహానికి కాకినాడ టికెట్ కేటాయించారు. అసెంబ్లీ అభ్యర్థుల జాబితాలో గంగుల ప్రభాకర రెడ్డి, టీజీ వెంకటేష్, ఏరాసు ప్రతాపరెడ్డి, శిల్పా మోహన్ రెడ్డి, మండలి బుద్ధప్రసాద్, పితాని సత్యనారాయణ, శత్రుచర్ల విజయరామారాజు వంటి పేర్లు ఉన్నాయి. వీరందరూ తాజా మాజీ కాంగ్రెస్ నాయకులే. సీమాంధ్రలో కాంగ్రెస్ గల్లంతు కావడం, టీడీపీకి బలమైన అభ్యర్థులు లేకపోవడంతో పరస్పర అవసరాలు వీరిని దగ్గరకు చేర్చాయి. ఇక గంటా శ్రీనివాసరావు, పంచకర్ల రమేష్ తదితరులు పీఆర్పీ నుంచి కాంగ్రెస్కు, అటు నుంచి టీడీపీ జంప్ అయ్యారు.

వీరే కాదు గల్లా ఫ్యామిలీ, జేసీ బ్రదర్స్, రాయపాటి.. ఇలా చెబుతూ పోతే టీడీపీలో సొంత నాయకుల స్థానంలో వచ్చిన వలస నాయకుల జాబితా  చాలా ఉంది. ఇన్నేళ్లుగా పార్టీని అంతో ఇంతో బతికించిన తెలుగు తమ్ముళ్లకు మాత్రం చంద్రబాబు పెద్ద చెయ్యే ఇచ్చారు. కమలంతో బలవంతపు పొత్తు, వలస నాయకులతో సైకిల్ ఎటు వెళ్తుందో? వలసల బరువు మోయ లేక పంక్చర్ అవుతుందోనని దేశం నేతలు ఆందోళన చెందుతున్నారు. టీడీపీని టీసీపీ (తెలుగుదేశం, కాంగ్రెస్, పీఆర్పీ)గా మార్చుకుంటే బాగుంటుందనే గుసగుసలు వినిపిస్తున్నాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement