
హైదరాబాద్: వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ, కాంగ్రెస్ పార్టీలను భూ స్థాపితం చేయాలని హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఒవైసీ పిలుపునిచ్చారు. నాంపల్లిలోని దారుస్సలాంలోని ఎంఐఎం పార్టీ కార్యాలయంలో శనివారం జరిగిన పార్టీ 61వ ఆవిర్భావ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పార్టీ జెండాను ఆవిష్కరించి ప్రసంగించారు. త్వరలో ఎన్నికల షెడ్యూల్ విడుదల కానుందని చెప్పారు. ఈ ఎన్నికల్లో హైదరాబాద్ ఎంపీ స్థానాన్ని ఎంఐఎం గెలుచుకుంటుందని, మిగతా 16 ఎంపీ స్థానాలను టీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు.
పార్లమెంట్ ఎన్నికల్లో తెలంగాణలో టీఆర్‌ఎస్ పార్టీకి, ఏపీలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి మద్దతిస్తామని స్పష్టం చేశారు. ఏపీకి వెళ్లి జగన్‌కు మద్దతుగా ప్రచారం చేస్తానన్నారు. రాష్ట్రం రెండుగా విడిపోయినా ఏపీ సీఎం చంద్రబాబుకు కొంత రాజకీయ బాకీ ఇవ్వాల్సి ఉందని, వచ్చే ఎన్నికల్లో దాన్ని కూడా తీర్చేస్తానని తెలిపారు. రెండు రాష్ట్రాల్లో టీఆర్‌ఎస్, వైఎస్సార్‌సీపీ, ఎంఐఎం కలసి 35 ఎంపీ సీట్లు గెలుచుకోవడం ఖాయమని జోస్యం చెప్పారు.
జైషే, ఐసిస్‌లకు మతం ఉండదు
ఆత్మాహుతి దాడులకు పాల్పడేవారికి మతం ఉండదని ఒవైసీ చెప్పారు. జైషే మహ్మద్, ఐసిస్ వంటి సంస్థలు ఇస్లాం మతాన్ని కించపరుస్తున్నాయన్నారు. ఉగ్రవాదులకు, ఆత్మాహుతి దాడులకు పాల్పడేవారు ఇస్లాం మతానికి చెందిన పేర్లు పెట్టుకున్నంత మాత్రాన తాము వారికి మద్దతు ఇస్తున్నట్లు కాదన్నారు. వింగ్ కమాండర్ అభినందన్ స్వదేశానికి తిరిగి రావడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. అభినందన్ అంశాన్ని కొందరు రాజకీయాలు చేయడం తగదన్నారు. దేశంలో లౌకికవాదాన్ని బ్రతికించుకోవాలని కోరారు.