అక్లాండ్/న్యూఢిల్లీ: కరోనా మహమ్మారిని సమర్థంగా ఎదుర్కోవడం, దేశ ఆర్థిక వ్యవస్థను చక్కదిద్దడమే తన విజయానికి కారణాలని రెండోసారి న్యూజిలాండ్ ప్రధాన మంత్రిగా ఎన్నికైన జెసిండా అర్డెర్న్(40) చెప్పారు. ఆమె ఆదివారం మీడియాతో మాట్లాడారు. తమ ప్రభుత్వ కృషిని ప్రజలు గుర్తించారని, అందుకే ఈ విజయాన్ని కట్టబెట్టారని అన్నారు. కరోనా మహమ్మారిని న్యూజిలాండ్ నుంచి పూర్తిగా తరిమికొట్టడమే లక్ష్యమన్నారు. తాజాగా జరిగిన ఎన్నికల్లో అర్డెర్న్‌కు చెందిన లిబరల్ లేబర్ పార్టీ 49 శాతం ఓట్లతో ఘన విజయం సాధించింది.
ప్రతిపక్ష కన్జర్వేటివ్ నేషనల్ పార్టీకి కేవలం 27 శాతం ఓట్లు దక్కాయి. అంచనాలకు మించి తమకు ఓట్లు పడ్డాయని అర్డెర్న్ చెప్పారు. న్యూజిలాండ్‌లో 24 ఏళ్ల క్రితం దామాషా ఓటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టారు. అప్పటి నుంచి ఇప్పటిదాకా ఒక పార్టీ పార్లమెంట్‌లో స్పష్టమైన మెజారిటీ సాధించడం ఇదే మొదటిసారి. ప్రధానిగా అర్డెర్న్ ఈ ఏడాది మార్చిలో లాక్‌డౌన్‌ను కఠినంగా అమలు చేశారు. దీంతో దేశంలో కరోనా వ్యాప్తి భారీగా తగ్గిపోయింది. ఇది ఆమెకు మంచి పేరు తీసుకొచ్చింది. అర్డెర్న్ 2017లో ప్రధానమంత్రిగా ఎన్నికయ్యారు.
అర్డెర్న్‌కు ప్రధాని మోదీ అభినందనలు
జెసిండా అర్డెర్న్‌కు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభినందనలు తెలిపారు. ఇరు దేశాల మధ్య సంబం«ధాలను మరింత ఉన్నతస్థాయికి తీసుకెళ్లడానికి అర్డెర్న్‌తో కలిసి పనిచేస్తానని ట్విట్టర్‌లో పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment