మరికొద్ది రోజుల్లో పార్లమెంట్ ఎన్నికల నగారా మోగనుంది. పార్లమెంటులో అడుగుపెట్టడానికి తెలంగాణ రాష్ట్రము నుంచి యువత ఎక్కువగా ఆసక్తి చూపుతోంది.రాష్ట్రంలోని 17 పార్లమెంట్ స్థానాలకు కాంగ్రెస్, బిజెపి, బిఆర్ఎస్ పార్టీల నుంచి పోటీ చేసే అభ్యర్థుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ప్రధానంగా ఢిల్లీ పీఠం 2024 లో బీజేపీకె చెందుతుందని రాజకీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి. రాష్ట్రము నుంచి తాజా అసెంబ్లీ ఎన్నికల్లో ఎనిమిది మంది విజయం సాధించారు. అదేవిదంగా 2019 ఎన్నికల్లో కూడా రాష్ట్రం నుంచి బీజేపీ అభ్యర్థులు నలుగురు పార్లమెంట్లో అడుగుపెట్టారు. ఈ నేపథ్యంలో బీజేపీ అభ్యర్థులుగా పార్లమెంట్ కు పోటీచేయడానికి రాష్ట్రము నుంచి పోటీ ఎక్కువగానే కనపడుతోంది. ప్రధానంగా నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి యాదవ సామాజిక వర్గం నుంచి మన్నెం రంజిత్ యాదవ్ పోటీ చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. రంజిత్ యాదవ్ ఇప్పటి నుంచే నల్ల గొండ నుంచి పావులు కదుపుతున్నారు. పార్టీలో కొత్తగ చేరినప్పటికీ, ఆయనకు హైదరాబాద్ నుంచి ఢిల్లీ వరకు స్నేహపూర్వక వాతావరణం ఉంది.
కాంగ్రెస్ నుంచి కుందూరు రఘువీర్ రెడ్డి...!
నల్లగొండ పార్లమెంట్ స్థానం నుంచి ఈసారి తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన సీనియర్ నేత కుందూరు జానారెడ్డి తనయుడు.. టీపీసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కుందూరు రఘువీర్ రెడ్డి పోటీ చేసే అవకాశాలు మెండుగా ఉన్నట్లు ప్రచారం జరుగుతుంది. ఎందుకంటే గత రెండు మూడు ఎన్నికల నుండి మిర్యాలగూడ.. నాగార్జునసాగర్ నియోజకవర్గాల్లో ఏదో ఒక స్థానం నుంచి పోటీ చేయాలనే ఆలోచనతో ఉన్న రఘువీర్ రెడ్డికి కాలం కలిసి రాకపోవడంతో పాటు రాజకీయ సమీకరణలు అనుకూలించకపోవడంతో పోటీ చేసే అవకాశం రాలేదు. అయితే ఈసారి పరిస్థితులన్నీ ఆయనకు అనుకూలంగా మారిన క్రమంలో నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలిచేందుకు రఘువీర్ రెడ్డి. బరాబర్ సిద్ధమై ఉన్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం.
బీఆర్ఎస్ పార్టీ నుంచి డాక్టర్ తేరా చిన్నపరెడ్డి...!
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్త.. మాజీ శాసనమండలి సభ్యులు డాక్టర్ తేరా చిన్నపరెడ్డి బీఆర్ఎస్ పార్టీ నుంచి నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల బరిలో నిలవనున్నట్లు విశ్వసనీయవర్గాల సమాచారం. ఎందుకంటే గతంలోనూ నల్గొండ పార్లమెంట్ స్థానం నుంచి పోటీ చేసిన అనుభవం ఉండటంతో పాటు కుందూరు జానారెడ్డి కుటుంబంతో పోటీ అనగానే వాళ్లని ఎదుర్కొనే సత్తా... తేరా చిన్నపరెడ్డికి మాత్రమే ఉందనే రాజకీయ ఎత్తుగడలలో భాగంగా బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం ఆ దిశగా ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. అట్లనే గత సాగర్ ఉప ఎన్నికల్లోనూ బీఆర్ఎస్ పార్టీ అధిష్టానం తేరా చిన్నపరెడ్డి పేరును పరిశీలించడంతో పాటు ఎమ్మెల్సీ గానూ మరోసారి అవకాశం ఇవ్వకపోవడం వంటిపరిస్థితుల్లో తేరా చిన్నపరెడ్డికి ఈసారి నల్లగొండ పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే అవకాశం ఇస్తుందనే చర్చ ఆ పార్టీ శ్రేణుల్లో బలంగా ఉంది. ఈయనతో పాటు ట్రైకార్ రాష్ట్ర మాజీ చైర్మన్ ఇస్లావత్ రామచంద్రనాయక్ పేరు కూడా పరిశీలనలో ఉన్నట్లు సమాచారం.
బీజేపీ నుంచి రంజిత్ యాదవ్..!
నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన బీజేపీ నల్గొండ జిల్లా అధ్యక్షులు కంకణాల శ్రీధర్ రెడ్డి పార్లమెంట్ ఎన్నికల్లో పోటీ చేసే యోచనలో ఉండి ఆ దిశగా ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. అలాగే నిడమనూరు మండలానికి చెందిన మన్నెం రంజిత్ యాదవ్.. బీజేపీ పక్షాన నల్గొండ పార్లమెంట్ అభ్యర్థిగా బరిలో నిలిచేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల్లో సాగర్ బీఆర్ఎస్ టికెట్ ఆశించి భంగపడిన రంజిత్ యాదవ్.. ఎన్నికలకు ముందే బీజేపీలో చేరారు. యాదవ సామాజిక వర్గానికి చెందిన రంజిత్ యాదవ్ సేవా కార్యక్రమాలతో ప్రజలకు దగ్గరయ్యారు. ఈ క్రమంలో ప్రజాప్రతినిధిగా ప్రజలకు సేవ చేయాలనే సంకల్పంతో... జరగబోయే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీ పక్షాన నల్లగొండ టికెట్ కోసం ప్రయత్నం చేస్తున్నట్లు సమాచారం. ఈ పరిణామాల క్రమంలో పరిస్థితులన్నీ కలిసి వస్తే జరగబోయే నల్గొండ పార్లమెంట్ ఎన్నికల్లో ప్రధాన పార్టీల అభ్యర్థులుగా నాగార్జునసాగర్ నియోజకవర్గానికి చెందిన వాళ్లే ఉండే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. అట్లనే టికెట్ సాధించి బరిలో నిలిచే గెలిచే అభ్యర్థులు ఎవరో.. అదృష్టం ఎవరికి దక్కుతుందో వేచి చూడాల్సి ఉంది.
Comments
Please login to add a commentAdd a comment