సాక్షి, హైదరాబాద్: కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చి ఇతరులకు అవకాశం ఇచ్చి ఉంటే బాగుండేదనే అభిప్రాయం బలంగాఉందని భారత్ రాష్ట్ర సమితి వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు. ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల తరహా పొరపాట్లు పార్లమెంటు ఎన్నికల్లో జరగనివ్వమని స్పష్టం చేశారు. పార్లమెంటు ఎన్నికల సన్నాహక సమావేశాల్లో భాగంగా ఆదివారం తెలంగాణభవన్‌లో జహీరాబాద్ లోక్‌సభ నియోజకవర్గ బీఆర్‌ఎస్ నేతలతో జరిగిన భేటీలో కేటీఆర్ ప్రసంగించారు. కేసీఆర్ పట్ల ఉన్న సానుభూతి, కాంగ్రెస్‌కు దూరమైన వర్గాలు పార్లమెంటులో బీఆర్‌ఎస్ విజయానికి బాటలు వేస్తాయన్నారు. లోక్‌సభ ఎన్నికల్లో రెండు జాతీయపారీ్టలతో జరిగే త్రిముఖ పోటీ బీఆర్‌ఎస్‌కే అనుకూలిస్తుందన్నారు.
కాంగ్రెస్‌కు ఓట్లేసిన వారిలో పునరాలోచన: అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లోనే కాంగ్రెస్ ప్రభుత్వం అప్రతిష్ట మూటకట్టుకుందని, ప్రజల నుంచి ఆ పార్టీ ఎమ్మెల్యేలకు నిరసన సెగ ఎదురవుతోందని కేటీఆర్ అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌కు ఓటేసిన వారు పునరాలోచనలో పడ్డారని, అప్పులను బూచిగా చూపి హామీల నుంచి రాష్ట్ర ప్రభుత్వం తప్పించుకునే ప్రయత్నం చేస్తోందన్నారు. జిల్లాల సంఖ్య తగ్గించేందుకు రేవంత్ కమిషన్ వేస్తామంటున్నారని, కొత్త జిల్లాలు రద్దు చేస్తే ప్రజలు ఊరుకుంటారా అని ప్రశ్నించారు.
ప్రభుత్వం మీద విమర్శల విషయంలో తొందరపడటం లేదని, బీఆర్‌ఎస్‌పై కాంగ్రెస్ విమర్శలు చేస్తే వదిలిపెట్టే ప్రసక్తి లేదన్నారు. తెలంగాణలో కేసీఆర్ పట్ల అభిమానం చెక్కు చెదరలేదని, కాంగ్రెస్‌కు ఓటు వేసిన వారు కూడా కేసీఆర్ సీఎం కానందుకు బాధ పడుతున్నారన్నారని చెప్పారు. గతంలో తెలంగాణ పదాన్ని కాంగ్రెస్ నిషేధించిందని, బీఆర్‌ఎస్ బలంగా లేకపోతే తెలంగాణ పదాన్ని మాయం చేసేందుకు పారీ్టలు సిద్ధంగా ఉన్నాయని, పారీ్టలకు ఎత్తు పల్లాలు తప్పవన్నారు.
ఒకరికి సాయం అందితే మరొకరు ఈర్ష పడేలా సమాజం తయారైందని చెప్పారు. జుక్కల్ నియోజకవర్గం నిజాంసాగర్ మండలంలో అందరికీ దళితబంధు సాయం అందగా, ఇతర వర్గాలు ఓట్లు వేయలేదని, దళితబంధు, బీసీ బంధు, రైతుబంధు వంటి పథకాల ప్రభావం బీఆర్‌ఎస్‌పై పడిందని చెప్పారు. జుక్కల్‌లో షిండే ఓడిపోతారని తాము భావించలేదన్నారు.
అధికారం కోల్పోయినా మునుపటి ఉత్సాహమే : హరీశ్‌రావు
పార్టీ తరపున తప్పులు ఉంటే మన్నించాలని, అధికారం కోల్పోయినా బీఆర్‌ఎస్ కార్యకర్తల్లో మునుపటి ఉత్సాహమే ఉందని మాజీ మంత్రి హరీశ్‌రావు అన్నారు. ఓటమిని దిగమింగుకొని లోక్‌సభ ఎన్నికల్లో సత్తా చాటాలనే పట్టుదలతో ఉన్నారని చెప్పారు. బీఆర్‌ఎస్ ఎంపీల సంఖ్య బలంగా ఉంటేనే లోక్‌సభలో తెలంగాణ గళం వినిపిస్తుందన్నారు. తెలంగాణ పాలిట బీజేపీది మొండిచేయి, కాంగ్రెస్‌ది తొండిచేయి అని, కేంద్రంతో సఖ్యత కోసం ప్రయత్నిస్తే గతంలో బీజేపీతో తాము కుమ్మక్కు అయినట్టు రేవంత్ ఆరోపించారన్నారు.
ప్రజాపాలనలో స్వీకరించిన 1.25 కోట్ల దరఖాస్తులకు మోక్షం కల్పించాలని, వంద రోజుల తర్వాత కాంగ్రెస్ పప్పులు ఉడకవని హరీశ్ స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తన శక్తితో కాకుండా బీఆర్‌ఎస్ బలహీనతల వల్లే గెలిచిందని, బీఆర్‌ఎస్‌లో కొందరు సొంత పార్టీ అభ్యర్థులనే ఓడించారని మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. పార్టీలో ప్రక్షాళన జరగాలని, గ్రూపు తగాదాలకు స్వస్తి పలకాలని చెప్పారు. అభివృద్ది ఎజెండాగా కాకుండా, ఇతర అంశాలపై ప్రజల దృష్టిని మళ్లించడంలో కాంగ్రెస్ సఫలమైందని మాజీ మంత్రి నిరంజన్‌రెడ్డి అన్నారు.
జహీరాబాద్‌లో గెలుపుపై బీఆర్‌ఎస్ ధీమా
పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయడం ద్వారా బీఆర్‌ఎస్ బలోపేతమవుతుందని, లోక్‌సభ ఎన్నికల్లో జహీరాబాద్ స్థానాన్ని బీఆర్‌ఎస్ కైవసం చేసుకుంటుందని ఆ పార్టీ నేతలు అభిప్రాయం వ్యక్తం చేశారు. జహీరాబాద్ లోక్‌సభ సన్నాహక సమావేశం అనంతరం మాజీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి, ఎంపీ బీబీ పాటిల్, జహీరాబాద్ ఎమ్మెల్యే మాణిక్‌రావు మీడియాతో మాట్లాడారు. సన్నాహక సమావేశంలో ఎమ్మెల్సీ మధుసూధనా చారి, ఎంపీ బీబీ.పాటిల్, ఎమ్మెల్యేలు మాణికరావు, చింత ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు
కొన్నిచోట్ల సిట్టింగ్ ఎమ్మెల్యేలను మార్చితే బాగుండేది
Published Mon, Jan 8 2024 5:02 AM | Last Updated on Mon, Jan 8 2024 5:02 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment