
అక్కన్నపేట (హుస్నాబాద్): వచ్చే 30 ఏళ్లు సంకీర్ణ ప్రభుత్వాల యుగమేనని, దీని ద్వారానే రాష్ట్రాలు అభివృద్ధి చెందుతాయని కరీంనగర్ ఎంపీ వినోద్‌కుమార్ అన్నారు. ఆదివారం హుస్నాబాద్ పట్టణంలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజనలో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం వల్లే నేడు తెలంగాణకు తీవ్ర అన్యాయం జరుగుతోందన్నారు. విభజన చట్టంలో తెలంగాణకు భారీ గా నష్టాలను రాశారని ధ్వజమెత్తారు. ఉద్యమ సమయంలో ముఖ్యంగా నీళ్ల కోసమే కొట్లాడామని, కానీ ఆనాటి కాంగ్రెస్ ప్రభుత్వం పోలవరం ప్రాజెక్టుకే రూ.50 వేల కోట్లు కేటాయించాలని చట్టంలో పెట్టిందని మండిపడ్డారు.
6న కరీంనగర్‌లో బహిరంగ సభ..
పార్లమెంటు ఎన్నికల నేపథ్యంలో ఈ నెల 6న కరీంనగర్ జిల్లాలోని ఎస్‌ఆర్ కళాశాల గ్రౌండ్‌లో బహిరంగ సభ నిర్వహించన్నట్లు వినోద్‌కుమార్ చెప్పారు. ఈ సభకు టీఆర్‌ఎస్ కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ హాజరవుతారన్నారు. టీఆర్‌ఎస్ పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే వొడితెల సతీష్‌కుమార్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్, కరీంనగర్ జిల్లా పరిషత్ చైర్మన్ తుల ఉమా తదితరులు పాల్గొన్నారు.