రానున్న ఆసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు- 2014కి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది.
ఎన్నికలకు సన్నద్ధం!
Published Thu, Feb 6 2014 3:29 AM | Last Updated on Sun, Sep 2 2018 4:46 PM
శ్రీకాకుళం కలెక్టరేట్, న్యూస్‌లైన్: రానున్న ఆసెంబ్లీ, పార్లమెంట్ ఎన్నికలు- 2014కి జిల్లా యంత్రాంగం సన్నద్ధమవుతోంది. ఈ మేరకు ఎలక్ట్రానిక్ ఓటింగ్ మెషీన్(ఈవీఎం)లను పూర్తి స్థాయిలో ఉపయోగించనుంది. అయితే..నోటా వెర్షన్‌తో కూడిన మిషన్లు రానున్నాయని అధికార వర్గాలు చెబుతున్నాయి. గతంలో జిల్లాలో వినియోగించిన ఈవీఎంలను..పశ్చిమ బెంగాల్ ఎన్నికలకు తరలించారు. ప్రస్తుతం వాటి స్థానంలో కొత్తమెషీన్లు రానున్నాయి. జిల్లాలో పార్లమెంట్, అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి..5,200 ఓటింగ్ యంత్రాలు అవసరమని, అదనంగా రిజర్వ్‌లో 20 శాతం అనగా..మరో 1040 మెషీన్లు కావాలని అధికారులు ఎన్నికల కమిషన్‌కు వివరించారు. దీంతో ఈనెల పదో తేదీకల్లా జిల్లాకు మొత్తం 6,240 ఈవీఎంలు రానున్నాయని అధికార వర్గాల సమాచారం.
సిబ్బందికి శిక్షణ
ఈ నేపథ్యంలో ఎన్నికల సిబ్బందికి, రాజకీయ పార్టీల నాయకులు, కార్యకర్తలకు కూడా శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. అనంతరం ఓటింగ్ విధానం, ఈవీఎం వినియోగించే పద్ధతిపై ఓటర్లకు కూడా శిక్షణ ఇస్తారు. ఈవీఎంలపై శిక్షణ ఇచ్చే..మాస్టర్ ట్రైనీలకు ఇప్పటికే శిక్షణ ఇచ్చారు. జిల్లా విద్యాశాఖలో పనిచేసి, ఉద్యోగ విరమణ పొందిన ఇద్దరు అధికారులు బి.మల్లేశ్వరరావు, సత్యనారాయణలు ఇప్పటికే..ఢిల్లీ వెళ్లి..శిక్షణ పొంది వచ్చారు. అలాగే..జిల్లా ఆడిట్ అధికారి, ప్రణాళికాధికారి హైదరాబాద్‌లో బుధవారం జరిగిన వర్క్‌షాపునకు హాజరయ్యారు. అనంతరం వీరు..జిల్లాలో వివిధ స్థాయిల అధికారులకు శిక్షణ ఇస్తారు. మండలాలవారీగా శిక్షణలు పూర్తియిన తరువాత, గ్రామాల్లో ప్రజలకు ఓటింగ్ యంత్రాలపై అవగాహన కల్పిస్తారు. ఈవీఎంల పనితీరుతో పాటు.. ఎన్నికల ఖర్చులు, ఖర్చు రాసే విధానం, నోడల్ కోడ్ ఆప్ కాండాక్టుపై వివరిస్తారు. అన్ని స్థాయిల్లోనూ రాజకీయ నాయకులు, స్థానిక కార్యకర్తలను శిక్షణలో భాగస్వాములను చేస్తారు. ఈ నెలాఖరు నాటికి శిక్షణ పూర్తి చేయాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది.
Advertisement
Advertisement