సాక్షి, హైదరాబాద్: ఒక వైపు ఎమ్మెల్సీ ఎన్నికల్లో ప్రత్యర్థులకు ఊహించని షాకులిస్తున్న అధికార టీఆర్‌ఎస్.. సమాంతరంగా పార్లమెంట్ ఎన్నికలకు సిద్ధమవుతోంది. ఇందులో భాగంగా లోక్‌సభ నియోజకవర్గ స్థాయిలో సమావేశాలకు ఏర్పాట్లు చేసుకున్న సంగతి తెలిసిందే. మరోవైపు పార్లమెంట్ ఎన్నికలకు ముందే ప్రజల నాడి తెలుసుకునే పనిలో పడింది. ఇప్పటికే ఈ పనిలో రాష్ట్ర ఇంటెలిజెన్స్ పోలీసులు తలమునకలైనట్లు సమాచారం. ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా ప్రతీ అసెంబ్లీ నియోజవర్గంలో ఒక్కో మండలానికి ఓ పోలీసు అధికారి (హెడ్ కానిస్టేబుల్ లేదా ఎస్‌ఐ)తో సర్వే చేయిస్తున్నట్లు తెలిసింది. ప్రతీ అసెంబ్లీకి కనీసం 4 మండలాలు ఉన్నాయి. ఈ లెక్కన ప్రతీ పార్లమెంట్ సెగ్మెంట్‌లో దాదాపుగా 28 నుంచి 30 మంది వరకు పోలీసులు సర్వేలో పాల్గొంటున్నారు.
16 ఎంపీ సీట్లే లక్ష్యంగా...
శాసనసభ ఎన్నికల్లో అనుసరించిన వ్యూహాలనే ఇప్పుడూ అనుసరించాలని టీఆర్‌ఎస్ భావిస్తోంది. అసెంబ్లీ ఎన్నికల్లో 105 సీట్లు లక్ష్యంగా బరిలోకి దిగిన ఆ పార్టీ 88 స్థానాల్లో విజయం సాధించిన సంగతి తెలిసిందే. అనంతరం ఇద్దరు స్వతంత్రులు టీఆర్‌ఎస్‌లో చేరారు. నామినేటెడ్ ఎమ్మెల్యేను కూడా కలుపుకుంటే పార్టీ బలం 91కి చేరింది. ఇక మిత్రపక్షం ఎంఐఎం 7 స్థానాలు కలిపితే ప్రభుత్వానికి 98 మంది ఎమ్మెల్యేల బలం ఉంది. తాజాగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు రేగా కాంతారావు, ఆత్రం సక్కు, టీడీపీ ఎమ్మెల్యే సండ్ర పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించడంతో టీఆర్‌ఎస్ బలం మద్దతుదారులతో కలిపి 101కి చేరింది.
16 ఎంపీ సీట్లే లక్ష్యంగా బరిలోకి దిగనున్న టీఆర్‌ఎస్ ఈసారి 100 శాతం సఫలీకృతం కావాలని పావులు కదుపుతోంది. ఇటీవల పంచాయతీ ఎన్నికల్లో మెజారిటీ స్థానాలు కైవసం చేసుకుని జోరు మీదున్న కారు పార్టీ అదే జోరును పార్లమెంట్ ఎన్నికల్లోనూ కొనసాగించాలని అనుకుంటోంది. ఇందులో భాగంగా టీఆర్‌ఎస్, బీజేపీ, కాంగ్రెస్‌కు ప్రజల్లో ఆదరణ ఏ మేరకు ఉందో తెలుసునే ప్రయత్నం చేస్తోంది. ఇప్పటికే ప్రభుత్వ పథకాల అమలు తీరు, పింఛన్లు, రైతు రుణమాఫీ, రైతుబంధు తదితరాల విషయంలో లబ్ధిదారుల అభిప్రాయాలపై ఇంటెలిజెన్స్ సర్వే చేస్తున్నట్లు తెలిసింది. ప్రజాభిప్రాయాన్ని మొత్తంగా క్రోడీకరించి త్వరలోనే ప్రభుత్వానికి అందజేయనున్నారు.
మరో రెండుసార్లు సర్వే?
ఇప్పుడు జరుగుతున్న సర్వే దాదాపు పూర్తి కావొచ్చింది. ఈ నివేదిక ప్రభుత్వానికి అందజేశాక మరో రెండుసార్లు సర్వే చేయించనున్నట్లు సమాచారం. నోటిఫికేషన్ వచ్చాక ఒకసారి, బీ–ఫారాలు ఇచ్చాక రెండోసారి సర్వే జరుగనుంది. సరిహద్దు ఉద్రిక్తతల నేపథ్యంలో దేశంలో, రాష్ట్రంలో.. బీజేపీ, కాంగ్రెస్ మధ్య మాటల యుద్ధం ముదిరిన సంగతి తెలిసిందే. ఈ పరిణామాలు ఎన్నికలపై పడతాయా? అన్న విషయంలోనూ సర్వే జరగనుంది. జాతీయ అంశాలు కీలకంగా ఎన్నికలు జరిగితే... టీఆర్‌ఎస్ అనుకున్న 16 సీట్లు గెలవడం క్లిష్టమవుతుంది. అందుకే, నోటిఫికేషన్ వచ్చాక, బీ–ఫారాలు ఇచ్చాక మరోసారి సర్వే జరగనుందని సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment