ఆర్మూర్ సభలో మాట్లాడుతున్న బీజేపీ జాతీయ ప్రధానకార్యదర్శి రాంమాధవ్
ఆర్మూర్: కేంద్రంలో మళ్లీ అధికారంలోకి రాగానే పసుపు బోర్డును ఏర్పాటు చేస్తామని, ఈ అంశాన్ని తమ పార్టీ ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినట్లు బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంమాధవ్ వెల్లడించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా సోమవారం నిజామాబాద్ జిల్లా ఆర్మూర్‌లో ఏర్పాటు చేసిన బహిరంగలో ఆయన ప్రసంగించారు. తమ పార్టీ నిజామాబాద్ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చొరవ వల్లే సమస్య తీవ్రత కేంద్ర ప్రభుత్వం దృష్టికి వచ్చిందని తెలిపారు. వరి, మొక్కజొన్న, సోయాబీన్, పొద్దుతిరుగుడు లాంటి పంటలకు గిట్టుబాటు ధరను పెంచిన కేంద్ర ప్రభుత్వానికి పసుపు పంటకు ధర ఇవ్వడం పెద్ద సమస్య కాదని చెప్పారు. సుమారు 150 రకాల పసుపు, ఎర్రజొన్న లాంటి పంటలు పండించే రైతులను ఆదుకోవడానికి కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు.
పసుపు, ఎర్రజొన్న పంటలను మార్కెట్ ధర కంటే తక్కువ ధరకు అమ్ముకోవాల్సిన పరిస్థితిని రైతులు ఎదుర్కొన్న తరుణంలో రైతు పంటను అమ్ముకున్న ధరకు, మార్కెట్ ధరకు మధ్య ఉన్న వ్యత్యాసం మొత్తాన్ని కేంద్ర ప్రభుత్వం నేరుగా రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తుందని రాంమాధవ్ హామీ ఇచ్చారు. పసుపు, ఎర్రజొన్న రైతుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేదని, ప్రభుత్వంపై ఉన్న వారి ఆక్రోశాన్ని వెళ్లగక్కడానికి పార్లమెంట్ ఎన్నికల్లో నామినేషన్లు వేస్తున్నారని తెలిపారు. ఇది ఎంపీ కవిత వైఫల్యమేనని చెప్పారు. తెలంగాణ రాష్ట్రంలో కుటుంబ పాలనతో నిరంకుశ పాలన సాగుతోందని రాంమాధవ్ విమర్శించారు.
బీజేపీ విజయాన్ని అడ్డుకోలేరు..
పాలమూరు: బీజేపీ విజయాన్ని అడ్డుకునే శక్తి ఎవరికీ లేదని రాంమాధవ్ అన్నారు. మహబూబ్‌నగర్‌లో ఆయన మాట్లాడుతూ. తానే కింగ్ మేకర్ అంటున్న కేసీఆర్, మోదీ పాలనను అడ్డుకుంటామన్న మమతా బెనర్జీ, కేజ్రీవాల్ లాంటి నాయకులెవరూ ఎన్నికల్లో పోటీ చేయడం లేదన్నారు. కేంద్రంలో ఫ్రంట్ ప్రభుత్వం ఏర్పడుతుందని చెబుతున్న చంద్రబాబు మొదట ఆంధ్రలో గెలిచి చూపించాలని సవాల్ విసిరారు. దేశంలో రాహుల్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని విమర్శించారు. రాహుల్ ఎక్కడ పర్యటించినా మోదీ..మోదీ అంటూ ప్రజలు నీరాజనం పలుకుతున్నారని గుర్తు చేశారు.
300 స్థానాల్లో ఒంటరి పోరు
వచ్చే ఎన్నికల్లో బీజేపీ ఒంటరిగా 300 స్థానాల్లో పోరాడుతుందని, అన్ని స్థానాల్లో గెలిచి మళ్లీ ప్రభుత్వం ఏర్పాటు చేస్తుందని రాంమాధవ్ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణలో కేసీఆర్‌ను ఓడించేందుకు బీజేపీ నాయకులు శక్తి వంచన లేకుండా పని చేయాలని పిలుపునిచ్చారు. తెలంగాణలో కుటుంబపాలన సాగుతోందని, ఎక్కువ మెజార్టీతో గెలిచాడని అల్లుడు హరీశ్‌రావును పక్కన పెట్టారని, మహబూబ్‌నగర్ ఎంపీగా ఉన్న జితేందర్‌రెడ్డికి సైతం టికెట్టు ఇవ్వకుండా అన్యాయం చేశారన్నారు. ఈ నెల 29న ప్రధాని నరేంద్రమోదీ మహబూబ్‌నగర్‌సభలో పాల్గొంటారని తెలిపారు. కేంద్ర పట్టణ అభివృద్ధి శాఖ మంత్రి హర్‌దీప్‌సింగ్ పూరి మాట్లాడుతూ.. ఉగ్రవాదులను అణచివేయడంలో ప్రపంచంలో మోదీకి మించిన నాయకుడు లేడని కొనియాడారు.
Comments
Please login to add a commentAdd a comment