పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇతర సహజవనరుల విషయంలోనూ పర్యావరణపరమైన ఒత్తిళ్ళున్నాయి. ఈ నేపథ్యంలో ఇంధన వనరుల రంగం సమూలంగా దిశ మార్చుకుంటోంది. వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగం నుంచి ప్రపంచం సౌర, పవన, హైడ్రోజన్ వంటి పునర్వినియోగ ఇంధనాల వైపు మళ్లుతోంది. విద్యుత్తు వినియోగం, రవాణా–ప్రయాణ రంగంలో వాహ నాలకు పునర్వినియోగ ఇంధన వాటా పెరిగితేనే, ‘వాతావరణ మార్పు’ ప్రతికూల ప్రభావాల నుంచి స్థూలంగా ప్రపంచానికి, ప్రత్యేకంగా భారత్‌కు రక్ష!
ఆధునిక మానవుడి నిత్యావసరమైన ఇంధన వనరు రంగం సమూలంగా దిశ మార్చుకుంటోంది. కర్భన ఉద్గారాలతో వాతావరణ కాలుష్యానికి కారణమవుతున్న శిలాజ ఇంధనాల వినియోగం నుంచి ప్రపంచం సౌర, పవన, హైడ్రోజన్ వంటి పునర్వినియోగ (స్వచ్ఛ– హరిత) ఇంధనాల వైపు మళ్లుతోంది. ఇదొక... అవసర, అనివార్య స్థితి! ఈ మార్పుకనుగుణంగా భారత్‌లోనూ బలమైన అడుగులే పడు తున్నాయి. అక్టోబర్ నెలాఖరుకి 150 గిగావాట్లు, 2022 సంవత్సరాం తానికి 175 గిగావాట్ల పునర్వినియోగ విద్యుత్ ఇంధన (ఆర్‌ఈ) స్థాపక సామర్థ్యానికి కేంద్ర ప్రభుత్వం సన్నద్ధమౌతోంది. (ఒక గిగా వాట్ అంటే వెయ్యి మెగావాట్లు) గాంధీ జయంతి రోజైన శనివారం 2.2 గిగావాట్లు, నెలాఖరున మరో 2.32 గిగావాట్ల స్థాపక సామర్థ్య ప్లాంట్‌లను ఏర్పాటు చేస్తోంది.
కార్పొరేట్ రంగం నుంచి ఇటీవల వచ్చిన భారీ ప్రకటనల ప్రకారం.... రిలయన్స్ అధినేత ముఖేశ్ అంబానీ వచ్చే మూడేళ్లలో రూ 75 వేల కోట్లు (పది బిలియన్ డాలర్లు), అదానీ గ్రూప్ అధినేత గౌతమ్ అదానీ వచ్చే పదేళ్లలో రూ 1.50 లక్షల కోట్లు (ఇరవై బిలియన్ డాలర్లు) çపునర్వినియోగ ఇంధన రంగంలో వ్యయం చేయనున్నారు. ప్రభుత్వాలు, పరిశ్రమ, పౌర సమాజం... అప్రమత్తంగా ఉండి భవిష్యత్తుకు భరోసా ఇచ్చేలా బాటను చక్కదిద్దుకోవడమే వారి ముందున్న కర్తవ్యం. పెట్రోలియం ఉత్పత్తుల ధరలు అసాధారణంగా పెరిగిపోతున్నాయి. ఇతర సహజ వనరుల విషయంలోనూ పర్యావరణపరమైన ఒత్తిడులున్నాయి.
వాటి లభ్యత కష్టం–ఖరీదవుతుండగా, వినియోగం దుర్భరమౌతున్న పరిస్థి తుల్లో పర్యావరణ సానుకూల çపునర్వినియోగ ఇంధనాల వినియోగ వాటాను పెంచడం ఆరోగ్యకర పరిణామం! ఐక్యరాజ్యసమితి (యూఎన్) నిర్దేశించనట్టు, 2015 పారిస్ పర్యావరణ ఒప్పందం ప్రకారం నిర్దేశిత లక్ష్యాలు చేరుకోవడానికి ఈ దిశలో పయనం అత్య వసరం! అదే సమయంలో సుస్థిరమైన ప్రత్యామ్నాయ ఏర్పాట్లు లేకుంటే, ఇప్పుడు చైనా ఎదుర్కొంటున్న తీవ్ర విద్యుత్ సంక్షోభ దుస్థితి మనకూ తప్పదు! ప్రపంచంలో అత్యధికంగా బొగ్గు వినియో గించే చైనా సదరు శిలాజ ఇంధన వాడకాన్ని రమారమి తగ్గించింది. గత దశాబ్దారంభంలో 68 శాతం ఉన్న బొగ్గు వినియోగం వాటాని, 2020లో 56 శాతానికి తగ్గించింది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు సరిగా లేనందున ఇప్పుడు పారిశ్రామిక, నివాస, ట్రాఫిక్ నిర్వహణ వంటి నిత్యావసరాలకూ తీవ్ర విద్యుత్ కొరత ఎదుర్కొంటూ దిగుమతుల కోసం దిక్కులు చూస్తోంది.
సరైన దిశలోనే భారత్!
అమెరికా, చైనా తర్వాత ఎక్కువ కర్బన ఉద్గారాలను (గ్రీన్ హౌజ్ గ్యాసెస్) విడుదల చేస్తున్న దేశంగా భారత్‌పై పర్యావరణ పరిరక్షణ బాధ్యత ఎంతో ఉంది. 2030 నాటికి, కార్బన్ ఫుట్‌ప్రింట్‌ని 33–35 శాతం (2005 నాటి స్థాయిపై లెక్కించి) మేర తగ్గిస్తామని పారిస్‌లో మాటిచ్చాం. పునర్వినియోగ ఇంధన వాటాని 40 శాతానికి పెంచుతా మన్నది కూడా ఒప్పందంలో భాగమే! ఇప్పటికే 38.4 శాతానికి చేరు కున్నామని కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తోంది. ప్రభుత్వ–ప్రయివేటు రంగంలో తాజాగా వస్తున్న పెట్టుబడులు, ప్రణాళికల్ని బట్టి ఈ వాటాను 2030 నాటికి 66 శాతానికి పెంచే ఆస్కారముంది. పర్యా వరణ సానుకూల దిశలో గట్టి ముందడుగు పడ్డట్టే! కార్బన్ డైయాక్సైడ్ (సీవోటూ) వంటి కర్బన ఉద్గారాలను 28 శాతానికి తగ్గించినట్టు ప్రభుత్వం చెబుతోంది. కోవిడ్ రెండో అల సమయంలో దేశవ్యాప్తంగా విద్యుత్ వినియోగం తగ్గి, బొగ్గు ఉత్పత్తి పెరిగింది. కానీ, సాధారణ పరిస్థితుల్లో విద్యుత్ వినియోగం మనదేశంలో పెరుగుతోంది.
గరిష్ట వినియోగ సమయంలో (పీక్) గత జూలై 7న, 200.57 గిగావాట్ల విద్యుత్ వినియోగం జరిగినట్టు కేంద్ర ఇంధన మంత్రి రాజ్‌కుమార్ సింగ్ తెలిపారు. ప్రపంచ సగటు తలసరి కర్బన ఉద్గారాలతో పోలిస్తే మన తలసరి మూడో వంతేనని ఇటీవల ఒక అంతర్జాతీయ వేదిక నుంచి, సదరు మంత్రి సెలవిచ్చారు. కర్బన ఉద్గారాల సున్నాస్థితి (జీరో న్యూట్రాలిటీ) సాధించే విషయమై భారత్ నిర్దిష్ట ప్రకటన చేయాలన్న వాదనను తోసిపుచ్చుతూ ఆయనీ మాటలన్నారు. కానీ, అది సరైన వాదన కాదనేది పర్యావరణ కార్యకర్తల భావన! ప్రపం చంలో రెండో అతి పెద్ద ఉత్పత్తి దేశం, రెండో అత్యధిక జనాభా దేశం, కర్బన ఉద్గారాల్లో మూడో అతిపెద్ద దేశం. తలసరి ఉద్గారాల వెల్లడి తక్కువే అయినా, విస్తృత జనాభా రీత్యా, దీన్ని తీవ్ర సమస్యగానే పరిగణించాలి. నెల రోజుల్లో గ్లాస్‌గోవ్‌లో జరుగనున్న ‘కాప్–26’ యూఎన్ సదస్సులోగానీ, ముందేగానీ దీనిపై నిర్దిష్ట ప్రకటన చేయా లని భారత్‌పై అంతర్జాతీయ సమాజం నుంచి వత్తిడి పెరుగుతోంది.
భూమి ఒక వివాదాంశమే!
భారత్ పురోగమిస్తున్న çపునర్వినియోగ ఇంధన రంగంలో, అందుక వసరమైన భూలభ్యత, సేకరణ, వినియోగం జఠిల సమస్యే కానుంది. హరిత మార్గాలైన సౌర విద్యుత్‌కైనా, పవన విద్యుత్తుకైనా నిర్దిష్టంగా స్థలం అవసరమౌతుంది. పునర్వినియోగ ఇంధనాల ద్వారా. 2050 నాటికి కర్భన ఉద్గారాల శూన్యస్థితి సాధించాలంటే ‘ఇంధన వ్యయ– ఆర్థిక విశ్లేషన సంస్థ’ (ఐఈఈఎప్‌ఎ) అధ్యయనం ప్రకారం, పెద్ద మొత్తం భూమి అవసరమౌతుంది. సౌర విద్యుత్ వ్యవస్థకు 50,000 నుంచి 70,000 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం, పవనవిద్యుత్ వ్యవస్థ కోసం మరో 15,000 నుంచి 20,000 చ.కి.మీ భూమి అవసరమౌతుంది. అంటే ఒక్క విద్యుత్తుకే మొత్తం భూభాగంలో 1.7 నుంచి 2.5 విస్తీర్ణం, అటవీయేతర భూభాగంలో దీన్ని 2,2 నుంచి 3.3 శాతంగా లెక్కగట్టారు. ఇది మంచిది కాదని, భూమ్యావరణ వ్యవస్థకు చేటని పర్యావరణవేత్తలంటున్నారు. ఆహారోత్పత్తిపైనా ప్రతికూల ప్రభా వమే! బడా కార్పోరేట్ల స్పర్థలో భూసేకరణ, భూదురాక్రమణలు మళ్లీ వివాదాస్పదమనే అభిప్రాయం ఉంది.
ఈ విషయంలో తగినంత కస రత్తు జరగాలని, భూవినియోగ విధానాలు సమగ్రంగా ఉండాలని ఆ సంస్థ సిఫారసు చేసింది. సౌరవిద్యుత్ పలకలు (ప్యానల్స్), పవన్ విద్యుత్ టవర్స్ ఏర్పాటు చేసే భూములు, సామాజికంగా–వ్యావసా యికంగా–పర్యావరణ పరంగా తక్కువ ప్రభావితమయ్యే ప్రాంతాలు, ప్రభుత్వ ఖాళీ, పోరంబోకు, గైరాన్ వంటి భూముల్ని ఎంపిక చేయాలి. గరిష్ట ప్రయోజనం–కనీస వివాదం ప్రాతిపదకగా ఉండాలనీ సూచించింది. పంట కాల్వలపైన, ప్రయివేటు–కృత్రిమ జలాశయాల పైన సౌరపలకలు ఏర్పాటు చేయడం మంచిదంటున్నారు. ప్రధాని మోదీ గుజరాత్ సీఎంగా ఉన్నపుడు, నీటిపారుదల ప్రాజెక్టు కాలువ లపై సౌరపలకలు ఏర్పాటు చేసిన నమూనాకు ‘జాతీయ సోలార్ మిషన్’గా యూఎన్ స్థాయిలో ప్రచారం కల్పించారు. ఇపుడు దేశ వ్యాప్తంగా దాన్ని మరింత విస్తృతపరచవచ్చు. ఇళ్లు, ఇతర నివాస ప్రదేశాలు, కార్యాలయాలపైన (రూప్‌టాప్) కూడా ప్యానల్స్ ఏర్పాటు చేయడం సముచితమనే అభిప్రాయముంది. ఫ్రాన్స్‌లో ఒక దశలో, ప్రతి ఇంటి పైకప్పునూ అయితే హరితంతో లేదా సౌరపలకలతో గానీ కప్పి ఉంచేట్టు ఇచ్చిన ఆదేశాలు ఫలితమిచ్చాయి.
పెట్రోలియం ధరలు అంతర్జాతీయ మార్కెట్లో వేగంగా పెరుగు తున్నాయి. బ్యారెల్ క్రూడ్ 90 డాలర్లకు చేరనుందని వార్తలొస్తు న్నాయి. భారత్, 85 శాతం దిగుమతులపైనే ఆధారపడుతోంది. దేశీయంగా పెట్రో ఉత్పత్తి విస్తరణ అవకాశాలు తక్కువ. ఎలక్ట్రిక్ వాహనాలు రావాల్సినంత త్వరగా భారత్ మార్కెట్లోకి రావటం లేదు. ఏయే లాబీలు బలంగా పనిచేస్తున్నాయో గానీ, వాటికెన్నో ప్రతి బంధకాలు! పెట్రో ఎగుమతి దేశాల సంస్థ (ఒపెక్) అధ్యయనం ప్రకారం, వచ్చే పాతికేళ్లలో, డీజిల్–గ్యాసోలైన్‌పై ఆధారపడి నడిచే మన వాహనాల వాటా 51 శాతం నుంచి 58 శాతానికి పెరుగనుంది. ఇది, పర్యావరణంపై ప్రతికూల ప్రభావం చూపుతుంది. విద్యుత్తు వినియోగం, రవాణా–ప్రయాణ రంగంలో వాహనాలకు పునర్వినియోగ ఇంధన వాటా పెరిగితేనే, ‘వాతావరణ మార్పు’ ప్రతికూల ప్రభావాల నుంచి స్థూలంగా ప్రపంచానికి, ప్రత్యేకంగా భారత్‌కు రక్ష!
దిలీప్ రెడ్డి
ఈ–మెయిల్ : dileepreddy@sakshi.com
Comments
Please login to add a commentAdd a comment