ప్రకృతిని పరిరక్షించుకోకపోతే విపత్తులు తప్పవు | World Wide Fund For Nature Report For Living Planet 2020 | Sakshi
Sakshi News home page

ప్రకృతిని పరిరక్షించుకోకపోతే విపత్తులు తప్పవు

Published Sun, Sep 13 2020 11:29 AM | Last Updated on Sun, Sep 13 2020 1:11 PM

World Wide Fund For Nature Report For Living Planet 2020 - Sakshi

హరివిల్లులో ఏడు రంగుల స్థానంలో  ఒక రంగు మాత్రమే ఉంటే?  భూమ్మీద తెల్లటి పూలు మాత్రమే పూస్తే? పండ్లు అన్నింటి రుచి ఒకేలా ఉంటే?  అబ్బే... ఏం బాగుంటుంది అంటున్నారా?  నిజమే. అన్నీ ఒకేలా ఉంటే బోర్‌ కొట్టేస్తుంది!  వైవిధ్యం అనేది మనసుకు ఆనందం కలిగిస్తుంది! ప్రయోజనాలూ బోలెడు!  కానీ.. ఈ విషయం మనిషికి పూర్తిగా అర్థమైనట్లు లేదు.  ఎందుకంటే.. మన మనుగడనే ప్రశ్నార్థకం చేస్తుందని తెలిసినా...  వ్యవసాయం, పరిశ్రమలు, విద్యుత్‌ తదితరాల పేరుతో....  అడవులు, నదులు, సరస్సులు, నేలలను నాశనం చేస్తూనే ఉన్నాడు!  వరల్డ్‌ వైడ్‌ ఫండ్‌ ఫర్‌ నేచర్‌ (డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌) సిద్ధం చేసిన లివింగ్‌ ప్లానెట్‌ రిపోర్ట్‌ –2020 చెబుతున్నది ఇదే! 

కోవిడ్‌ మహమ్మారి విజృంభణ కొనసాగుతూనే ఉంది. కోట్ల కేసులు.. లక్షల్లో మరణాలు... ఆర్థిక వ్యవస్థ ఛిద్రం.. ఉద్యోగాల కోత. ఇలా ఎన్నెన్నో సమస్యలకు ఒక వైరస్‌ కారణమైందంటే ఆశ్చర్యం అనిపించక మానదు. కానీ.. కోట్ల సంవత్సరాలపాటు జంతువుల్లో నిక్షేపంగా బతికిన ఈ వైరస్‌లు ఈ మధ్య కాలంలో మనిషికి ఎందుకు సంక్రమిస్తున్నాయో.. కారణమేమిటో మీరెప్పుడైనా ఆలోచించారా? హెచ్‌1ఎన్‌1 కానివ్వండి, చికెన్‌ గున్యా కానివ్వండి. స్వైన్‌ఫ్లూ కానివ్వండి అన్నీ జంతువుల నుంచి మనిషికి సోకిన వ్యాధులే. ఇప్పుడు కోవిడ్‌–19 కూడా. మనిషి ఎప్పుడైతే అటవీ సంపదను తన స్వార్థం కోసం విచ్చలవిడిగా వాడటం మొదలుపెట్టాడో అప్పటి నుంచే ఈ సమస్య కూడా పెరగడం మొదలైందని అంటారు నిపుణులు.

ప్రకృతిని, జీవజాలాన్ని పరిరక్షించుకోవడం ఇప్పటికైనా నేర్చుకోకపోతే కోవిడ్‌–19 తరహా విపత్తులు మరిన్ని ఎదుర్కోక తప్పదని డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ తన లివింగ్‌ ప్లానెట్‌ రిపోర్ట్‌ –2020లో స్పష్టం చేసింది. రెండేళ్లకు ఒకసారి విడుదల చేసే లివింగ్‌ ప్లానెట్‌ రిపోర్ట్‌ను ఈసారి దాదాపు 125 మంది నిపుణులు కలిసి సిద్ధం చేశారు. 1970 నుంచి 2016 మధ్యకాలంలో  ప్రపంచ వ్యాప్తంగా సుమారు 21 వేల క్షీరదాలు, పక్షులు, జలచరాలు, సరిసృపాలు సంతతిని పరిశీలిస్తూ సిద్ధం చేసిన ఈ నివేదిక దాదాపు 164 పేజీల నిడివి ఉంది.  

ప్రపంచవ్యాప్తంగా డబ్ల్యూడబ్ల్యూఎఫ్‌ పరిశీలించిన వాటిల్లో మూడింట రెండు వంతుల జంతుజాలం క్షీణావస్థలో ఉంది. మొక్కల విషయానికొస్తే... ప్రతి ఐదింటిలో ఒకటి అంతరించిపోయేందుకు సిద్ధంగా ఉన్నట్లు నివేదిక చెబుతోంది. గత ఏడాది ఉష్ణమండల ప్రాంతాల్లోని అడవులనే పరిగణనలోకి తీసుకుంటే.. ఆరుసెకన్లకు రెండు ఎకరాల చొప్పున నష్టపోయామని నివేదిక తెలిపింది. అడవులు నరికివేసి వ్యవసాయం చేయడం మొదలుకొని నదీజలాల కాలుష్యంతో జలచరాలకు ముప్పు తేవడం వరకూ అన్నింటి ఫలితంగా భూమి ఇప్పుడు అత్యవసర సాయం కోరుతూ ఆక్రందనలు చేస్తోందని వివరించింది. ఈ పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేకపోతే ఇంకో పదేళ్లలో సరిచేసుకునేందుకు వీలు కానంత పెద్ద ప్రమాదంలో పడతామని హెచ్చరించింది. అయితే ఇప్పటికైనా పరిస్థితి మించిపోలేదని, దేశాలన్నీ కలిసికట్టుగా పచ్చ‘ధనం’ పండిస్తే.. వినియోగం విషయంలో మనల్ని మనం మార్చు కోగలిగితే భూమి మరికొన్ని కాలాలపాటు పచ్చగా ఉండేందుకు అవకాశం లేకపోలేదని చెబుతోంది ఈ నివేదిక.

ఇవీ కారణాలు
భూ వినియోగంలో మార్పులు. అటవీ విస్తీర్ణం వేగంగా తగ్గిపోతూ ఉండటం, జంతుజాలాల ఆవాస యోగ్య ప్రాంతాలు కుంచించుకుపోవడం జీవవైవిధ్యం తగ్గుదలకు ఒక కారణం. ప్రకృతి వనరుల విచ్చలవిడి వాడకం రెండో కారణం. ఇన్వేసివ్‌ స్పీషీస్‌ (ఇతర జీవావరణాల నుంచి వచ్చిన జంతువులు, పక్షులు, మొక్కలు) మూడో కారణం. నాలుగవ, ఐదవ కారణాలుగా కాలుష్యం, వాతావరణ మార్పులను పేర్కొనవచ్చు. భారత్‌తోపాటు ఆసియా పసిఫిక్‌ ప్రాంతంలో జీవ వైవిధ్యతలో తగ్గుదలకు ప్రధానంగా వాటి ఆవాస ప్రాంత నష్టం కారణం కాగా.. ఇన్వేసివ్‌ స్పీషీస్, వ్యాధులు, అతి వాడకం ఇతర కారణాలుగా కనిపిస్తున్నాయి. భారత్‌లో నగరీకరణ, వ్యవసాయ కార్యకలాపాలు, కాలుష్యం వంటి కారణాల వల్ల చిత్తడి నేలలు దాదాపు లేకుండా పోయాయని లివింగ్‌ ప్లానెట్‌ ఇండెక్స్‌ రిపోర్ట్‌ స్పష్టం చేసింది. అటవీ ప్రాంతాలు తగ్గడంతో జంతు సమూహాల్లోని సంఖ్య కూడా తగ్గిపోతోందని, ఇది కాస్తా సంతానోత్పత్తిపై ప్రభావం చూపడంతోపాటు వ్యాధులు ప్రబలేందుకు కారణమవుతోందని ఈ నివేదిక తెలిపింది. గత ఏడాది భారత్‌లో అటవీ భూములను ఇతర అవసరాల కోసం మళ్లించాలన్న అభ్యర్థనలు దాదాపు 240 వరకూ కేంద్ర ప్రభుత్వం ముందుకు రాగా.. సుమారు 99 శాతం ప్రతిపాదనలకు అనుమతి లభించిందని ఈ నివేదిక తెలిపింది.  

సమీకృత విధానంతోనే పరిష్కారం...
వేగంగా తగ్గిపోతున్న జీవవైవిధ్యాన్ని పునరుద్ధరించాలన్నా, తద్వారా మానవ మనుగడను మరింత సుస్థిరం చేసుకోవాలన్నా ప్రపంచ దేశాలన్నీ కలిసికట్టుగా పనిచేయాల్సిందే. ఆహార ఉత్పత్తిని, వాణిజ్యాన్ని మరింత ప్రకృతి అనుకూలమైన పద్ధతుల్లో చేపట్టడం ఇందులో ఒకటి మాత్రమే. ప్రపంచవ్యాప్తంగా ఉత్పత్తి అవుతున్న ఆహారంలో కనీసం మూడో వంతు వృథాగా చెత్తబుట్టల్లోకి చేరుతుండటం జీవవైవిధ్యానికి ఏమాత్రం మంచిది కాదు. ఈ వృథా కారణంగా గాల్లోకి చేరుతున్న విషవాయువులు వైమానిక రంగ ఉద్గారాల కంటే ఎక్కువగా ఆరు శాతం వరకూ ఉండటం గమనార్హం. ఆహార రంగం ద్వారా వెలువడుతున్న విషవాయువుల్లో 24 శాతం సరఫరా నష్టాలు, వినియోగదారులు వృథా చేయడమేనని నివేదిక తెలిపింది.

ఈ నష్టాలన్నింటినీ తగ్గించుకోగలిగితే జీవవైవిధ్యం పెంపునకు తోడ్పడినట్లే. భారత్‌ విషయానికి వస్తే.. ఉత్పత్తి అవుతున్న ఆహారంలో వృథా అవుతున్నది దాదాపు 40 శాతం. ఫుడ్‌ కార్పొరేషన్‌  ఆఫ్‌ ఇండియా వంటివి ఈ నష్టాన్ని 10 నుంచి 15 శాతంగా మాత్రమే చెబుతున్నా అంతర్జాతీయ సంస్థలు 40 శాతంగా లెక్కవేస్తున్నాయి. జంతుజాలాన్ని, ప్రకృతిని పరిరక్షించడం జీవవైవిధ్యం కోసం కీలకమైనప్పటికీ కేవలం ఈ చర్యల ద్వారా మాత్రమే పరిస్థితిని పారిశ్రామిక విప్లవం మునుపటి స్థాయికి తీసుకువెళ్లలేమని వీటికి ఇతర అంశాలూ కూడా జోడిస్తేనే మేలు జరుగుతుందని ఈ నివేదిక స్పష్టం చేసింది.

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement