వేర్వేరు ప్రాంతాల్లో విడిగా బతికే ధోరణిని అవలంభిస్తున్న పలు జంటలు
పశ్చిమదేశాల్లో పెరిగిన ఎల్‌ఏటీ సంస్కృతి
ప్రేమలు బలపడేందుకు ఓరకంగా ఇది మంచి పద్దతేనంటున్న మానసిక నిపుణులు
పెళ్లయిన కొత్తలో ఆమె ఏం చెప్పినా, చేసినా అతనికి ఎంతో ఇష్టం. ఇద్దరికీ నచ్చిన ఫుడ్, నచ్చిన రంగు, నచ్చిన హాలిడే వెకేషన్. కొన్నాళ్లు గడిచాక సీన్ రివర్స్. ఏం చేసినా తప్పే. చేయకపోయినా తప్పే. టాయిలెట్ కమోడ్ మూత వేయకపోతే మాటల యుద్ధం. మంచంపై తడిసిన తువ్వాలు కనిపిస్తే పెద్ద వాగ్వాదం. ఏసీ నంబర్ పెంచినా, తగ్గించినా పట్టరానంత కోపాలు. పెద్దలు కుదిర్చిన పెళ్లికావొచ్చు మనసులు కలిపిన ప్రేమ వివాహం కావొచ్చు.
కీచులాటలు కామన్. ఇలా కొట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోతే బాగుండు అనే జంటలు కోకొల్లలు. శాశ్వతంగా విడిపోకుండా దూరం దూరంగా వేర్వేరు ఇళ్లలో ఉంటూ ఒకరికిపై మరొకరు గాఢమైన ప్రేమానుబంధాలను పెంచుకునే కొత్త ధోరణి ఇప్పుడు మొగ్గ తొడిగి వేగంగా విస్తరిస్తోంది. దీనికే ఇప్పుడు చాలా జంటలు ‘దూరంగా కలిసి బతకడం( లివింగ్ అపార్ట్ టుగెదర్ ) అనే కొత్త పేరు పెట్టి ఆచరిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్‌లోని విశేషాలను తెల్సుకునేందుకు ఆయా జంటల జీవితాల్లోకి ఓసారి తొంగిచూద్దాం..
ఏమిటీ ఎల్‌ఏటీ?
లివింగ్ అపార్ట్ టుగెదర్ (ఎల్‌ఏటీ) గురించి 19వ శతాబ్దానికి చెందిన లెబనాన్ మూలాలున్న అమెరికన్ రచయిత కహ్‌లిల్ గిబ్రాన్ తన ‘పెళ్లి’కవితలో తొలి సారిగా ప్రస్తావించారు. భా ర్యభర్తలు ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ తమ అహం కిరీటం కిందపడొద్దనే కారణంగా తమ మాటే నెగ్గాలనే మొండిపట్టుదలతో చిన్నపాటి వాగ్వాదాలకు దిగుతారు. తర్వాత బాధపడతారు. మళ్లీ అంతా సర్దుకోవడానికి కాస్తంత సమ యం పడుతుంది.
ఇప్పుడున్న ఆధునిక యుగంలో భార్యాభర్తలిద్దరూ సొంత కెరీర్‌లకు ప్రాధాన్యతనిస్తున్నారు. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, వృత్తుల్లో నిమగ్నమవుతున్నారు. పని కోసం వేరే చోట ఉండాల్సి రావడం, వ్యక్తిగత అభిప్రాయాలకు గౌరవించాల్సి రావడం, అన్యోన్యంగా ఉన్నాసరే కొన్నిసార్లు వ్యక్తిగత ఏకాంతం(పర్సనల్ స్పేస్) కోరుకోవడం వంటివి జరుగుతున్నాయి. వీటికి పరిష్కార మార్గంగా జంటలే తమకు తాముగా ఎల్‌ఏటీకి జై కొడుతున్నాయి. చినికిచినికి గాలివాన దుమారంగా మారే ప్రమాదాలను దూరం దూరంగా ఉండటం వల్ల తప్పించుకోవచ్చని జంటలు భావిస్తున్నాయి.
ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇస్తూనే ఇలా దూరంగా ఉంటూ మానసికంగా అత్యంత దగ్గరగా ఉంటున్నామని ఎల్‌ఏటీ జంటలు చెబుతున్నాయి. ‘‘సాన్నిహిత్యంలోనూ కా స్తంత ఎడం ఉంచుదాం. ఈ స్వల్ప దూరా ల్లోనే స్వర్గలోకపు మేఘాల స్పర్శను స్పశిద్దాం’’అంటూ జంటలు పాటలు పాడుకుంటున్నాయని కవి గిబ్రాన్ ఆనాడే అన్నారు.
ఎవరికి బాగా నప్పుతుంది?
వేర్వేరు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే జంటలు ఈ సిద్ధాంతాన్ని ఆచరించి మంచి ఫలితాలు పొందొచ్చు. ముఖ్యమైన పనుల మీద దూరంగా, విదేశాల్లో గడపాల్సిన జంటలు ఈ మార్గంలో వెళ్లొచ్చు. వ్యక్తిగత ఏకాంతం కోరుకుంటూనే జీవిత భాగస్వామికి అత్యంత విలువ ఇచ్చే జంటలూ ఈ సిద్ధాంతం తమకు ఆమోదయోగ్యమేనని చెబుతున్నాయి. వేర్వేరు కార్యాలయాలు, భిన్న వృత్తుల్లో, విభిన్న సమయాల్లో పనిచేసే జంటలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భాగస్వామికి అతిభారంగా మారకూడదని, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడదామని భావించే జంటలూ ఈ ట్రెండ్‌ను ఫాలో కావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్
ఎలా సాధ్యం?
కథలు, సినిమాల్లో, నవలల్లో ప్రస్తావించినట్లు దూరంగా ఉన్నప్పుడు ప్రేమికులను విరహవేదన కాల్చేస్తుంది. అదే వేదన ఈ జంటలకు ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. కలిసిమెలిసి ఉంటేనే బంధం బలపడుతుందన్న భావనకు భిన్నమైన సిద్ధాంతం ఇది. కాస్తంత కష్టపడితే ఈ బంధాన్నీ పటిష్టపరుచుకోవచ్చని మనోవిజ్ఞాన నిపుణులు చెప్పారు. ‘‘వారాంతాలు, సెలవు దినాల్లో ఒకరి నివాస స్థలానికి ఇంకొకరు వచ్చి ఆ కాస్త సమయం అత్యంత అన్యోన్యంగా గడిపివెళ్తే చాలు. తమ మధ్య దూరం ఉందనే భావన చటక్కున మటుమాయం అవుతుంది.
కలిసి ఉన్నప్పటి సరదా సంగతులు, మధుర స్మృతులను మాత్రమే టెక్ట్స్ రూపంలో సందేశాలు పంపుతూ గుర్తుచేసుకుంటూ ప్రేమ వారధికి మరింత గట్టిదనం కల్పించొచ్చు. కలిసి ఉన్నప్పుడు జరిగిన గొడవలను భూతద్దంలోంచి చూడటం మానేయాలి. ఆధునిక జంటల్లో స్వతంత్ర భావాలు ఎక్కువ. గతంతో పోలిస్తే వ్యక్తిగత ఏకాంతం ఎక్కువ కోరుకుంటారు. జీవిత భాగస్వామి ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పాత, చేదు విషయాలను తవ్వుకోవడం తగ్గించాలి’’అని ఢిల్లీలోని ఎల్‌ఏటీ నిపుణుడు రుచీ రూహ్, మానసిక నిపుణుడు, జంటల మధ్య మనస్పర్థలను తగ్గించే డాక్టర్ నిషా ఖన్నా సూచించారు.
చివరగా చెప్పేదేమంటే?
విడివిడిగా జీవించే సమయాల్లో ఇద్దరి మధ్యా నమ్మకం అనేది అత్యంత కీలకం. ఆర్థిక, శారీరక, మానసిక అంశాలను నిజాయతీగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడుకుని కష్టాల కడలిలోనూ జీవననావ సాఫీగా సాగేలా చూసుకోవాలి. ఎప్పుడు కలవాలి? ఎక్కడ కలవాలి? ఎంతసేపు కలవాలి? ఏమేం చేయాలి? అనేవి ముందే మాట్లాడుకుంటే వేచి చూడటం వంటి ఉండవు. అనవసర కోపాలు, అపార్థాలు రావు. భారత్‌లో బ్రతుకు దెరువు కోసం లక్షలాది కుటుంబాల్లో పురుషులు వేరే జిల్లాలు, రాష్ట్రాలకు వలసవెళ్తూ భార్యను గ్రామాల్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నారు.
విశాల దృక్పథం, మానసిక పరిణతి కోణంలో చూస్తే భారత్‌లో దశాబ్దాలుగా ఎల్‌ఏటీ సంస్కృతి ఉందనే చెప్పాలి. ప్రత్యేకంగా పేరు పెట్టకపోయినా నోయిడా, గుర్గావ్, ఢిల్లీ, ముంబైలలో ఇద్దరూ పనిచేసే చాలా జంటలు ఇదే సంస్కృతిని ఆచరిస్తున్నాయి. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, సొంతూర్లలో వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతల కారణంగా మెట్రో నగరాల్లో చాలా జంటలు దూరంగా ఉంటున్నాయి. పశ్చిమదేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి బాగా విస్తరిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment