Gibran
-
కలిసే దూరంగా ఉందాం!
పెళ్లయిన కొత్తలో ఆమె ఏం చెప్పినా, చేసినా అతనికి ఎంతో ఇష్టం. ఇద్దరికీ నచ్చిన ఫుడ్, నచ్చిన రంగు, నచ్చిన హాలిడే వెకేషన్. కొన్నాళ్లు గడిచాక సీన్ రివర్స్. ఏం చేసినా తప్పే. చేయకపోయినా తప్పే. టాయిలెట్ కమోడ్ మూత వేయకపోతే మాటల యుద్ధం. మంచంపై తడిసిన తువ్వాలు కనిపిస్తే పెద్ద వాగ్వాదం. ఏసీ నంబర్ పెంచినా, తగ్గించినా పట్టరానంత కోపాలు. పెద్దలు కుదిర్చిన పెళ్లికావొచ్చు మనసులు కలిపిన ప్రేమ వివాహం కావొచ్చు. కీచులాటలు కామన్. ఇలా కొట్టుకుంటూ కలిసుండే బదులు విడిపోతే బాగుండు అనే జంటలు కోకొల్లలు. శాశ్వతంగా విడిపోకుండా దూరం దూరంగా వేర్వేరు ఇళ్లలో ఉంటూ ఒకరికిపై మరొకరు గాఢమైన ప్రేమానుబంధాలను పెంచుకునే కొత్త ధోరణి ఇప్పుడు మొగ్గ తొడిగి వేగంగా విస్తరిస్తోంది. దీనికే ఇప్పుడు చాలా జంటలు ‘దూరంగా కలిసి బతకడం( లివింగ్ అపార్ట్ టుగెదర్ ) అనే కొత్త పేరు పెట్టి ఆచరిస్తున్నాయి. ఈ నయా ట్రెండ్‌లోని విశేషాలను తెల్సుకునేందుకు ఆయా జంటల జీవితాల్లోకి ఓసారి తొంగిచూద్దాం.. ఏమిటీ ఎల్ఏటీ? లివింగ్ అపార్ట్ టుగెదర్ (ఎల్ఏటీ) గురించి 19వ శతాబ్దానికి చెందిన లెబనాన్ మూలాలున్న అమెరికన్ రచయిత కహ్లిల్ గిబ్రాన్ తన ‘పెళ్లి’కవితలో తొలి సారిగా ప్రస్తావించారు. భా ర్యభర్తలు ఒకరిపై మరొకరికి ఎనలేని ప్రేమానురాగాలు ఉన్నప్పటికీ తమ అహం కిరీటం కిందపడొద్దనే కారణంగా తమ మాటే నెగ్గాలనే మొండిపట్టుదలతో చిన్నపాటి వాగ్వాదాలకు దిగుతారు. తర్వాత బాధపడతారు. మళ్లీ అంతా సర్దుకోవడానికి కాస్తంత సమ యం పడుతుంది.ఇప్పుడున్న ఆధునిక యుగంలో భార్యాభర్తలిద్దరూ సొంత కెరీర్లకు ప్రాధాన్యతనిస్తున్నారు. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, వృత్తుల్లో నిమగ్నమవుతున్నారు. పని కోసం వేరే చోట ఉండాల్సి రావడం, వ్యక్తిగత అభిప్రాయాలకు గౌరవించాల్సి రావడం, అన్యోన్యంగా ఉన్నాసరే కొన్నిసార్లు వ్యక్తిగత ఏకాంతం(పర్సనల్ స్పేస్) కోరుకోవడం వంటివి జరుగుతున్నాయి. వీటికి పరిష్కార మార్గంగా జంటలే తమకు తాముగా ఎల్ఏటీకి జై కొడుతున్నాయి. చినికిచినికి గాలివాన దుమారంగా మారే ప్రమాదాలను దూరం దూరంగా ఉండటం వల్ల తప్పించుకోవచ్చని జంటలు భావిస్తున్నాయి.ఒకరి అభిప్రాయాలకు మరొకరు గౌరవం ఇస్తూనే ఇలా దూరంగా ఉంటూ మానసికంగా అత్యంత దగ్గరగా ఉంటున్నామని ఎల్ఏటీ జంటలు చెబుతున్నాయి. ‘‘సాన్నిహిత్యంలోనూ కా స్తంత ఎడం ఉంచుదాం. ఈ స్వల్ప దూరా ల్లోనే స్వర్గలోకపు మేఘాల స్పర్శను స్పశిద్దాం’’అంటూ జంటలు పాటలు పాడుకుంటున్నాయని కవి గిబ్రాన్ ఆనాడే అన్నారు. ఎవరికి బాగా నప్పుతుంది?వేర్వేరు చోట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు చేసే జంటలు ఈ సిద్ధాంతాన్ని ఆచరించి మంచి ఫలితాలు పొందొచ్చు. ముఖ్యమైన పనుల మీద దూరంగా, విదేశాల్లో గడపాల్సిన జంటలు ఈ మార్గంలో వెళ్లొచ్చు. వ్యక్తిగత ఏకాంతం కోరుకుంటూనే జీవిత భాగస్వామికి అత్యంత విలువ ఇచ్చే జంటలూ ఈ సిద్ధాంతం తమకు ఆమోదయోగ్యమేనని చెబుతున్నాయి. వేర్వేరు కార్యాలయాలు, భిన్న వృత్తుల్లో, విభిన్న సమయాల్లో పనిచేసే జంటలకు ఈ విధానం ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. భాగస్వామికి అతిభారంగా మారకూడదని, ఆర్థికంగా సొంత కాళ్లపై నిలబడదామని భావించే జంటలూ ఈ ట్రెండ్‌ను ఫాలో కావొచ్చు. – సాక్షి, నేషనల్ డెస్క్ ఎలా సాధ్యం?కథలు, సినిమాల్లో, నవలల్లో ప్రస్తావించినట్లు దూరంగా ఉన్నప్పుడు ప్రేమికులను విరహవేదన కాల్చేస్తుంది. అదే వేదన ఈ జంటలకు ఉంటుందని మానసిక నిపుణులు చెబుతున్నారు. కలిసిమెలిసి ఉంటేనే బంధం బలపడుతుందన్న భావనకు భిన్నమైన సిద్ధాంతం ఇది. కాస్తంత కష్టపడితే ఈ బంధాన్నీ పటిష్టపరుచుకోవచ్చని మనోవిజ్ఞాన నిపుణులు చెప్పారు. ‘‘వారాంతాలు, సెలవు దినాల్లో ఒకరి నివాస స్థలానికి ఇంకొకరు వచ్చి ఆ కాస్త సమయం అత్యంత అన్యోన్యంగా గడిపివెళ్తే చాలు. తమ మధ్య దూరం ఉందనే భావన చటక్కున మటుమాయం అవుతుంది.కలిసి ఉన్నప్పటి సరదా సంగతులు, మధుర స్మృతులను మాత్రమే టెక్ట్స్ రూపంలో సందేశాలు పంపుతూ గుర్తుచేసుకుంటూ ప్రేమ వారధికి మరింత గట్టిదనం కల్పించొచ్చు. కలిసి ఉన్నప్పుడు జరిగిన గొడవలను భూతద్దంలోంచి చూడటం మానేయాలి. ఆధునిక జంటల్లో స్వతంత్ర భావాలు ఎక్కువ. గతంతో పోలిస్తే వ్యక్తిగత ఏకాంతం ఎక్కువ కోరుకుంటారు. జీవిత భాగస్వామి ఆలోచనలకు విలువ ఇవ్వాలి. పాత, చేదు విషయాలను తవ్వుకోవడం తగ్గించాలి’’అని ఢిల్లీలోని ఎల్ఏటీ నిపుణుడు రుచీ రూహ్, మానసిక నిపుణుడు, జంటల మధ్య మనస్పర్థలను తగ్గించే డాక్టర్ నిషా ఖన్నా సూచించారు. చివరగా చెప్పేదేమంటే? విడివిడిగా జీవించే సమయాల్లో ఇద్దరి మధ్యా నమ్మకం అనేది అత్యంత కీలకం. ఆర్థిక, శారీరక, మానసిక అంశాలను నిజాయతీగా, నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా మాట్లాడుకుని కష్టాల కడలిలోనూ జీవననావ సాఫీగా సాగేలా చూసుకోవాలి. ఎప్పుడు కలవాలి? ఎక్కడ కలవాలి? ఎంతసేపు కలవాలి? ఏమేం చేయాలి? అనేవి ముందే మాట్లాడుకుంటే వేచి చూడటం వంటి ఉండవు. అనవసర కోపాలు, అపార్థాలు రావు. భారత్‌లో బ్రతుకు దెరువు కోసం లక్షలాది కుటుంబాల్లో పురుషులు వేరే జిల్లాలు, రాష్ట్రాలకు వలసవెళ్తూ భార్యను గ్రామాల్లో ఒంటరిగా వదిలి వెళ్తున్నారు.విశాల దృక్పథం, మానసిక పరిణతి కోణంలో చూస్తే భారత్‌లో దశాబ్దాలుగా ఎల్ఏటీ సంస్కృతి ఉందనే చెప్పాలి. ప్రత్యేకంగా పేరు పెట్టకపోయినా నోయిడా, గుర్గావ్, ఢిల్లీ, ముంబైలలో ఇద్దరూ పనిచేసే చాలా జంటలు ఇదే సంస్కృతిని ఆచరిస్తున్నాయి. వేర్వేరు చోట్ల ఉద్యోగాలు, సొంతూర్లలో వృద్ధ తల్లిదండ్రుల బాగోగులు చూసుకోవాల్సిన బాధ్యతల కారణంగా మెట్రో నగరాల్లో చాలా జంటలు దూరంగా ఉంటున్నాయి. పశ్చిమదేశాల్లో ఇప్పుడిప్పుడే ఈ సంస్కృతి బాగా విస్తరిస్తోంది. -
విశ్వరూపం-2 ట్రైలర్ విడుదల
కమలహాసన్ ‘విశ్వరూపం’ సినిమాతో తన నట విశ్వరూపాన్ని చూపారు. ఈ యూనివర్సల్ హీరోకు విశ్వరూపం విడుదల విషయంలో ఎన్నో అడ్డంకులు ఏర్పడ్డాయి. ఎన్నో వివాదాల నడుమ విడుదలైన ఈ సినిమా ఘన విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ మూవీకి సీక్వెల్‌గా విశ్వరూపం 2 సినిమాను తెరకెక్కిస్తానని గతంలో ప్రకటించిన విషయం తెలిసిందే. అయితే ఎప్పుడో విడుదల కావల్సిన ‘విశ్వరూపం 2’ అనివార్య కారణాల వల్ల ఆలస్యమవుతూ వచ్చింది. తాజాగా ఈ సినిమా ట్రైలర్‌ను హిందీలో ఆమీర్ ఖాన్, తమిళ్లో శృతి హాసన్, తెలుగులో యంగ్ టైగర్ ఎన్టీఆర్ విడుదల చేశారు. ‘ఏ ఒక్క మతానికో కట్టుబడటం తప్పుకాదు.. దేశ ద్రోహం మాత్రం తప్పు’ అంటూ చెప్పిన డైలాగ్ ట్రైలర్లో ఆకట్టుకుంటోంది. ట్రైలర్లో చూపిన పోరాట సన్నివేశాలు ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉన్నాయి. జిబ్రాన్ అందించిన సంగీతం, నేపథ్య సంగీతం అదిరిపోయేలా ఉన్నాయి. ట్రైలర్ విజువల్ పరంగానూ ప్రేక్షకులను కట్టిపడేసేలా ఉంది. మరి ఈ సినిమాతో కమల్‌హాసన్‌కు భారీ విజయాన్ని అందుకుంటారో లేదో వేచి చూడాలి. కమల్ స్వీయ దర్శకత్వంలో ఆగస్టు 10న రాబోతున్న ఈ సినిమాలో ప్రియా, ఆండ్రియా కీలకపాత్రల్లో నటిస్తున్నారు. -
దేశద్రోహం మాత్రం తప్పు
-
సినిమా రివ్యూ: కాస్త... ముందుకు! మరికాస్త... వెనక్కు!!
కొత్త దర్శకులు, కొత్త తరం కథకులు వస్తున్నప్పుడు వెండితెర కొత్తగా వెలుగులీనే అవకాశం ఉంటుందని చిన్న ఆశ ఉంటుంది. వాళ్ళ సినిమా వస్తోందంటే, కొత్తదనం కోరుకొనేవారికి ఎదురుచూపులుంటాయి. లఘు చిత్రాల ద్వారా మొదలుపెట్టి ఫీచర్ ఫిల్మ్‌కు ఎదిగిన దర్శకుడు సుజీత్ ‘రన్ రాజా రన్’ విషయంలోనూ అదే జరిగింది. కథ ఏమిటంటే... రాజా (శర్వానంద్) ఓ కూరగాయల వ్యాపారి కొడుకు. నగర పోలీస్ కమిషనర్ దిలీప్ (సంపత్‌రాజ్) కూతురు ప్రియ (శీరత్ కపూర్)ను ప్రేమిస్తాడు. మరోపక్క నగరంలో వరుసగా జరుగుతున్న ప్రముఖుల కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. ఆ కిడ్నాప్‌ల గుట్టు ఛేదించడానికి కమిషనర్ కుస్తీ పడుతుంటాడు. అతని కూతుర్ని ప్రేమించానంటూ వెళ్ళిన హీరోకు కమిషనర్ ఓ కిడ్నాప్ డ్రామా పని అప్పజెపుతాడు. హీరోయిన్నే కిడ్నాప్ చేస్తాడు హీరో. ఆ తరువాత కథేమిటన్నది రకరకాల ట్విస్టుల మధ్య సాగే సినిమా. ఎక్కువగా వినోదాత్మక ఫక్కీలో నడపాలని దర్శకుడు బలవంతాన ప్రయత్నించిన ఈ సినిమాలో హీరో శర్వానంద్ చూడడానికి బాగున్నాడు. అయితే, కొన్నిచోట్ల హెయిర్‌స్టైల్‌లో, హావభావాల్లో తమిళ సూర్యను అనుసరించినట్లు అర్థమైపోతుంటుంది. ఇక, హీరోయిన్ శీరత్ కపూర్ కొత్తమ్మాయి. అభినయంతో పాటు అందమూ తక్కువే. అభినయం తక్కువైనా కథ రీత్యా అడివి శేషుది మరో ముఖ్యపాత్ర. కమిషనర్‌గా సంపత్‌రాజ్, హీరో తండ్రిగా వి. జయప్రకాశ్ అలవాటైన తమిళ ప్రాంతీయ సినీశైలిలో ఫరవాలేదనిపిస్తారు. ఎలా ఉందంటే... తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా విడుదల చేయాలనో ఏమో అక్కడి నటులనూ తీసుకున్నారు. వీలున్నప్పుడల్లా హాలులో రజనీకాంత్ నామస్మరణ వినిపిస్తుంది. తమిళ హీరో కార్తి తదితరుల పోస్టర్లూ కనిపిస్తాయి. తమిళ ఫక్కీ సినీ కథన ధోరణి సరేసరి. మది ఛాయాగ్రహణం, గిబ్రాన్ సంగీతం కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా పాటల చిత్రీకరణ బాగుంది. ఇప్పటికే పాపులరైన ‘అనగనగనగా అమ్మాయుందిరా’ పాట (రచన శ్రీమణి) చిత్రీకరణ, విలక్షణమైన గొంతు (గోల్డ్ దేవరాజ్)తో పాడించిన తీరు ఆకట్టుకుంటాయి. రామజోగయ్య రాసిన మెలోడీ ‘వద్దంటూనే’ గాయని చిన్మయి గొంతులో వినడానికీ, తెరపై చూడడానికీ బాగుంది. పాటల్లో గొంతులు కొత్తగా అనిపిస్తాయి. అక్కడక్కడ డైలాగ్స నవ్విస్తాయి. కాస్త...కాలక్షేపం! చాలా... కాలహరణం! ప్రథమార్ధం కాలహరణంగా నడిచే సినిమా, సెకండాఫ్‌లో ఫక్తు కాలక్షేపంగా ఫరవాలేదనిపిస్తుంది. కానీ, చివరకొచ్చేసరికి ఆ భావన కూడా బలంగా నిలబడదు. దర్శకుడి అనుభవ రాహిత్యం వల్లనో, లేక అది వినోదమని భ్రమపడడం వల్లనో ఏమో, కథకు అక్కరలేని సన్నివేశాలు కూడా సినిమాలోకి తరచూ చొచ్చుకు వచ్చేస్తుంటాయి. వాటిని స్క్రిప్టు దశలో కాకపోయినా, ఎడిటింగ్ టేబుల్ మీదైనా కత్తిరించుకోవాల్సింది. పోలీసు కమిషనర్, మంత్రి, ఎమ్మెల్యే - ఇలా అందరూ బఫూన్ల లాగా వ్యవహరిస్తారు. ప్రత్యర్థిని అడ్డుకొనేందుకు ఈ వీరశూరసేనులు చేసిందేమీ కనిపించదు. దాంతో, కథలో పాత్రల మధ్య ఆసక్తికరమైన సంఘర్షణ ఏదీ లేకుండా పోయింది. చిత్ర నిర్మాణ విలువలు గణనీయంగానే ఉన్న సినిమా ఇది. రొమాంటిక్ కథగా మొదలై సమాంతరంగా సస్పెన్స్‌ను కొనసాగించి, చివరకొచ్చేసరికి రొటీన్ పగ- ప్రతీకారాల వ్యవహారంగా తేల్చేయడంతో ఈ కథ ఓ పట్టాన సంతృప్తినివ్వదు. కూరగాయలమ్మే వాడి కొడుకు ఇంత ఆధునికంగా ఉన్నాడేమిటి, ఫలానా పాత్ర ఫలానాలా ప్రవర్తిస్తోందేమిటి లాంటి సందేహాలొస్తాయి. చివరలో వాటన్నిటికీ లాజిక్‌లు చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైపోయింది. కొత్తదనం కోసం మరీ విపరీతమైన ట్విస్టులు పెట్టేస్తే ఇబ్బందేనని కథ, కథనం తేల్చేస్తాయి. వెరసి, బాగోగులు రెండూ ఉన్న ఈ చిత్రం జనాన్ని పరిగెత్తించేది ఎటువైపో? తారాగణం: శర్వానంద్, శీరత్ కపూర్, ఎడిటింగ్: మధు, నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుజీత్ బలాలు: కథను వినూత్నంగా చెప్పాలన్న ప్రయత్నం శర్వానంద్ నటన కొత్తగా ధ్వనించే గిబ్రాన్ సంగీతం, గాయకుల గొంతు మది కెమేరా పనితనం, పాటల చిత్రీకరణ బలహీనతలు: సాగదీత కథనశైలి గందరగోళపెట్టే అతి ట్విస్టులు, ఆఖరికి రోలింగ్ టైటిల్స్‌లోనూ సా...గిన కథ ఆఖరుకు పగ, ప్రతీకారాల కథగా మిగలడం పాత్రలు ఎప్పుడుపడితే అప్పుడొచ్చి, వెళ్ళిపోతుండే సీన్లు మొద్దుబారిన ఎడిటింగ్ కత్తెర హీరోయిన్ - రెంటాల జయదేవ -
సినిమా రివ్యూ: రన్ రాజా రన్
నటీనటులు: శర్వానంద్, సీరత్ కపూర్, సంపత్, జయప్రకాశ్, అడివి శేషు, విద్యుల్లేఖ రామన్, కోట శ్రీనివాసరావు తదితరులు. సంగీతం: జిబ్రాన్ కెమెరా: మధి నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి దర్శకత్వం: సుజిత్ ప్రస్థానం, జర్ని లాంటి చిత్రాలతో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్, సీరత్ కపూర్ లు జంటగా దర్శకుడు సుజిత్ రూపొందించిన చిత్రం 'రన్ రాజా రన్'. కిడ్నాప్ డ్రామాకు ప్రేమ కథను జోడించి ఓ యూత్ ఫుల్ చిత్రంగా ప్రేక్షకులకు అందించిన 'రన్ రాజా రన్' ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ఉందా అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. హైదరాబాద్ నగరంలో ప్రముఖులు మాస్క్ ల పెట్టుకుని ఓ ముఠా వరుస కిడ్నాప్ లు సంచలనం సృష్టిస్తుంటాయి. కిడ్నాప్ ముఠాను పట్టుకునేందుకు దిలీప్ (సంపత్ రాజ్) అనే పోలీస్ కమిషనర్ కు కేసును అప్పగిస్తారు. కథ అలా సాగతుండగా అల్లరి చిల్లరిగా తిరుగుతూ.. చాలా మంది అమ్మాయిలతో లవ్ బ్రేక్ ఆప్ లతో విసిగిపోయిన రాజా హరిశ్చందప్రసాద్ (శర్వానంద్)తో పోలీస్ కమిషనర్ కూతురు ప్రియ (సీరత్ కపూర్) ప్రేమలో పడుతుంది. రాజా, ప్రియల ప్రేమ వ్యవహారం తనకు నచ్చకపోయినా పోలీస్ కమిషనర్ ఒప్పకున్నట్టు నటిస్తాడు. ప్రియ నుంచి దూరం చేయడానికి రాజాను కిడ్నాప్ డ్రామా ఆడాలని ఓ కండిషన్ పెడుతాడు. ప్రియ ప్రేమ కోసం రాజా ఒప్పుకున్నట్టు నటించినా అసలు కారణం మరోకటి అనేది ఈ చిత్రంలో ఓట్విస్ట్. కిడ్నాప్ డ్రామా ఆడేందుకు రాజా ఎందుకు ఒప్పుకున్నాడు? రాజా కిడ్నాప్ వ్యవహారం సఫలమైందా? పోలీస్ కమిషనర్ దిలీప్ కిడ్నాప్ ముఠాను పట్టుకున్నారా? కిడ్నాప్ లకు పాల్పడుతున్నది ఎవరు? అనే పలు సందేహాలను ప్రేక్షకులు కల్పించి దర్శకుడు చెప్పిన సమాధానాలే 'రన్ రాజా రన్'. రాజా పాత్రలో శర్వానంద్ మంచి జోష్ ఉన్న యువకుడిగా కనిపించాడు. స్టైల్స్ తో శర్వానంద్ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా కనిపించాడు. స్టైల్స్ తోపాటు యాక్టింగ్ పరంగా కూడా మంచి ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యువ హీరోల పోటీలో శర్వానంద్ కు ఈ చిత్రం మరింత పేరు సంపాదించి పెడుతుందని చెప్పవచ్చు. ప్రియగా కనిపించిన సీరత్ కపూర్ అందంతోనూ, అభినయంతోనూ మెప్పించింది. సీరత్ కపూర్ అందచందాలు కనువిందు చేశాయనే చెప్పవచ్చు. గ్లామర్ తారగా సీరత్ కపూర్ రాణించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి సీరత్ గ్లామర్ అదనపు ఆకర్షణ. పోలీస్ కమిషనర్ గా సంపత్ తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనించాడు. శర్వానంద్ తండ్రిగా జయప్రకాశ్ ది ఓ ముఖ్యమైన పాత్రే. సంపత్, జయప్రకాశ్ లు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. కోట శ్రీనివాసరావు పాత్ర రొటీన్ గానే ఉంది. టెక్నికల్: మిర్చి చిత్రానికి ఫొటోగ్రఫినందించిన మధి మరోసారి తన సత్తాను చూపించాడు. ఈ చిత్రంలో మధి అందించిన ఫొటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శర్వానంద్, సీరత్ కపూర్ లను గ్లామర్ గా చూపించాడు. ప్రతి ఫ్రేమ్ లోను కలర్స్ వినియోగించిన తీరు బాగుంది. యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లను తెరకెక్కించిన విధానం 'రన్ రాజా రన్'కు హైలెట్ నిలుస్తాయని చెప్పవచ్చు. రాజ్ సుందరం అందించిన కోరియోగ్రఫీ పాటలకు మరింత ట్రేండిగా మార్చాయి. కిడ్నాప్ కథ బ్యాక్ డ్రాప్ గా 'రన్ రాజా రన్'ను ఓ అందమైన ప్రేమ కథగా మలచడంలో దర్శకుడు సుజీత్ కొంతమేరకు సఫలమయ్యాడనే చెప్పవచ్చు. అయితే కథనంలో వేగం మందగించడం కారణంగా మధ్య, మధ్యలో కొంత ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కోసమే కథను సా...గదీశాడా అనే కోణం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తెలుగు, తమిళ, హిందీ హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్ల మాస్క్ లతో వెరైటీగా కిడ్నాప్ ముఠాను దర్శకుడు వెరైటీగా డిజైన్ చేసిన తీరు ప్రశంసనీయం. చిత్ర ఫస్టాఫ్, సెకండాఫ్ లో నిడివి ఎక్కువగా ఉండటం వలన కథలో వేగానికి కళ్లెం వేసిందనే ఫీలింగ్ కలుగుతుంది. చిత్ర నిడివిని తగ్గించడానికి ఎడిటింగ్ విభాగంపై మరికొంత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపించింది. ప్రమోద్, కృష్ణారెడ్డిల నిర్మాణాత్మక విలువులు బాగున్నాయి.