సినిమా రివ్యూ: కాస్త... ముందుకు! మరికాస్త... వెనక్కు!! | run raja run will sharvanands run reach the audinece | Sakshi
Sakshi News home page

సినిమా రివ్యూ: కాస్త... ముందుకు! మరికాస్త... వెనక్కు!!

Published Sat, Aug 2 2014 1:14 AM | Last Updated on Sat, Sep 2 2017 11:14 AM

సినిమా రివ్యూ: కాస్త... ముందుకు! మరికాస్త... వెనక్కు!!

సినిమా రివ్యూ: కాస్త... ముందుకు! మరికాస్త... వెనక్కు!!

కొత్త దర్శకులు, కొత్త తరం కథకులు వస్తున్నప్పుడు వెండితెర కొత్తగా వెలుగులీనే అవకాశం ఉంటుందని చిన్న ఆశ ఉంటుంది. వాళ్ళ సినిమా వస్తోందంటే, కొత్తదనం కోరుకొనేవారికి ఎదురుచూపులుంటాయి. లఘు చిత్రాల ద్వారా మొదలుపెట్టి ఫీచర్ ఫిల్మ్‌కు ఎదిగిన దర్శకుడు సుజీత్ ‘రన్ రాజా రన్’ విషయంలోనూ అదే జరిగింది.
 
కథ ఏమిటంటే... రాజా (శర్వానంద్) ఓ కూరగాయల వ్యాపారి కొడుకు. నగర పోలీస్ కమిషనర్ దిలీప్ (సంపత్‌రాజ్) కూతురు ప్రియ (శీరత్ కపూర్)ను ప్రేమిస్తాడు. మరోపక్క నగరంలో వరుసగా జరుగుతున్న ప్రముఖుల కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. ఆ కిడ్నాప్‌ల గుట్టు ఛేదించడానికి కమిషనర్ కుస్తీ పడుతుంటాడు. అతని కూతుర్ని ప్రేమించానంటూ వెళ్ళిన హీరోకు కమిషనర్ ఓ కిడ్నాప్ డ్రామా పని అప్పజెపుతాడు. హీరోయిన్‌నే కిడ్నాప్ చేస్తాడు హీరో. ఆ తరువాత కథేమిటన్నది రకరకాల ట్విస్టుల మధ్య సాగే సినిమా.
 
ఎక్కువగా వినోదాత్మక ఫక్కీలో నడపాలని దర్శకుడు బలవంతాన ప్రయత్నించిన ఈ సినిమాలో హీరో శర్వానంద్ చూడడానికి బాగున్నాడు. అయితే, కొన్నిచోట్ల హెయిర్‌స్టైల్‌లో, హావభావాల్లో తమిళ సూర్యను అనుసరించినట్లు అర్థమైపోతుంటుంది. ఇక, హీరోయిన్ శీరత్ కపూర్ కొత్తమ్మాయి. అభినయంతో పాటు అందమూ తక్కువే. అభినయం తక్కువైనా కథ రీత్యా అడివి శేషుది మరో ముఖ్యపాత్ర. కమిషనర్‌గా సంపత్‌రాజ్, హీరో తండ్రిగా వి. జయప్రకాశ్ అలవాటైన తమిళ ప్రాంతీయ సినీశైలిలో ఫరవాలేదనిపిస్తారు.
 
ఎలా ఉందంటే... తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా విడుదల చేయాలనో ఏమో అక్కడి నటులనూ తీసుకున్నారు. వీలున్నప్పుడల్లా హాలులో రజనీకాంత్ నామస్మరణ వినిపిస్తుంది. తమిళ హీరో కార్తి తదితరుల పోస్టర్లూ కనిపిస్తాయి. తమిళ ఫక్కీ సినీ కథన ధోరణి సరేసరి. మది ఛాయాగ్రహణం, గిబ్రాన్ సంగీతం కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా పాటల చిత్రీకరణ బాగుంది. ఇప్పటికే పాపులరైన ‘అనగనగనగా అమ్మాయుందిరా’ పాట (రచన శ్రీమణి) చిత్రీకరణ, విలక్షణమైన గొంతు (గోల్డ్ దేవరాజ్)తో పాడించిన తీరు ఆకట్టుకుంటాయి. రామజోగయ్య రాసిన మెలోడీ ‘వద్దంటూనే’ గాయని చిన్మయి గొంతులో వినడానికీ, తెరపై చూడడానికీ బాగుంది. పాటల్లో గొంతులు కొత్తగా అనిపిస్తాయి. అక్కడక్కడ డైలాగ్‌‌స నవ్విస్తాయి.
 
కాస్త...కాలక్షేపం! చాలా... కాలహరణం! ప్రథమార్ధం కాలహరణంగా నడిచే సినిమా, సెకండాఫ్‌లో ఫక్తు కాలక్షేపంగా ఫరవాలేదనిపిస్తుంది. కానీ, చివరకొచ్చేసరికి ఆ భావన కూడా బలంగా నిలబడదు. దర్శకుడి అనుభవ రాహిత్యం వల్లనో, లేక అది వినోదమని భ్రమపడడం వల్లనో ఏమో, కథకు అక్కరలేని సన్నివేశాలు కూడా సినిమాలోకి తరచూ చొచ్చుకు వచ్చేస్తుంటాయి. వాటిని స్క్రిప్టు దశలో కాకపోయినా, ఎడిటింగ్ టేబుల్ మీదైనా కత్తిరించుకోవాల్సింది. పోలీసు కమిషనర్, మంత్రి, ఎమ్మెల్యే - ఇలా అందరూ బఫూన్ల లాగా వ్యవహరిస్తారు.

ప్రత్యర్థిని అడ్డుకొనేందుకు ఈ వీరశూరసేనులు చేసిందేమీ కనిపించదు. దాంతో, కథలో పాత్రల మధ్య ఆసక్తికరమైన సంఘర్షణ ఏదీ లేకుండా పోయింది. చిత్ర నిర్మాణ విలువలు గణనీయంగానే ఉన్న సినిమా ఇది. రొమాంటిక్ కథగా మొదలై సమాంతరంగా సస్పెన్స్‌ను కొనసాగించి, చివరకొచ్చేసరికి రొటీన్ పగ- ప్రతీకారాల వ్యవహారంగా తేల్చేయడంతో ఈ కథ ఓ పట్టాన సంతృప్తినివ్వదు. కూరగాయలమ్మే వాడి కొడుకు ఇంత ఆధునికంగా ఉన్నాడేమిటి, ఫలానా పాత్ర ఫలానాలా ప్రవర్తిస్తోందేమిటి లాంటి సందేహాలొస్తాయి. చివరలో వాటన్నిటికీ లాజిక్‌లు చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైపోయింది. కొత్తదనం కోసం మరీ విపరీతమైన ట్విస్టులు పెట్టేస్తే ఇబ్బందేనని కథ, కథనం తేల్చేస్తాయి. వెరసి, బాగోగులు రెండూ ఉన్న ఈ చిత్రం జనాన్ని పరిగెత్తించేది ఎటువైపో?
 
తారాగణం: శర్వానంద్, శీరత్ కపూర్, ఎడిటింగ్: మధు, నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుజీత్

బలాలు:  కథను వినూత్నంగా చెప్పాలన్న ప్రయత్నం  శర్వానంద్ నటన  కొత్తగా ధ్వనించే గిబ్రాన్ సంగీతం, గాయకుల గొంతు   మది కెమేరా పనితనం, పాటల చిత్రీకరణ
 
బలహీనతలు:  సాగదీత కథనశైలి  గందరగోళపెట్టే అతి ట్విస్టులు, ఆఖరికి రోలింగ్ టైటిల్స్‌లోనూ సా...గిన కథ  ఆఖరుకు పగ, ప్రతీకారాల కథగా మిగలడం  పాత్రలు ఎప్పుడుపడితే అప్పుడొచ్చి, వెళ్ళిపోతుండే సీన్లు  మొద్దుబారిన ఎడిటింగ్ కత్తెర  హీరోయిన్
 
 - రెంటాల జయదేవ

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement