Pramod Uppalapati
-
సినిమా రివ్యూ: కాస్త... ముందుకు! మరికాస్త... వెనక్కు!!
కొత్త దర్శకులు, కొత్త తరం కథకులు వస్తున్నప్పుడు వెండితెర కొత్తగా వెలుగులీనే అవకాశం ఉంటుందని చిన్న ఆశ ఉంటుంది. వాళ్ళ సినిమా వస్తోందంటే, కొత్తదనం కోరుకొనేవారికి ఎదురుచూపులుంటాయి. లఘు చిత్రాల ద్వారా మొదలుపెట్టి ఫీచర్ ఫిల్మ్‌కు ఎదిగిన దర్శకుడు సుజీత్ ‘రన్ రాజా రన్’ విషయంలోనూ అదే జరిగింది. కథ ఏమిటంటే... రాజా (శర్వానంద్) ఓ కూరగాయల వ్యాపారి కొడుకు. నగర పోలీస్ కమిషనర్ దిలీప్ (సంపత్‌రాజ్) కూతురు ప్రియ (శీరత్ కపూర్)ను ప్రేమిస్తాడు. మరోపక్క నగరంలో వరుసగా జరుగుతున్న ప్రముఖుల కిడ్నాప్‌లు జరుగుతుంటాయి. ఆ కిడ్నాప్‌ల గుట్టు ఛేదించడానికి కమిషనర్ కుస్తీ పడుతుంటాడు. అతని కూతుర్ని ప్రేమించానంటూ వెళ్ళిన హీరోకు కమిషనర్ ఓ కిడ్నాప్ డ్రామా పని అప్పజెపుతాడు. హీరోయిన్నే కిడ్నాప్ చేస్తాడు హీరో. ఆ తరువాత కథేమిటన్నది రకరకాల ట్విస్టుల మధ్య సాగే సినిమా. ఎక్కువగా వినోదాత్మక ఫక్కీలో నడపాలని దర్శకుడు బలవంతాన ప్రయత్నించిన ఈ సినిమాలో హీరో శర్వానంద్ చూడడానికి బాగున్నాడు. అయితే, కొన్నిచోట్ల హెయిర్‌స్టైల్‌లో, హావభావాల్లో తమిళ సూర్యను అనుసరించినట్లు అర్థమైపోతుంటుంది. ఇక, హీరోయిన్ శీరత్ కపూర్ కొత్తమ్మాయి. అభినయంతో పాటు అందమూ తక్కువే. అభినయం తక్కువైనా కథ రీత్యా అడివి శేషుది మరో ముఖ్యపాత్ర. కమిషనర్‌గా సంపత్‌రాజ్, హీరో తండ్రిగా వి. జయప్రకాశ్ అలవాటైన తమిళ ప్రాంతీయ సినీశైలిలో ఫరవాలేదనిపిస్తారు. ఎలా ఉందంటే... తమిళ, తెలుగు ద్విభాషా చిత్రంగా విడుదల చేయాలనో ఏమో అక్కడి నటులనూ తీసుకున్నారు. వీలున్నప్పుడల్లా హాలులో రజనీకాంత్ నామస్మరణ వినిపిస్తుంది. తమిళ హీరో కార్తి తదితరుల పోస్టర్లూ కనిపిస్తాయి. తమిళ ఫక్కీ సినీ కథన ధోరణి సరేసరి. మది ఛాయాగ్రహణం, గిబ్రాన్ సంగీతం కొత్తగా అనిపిస్తాయి. ముఖ్యంగా పాటల చిత్రీకరణ బాగుంది. ఇప్పటికే పాపులరైన ‘అనగనగనగా అమ్మాయుందిరా’ పాట (రచన శ్రీమణి) చిత్రీకరణ, విలక్షణమైన గొంతు (గోల్డ్ దేవరాజ్)తో పాడించిన తీరు ఆకట్టుకుంటాయి. రామజోగయ్య రాసిన మెలోడీ ‘వద్దంటూనే’ గాయని చిన్మయి గొంతులో వినడానికీ, తెరపై చూడడానికీ బాగుంది. పాటల్లో గొంతులు కొత్తగా అనిపిస్తాయి. అక్కడక్కడ డైలాగ్స నవ్విస్తాయి. కాస్త...కాలక్షేపం! చాలా... కాలహరణం! ప్రథమార్ధం కాలహరణంగా నడిచే సినిమా, సెకండాఫ్‌లో ఫక్తు కాలక్షేపంగా ఫరవాలేదనిపిస్తుంది. కానీ, చివరకొచ్చేసరికి ఆ భావన కూడా బలంగా నిలబడదు. దర్శకుడి అనుభవ రాహిత్యం వల్లనో, లేక అది వినోదమని భ్రమపడడం వల్లనో ఏమో, కథకు అక్కరలేని సన్నివేశాలు కూడా సినిమాలోకి తరచూ చొచ్చుకు వచ్చేస్తుంటాయి. వాటిని స్క్రిప్టు దశలో కాకపోయినా, ఎడిటింగ్ టేబుల్ మీదైనా కత్తిరించుకోవాల్సింది. పోలీసు కమిషనర్, మంత్రి, ఎమ్మెల్యే - ఇలా అందరూ బఫూన్ల లాగా వ్యవహరిస్తారు. ప్రత్యర్థిని అడ్డుకొనేందుకు ఈ వీరశూరసేనులు చేసిందేమీ కనిపించదు. దాంతో, కథలో పాత్రల మధ్య ఆసక్తికరమైన సంఘర్షణ ఏదీ లేకుండా పోయింది. చిత్ర నిర్మాణ విలువలు గణనీయంగానే ఉన్న సినిమా ఇది. రొమాంటిక్ కథగా మొదలై సమాంతరంగా సస్పెన్స్‌ను కొనసాగించి, చివరకొచ్చేసరికి రొటీన్ పగ- ప్రతీకారాల వ్యవహారంగా తేల్చేయడంతో ఈ కథ ఓ పట్టాన సంతృప్తినివ్వదు. కూరగాయలమ్మే వాడి కొడుకు ఇంత ఆధునికంగా ఉన్నాడేమిటి, ఫలానా పాత్ర ఫలానాలా ప్రవర్తిస్తోందేమిటి లాంటి సందేహాలొస్తాయి. చివరలో వాటన్నిటికీ లాజిక్‌లు చెప్పడానికి దర్శకుడు ప్రయత్నించినా అప్పటికే ఆలస్యమైపోయింది. కొత్తదనం కోసం మరీ విపరీతమైన ట్విస్టులు పెట్టేస్తే ఇబ్బందేనని కథ, కథనం తేల్చేస్తాయి. వెరసి, బాగోగులు రెండూ ఉన్న ఈ చిత్రం జనాన్ని పరిగెత్తించేది ఎటువైపో? తారాగణం: శర్వానంద్, శీరత్ కపూర్, ఎడిటింగ్: మధు, నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీకృష్ణారెడ్డి, కథ, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: సుజీత్ బలాలు: కథను వినూత్నంగా చెప్పాలన్న ప్రయత్నం శర్వానంద్ నటన కొత్తగా ధ్వనించే గిబ్రాన్ సంగీతం, గాయకుల గొంతు మది కెమేరా పనితనం, పాటల చిత్రీకరణ బలహీనతలు: సాగదీత కథనశైలి గందరగోళపెట్టే అతి ట్విస్టులు, ఆఖరికి రోలింగ్ టైటిల్స్‌లోనూ సా...గిన కథ ఆఖరుకు పగ, ప్రతీకారాల కథగా మిగలడం పాత్రలు ఎప్పుడుపడితే అప్పుడొచ్చి, వెళ్ళిపోతుండే సీన్లు మొద్దుబారిన ఎడిటింగ్ కత్తెర హీరోయిన్ - రెంటాల జయదేవ -
సినిమా రివ్యూ: రన్ రాజా రన్
నటీనటులు: శర్వానంద్, సీరత్ కపూర్, సంపత్, జయప్రకాశ్, అడివి శేషు, విద్యుల్లేఖ రామన్, కోట శ్రీనివాసరావు తదితరులు. సంగీతం: జిబ్రాన్ కెమెరా: మధి నిర్మాతలు: ప్రమోద్ ఉప్పలపాటి, వంశీ కృష్ణారెడ్డి దర్శకత్వం: సుజిత్ ప్రస్థానం, జర్ని లాంటి చిత్రాలతో కనిపించి ప్రేక్షకులను ఆకట్టుకున్న శర్వానంద్, సీరత్ కపూర్ లు జంటగా దర్శకుడు సుజిత్ రూపొందించిన చిత్రం 'రన్ రాజా రన్'. కిడ్నాప్ డ్రామాకు ప్రేమ కథను జోడించి ఓ యూత్ ఫుల్ చిత్రంగా ప్రేక్షకులకు అందించిన 'రన్ రాజా రన్' ప్రేక్షకుల అభిరుచికి తగినట్టు ఉందా అనే విషయం తెలుసుకోవాలంటే కథలోకి వెళ్లాల్సిందే. హైదరాబాద్ నగరంలో ప్రముఖులు మాస్క్ ల పెట్టుకుని ఓ ముఠా వరుస కిడ్నాప్ లు సంచలనం సృష్టిస్తుంటాయి. కిడ్నాప్ ముఠాను పట్టుకునేందుకు దిలీప్ (సంపత్ రాజ్) అనే పోలీస్ కమిషనర్ కు కేసును అప్పగిస్తారు. కథ అలా సాగతుండగా అల్లరి చిల్లరిగా తిరుగుతూ.. చాలా మంది అమ్మాయిలతో లవ్ బ్రేక్ ఆప్ లతో విసిగిపోయిన రాజా హరిశ్చందప్రసాద్ (శర్వానంద్)తో పోలీస్ కమిషనర్ కూతురు ప్రియ (సీరత్ కపూర్) ప్రేమలో పడుతుంది. రాజా, ప్రియల ప్రేమ వ్యవహారం తనకు నచ్చకపోయినా పోలీస్ కమిషనర్ ఒప్పకున్నట్టు నటిస్తాడు. ప్రియ నుంచి దూరం చేయడానికి రాజాను కిడ్నాప్ డ్రామా ఆడాలని ఓ కండిషన్ పెడుతాడు. ప్రియ ప్రేమ కోసం రాజా ఒప్పుకున్నట్టు నటించినా అసలు కారణం మరోకటి అనేది ఈ చిత్రంలో ఓట్విస్ట్. కిడ్నాప్ డ్రామా ఆడేందుకు రాజా ఎందుకు ఒప్పుకున్నాడు? రాజా కిడ్నాప్ వ్యవహారం సఫలమైందా? పోలీస్ కమిషనర్ దిలీప్ కిడ్నాప్ ముఠాను పట్టుకున్నారా? కిడ్నాప్ లకు పాల్పడుతున్నది ఎవరు? అనే పలు సందేహాలను ప్రేక్షకులు కల్పించి దర్శకుడు చెప్పిన సమాధానాలే 'రన్ రాజా రన్'. రాజా పాత్రలో శర్వానంద్ మంచి జోష్ ఉన్న యువకుడిగా కనిపించాడు. స్టైల్స్ తో శర్వానంద్ గతంలో కంటే మరింత ఆకర్షణీయంగా కనిపించాడు. స్టైల్స్ తోపాటు యాక్టింగ్ పరంగా కూడా మంచి ఫెర్ఫార్మెన్స్ తో ఆకట్టుకున్నాడు. యువ హీరోల పోటీలో శర్వానంద్ కు ఈ చిత్రం మరింత పేరు సంపాదించి పెడుతుందని చెప్పవచ్చు. ప్రియగా కనిపించిన సీరత్ కపూర్ అందంతోనూ, అభినయంతోనూ మెప్పించింది. సీరత్ కపూర్ అందచందాలు కనువిందు చేశాయనే చెప్పవచ్చు. గ్లామర్ తారగా సీరత్ కపూర్ రాణించడానికి అన్ని అర్హతలు ఉన్నాయని నిస్సందేహంగా చెప్పవచ్చు. ఈ చిత్రానికి సీరత్ గ్లామర్ అదనపు ఆకర్షణ. పోలీస్ కమిషనర్ గా సంపత్ తన పాత్ర పరిధి మేరకు పర్వాలేదనించాడు. శర్వానంద్ తండ్రిగా జయప్రకాశ్ ది ఓ ముఖ్యమైన పాత్రే. సంపత్, జయప్రకాశ్ లు తమ పాత్రలకు న్యాయం చేకూర్చారు. కోట శ్రీనివాసరావు పాత్ర రొటీన్ గానే ఉంది. టెక్నికల్: మిర్చి చిత్రానికి ఫొటోగ్రఫినందించిన మధి మరోసారి తన సత్తాను చూపించాడు. ఈ చిత్రంలో మధి అందించిన ఫొటోగ్రఫీ ప్రధాన ఆకర్షణగా నిలిచింది. శర్వానంద్, సీరత్ కపూర్ లను గ్లామర్ గా చూపించాడు. ప్రతి ఫ్రేమ్ లోను కలర్స్ వినియోగించిన తీరు బాగుంది. యాక్షన్ సీన్లు, రొమాంటిక్ సీన్లను తెరకెక్కించిన విధానం 'రన్ రాజా రన్'కు హైలెట్ నిలుస్తాయని చెప్పవచ్చు. రాజ్ సుందరం అందించిన కోరియోగ్రఫీ పాటలకు మరింత ట్రేండిగా మార్చాయి. కిడ్నాప్ కథ బ్యాక్ డ్రాప్ గా 'రన్ రాజా రన్'ను ఓ అందమైన ప్రేమ కథగా మలచడంలో దర్శకుడు సుజీత్ కొంతమేరకు సఫలమయ్యాడనే చెప్పవచ్చు. అయితే కథనంలో వేగం మందగించడం కారణంగా మధ్య, మధ్యలో కొంత ల్యాగ్ అనిపిస్తుంది. క్లైమాక్స్ కోసమే కథను సా...గదీశాడా అనే కోణం స్పష్టంగా కనిపిస్తుంది. అయితే తెలుగు, తమిళ, హిందీ హీరోలు, రాజకీయ నాయకులు, క్రికెటర్ల మాస్క్ లతో వెరైటీగా కిడ్నాప్ ముఠాను దర్శకుడు వెరైటీగా డిజైన్ చేసిన తీరు ప్రశంసనీయం. చిత్ర ఫస్టాఫ్, సెకండాఫ్ లో నిడివి ఎక్కువగా ఉండటం వలన కథలో వేగానికి కళ్లెం వేసిందనే ఫీలింగ్ కలుగుతుంది. చిత్ర నిడివిని తగ్గించడానికి ఎడిటింగ్ విభాగంపై మరికొంత దృష్టి పెట్టాల్సిన అవసరం కనిపించింది. ప్రమోద్, కృష్ణారెడ్డిల నిర్మాణాత్మక విలువులు బాగున్నాయి. -
శభాష్ శర్వా..!
‘‘వినూత్నమైన ప్రేమకథాచిత్రం మా ‘రన్ రాజా రన్’. యువతరం మెచ్చే అంశాలన్నీ ఇందులో పుష్కలంగా ఉంటాయి’’ అంటున్నారు దర్శకుడు సుజిత్. ఆయన దర్శకత్వంలో శర్వానంద్, సీరత్ కపూర్ జంటగా రూపొందిన చిత్రం ‘రన్ రాజా రన్’. బ్లాక్‌బస్టర్ ‘మిర్చి’ని ప్రేక్షకులకు అందించిన వి.వంశీకృష్ణారెడ్డి, ప్రమోద్ ఉప్పలపాటి ఈ చిత్రానికి నిర్మాతలు. జూలైలో ఈ చిత్రాన్ని విడుదల చేయడానికి నిర్మాతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ-‘‘కథ ఈ చిత్రానికి ప్రాణం. ‘మిర్చి’ లాంటి విజయం తర్వాత ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నామంటే కారణం అదే. శర్వానంద్ నటన శభాష్ అనిపించుకుంటుంది. గిబ్రన్ సంగీతం ఈ చిత్రానికి హైలైట్. ‘మిర్చి’ తర్వాత మళ్లీ ఈ చిత్రానికి మది ఛాయాగ్రహణం అందిస్తున్నారు. తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి ఈ చిత్రాన్ని నిర్మించాం’’ అని తెలిపారు. కోట శ్రీనివాసరావు, అలీ, జయప్రకాశ్‌రెడ్డి, అడవి శేషు తదితరులు ఇతర పాత్రలు పోషించిన ఈ చిత్రానికి కూర్పు: మధు, కళ: ఏఎస్.ప్రకాశ్, ఎగ్జిక్యూటివ్ నిర్మాత: అశోక్, లైన్ ప్రొడ్యూసర్: సందీప్.