అన్ని వయసుల వారికీ
వాకింగ్ నిర్ద్వంద్వంగా అందరికీ మేలు చేసే వ్యాయామం. పైగా అది ఎవరైనా చేయగలిగే చాలా తేలికైన ఎక్సర్‌సైజ్. పైగా దీనికి ఎలాంటి వ్యాయామం ఉపకరణాలూ, పరికరాలూ అక్కర్లేదు. వ్యాయామం చేయగలిగే ఏ వయసు వారైనా అలాగే మహిళలైనా, పురుషులైనా వాకింగ్ చేయాల్సిన సగటు దూరమెంతో, ఎంత నడిస్తే దేహం మీద దాని ప్రభావం పడి, మంచి ఆరోగ్యం సమకూరుతుందో లెక్కలు వేశారు యూఎస్‌కు చెందిన సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ (సీడీసీ) వారి సిఫార్సుల ప్రకారం రోజుకు ఎనిమిది కిలోమీటర్లు మంచిదని చెబుతున్నారు. (వాళ్ల లెక్కల ప్రకారం 5 మైళ్లు).
ఇక ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చెబుతున్న ప్రకారం వారానికి 150 నిమిషాల పాటు నడక గానీ లేదా ఏరోబిక్స్‌గానీ చేయడం మంచిది. నడర అయితే రోజుకు 30 నిమిషాల పాటు బ్రిస్క్ వాక్ చేస్తూ వారంలో కనీసం ఐదు రోజుల పాటైనా ఈ వ్యాయామం చేయాలి. ఇలా చేస్తే రోజులో కనీసం 4 నుంచి 5 కిలోమీటర్లు నడవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలన్నది డబ్ల్యూహెచ్‌వో లెక్క. ఏ లెక్కలు ఎలా ఉన్నా... ఎత్తుకు తగినట్లుగా బరువు తగ్గి, మంచి ఫిట్‌నెస్ సాధించడం కోసం అందరూ రోజూ ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు నడవాలని పలు ఆరోగ్య సంస్థల అధ్యయనాల్లో తేలింది. దీనివల్ల గరిష్టమైన ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయన్నది ఆ అధ్యయనాల మాట.
ఇది అందరి లెక్క అయినప్పుడు అందరూ ఇన్ని దూరాలు నడవగలరా అన్న ప్రశ్న ఉత్పన్నమవుతుంది కదా... దీనికి సమాధానమిస్తూ టీనేజ్‌లో ఉన్న పిల్లలు, యువత చాలా వేగంగా ఆరు నుంచి ఎనిమిది కిలోమీటర్లు దూరాలు నడవాలనీ, అయితే మధ్యవయస్కులు మొదలు కాస్త వయసు ఎక్కువగా ఉన్నవారు నెమ్మదిగా నడవాలని సూచిస్తున్నారు. మరీ ఎక్కువ వయసుతో వృద్ధాప్యంలో ఉన్నవారు మాత్రం రోజూ 2 నుంచి 4 కిలోమీటర్లు నడిస్తే చాలన్నది ఆ అధ్యయన సంస్థల సూచన.
ఇక ఆరు నుంచి పదిహేడేళ్ల వరకు ఉన్న చిన్నారులు రోజుకు కనీసం 60 నిమిషాల పాటైనా వేగంతో కూడిన నడక లేదా కాస్త శ్రమ కలిగించే వ్యాయామాలు చేయాలంటున్నారు.
అసలు ఎందుకు నడవాలి?
ఈ ప్రశ్న వచ్చినప్పుడు నడక వల్ల కలిగే వేర్వేరు ఆరోగ్య ప్రయోజనాలే సమాధానాలుగా నిలుస్తాయంటున్నాయి ఆరోగ్య పరిశోధక సంస్థలు. నడక వల్ల ఒత్తిడి తగ్గడం, మూడ్స్ మెరుగుపడటం, శక్తిసామర్థ్యాలు పెరగడం, బరువు తగ్గడం, కండరాలు బలంగా మారడం, కీళ్ల ఆరోగ్యం మెరుగుపడటంతో పాటు వాటికి అవసరమైన పోషకాలు అందడం, వాటి ఫ్లెక్సిబిలిటీ పెరగడంతో పాటు మరిన్ని ప్రయోజనాలు కలుగుతాయంటున్నారు నిపుణులు.
Comments
Please login to add a commentAdd a comment