ఈరోజు ప్రపంచ ఆరోగ్య దినం. ప్రపంచ ఆరోగ్య సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏటా ఏప్రిల్ 7న దీన్ని నిర్వహిస్తుంటారు. ఈ ఏడాది నిర్దేశించుకున్న ఉద్దేశం/ నినాదం (స్లోగన్) ‘అందరికీ ఆరోగ్యం’. అయితే ఈ ఏడాది ‘ప్రపంచ ఆరోగ్య దినం’ వచ్చిన సమయంలో లోకమంతా కరోనా వైరస్ గుప్పెట్లో విలవిలలాడుతోంది. ఈ వైరస్ కారణంగా వచ్చే ‘కోవిడ్–19’ వ్యాధి ప్రధానంగా ఊపిరితిత్తులను లక్ష్యంగా చేసుకుంటుంది. అందుకే ప్రస్తుతం ఉన్న తరుణంలో ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం.
మీకు తెలుసా?
ప్రతి ఏడాదీ... ప్రతి ఒక్కరికీ ఊపిరితిత్తుల సామర్థ్యం ఎంతో కొంత తగ్గుతూ పోతుంటుంది. దాంతో ఆక్సిజన్ అందే సామర్థ్యం కూడా తగ్గుతుంద. దీన్ని నివారించాలంటే మనం క్రమం తప్పకుండా శ్వాసవ్యాయామాలు (బ్రీతింగ్ ఎక్సర్‌సైజెస్) చేస్తూ ఉండాలి.
ఇలాంటి వృత్తులో ఉన్నవారు జరభద్రం...
♦ గొర్రెల పెంపకం అన్నది కూడా చాలామందికి ఓ జీవనోపాధి. అయితే గొర్రెల మంద మీదుగా వచ్చే గాలిలో కూడా ‘కాక్సియల్లా’ అనే సూక్ష్మజీవులు ఉంటాయి. వీటివల్ల ఇంకో రకం నిమోనియా వస్తుంది. అందుకే వీటి నుంచీ జాగ్రత్తగా ఉండాలి. దీనికి ఒక మార్గం ఉంది. గొర్రెల మీదుగా వచ్చే గాలి ఒకరకమైన వాసనతో మన ముక్కుపుటాలకు తాకుతుంది. ఆ వాసన తగలనంతటి దూరంలో మనం ఉండటం మేలు.
♦ ఇక మన సమాజంలో కోళ్లు, బాతుల వంటి వాటిని పెంచేవారు చాలామందే ఉంటారు. ఆ పక్షుల మీదుగా వచ్చే గాలిలోని ‘క్లెమీడియా’ అనే సూక్ష్మజీవుల వల్ల ఒక రకం నిమోనియా వస్తుంది. అందుకే ఆ పక్షులను పెంచేవారు వాటిని మీ నివాసాల నుంచి దూరంగా ఉంచేలా జాగ్రత్త పడండి.
♦ పావురాలు, అవి వేసే రెట్టల వల్ల ఆస్పర్జిల్లస్, క్రిప్టోకోకస్ అనే సూక్ష్మజీవుల వల్ల వ్యాప్తి చెంది ఊపిరితిత్తులకు సంబంధించిన ఇన్ఫెక్షన్స్ వచ్చే ఆస్కారం ఉంది. షుగర్ లేదా ఇతర ఊపిరితిత్తుల వ్యాధులు ఉన్నవారిలో ఇలాంటి ఇన్ఫెక్షన్లు మరింత ప్రమాదకరంగా పరిణమించే అవకాశం ఉంది. వీటిని కనుగొనడం, చికిత్స... ఈ రెండూ కష్టమైన, ఖరీదైన విషయాలే. కాబట్టి వాటిని నివాస ప్రాంతాలకు దూరంగా ఉంచాలి. కొందరు వాటికి దాణా తినిపించడం మంచి విషయంగా భావిస్తుంటారు. కానీ వాటిని నివాసప్రాంతాలకు దూరంగా ఉంచాలన్నది గుర్తుంచుకోండి. మరీ ముఖ్యంగా క్వారంటైన్ ప్రదేశాలు, హాస్పిటల్స్ వంటి వైద్య/చికిత్సా కేంద్రాలకు దూరంగా ఉంచేలా జాగ్రత్త తీసుకోవాలి.
♦ పిల్లులూ లేదా ఇతర పెంపుడు జంతువులు కూడా మీనుంచి దూరంగా ఉండేలా జాగ్రత్త తీసుకోవాలి. వాటి సాధారణ ప్రవర్తనలో ఏమాత్రం మార్పు కనిపించినా వెంటనే వాటిని వెటర్నరీ డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లండి.
♦ ఇక పట్టణాల్లో... ఆ మాటకొస్తే కొన్ని పల్లెల్లో కూడా చాలాకాలం వాడని ఏసీలు, కూలర్లలో ‘లెజినెల్లా’ అనే సూక్ష్మజీవులు పెరిగి, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్‌కు దారితీస్తాయి. ఇలాంటి ఇన్ఫెక్షన్లు ముదిరితే, దీర్ఘకాలంలో క్రానిక్ అబ్‌స్ట్రక్టివ్ పల్మునరీ డిసీజ్ (సీఓపీడీ)కి దారితీసే అవకాశాలూ ఉంటాయి. చాలాకాలం వాడకుండా ఉన్న కూలర్‌ను బయటకు తీసినప్పుడు కాసేపు ఆరుబయట దాన్ని ఆన్‌చేసి ఉంచి, ఆ తర్వాతే వాడాలి. ఏసీలు వాడేవారు వాటి తగిన సమయంలో వాటి ఫిల్టర్లను మార్చి వాడాలి.
♦ ఇళ్లలోకి గాలి వెలుతురు ధారాళంగా వచ్చేలా ఏర్పాట్లు చేసుకోవాలి. చాలాకాలం మూసి ఉంచిన గదుల్లోకి వెళ్లేటప్పుడు ముక్కుకు గుడ్డ కట్టుకుని వెళ్లడం మంచిది.
♦ లిఫ్ట్ వంటి క్లోజ్‌డ్ ప్రదేశాల్లో తుమ్మడం, దగ్గడం వంటివి చేసేటప్పుడు ముక్కు దగ్గర టిష్యూ లేదా కర్చిఫ్ అడ్డు పెట్టుకోవాలి. ఆ టిష్యూను ఇక మళ్లీ వాడకుండా పారేయాలి. కర్చిఫ్‌ను ఉతికాకే మళ్లీ వాడుకోవాలి. టీష్యూ, కర్చిఫ్ లేకపోతే మోచేతి మడతలో తుమ్మడం/దగ్గడం చేయాలన్నది ఇటీవలి సూచనల వల్ల మీకు తెలిసిన విషయమే.
♦ పొగతాగే అలవాటుంటే, తక్షణమే మానేయాలి. పొగతాగే వారంతా ఈ 21 రోజుల లాక్‌డౌన్ సందర్భంగా తమ అలవాటు మానుకోగలిగితే ప్రపంచవ్యాప్తంగా ఏటా పదిలక్షల మరణాలను నివారించవచ్చు.
ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా లంగ్స్ ఆరోగ్యం కోసం ఈ సూచనలు పాటించండి.
Comments
Please login to add a commentAdd a comment