మౌనమేలనోయి
సందర్భం : నేడు ప్రపంచ ఆరోగ్య దినం
మనం అనుకున్నది నెరవేరకుంటే ఏదోలా ఉంటుంది. అది సహజం. అయితే దాని వల్ల జీవితం నిస్సారమైందని భావించకూడదంటున్నారు మానసిక వైద్య నిపుణులు. సరైన దృక్పథంతో ఆలోచించగలిగితే భవిష్యత్‌పై నమ్మకం పెరుగుతుందని, మనసుకు ప్రశాంతత చేకూరుతుందని అంటున్నారు. జీవితం ఆశాజనకంగా కన్పించాలంటే ముందుగా మౌనం వీడాలని.. హాయిగా మాట్లాడుకోవాలని చెబుతున్నారు. ఈ నెల 7న ప్రపంచ ఆరోగ్య దినం సందర్భంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఆత్మనూన్యత(డిప్రెషన్) తీవ్రత, దాని పర్యవసానాలను గుర్తించి ఈ ఏడాది ‘డిప్రెషన్‌పై మౌనం వీడండి..మాట్లాడండి’ నినాదంతో అవగాహన కల్పించడానికి ముందుకు వచ్చింది. శుక్రవారం వరల్డ్ హెల్త్ డే సందర్భంగా ‘సాక్షి’ ప్రత్యేక కథనం.
- అనంతపురం మెడికల్
డిప్రెషన్ అనేది సర్వసాధారణమైన మానసిక సమస్య. 14 రోజులకు మించి రోజూ దిగులుగా ఉండడం, రోజువారీ దైనందిన కార్యక్రమాలపై ఆసక్తి తగ్గిపోవడం, శారీరక జబ్బు లేకపోయినా చిన్నచిన్న పనులకు త్వరగా అలసిపోవడం, నిద్రపట్టకపోవడం, ఆకలి మందగించడం, ధ్యాస లోపించడం, సెక్స్ పట్ల ఉత్సాహం తగ్గడం, చిన్న విషయాలను సైతం విసుగు, కోపగించుకోవడం, జరిగిపోయిన ఘటనలకు సంబంధించి అతిగా పశ్చాత్తాపం చెందడం, తనకు తాను శిక్షించుకోవడం, ఆత్మహత్యకు ప్రయత్నించడం... ఈ లక్షణాలు ఉంటే మనం డిప్రెషన్‌కు గురవుతున్నట్లే.
డిప్రెషన్‌కు గురైతే..
– మద్యం, మాదక ద్రవ్యాలకు బానిసలవుతారు.
– చిన్న వయసులోనే బీపీ, షుగర్, గుండె జబ్బులకు గురవుతారు.
– మందులకు లొంగని తలనొప్పి, వెన్నునొప్పి, వ్యాధి నిరోధక శక్తి తగ్గి చర్మవ్యాధులు, ఇతర శారీరక జబ్బులు ఎక్కువ అవుతాయి.
– వృత్తిపరంగా ధ్యాస లోపించి పని సామర్థ్యం తగ్గుతుంది. కుటుంబ కలహాలకు దారి తీస్తుంది.
– కుటుంబ సభ్యులు, స్నేహితులు, తోటి ఉద్యోగులతో పాటు సమాజంలో ఉన్న వాళ్లకు మనశ్శాంతి లేకుండా చేస్తారు.
డిప్రెషన్ ఎందుకొస్తుంది?
కోరికలు నశించడం, పని చేసే సామర్థ్యం కొరవడడం, నెగిటివ్ ఆలోచనలు, జీవితంలో పొందలేకపోయిన వాటి గురించి ఆలోచిస్తూ ఉండడం, బాగా కావాల్సిన వారి ఆకస్మిక మరణం ఇతరత్రా కారణాల వల్ల డిప్రెషన్ ఏర్పడవచ్చు. డిప్రెషన్‌లో ఉన్న వ్యక్తికి తమ చుట్టూ ఉన్న వాతావరణం చాలా నిరాశాజనకంగా కనిపిస్తూ ఉంటుంది.
‘మాటలే’ పరిష్కారం
డిప్రెషన్‌ను నివారించే ప్రత్యేకమైన చికిత్స అంటూ ఏమీ లేదు. కేవలం డాక్టర్లు ఇచ్చే మందుల వల్ల ఇది నయంకాదు. కుటుంబ సభ్యులు, బంధువుల సహకారం, సైకాలజిస్ట్ కౌన్సెలింగ్ వల్ల డిప్రెషన్‌ను అదుపు చేయవచ్చు. మానసిక వైద్య శాస్త్రం అందుబాటులో లేని రోజుల్లో మానసిక జబ్బులకు కారణం ‘పాపం చేశారని, శాపం వంటిదని, తప్పులు చేసే వారికి సంక్రమిస్తాయని, చేతబడి, పీడ, దెయ్యం వంటికి పట్టాయన్న మూఢనమ్మకాలతో భూత వైద్యులు, మంత్ర వైద్యులకు చూయించుకునేవారు. ఈ క్రమంలో జబ్బు తీవ్రత పెంచుకుని ఏళ్ల తరబడి ఆలనాపాలనకు నోచుకోక గృహ నిర్బంధంలో మగ్గేవారు. కానీ ఇవన్నీ తప్పని, మానసిక సమస్యలకు మెదడులో కలిగే రసాయనాల ఒడిదుడుకులే కారణమని వైద్యశాస్త్రం నిరూపించింది. శారీరక జబ్బుల్లానే మానసిక జబ్బులు వస్తాయని తేల్చింది. మనసును బాగా చూసుకుంటే చాలా రకాల శారీరక జబ్బులను జయించవచ్చు. ఈ సత్యాన్ని అందరూ గ్రహించి ‘మాట్లాడుకోవాలి’ అని మానసిక వైద్య నిపుణులు చెబుతున్నారు.
జాగ్రత్తలు తీసుకోవాలిలా...
– డిప్రెషన్‌కు లోనైన వ్యక్తిని ఎప్పుడూ ఒంటరిగా వదలకూడదు. ఆ వ్యక్తికి సన్నిహింతంగా ఉంటూ విషయం ఏమిటో కనుక్కోవాలి. ఎప్పటి నుంచి అలా విచారంగా అనిపిస్తుందో అడగాలి.
– వారి తలకు నూనె పట్టించి మసాజ్ చేయాలి
– గోరువెచ్చని నీళ్లతో స్నానం చేయాలని చెప్పాలి
– ‘ఇంత చిన్న విషయానికి బాధపడతావెందుకు’ వంటి మాటలు చెప్పి వారిలో మానసిక స్థైర్యం పెంపొందించాలి.
– చాలా సార్లు చెప్పినా భోజనం చేయకపోతే పక్కనే కూర్చుని మీ చేత్తో కలిపి తినిపించాలి.
– బయట అలా తిరిగొద్దామనో, సినిమాకు వెళ్దామనో చెప్పి వెంట తీసుకెళ్లాలి
సర్వజనాస్పత్రిలో కౌన్సెలింగ్ కేంద్రం
డిప్రెషన్ అనేది పూర్తిగా నివారించదగిన సాధారణ మానసిక జబ్బు. మొదటి దశలోనే లక్షణాలను గుర్తించి ఆప్తులతో సమస్యను పంచుకోవాలి. లోలోపల కుమిలిపోకుండా మాట్లాడుకోవాలి. ఆ తర్వాత కౌన్సెలింగ్ తీసుకోవాలి. రోజురోజుకూ పెరుగుతున్న మానసిక జబ్బుల తీవ్రతను దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వ అనంతపురంలోని సర్వజనాస్పత్రిలో మానసిక జబ్బుల విభాగంలో ప్రత్యేక కేంద్రం ఏర్పాటు చేశాం. ఆత్మహత్యల నివారణ కోసం కౌన్సెలింగ్ కేంద్రం ఉంది.
– డాక్టర్ యెండ్లూరి ప్రభాకర్, ప్రొఫెసర్ ఆఫ్ సైకియాట్రి, సర్వజనాస్పత్రి, అనంతపురం
6 వేల మందికి పైగా ఆత్మహత్యాయత్నం :
గత ఏడాది మన జిల్లాలో 728 మంది ఆత్మహత్య చేసుకున్నారు. ఆత్మహత్యకు ప్రయత్నించి బయట పడిన వారు 6 వేల మంది వరకు ఉంటారని అంచనా. కారణం ఏదైనా ఆత్మహత్య చేసుకునే వారిలో 90 శాతం మంది డిప్రెషన్‌తో బాధపడి ‘చావే మార్గం’ అని భావించి చనిపోవడానికి ప్రయత్నిస్తారు. దీన్ని బట్టి డిప్రెషన్ ప్రభావం ఎంత తీవ్రంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు.
ఆత్మహత్యలకు కారణాలివీ..
కుటుంబ కలహాలు – 25 శాతం
వ్యాధులు : 26 శాతం
ప్రేమ వైఫల్యం : 3.2
మద్యపానం : 5.3
వరకట్నం :1.6
పేదరికం : 1.9
ఆర్థిక సమస్యలు : 2
తెలియని కారణాలు : 15
ఇతర సమస్యలు : 20