
గ్రామీణ వైద్యానికి గ్రహణం
విశ్లేషణ
గ్రామీణ ప్రజలకు సంచార వైద్య సేవల (104) వంటి ఉత్తమ పథకం వైఎస్ మరణానంతరం అటకెక్కింది. రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలూ ప్రజలకు మంచి చేసే లక్ష్యంతో సాగిపోతున్నామని చెబుతున్నాయి. కాబట్టి అవి గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఇటువంటి పథకాలపై దృష్టి పెట్టాలి.
ఆసుపత్రుల ఫీజులు కట్ట లేని రోగి చావాల్సిందేనా? నేడు ఈ ప్రశ్న తరచుగా విన బడుతోంది. జవాబు ఇచ్చే వాళ్లే లేరు. అందుకే ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని ఆరోగ్య, వైద్య సేవల గురించి విశ్లేషిం చుకోవాల్సి వస్తోంది. ప్రభు త్వాలు ఏటా కోట్లాది రూపాయలు వైద్య ఆరోగ్య రంగంపై ఖర్చు చేస్తున్నాయి. గ్రామీణ ప్రాంతాలలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు) కొంత మేరకు ప్రజ లకు ఆరోగ్య సేవలను అందిస్తున్నా గ్రామీణ ప్రజల ఆరోగ్యం సమస్యగానే మిగిలిపోతున్నది. వైద్య శాస్త్ర పట్టభద్రులు పల్లెల్లో వైద్యం చేయడానికి సిద్ధంగా లేరు. ఇక మందుల విషయం చెప్పనక్కరలేదు. పీహెచ్‌సీలకు దూరంగా ఉన్న పల్లెల్లోని ప్రజలకు ఈ అరకొర సదుపాయమూ అందుబాటులో లేదు. ఇక అంత సులువుగా చేరుకోలేని కొండకోనల్లోని ఆది వాసులకు రోగం రొస్టూ వస్తే ఇక ఇంతే సంగతులు. వారికి మలేరియా, అతిసార వంటి వ్యాధులేగాక మధుమేహం, రక్తపోటు, ఉబ్బసం, కీళ్ల వ్యాధులతో కూడా బాధపడుతుంటారు. అయినా వారు ఎలాంటి వైద్య పరీక్షలు ఎన్నడూ చేయించుకుని ఎరుగరు. కనుక వారికి తమ జబ్బుల గురించే తెలియదు.
ఆరోగ్య మంత్రిత్వ శాఖను వైద్య, ఆరోగ్యశాఖ అంటారు. ఆరోగ్యాన్ని కాపాడుకోగలిగితే, వైద్యం అవసరం రాదన్న అర్థం అందులో నిగూఢంగా ఉంది. తాగే నీరు, తినే ఆహారం, నివసించే వాతావరణం ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తుంటాయి. ఈ ప్రాథమిక అంశాలకు ప్రభుత్వాలు ప్రాధాన్యం ఇస్తే రోగాల సంఖ్యా, రోగుల సంఖ్యా తగ్గిపోతాయి. వైద్య రంగంపై ప్రభుత్వం, వ్యక్తులు చేసే ఖర్చు గణనీ యంగా తగ్గిపోతుందని నిపుణుల అభిప్రాయం.
ఈ సదుద్దేశంతోనే కొద్దికాలం క్రితం హెచ్‌ఎంఆర్‌ఐ అనే స్వచ్ఛంద సంస్థ కొంత కృషి చేసింది. సుదూర గ్రామీణ ప్రాంతాల్లో కనీస వైద్య సదుపాయాలు లేక, నాటు వైద్యంపైనే ఆధారప డుతున్న ప్రజలకు సంచార వైద్య కేంద్రాల ద్వారా వారి గ్రామాలకే వెళ్లి, వైద్యసేవలను అందించడమే తమ లక్ష్యమని ఆ సంస్థ నాటి ముఖ్యమంత్రి డాక్టర్ వై.ఎస్.రాజశేఖరరెడ్డికి వివరించింది. సంచార వైద్య కేంద్రాలు గ్రామీణ ప్రజానీకానికి క్రమం తప్పకుండా వైద్య పరీక్షలు, రోగ నిర్ధారణ జరిపి తగిన మందులిస్తే చాలా రోగాలకు సులువుగా సురక్షితమైన వైద్యాన్ని అందించవచ్చని, పక్షవాతం వంటి జబ్బుల బారిన పడకుండా వారిని కాపాడవచ్చని తెలిపారు. స్వత హాగా వైద్యుడయిన నాటి ముఖ్యమంత్రి అలాంటి వైద్య సేవల ఆవశ్యకతను గుర్తించారు. అలా ప్రభుత్వ -ప్రైవేటు భాగస్వామ్యం ప్రాతిపదికన ఉమ్మడి రాష్ట్రంలో హెచ్‌ఎంఆర్‌ఐ సంస్థ కార్యకలాపాలు మొదలయ్యాయి.
పీహెచ్‌సీలకు మూడు కిలోమీటర్ల ఆవల ఉండే ప్రతి పల్లెకు నెల నెలా వెళ్లి అక్కడి ప్రజలకు వైద్య పరీక్షలను, మందులను ఉచితంగా అందించే 104 సంచార వైద్య వాహనానికి రూపకల్పన చేశారు. ఇక 108 అంబులెన్స్ పథకం ప్రమాదం అంచున ఉన్నవారి ప్రాణాలను కాపాడేందుకు ఉద్దేశించినది. ఈ పథకం కింద లబ్ధి పొందే వారి సంఖ్యను లెక్కలోకి తీసుకుంటే ఒక్కొక్కరిపై పెట్టే ఖర్చు ఏడాదికి ఎనభై రూపాయలే. వైద్య ఆరోగ్య రంగం బడ్జెట్‌లో పది శాతం కన్నా తక్కువ. ఈ 104 వాహనం ప్రతి నెలా ఒక నిర్దేశిత దినం నాడు క్రమం తప్పకుండా ఒక గ్రామాన్ని సందర్శించేది. ఈ వాహనంలో ఉండే మొత్తం ఏడుగురు సిబ్బంది గర్భిణులను, బాలిం తలను పరీక్షించి మందులు ఇచ్చేది. గర్భిణుల కడుపులో పిండం పెరుగుదలను బట్టి, తగు జాగ్రత్తలు సూచించేది.
అవసరమని భావిస్తే 108 అంబులెన్స్‌ను రప్పించి రోగిని ఆస్పత్రిలో చేర్పించే వారు. రక్తపోటు, మధుమేహం వంటి వ్యాధులున్న వారికి నెలవారీ పరీక్షలు నిర్వహించి, ఎప్పటికప్పుడు తగు మార్పులు చేస్తూ అక్కడికక్కడే మందులు ఉచితంగా పంపిణీ చేసేవారు. రోగుల వివరాలను ఎప్పటికప్పుడు సవివరంగా కంప్యూటర్లలో నిక్షిప్తం చేసేవారు. ‘దర్వాజాలో దవాఖానా’ వంటి ఈ పథకం తదనంతర రాజకీయ పరిణామాల ఫలితంగా అర్ధంతరంగా అటకెక్కింది. దేశానికే ఆదర్శంగా నిలవాల్సిన ఓ అద్భుత పథకం, వైఎస్ ఆకస్మిక మరణానంతరం కొందరి నిర్వాకాలకు, మరికొందరి స్వార్థాలకు బలైపోయింది. ఇంత అత్యుత్తమ పథకం మూలన పడినా అంతా ఏమీ జరగనట్టే ఉండటానికి కారణం... ఈ పథకం వల్ల లబ్ధిపొందుతున్న వారు నోరూవాయీ లేని నిరుపేదలు కావడమే. నిరక్ష రాస్యులైన వారి గురించి రాసేవారూ లేరు. చదవడం రాని వారి గురించిన వార్తలు ఎవరికీ పట్టవు. వారి దుర్భర జీవితాలు బుల్లి తెరలపైకీ ఎక్కవు. ఎందు కంటే అలాంటి ఆధునిక సౌకర్యాలకు దూరంగా ఉన్న అభాగ్యుల గోడు వినిపిస్తే చూపిస్తే రేటింగులూ పెరగవు.
సమాజంలోని అట్టడుగు బడుగులకు బాగా ఉపయోగపడే ఒక మంచి ఆరోగ్య పథకం పురిట్లోనే సంధికొట్టిన రీతిగా అదృశ్యమైంది. ఇది ఉమ్మడి రాష్ట్రం చివరాఖరు దశలో జరిగిన కథ. ఇప్పుడు రెండు కొత్త రాష్ట్రాల ముఖ్యమంత్రులూ తమదైన రీతిలో ప్రజలకు మంచి పనులు చేసే లక్ష్యంతో సాగిపోతున్నామని పదేపదే చెబుతున్నారు. వారికి ఆ తపన ఉంటే అలాంటి ఆరోగ్య పథకాలను సమర్థంగా అమలు చేసి చూపిస్తాం అనే సంస్థలకు కొదవలేదు. కాబట్టి ఇకనైనా రెండు తెలుగు ప్రభుత్వాలూ గ్రామీణ ప్రజల ఆరోగ్య సంరక్షణకు ఉపయోగపడే ఇటువంటి పథకాలపై దృష్టి పెడితే బాగుంటుంది.
తుది పలుకు:
పాలకులు వస్తుంటారు, పోతుంటారు. కానీ వారు చేసిన మంచి పనులు మాత్రం కలకాలం నిలిచి చిరకాలం వారిని గుర్తు చేస్తుంటాయి. ‘కారే రాజులు రాజ్యముల్ కలుగవే...’అంటూ బలి చక్రవర్తి కాలంలో చెప్పింది నేటికీ వర్తించే వాస్తవం.
రేపు ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వ్యాసకర్త సీనియర్ పాత్రికేయులు భండారు శ్రీనివాసరావు
మొబైల్ : 98491 30595