
ప్రతీకాత్మకచిత్రం
‘ఆరోగ్యమే మహాభాగ్యం’ అని ఆర్యోక్తి. మన పూర్వీకులు ఆరోగ్య ప్రాధాన్యాన్ని ఏనాడో గుర్తించారు. ఆరోగ్యాన్ని రక్షించుకునే మార్గాలనూ బోధించారు. కొంచెం ముందుచూపు కలిగి, ముందు జాగ్రత్తలను పాటించినట్లయితే చాలావరకు ఆరోగ్య సమస్యలు దరిచేరవు. ఎన్ని జాగ్రత్తలు తీసుకుంటూ ఉన్నా, ఒక్కోసారి మహమ్మారి రోగాలు విజృంభిస్తూ ఉంటాయి. యావత్ ప్రపంచాన్ని గడగడలాడిస్తూ ఉంటాయి. పెద్దసంఖ్యలో మనుషుల ప్రాణాలను బలి తీసుకుంటూ ఉంటాయి. కాల గమనంలో పరిస్థితులు తిరిగి సద్దుమణుగుతాయి.
మహమ్మారి రోగాలు చెలరేగినçప్పుడు మనుషులు మరింత అప్రమత్తం కావాల్సి ఉంటుంది. మరింత సంయమనంతో మెలగాల్సి ఉంటుంది. ఎన్నో మహమ్మారి రోగాలు సృష్టించిన దారుణ మారణహోమాలను చూసిన చరిత్ర మనది. ఒక్కొక్కటినే జయించుకుంటూ వచ్చాం. తాజాగా ‘కరోనా’ వైరస్ ‘సుస్తీమే సవాల్’ అంటూ మానవాళిపై కత్తి దూసింది. దీనిని సైతం మట్టుబెట్టే రోజు ఒకటి వస్తుంది. ఆ రోజు త్వరలోనే వస్తుందని ఆశిద్దాం. అంతవరకు మహమ్మారులను ఎదుర్కోవడానికి ఎలా సన్నద్ధులం కావాలో తెలుసుకుందాం. ఆరోగ్య పరిరక్షణలో చరిత్ర చెప్పిన పాఠాలనూ తెలుసుకుందాం..
వ్యాయామాత్ లభతే స్వాస్థ్య దీర్ఘాయుష్యం బలం సుఖం
ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థ సాధనం
ఎన్నో సవాళ్లు.. మరెన్నో మైలురాళ్లు..
చరిత్ర గమనంలో ప్రజల ఆరోగ్యానికి ఎన్నో సవాళ్లు ఎదురయ్యాయి. అప్పుడప్పుడు విజృంభించిన మహమ్మారి రోగాలు, రకరకాల ఇన్ఫెక్షన్లు నిష్కారణంగా నిండు ప్రాణాలను బలితీసుకున్నాయి. వైద్యరంగం ఇలాంటి సవాళ్లను ఒక్కొక్కటిగా అధిగమిస్తూ వచ్చింది. ఎప్పటికప్పుడు కొత్త కొత్త సవాళ్లు ఎదురవుతున్నా, వాటిని కూడా అధిగమించేందుకు ఎప్పటికప్పుడు సమాయత్తమవుతూ వస్తోంది. పెన్సిలిన్ సహా వివిధ యాంటీబయోటిక్ ఔషధాల ఆవిష్కరణ, వివిధ వ్యాధుల నిరోధానికి వ్యాక్సిన్ల ఆవిష్కరణ, మధుమేహాన్ని నియంత్రించే ఇన్సులిన్ ఆవిష్కరణ, అవయవ మార్పిడి శస్త్రచికిత్స పద్ధతులు వంటి ఎన్నో ఘనవిజయాలను ఆధునిక వైద్యరంగం నమోదు చేసుకుంది. ఆధునిక వైద్యరంగం సాధించిన పురోగతి ఫలితంగా ఇప్పటికే కొన్ని వ్యాధులు కనుమరుగయ్యాయి. ఇదివరకటి కాలంలో బాగా భయపెట్టిన వ్యాధులు కొన్ని ఇప్పటికీ ఉనికిలో ఉన్నా, వాటికి భయపడే పరిస్థితులైతే ఇప్పుడు లేవు. ఒకనాటి కాలంలో ప్రాణాంతకంగా ఉన్న చాలా వరకు వ్యాధులను సమర్థంగా నయం చేయగల ఔషధాలు, చికిత్స పద్ధతులు ఇప్పుడు అందుబాటులోకి వచ్చాయి. వైద్యరంగం సాధించిన ముఖ్యమైన మైలురాళ్లు కొన్ని..
చేతులు కడుక్కోమన్నాడని చితగ్గొట్టి చంపేశారు
పంతొమ్మిదో శతాబ్దిలో తరచుగా మాతా శిశు మరణాలు సంభవించేవి. పురుళ్లు పోసే మంత్రసానులు, వైద్యులు సరైన శుభ్రతను పాటించకపోవడం వల్లనే నిష్కారణంగా మాతా శిశు మరణాలు సంభవిస్తున్న సంగతిని తొలిసారిగా హంగేరియన్ వైద్యుడు ఇగ్నాజ్ ఫిలిప్ సెమ్మెల్వీస్ గుర్తించాడు. క్లోరిన్ కలిపిన సున్నపు నీటితో (క్యాల్షియం హైపోక్లోరైట్) చేతులను శుభ్రం చేసుకున్న తర్వాత పురుళ్లు పోస్తే, మాతా శిశు మరణాలు గణనీయంగా తగ్గినట్లు గుర్తించాడు. తాను పనిచేసే వియన్నా జనరల్ హాస్పిటల్‌లో సెమ్మెల్వీస్ ఇలా చేతులను శుభ్రం చేసుకునే పద్ధతిని కట్టుదిట్టంగా అమలు చేయడం వల్ల ప్రసవాల కోసం వచ్చే మహిళల్లో, వారికి పుట్టే శిశువుల్లోను ప్రసవానంతర ఇన్ఫెక్షన్లను గణనీయంగా తగ్గించగలిగాడు. ఇదే అంశమై తన పరిశీలనను ‘ఎటియాలజీ, కాన్సెప్ట్ అండ్ ప్రొఫిలాక్సిస్ ఆఫ్ చైల్డ్‌బెడ్ ఫీవర్’ అనే పుసక్తంగా 1847లో వెలువరించాడు. సెమ్మెల్వీస్ పుస్తకం అప్పట్లో వివాదాస్పదంగా మారింది. ప్రసవాలు చేయడానికి ముందు, శస్త్రచికిత్సలకు ముందు తప్పనిసరిగా చేతులు కడుక్కోవాలంటూ సెమ్మెల్వీస్ చేసిన సూచన ఆనాటి వైద్యులకు ఆగ్రహం తెప్పించింది.
‘నువ్వు చెప్పే వరకు మాకు తెల్దేటి మరి’ అనే రీతిలో అతడిని నానా రకాలుగా హేళన చేసి, మానసికంగా హింసించారు. తన వాదనను బలపరచుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించిన సెమ్మెల్వీస్ ఒక దశలో కాస్త మతిస్థిమితం తప్పాడు. అలాంటి పరిస్థితుల్లో అతడితో పనిచేసే సహవైద్యుడు ఒకరు 1860లో అతడిని మానసిక చికిత్స కేంద్రంలో చేర్చాడు. తనకు పిచ్చిలేదని అతడు చెబుతున్నా పట్టించుకోని గార్డులు అతడిని చితగ్గొట్టారు. గార్డుల దాడిలో చేతికి తగిలిన గాయం గ్యాంగరీన్‌గా మారడంతో పద్నాలుగు రోజుల్లోనే సెమ్మెల్వీస్ కన్నుమూశాడు. అతడు మరణించిన కొంత కాలానికి గాని అతడి వాదనలోని వాస్తవాన్ని ఆధునిక వైద్యరంగం గుర్తించలేదు. సెమ్మెల్వీస్ మరణించిన నాలుగు దశాబ్దాల తర్వాత హంగేరీ రాజధాని బుడాపెస్ట్‌లోని స్జెంట్ రోకుస్ ఆస్పత్రి ఆవరణలో అతడి నిలువెత్తు విగ్రహాన్ని నెలకొల్పి, ఆయన పట్ల జరిగిన అపరాధానికి పశ్చాత్తాపం ప్రకటించుకున్నారు.
వ్యాయామంతోనే ఆరోగ్యం లభిస్తుంది. దీర్ఘాయుష్షు, బలం, సుఖం దానితోనే లభిస్తాయి. ఆరోగ్యమే మహాభాగ్యం. ఆరోగ్యంగానే ఉంటేనే ఏదైనా సాధించగలం. వైద్యరంగం ఆధునికతను సంతరించుకోక ముందే మన పూర్వీకులు ఈ సంగతిని గుర్తించారు. ఆరోగ్య పరిరక్షణ కోసం ఇలాంటి విలువైన సూత్రాలను ఎన్నింటినో చెప్పారు. కొందరు శాస్త్రవేత్తలు ఎంతో ముందుచూపుతో శుచి శుభ్రతలను గురించి చెప్పిన ఆరోగ్య సూత్రాలను జనాలు తొలినాళ్లలో అర్థం చేసుకోలేకపోయారు. పైగా ఆరోగ్య సూత్రాలు చెప్పిన వారినే నిందించారు, దారుణంగా హింసించారు. చివరకు చేతులు కాలిన తర్వాత తాపీగా పశ్చాత్తాపం చెందారు. ‘కరోనా’ దెబ్బకు ఇప్పుడందరూ శానిటైజర్లు వాడుతున్నారు. ఘడియ ఘడియకు చేతులు కడుక్కుంటున్నారు. చేతులు శుభ్రంగా ఉంచుకుంటే చాలు, సూక్ష్మజీవుల నుంచి వచ్చే చాలావరకు వ్యాధులను నివారించుకోవచ్చు.
వ్యాధి సోకిన తర్వాత దానిని నయం చేసుకునేందుకు నానా తిప్పలు పడే బదులు నివారణ చర్యలు పాటించడమే మంచిదనే స్పృహ మనుషుల్లో బాగానే పెరిగింది. రెండు శతాబ్దాల కిందట మనుషుల్లో ఈ స్పృహ అంతగా ఉండేది కాదు. చిన్నా చితకా రోగాలకే మనుషులు పిట్టల్లా రాలిపోయేవారు. శారీరక శుభ్రత, వ్యాయామం తగినంతగా ఉంటే చాలా వరకు ఆరోగ్య సమస్యలు దరిచేరవు. నేటికీ చాలావరకు జీవనశైలి వ్యాధులకు మూల కారణం వ్యాయామ లోపమే! డయాబెటిస్, బీపీ, గుండెజబ్బులు మొదలుగా గల వ్యాధులు వ్యాయామ లోపం వల్ల మనుషులను పీడిస్తున్నాయి. ఇక సాధారణమైన జలుబు మొదలుకొని ఇటీవలి ‘కరోనా’ వరకు చాలా వ్యాధులకు అసలు కారణం శుభ్రతా లోపమేనని అంతర్జాతీయ వైద్య నిపుణులు చెబుతున్నారు.
చరిత్రలోనే తొలి వ్యాక్సిన్
ఒకప్పుడు మానవాళిని వణికించిన మశూచి మహమ్మారిని తుదముట్టించే ప్రయత్నాల్లో ఇంగ్లాండ్‌కు చెందిన వైద్యుడు ఎడ్వర్డ్ జెన్నెర్ 1796లో తొలి విజయం సాధించాడు. మశూచి నివారణ కోసం ఆయన ప్రపంచ చరిత్రలోనే తొట్టతొలి వ్యాక్సిన్‌ను రూపొందించాడు. మశూచిని పోలిన వ్యాధితో బాధపడే ఆవుదూడల లింఫ్ గ్రంథులను ఎండించి, ఫ్రీజ్ చేసి, వాటి నుంచి సేకరించిన కణాలతో డాక్టర్ జెన్నెర్ రూపొందించిన ‘డ్రైవాక్స్’ వ్యాక్సిన్ ప్రపంచ వైద్య చరిత్రలోనే గొప్ప మైలురాయి. తర్వాతి కాలంలో పంతొమ్మిదో శతాబ్దిలో అమెరికన్ ఔషధ తయారీ సంస్థ ‘వైయెత్’ మశూచి నివారణ కోసం మరింత మెరుగైన వ్యాక్సిన్ తయారు చేసింది. వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిన తర్వాత కూడా కొన్నేళ్లు మశూచి మానవాళిని వెంటాడింది. చరిత్రలో చిట్టచివరి మశూచి కేసు 1977లో నమోదైంది. ఆ తర్వాత ఇది పూర్తిగా కనుమగురైంది.
చరిత్ర గతిని మార్చిన పెన్సిలిన్
చిన్నా చితకా బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు సైతం ఒకనాటి కాలంలో మనుషుల ప్రాణాలను బలి తీసుకునేవి. యాంటీబయోటిక్ ఔషధాలేవీ అందుబాటులో లేని కాలంలో బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్లు ప్రాణాంతకంగా ఉండేవి. ఈ పరిస్థితులు ఇరవయ్యో శతాబ్ది నాటికి కూడా ఉండేవి. అలాంటి రోజుల్లో స్కాటిష్ శాస్త్రవేత్త అలెగ్జాండర్ ఫ్లెమింగ్ 1928లో యాంటీబయోటిక్ ఔషధం ‘పెన్సిలిన్’ను కనుగొన్నాడు. లండన్‌లోని సెయింట్ మేరీ హాస్పిటల్ లాబొరేటరీలో ఫ్లెమింగ్ ఇన్‌ఫ్లూయెంజా వైరస్‌పై పరిశోధనలు సాగించేవాడు. అప్పటికే ఫ్లెమింగ్ మతిమరపు మనిషిగా, నిర్లక్ష్య ధోరణితో పనిచేసే వ్యక్తిగా పేరు మోశాడు. పెన్సిలిన్ ఆవిష్కరణ చాలా చిత్రంగా జరిగింది. స్టాఫిలోకాక్సస్ బ్యాక్టీరియాపై పరిశోధన మొదలుపెట్టిన ఫ్లెమింగ్, ఆ బ్యాక్టీరియా కల్చర్ ప్లేట్‌పై అలాగే లాబ్‌లో వదిలేసి, ఎందుకో రెండువారాలు సెలవుపై వెళ్లాడు. తిరిగి వచ్చి చూసుకుంటే, ఆ ప్లేట్‌పై పూర్తిగా బూజుపట్టి కనిపించింది. ప్లేట్‌పై పెరిగిన బూజు స్టాఫిలోకాక్సస్ బ్యాక్టీరియా పెరుగుదలను నిరోధించినట్లు ఫ్లెమింగ్ కనుగొన్నాడు. ఆశ్చర్యకరంగా జరిగిన ఈ పరిణామమే ‘పెన్సిలిన్’ రూపకల్పనకు దారితీసింది. ఇది ప్రపంచ వైద్య చరిత్రనే సమూలంగా మార్చేసింది.
అమెరికాలో సెప్టిసీమియాకు గురైన రోగికి 1942లో తొలిసారిగా పెన్సిలిన్ ఇవ్వడం ద్వారా స్వస్థత చేకూర్చగలిగారు. తర్వాత అమెరికన్ ఔషధ కంపెనీలు పెన్సిలిన్‌ను ఉత్పత్తి చేయడం ప్రారంభించాయి. రెండో ప్రపంచ యుద్ధం 1942లో మొదలైన తొలి ఐదు నెలల్లో కేవలం 40 కోట్ల యూనిట్ల పెన్సిలిన్ మాత్రమే అందుబాటులో ఉండేది. యుద్ధం ముగిసే నాటికి నెలకు 65 కోట్ల యూనిట్ల మేరకు పెన్సిలిన్‌ను ఔషధ సంస్థలు ఉత్పత్తి చేశాయి. ఫలితంగా యుద్ధంలో గాయపడ్డ వేలాది సైనికుల ప్రాణాలను కాపాడటం సాధ్యమైంది. పెన్సిలిన్ తర్వాత అందుబాటులోకి వచ్చిన చాలా యాంటీబయోటిక్ ఔషధాలు ప్రపంచవ్యాప్తంగా కోట్లాది ప్రాణాలను కొడిగట్టిపోకుండా కాపాడగలిగాయి.నిజానికి పెన్సిలిన్ కంటే ముందే యాంటీబయోటిక్ యుగం మొదలైంది. జర్మన్ రసాయన శాస్త్రవేత్త ఆల్‌ఫ్రెడ్ బెర్తీమ్, ఆయన సహచరుడైన వైద్యుడు పాల్ ఎల్రిక్ 1907లో తొలి యాంటీబయోటిక్ ఔషధం సాల్వర్‌సాన్‌ను రూపొందించారు. అప్పట్లో తీవ్రంగా ఉన్న సిఫిలిస్ చికిత్సలో దీనిని విజయవంతంగా ఉపయోగించారు.
వ్యాక్సిన్ల చరిత్రలో మలుపు
ఫ్రెంచి రసాయనిక శాస్త్రవేత్త లూయీ పాశ్చర్ పంతొమ్మిదో శతాబ్దిలో వ్యాక్సిన్ల చరిత్రనే మలుపు తిప్పాడు. ర్యాబిస్ వైరస్‌ను కుందేళ్లకు ఎక్కించి, వైరస్ సోకిన నాడీ కణాలను ఎండబెట్టడం ద్వారా వైరస్‌ను నాశనం చేసే పద్ధతిని కనుగొన్నాడు. పాశ్చర్ సహచరుడైన ఫ్రెంచి వైద్యనిపుణుడు ఎమిలీ రోక్స్ ఇదే పద్ధతి ద్వారా ర్యాబిస్ వ్యాక్సిన్‌ను విజయవంతంగా రూపొందించాడు. మనుషులపై దీనిని ప్రయోగించడానికి ముందు యాభై కుక్కలపై ప్రయోగించాడు. ఆ తర్వాత 1885లో కుక్కకాటుకు గురైన ఒక తొమ్మిదేళ్ల బాలుడికి తొలిసారిగా ఈ వ్యాక్సిన్ ఇచ్చి, అతడు పూర్తిగా కోలుకునేలా చేశాడు. ర్యాబిస్ వ్యాక్సిన్ రూపకల్పనలో పాశ్చర్ అనుసరించిన పద్ధతే తర్వాతి కాలంలో వివిధ వ్యాధులను నిరోధించగలిగే మిగిలిన వ్యాక్సిన్ల తయారీకి మార్గాన్ని సుగమం చేసింది.
శానిటైజర్‌గా ఆల్కహాల్
ఆల్కహాల్ కలిగిన పానీయాలను ఉల్లాస పానీయాలుగా ఉపయోగించే అలవాటు పదివేల ఏళ్ల కిందటే ఉండేది. ఆల్కహాల్ కలిగిన పానీయాలను ఇన్ఫెక్షన్ల నివారణ కోసం ఉపయోగించిన ఘనత మాత్రం ప్రాచీన ఈజిప్షియన్లకే దక్కుతుంది. కంటికి సోకిన ఇన్ఫెక్షన్లు నయం చేయడానికి ఈజిప్షియన్లు ఆల్కహాల్ కలిగిన ద్రవాలను ఉపయోగించేవారు. క్రీస్తుశకం రెండో శతాబ్ది నాటికి గాయాలకయ్యే ఇన్ఫెక్షన్ల నివారణ కోసం క్లాడియస్ గాలెన్ వంటి ప్రాచీన వైద్యులు ఆల్కహాల్‌ను విరివిగా ఉపయోగించేవారు. ఆల్కహాల్‌లోని యాంటీసెప్టిక్ లక్షణాలను తొలిసారిగా గుర్తించినది మాత్రం ఆధునిక కాలంలోనే. ఆల్కహాల్ బ్యాక్టీరియా వంటి సూక్ష్మజీవులను నాశనం చేస్తుందని 1875లో గుర్తించారు.
శస్త్రచికిత్సలు చేసే వైద్యులు శస్త్రచికిత్సలు చేసే ముందు ఆల్కహాల్‌తో చేతులను శుభ్రం చేసుకోవాలని అప్పటి వైద్యులు కొందరు సూచించేవారు. దాదాపు డెబ్బయి శాతానికి మించిన గాఢత కలిగిన ‘ఇథనాల్’ (ఈథైల్ ఆల్కహాల్) 1930 నాటికి ఆస్పత్రుల్లో యాంటీసెప్టిక్‌గా విరివిగా వాడుకలోకి వచ్చింది. అయితే, ఇథనాల్‌ను నేరుగా చేతులకు పూసుకోవడం కొంత ఇబ్బందిగానే ఉండేది. ఇథనాల్‌ను జెల్ వంటి పదార్థంలో కలిపి, ఉపయోగించేలా తయారు చేసిన ఘనత మాత్రం అమెరికన్ నర్సింగ్ విద్యార్థిని ల్యూప్ హెర్నాండెజ్‌కు దక్కుతుంది. ఆమె ఆవిష్కరణతో 1966 నుంచి ఆధునిక హ్యాండ్ శానిటైజర్ల యుగం మొదలైంది. ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) సైతం హ్యాండ్ శానిటైజర్లను 1980 నుంచి అత్యవసర ఔషధాల జాబితాలో చేర్చింది.
ఆశాజనకంగా యాంటీవైరల్ ఔషధాలు
యాంటీబయోటిక్స్‌తో పోల్చి చూస్తే యాంటీవైరల్ ఔషధాల ఆవిష్కరణ కాస్త ఆలస్యంగా మొదలైంది. తొలి యాంటీవైరల్ ఔషధం ‘ఇడాక్సురిడిన్’కు 1963లో ఆమోదం లభించింది. అమెరికన్ ఫార్మకాలజిస్ట్ విలియం ప్రుసాఫ్ ఈ ఔషధాన్ని 1959లో రూపొందించారు. హెర్పిస్ వైరస్‌ను సమర్థంగా అరికట్టడంలో ఈ ఔషధం సత్ఫలితాలను సాధించింది. ఇడాక్సురిడిన్ చూపిన మార్గంలోనే మరిన్ని యాంటీవైరల్ ఔషధాలు రూపుదిద్దుకున్నాయి. హెపటైటిస్ నుంచి హెచ్‌ఐవీ వరకు వివిధ వైరస్‌ల కారణంగా తలెత్తే వ్యాధుల నివారణలో ఈ ఔషధాలు కీలక పాత్ర పోషిస్తున్నాయి. యాంటీ బయోటిక్ ఔషధాల మాదిరిగా ఇవి వ్యాధికి కారణమయ్యే సూక్ష్మజీవులను నేరుగా నాశనం చేయవు.
ఇవి వ్యాధికారక వైరస్ అభివృద్ధిని నిరోధించి, అవి క్రమంగా నాశనమయ్యేలా చేయడం ద్వారా రోగులకు స్వస్థత కలిగిస్తాయి. ఇటీవలి కాలంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) మహమ్మారి వ్యాధుల్లో ఒకటిగా గుర్తించిన హెచ్‌ఐవీ/ఎయిడ్స్‌ను అరికట్టడంలో యాంటీవైరల్ ఔషధాలు సత్ఫలితాలను సాధిస్తున్నాయి. కొద్ది నెలలుగా ప్రపంచాన్ని గడగడలాడిస్తున్న మహమ్మారి వ్యాధి నావెల్ కరోనా వైరస్ డిసీజ్ ‘కోవిడ్–19’ను అరికట్టడంలో కూడా వైద్యరంగం త్వరలోనే సఫలం కాగలదనే ఆశించవచ్చు. దీని నియంత్రణకు యాంటీ వైరల్ ఔషధాలు, నివారణకు తగిన వ్యాక్సిన్ రూపొందించే దిశగా ముమ్మరంగా జరుగుతున్న ప్రయోగాల ఫలితాలు సాధ్యమైనంత త్వరలోనే మానవాళికి అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఒక్కొక్క కాలంలో కొత్త కొత్త వ్యాధులు ఎన్ని పుట్టుకొచ్చినా వైద్యరంగం ‘సుస్తీమే సవాల్’ అంటూ వాటన్నింటినీ ఎదుర్కొని విజయం సాధించింది. రానున్న సవాళ్లను సైతం ఆధునిక వైద్యరంగం ఇదే రీతిలో ఎదుర్కోగలదని మనం ఆశించవచ్చు. – పన్యాల జగన్నాథదాసు