జమ్ముకశ్మీర్‌లో మరోసారి దేశాన్ని దిగ్భ్రాంతికి గురిచేసే ఉదంతం చోటుచేసుకుంది. దోడాలో ఉగ్రవాదులతో జరిగిన ఎన్‌కౌంటర్‌లో భారత ఆర్మీకి చెందిన ఒక కెప్టెన్, నలుగురు జవాన్లు వీరమరణం పొందారు. దట్టమైన అడవుల మధ్య సెర్చ్ ఆపరేషన్ సమయంలో ఈ ఎన్‌కౌంటర్ జరిగింది.
ఉగ్రవాదులు సైనికులపై దాడికి తలపడగా నలుగురు వీర జవాన్లు అమరులయ్యారు. ఈ అమరుల పేర్లను సైన్యం విడుదల చేసింది. భారత ఆర్మీ కెప్టెన్ బ్రిజేష్ థాపా ఉగ్రవాదులు జరిపిన దాడిలో వీరమరణం పొందారు. థాపా రెండవ తరం ఆర్మీ అధికారి. అతని తండ్రి కల్నల్ భువనేష్ థాపా ఆర్మీ నుండి రిటైర్ అయ్యారు. సోదరి నేపాలీ గాయని. థాపా సిలిగురిలో నివసిస్తున్నారు. ఆయన 2019లో భారత సైన్యంలో చేరారు. ఆయనతో పాటు జవాను నాయక్ డి రాజేష్, కానిస్టేబుళ్లు, బిజేంద్ర, అజయ్ అమరులైనవారిలో ఉన్నారు.
దోడాలో జరిగిన ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్‌లో తమ ప్రాణాలను త్యాగం చేసిన వీర సైనికులకు ఆర్మీ అధికారులు ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. కాగా అంతకంతకూ పెరుగుతున్న ఉగ్రవాద ఘటనలపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వం నిర్ణయించింది. కేంద్ర రక్షణ మంత్రి రాజ్‌నాథ్ సింగ్ ఆర్మీ చీఫ్‌తో మాట్లాడి తాజాగా జరిగిన దాడికి సంబంధించిన వివరాలను తెలుసుకున్నారు. ఉగ్రవాదులపై చర్యలు తీసుకునేందుకు ఆర్మీ చీఫ్‌కు రక్షణ మంత్రి పూర్తి స్వేచ్ఛనిచ్చినట్లు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment