Ramji Gond
-
ప్రశ్న.. పాఠమయ్యేదెప్పుడు?
నిర్మల్: దేశచరిత్రలోనే అత్యంత దారుణమైన ఘటనగా జలియన్‌వాలాబాగ్ ఊచకోతకు పేరుంది. జనరల్ డయ్యర్ చేసిన ఈ నరమేథాన్ని దేశం ఇప్పటికీ గుర్తుపెట్టుకుంది. కారణం మన చరిత్రపుటల్లో ఈ ఘటనకు..కారకులకు..అమరులకు చోటిచ్చారు కనుక. కానీ.. జలియన్‌వాలాబాగ్ ఘటన కంటే దాదాపు 60 ఏళ్లకిందట అంతకంటే దారుణమైన మారణహోమం మనరాష్ట్రంలోనే చోటుచేసుకుంది. ఒకేసారి వెయ్యిమందిని అత్యంత కిరాతకంగా కాళ్లూచేతులు విరగ్గొట్టి, ఒకే మర్రిచెట్టుకు ఉరితీసి చంపేశారు. ఈ దారుణ మారణకాండ గురించి దేశానికి కాదు.. కనీసం ఆ జిల్లాలోనే ఇప్పటికీ చాలామందికి తెలియదంటే అతిశయోక్తి కాదు. మరో దారుణమేమంటే.. అసలు ఎక్కడా.. ఏ చరిత్రపుటల్లో.. ఏ పుస్తకంలో.. ఏ పాఠంలో.. చెప్పని ఆ చారిత్రక ఘటన గురించి ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలో ఓ ప్రశ్నగా అడిగారు.తెలంగాణ చరిత్రను ఆసాంతం చదివిన వారికి ఎక్కడో ఓ చోట రాసిన విషయం గుర్తుంటే తప్ప.. సమాధానం ఇవ్వలేరు. వెయ్యిమంది వీరుల త్యాగం పాఠ్యాంశంగా అందించాలన్న డిమాండ్ ఉంది. ఏంటా ప్రశ్న... తెలంగాణ రాష్ట్ర పబ్లిక్ సర్విస్ కమిషన్ ఇటీవల నిర్వహించిన గ్రూప్–3 పరీక్షలో రాంజీగోండుకు సంబంధించి అడిగారు. రెండవ పేపర్లో 18వ శతాబ్దంనాటి రాంజీగోండు తన బృందంతో ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోని ఆసిఫాబాద్ ప్రాంతం నుంచి నిర్మల్ వరకు తన ప్రాబల్యాన్ని పెంచుకొని, బ్రిటిష్ వారికి వ్యతిరేకంగా తిరుగుబాటు చేయడం, చివరకు వెయ్యిమంది సైన్యంతో కలిసి ఉరికొయ్యలకు బలికావడం తదితర అంశాలపై ప్రశ్నించారు. ఈ ప్రశ్నకు చాలామంది సరైన సమాధానాలు రాయలేకపోయామని చెప్పారు. ఇందుకు కారణం రాంజీగోండు, వెయ్యి ఉరుల మర్రి ఘటన గురించి చిన్నప్పటి నుంచి ఏ పాఠ్యపుస్తకంలో చదవకపోవడమే. ఎక్కడ ఆ ఘటన.. ఎవరా రాంజీ ! 1857లో జరిగిన ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామ సమయంలోనే వెలుగులోకి వచ్చిన ఆదివాసీ వీరుడు రాంజీగోండు. గోండురాజుల వంశానికి చెందిన రాంజీ అప్పటి ఉమ్మడి ఆదిలాబాద్, గోండ్వానా రాజ్యంలో చెల్లాచెదురుగా ఉన్న వారందరినీ ఏకం చేశాడు. పరాయిదేశం నుంచి వచ్చి భరతమాతను బంధించిన ఆంగ్లేయులపై, స్వదేశంలో ఉంటూ వారికి తొత్తులుగా ఉన్న నిజాం రాజులపైనా పోరాడాలని పిలుపునిచ్చాడు. ఇందుకు గోదావరి తీరంలో చుట్టూ దట్టమైన అడవులు, గుట్టలతో ఉన్న నిర్మల్ ప్రాంతాన్ని ఎంచుకున్నాడు. ప్రథమ సంగ్రామంలో పాల్గొన్న రొహిల్లాలు.. ఈ ఆదివాసీ వీరులకు తోడుకావడంతో నెలల తరబడి ఆంగ్లేయులను ముప్పతిప్పలు పెట్టారు. తమ వద్ద సరైన బలగాలు, మందుగుండు సామగ్రి, ఆయుధాలు లేకున్నా.. రాంజీ సారథ్యంలో గెరిల్లా తరహా పోరుసల్పారు. కొరకరాని కొయ్యగా మారిన గోండువీరులను శత్రువులు దొంగదెబ్బ తీశారు. రాంజీ సహా వెయ్యిమంది వీరులను బంధించారు. మరోసారి ఇలాంటి తిరుగుబాటు చేయడానికి కూడా ఎవరూ సాహసించొద్దని ఆ వీరులను అత్యంత దారుణంగా హింసించారు. ఒకే మర్రిచెట్టుకు.. వెయ్యిమంది 1860, ఏప్రిల్ 9న నిర్మల్ నుంచి ఎల్లపెల్లి గ్రామానికి వెళ్లే మార్గంలో ఉన్న పెద్ద మర్రిచెట్టుకు ఈ వెయ్యిమంది వీరులను ఒకేసారి ఉరితీశారు. అలా వారంతా మాతృభూమి కోసం ఉరికొయ్యలను ముద్దాడారు. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యిమంది వీరుల చరిత్ర దశాబ్దాలపాటు కనీసం బయటకు రాలేదు. ఇప్పటికీ ఈ దారుణ మారణకాండ గురించి ఎక్కడా చరిత్రలో, పాఠ్య పుస్తకాల్లోకి ఎక్కలేదు. 2021 సెపె్టంబర్ 17న తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా నిర్మల్ వచ్చి వెయ్యిమంది అమరులకు నివాళులరి్పంచారు. అయితే ఇప్పటికీ నిర్మల్‌లో వారి స్మారకార్థం ఎలాంటి చర్యలు చేపట్టలేదు.ముందుతరాలకు తెలిసేలా.. నిర్మల్ జిల్లాకేంద్రంలో ఎప్పుడో 1857–60లోనే జరిగిన వెయ్యి ఉరులమర్రి ఘటనను ఇప్పటికీ బయటకు తీయకపోవడం దారుణం. ఇలాంటి ఘటనను ముందుతరాలకు తెలిపేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలి. – ధోండి శ్రీనివాస్, చరిత్రకారుడుపాఠ్యాంశంగా పెడితే... వెయ్యి ఉరుల మర్రి ఘటన గురించి పాఠ్యాంశంగా పెట్టడంతోపాటు విస్తృ తంగా ప్రచారం కల్పించాల్సిన అవసరముంది. అప్పుడే ఇలాంటి ఘటనలపై అడిగే ప్రశ్నలకు సమాధానాలివ్వగలుగుతారు. – డాక్టర్ కట్కం మురళి, అసిస్టెంట్ ప్రొఫెసర్ -
అబిడ్స్‌లో రాంజీ గోండ్ మ్యూజియం
సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ పోరాట యోధుడు రాంజీగోండ్ పేరిట ప్రత్యేకంగా ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున అబిడ్స్‌లోని గిరిజన సంక్షేమశాఖ స్థలంలో కేంద్రమంత్రులు అర్జున్‌ముండా, జి.కిషన్‌రెడ్డిల చేతుల మీదుగా సోమవారం శంకుస్థాపన జరిపేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట్లు చేసింది. రూ.35 కోట్లపైగానే వ్యయం రాంజీగోండ్ మ్యూజియం ఏర్పాటుకు రూ.35 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభు త్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. రూ.10 కోట్లు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడలేదు. మొదట్లో బాపూఘాట్ వద్ద మ్యూజియం ఏర్పాటు చేయాలని భావించారు. కానీ భూ సమస్య కారణంగా ఆదిలోనే ఆగిపోయింది. దీంతో అబిడ్స్‌లో ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు. ఈ మ్యూజియంలో ప్రధానంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల వివరాలు, చరిత్ర, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి తెస్తారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఈ మ్యూజియం నిర్వహణ ఉంటుంది. దీని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది. టీసీఆర్టీఐ భవన ప్రారంభోత్సవం కూడా... మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరంసంజీవయ్య సంక్షేమభవన్ ఆవరణలో గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ (టీసీఆర్టీఐ)భవనం నిర్మించారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు విడుదల చేసింది. నాలుగు అంతస్తుల్లో సుమారు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి కేంద్రం ఇప్పటివరకు రూ.6.5 కోట్లు ఇచ్చినట్టు అధికారులు చెబుతు న్నారు. గిరిజన సంక్షేమశాఖలో టీసీఆర్టీఐ ఒక భాగమే అయినా, కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోమ వారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భవనాన్ని కేంద్రమంత్రులు అర్జున్‌ముండా, జి.కిషన్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు. -
ఆ మట్టితోనే ప్రాణం పోశాడు..
నిర్మల్: దేశ స్వాతంత్య్రం కోసం ఆయన ఎక్కడైతే చిరునవ్వుతో ఉరికొయ్యలను ముద్దాడాడో.. అక్కడి మట్టితోనే మళ్లీ ప్రాణం పోసుకున్నాడు. తనతోపాటు వెయ్యిమంది ప్రాణాలను అర్పించిన స్థలంలోని మట్టితో రాంజీగోండు విగ్రహానికి పోలీస్ భీమేశ్ అనే యువకుడు ప్రాణం పోశాడు. నిర్మల్ రూరల్ మండలం అనంతపేటకు చెందిన భీమేశ్ సెప్టెంబర్ 17 తెలంగాణ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా 1860లో వెయ్యి ఉరులమర్రి ఘటనలో ప్రాణత్యాగం చేసిన రాంజీగోండు మట్టి ప్రతిమను తయారు చేశారు. ఇందుకు ఎక్కడైతే వారిని ఉరితీశారో.. ఆ మట్టినే ఉపయోగించారు. ఈ సందర్భంగా భీమేశ్ మాట్లాడుతూ నిర్మల్ చరిత్రను వెలుగులోకి తీసుకొచ్చేందుకు ‘సాక్షి’విశేష కృషి చేస్తోందని తెలిపారు. ఇటీవల చేస్తున్న కార్యక్రమాల స్ఫూర్తితోనే తాను రాంజీ బొమ్మకు ప్రాణం పోసినట్లు భీమేశ్ వెల్లడించారు. -
మర్రిచెట్టంత త్యాగం మరవొద్దు
‘సెప్టెంబర్ 17.. విమోచనమా, విముక్తా, విలీనమా.. ఏ దినోత్సమైనా అనుకోండ్రి. తెలంగాణకు స్వాతంత్య్రం వచ్చిన ఆ రోజును అందరూ యాది చేసుకుంటుండ్రు. సంబురాలూ జేస్తున్నరు. అవ్‌గనీ.. అంతకుముందు మేం జేసిన పోరాటాలు యాదికున్నయా? అడవి బిడ్డలమైన మేం ఆఖరి శ్వాస దాకా ఎందుకు పోరాడినమో.. వెయ్యి మందిమి ఒకేపారి ఒకే మర్రిచెట్టు ఉరికొయ్యలకు ఎందుకు ఊగినమో మీకు ఎరుకేనా? కుమురం భీముడు ఏమిటికి తుపాకీ పట్టిండు..? ఎందుకు పానం ఇడిసిండు? ఏండ్ల సంది చరిత్ర పుస్తకాలల్ల మాకు ఒక్క అక్షరమంత జాగియ్యలేదు. జరంత మీరన్న.. ఇప్పటికన్న.. పట్టించుకోండ్రి’అంటూ నిర్మల్ గడ్డపై ఉన్న రాంజీ గోండు విగ్రహం ఘోషిస్తోంది. ఇంతకూ ఎవరీ రాంజీ..? ఆ వెయ్యి మంది ప్రాణాలు ఎందుకు వదిలారు.. ఇదంతా ఎక్కడ జరిగింది అనే ప్రశ్నలకు సమాధానాలు కావాలంటే చరిత్రకెక్కని ఈ గాథను చదవాల్సిందే. నిర్మల్: దేశ ప్రథమ స్వాతంత్య్ర సంగ్రామానికి కొనసాగింపు అన్నట్లుగా అడవుల్లో ఉమ్మడి శత్రువులపై గోండులు, రోహిల్లాలు, మరాఠీలు, దక్కనీలు పోరు చేశారు. నిర్మల్ ప్రాంతం కేంద్రంగా 1858–60 వరకు ఈ పోరాటం సాగింది. దీనికి గోండు వీరుడు రాంజీ గోండు నేతృత్వం వహించాడు. మహారాష్ట్ర, ఒడిశా, మధ్యప్రదేశ్, ఆంధ్రప్రదేశ్‌లలో నివసించే అనేక మంది గిరిజన తెగల సమూహాల్లో గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలకులు రాక పూర్వమే ఏర్పడింది. గోండుల పాలన 1750 వరకు సుమారు ఐదు శతాబ్దాలపాటు కొనసాగింది. 9 మంది గోండు రాజులలో చివరివాడైన నీల్‌కంఠ్ షా (క్రీ.శ 1735–49)ని మరాఠీలు బంధించి చంద్రాపూర్‌ను ఆక్రమించుకున్నారు. ఆ తర్వాత బ్రిటిష్‌వాళ్లు చేజిక్కించుకున్నారు. గోండుల పాలన అంతమై ఆంగ్లేయ, నైజాం పాలన మొదలయ్యాక ఆదివాసులనూ నాటి పాలకులు పీడించారు. అడవుల్లోకి చొచ్చుకొస్తూ ఆదివాసుల ఉనికిని ప్రశ్నార్థకంగా మారుస్తున్న ఆంగ్లేయ, నైజాం సేనలపై జనగాం (ఆసిఫాబాద్) కేంద్రంగా చేసుకున్న మర్సుకోల రాంజీగోండు పోరాటం ప్రారంభించాడు. నిర్మల్ కేంద్రంగా ఉన్న ఆంగ్లేయ కలెక్టర్.. నిజాం సేనలతో కలసి అడవులను, ఆదివాసులను పీడిస్తున్నాడని తెలియడంతో రాంజీగోండు ఈ ప్రాంతం వైపు వచ్చాడు. రోహిల్లాల తోడుతో.. ప్రథమ సాతంత్య్ర సంగ్రామంలో ఝాన్సీ లక్ష్మీబాయి వీరమరణం పొందాక నానాసాహెబ్ పీష్వా, తాంతియాతోపే, రావుసాహెబ్‌లు తమ బలగాలతో విడిపోయారు. తాంతియాతోపే అనుచరులైన రోహిల్లా సిపాయిలు మహారాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, తెలంగాణలోని ఆదిలాబాద్, నిర్మల్ ప్రాంతాలకు తరలివచ్చారు. వారు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్‌లను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. నిర్మల్ ప్రాంతంలో రోహిల్లాల నాయకుడు సర్దార్ హాజీతో కలిసిన రాంజీ... ఉమ్మడి శత్రువులైన ఆంగ్లేయ, నిజాం సేనలపై విరుచుకుపడ్డాడు. సరైన ఆయుధ సంపత్తి లేకున్నా నిర్మల్ సమీపంలోని సహ్యాద్రి కొండలను, అడవులను కేంద్రంగా చేసుకొని ముప్పుతిప్పలు పెట్టాడు. నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేసి దెబ్బతిన్నాయి. ఈ విషయం కలెక్టర్ ద్వారా హైదరాబాద్ రాజ్యంలో వారి రెసిడెంట్ అయిన డేవిడ్సన్, నాటి పాలకుడు అఫ్జల్ ఉద్దౌలా వరకు తెలిసింది. అణచివేత కోసం బళ్లారి దళం.. ప్రథమ సంగ్రామానికి కొనసాగింపుగా రాంజీ నేతృత్వంలో నిర్మల్ కేంద్రంగా ప్రారంభమైన పోరును పాలకులు తీవ్రంగా పరిగణించారు. అణచివేత కోసం బళ్లారిలోని 47వ నేషనల్ ఇన్ఫ్రాంట్రీని నిర్మల్ రప్పించారు. కల్నల్ రాబర్ట్ నేతృత్వంలోని ఈ దళం ఇక్కడి ప్రాంతంపై అంతగా పట్టులేకపోవడంతో రాంజీసేన చేతిలో దెబ్బతింది. ఈ కసితో రాంజీని దొంగదెబ్బ తీసేందుకు ప్రయత్నించి రాబర్ట్ సఫలమయ్యాడు. సోన్–కూచన్‌పల్లి ప్రాంతంలో గోదావరి ఒడ్డున రాంజీసేన పట్టుబడింది. ఒకే మర్రికి వెయ్యి మంది ఉరి.. దొంగదెబ్బతో బంధించిన రాంజీ సహా వెయ్యి మందిని శత్రుసేనలు చిత్రహింసలు పెట్టాయి. ఇలాంటి వాళ్లు మళ్లీ తమపై పోరాడేందుకు కూడా సాహించకూడదని నరకం చూపించాయి. వారందరినీ నిర్మల్ శివారులోని ఎల్లపెల్లి దారిలో నేలలో ఊడలు దిగిన మర్రిచెట్టు వద్దకు ఈడ్చుకెళ్లి అందరూ చూస్తుండగా రాంజీ సహా వెయ్యి మందిని ఉరితీశారు. దేశ స్వాతంత్య్ర చరిత్రలోనే మునుపెన్నడూ జరగని ఈ ఘటన 1860 ఏప్రిల్ 9న జరిగింది. ఆ తర్వాత కుమురం భీమ్ సహా ఎందరో సమరయోధులకు స్ఫూర్తిగా నిలిచింది. నేటికీ చరిత్రకెక్కని పోరాటం.. ఇంతటి పోరాటాన్ని సాగించిన రాంజీగోండు, వెయ్యి మంది వీరుల త్యాగం ఇప్పటికీ చరిత్రకెక్కలేదు. గతేడాది కేంద్ర హోంమంత్రి అమిత్ షా నిర్మల్ వచ్చి నివాళులర్పించినా రాష్ట్ర అటవీశాఖ మంత్రి అల్లోల ఇంద్రకరణ్‌రెడ్డి స్వగ్రామానికి సమీపంలోనే వెయ్యి ఉరుల మర్రి ఉన్నా.. పట్టించుకున్న నాథుడు లేడు. జిల్లా కేంద్రంలోని ఓ చిన్నపాటి విగ్రహం, 1995లో గాలివానకు నేలకొరిగిన వెయ్యి ఉరుల మర్రిచెట్టు ప్రాంతంలో అనాథలా అమరవీరుల స్థూపం మినహా ఎలాంటి జ్ఞాపకాలు లేవు. రాంజీ పేరిట మ్యూజియం పెడతామని కేంద్రం ప్రకటించినా ఇప్పటికీ ముందడుగు పడలేదు. సెప్టెంబర్ 17 ప్రతిష్టాత్మకంగా మారిన నేపథ్యంలో తమ పూర్వీకులను గుర్తించి చరిత్రలో చోటుకల్పిస్తారేమోనన్న ఆశతో ఆ అమరవీరుల వారసులు ఎదురుచూస్తున్నారు. -
4 గిరిజన మ్యూజియంలు
సాక్షి, హైదరాబాద్: గిరిజనులు, ఆదివాసీ తెగల సంస్కృతి, సంప్రదాయాలను ప్రస్తుత, భవిష్యత్ తరాలకు చాటిచెప్పేందుకు త్వరలో నాలుగు ప్రదర్శన శాలలు(మ్యూజియం) ఏర్పాటు కానున్నాయి. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం చర్యలు వేగవంతం చేసింది. మేడారం సమ్మక్క, సారక్క జాతర జరిగే ప్రాంతంలో ఐదెకరాల విస్తీర్ణంలో ఒక మ్యూజియం ఏర్పాటు చేస్తోంది. దీనికి రూ.5 కోట్లు ఖర్చు చేస్తోంది. పనులు శరవేగంగా జరుగుతున్నాయి. 2018 జనవరి నెలాఖరులో జాతర ప్రారంభమయ్యేనాటికి మ్యూజియాన్ని అందుబాటులోకి తీసుకొచ్చేలా గిరిజన సంక్షేమ శాఖ చర్యలు చేపట్టింది. ఈ మ్యూజియంలో సమ్మక్క, సారక్కల జీవిత విశేషాలు, కోయతెగల సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించి లైవ్ ప్రెజెంటేషన్స్‌ను ఏర్పాటు చేస్తారు. అరుదైన విగ్రహాలు, బస్తర్ ప్రాంతంతో ఈ తెగకున్న సంబంధాలు, అక్కడి ప్రాచీన అవశేషాలను ప్రదర్శిస్తారు. నిర్మల్‌లో రాంజీగోండ్ మ్యూజియం తొలితరం స్వాతంత్య్ర సమరయోధుడైన రాంజీగోండ్ స్వస్థలంలో మరో మ్యూజియంను ప్రభుత్వం ఏర్పాటు చేస్తోంది. నిర్మల్ సరిహద్దులో దీనికోసం స్థలాన్ని గుర్తించింది. సిపాయిల తిరుగుబాటు సమయంలో దాదాపు వెయ్యి మంది గోండ్లను ఏకకాలంలో ఉరితీయడంతో ఒక ఊరి పేరు ఉరిలమర్రిగా మారింది. దీంతో అక్కడి చరిత్రతో పాటు గోండ్ తెగల సంస్కృతిని ప్రతిబింబించేలా శిలలు, విగ్రహాలను ఈ మ్యూజియంలో ఏర్పాటు చేయనున్నారు. ఈ మ్యూజియంకు కేంద్ర ప్రభుత్వం విడతల వారీగా రూ.10 కోట్ల ఆర్థిక సాయం ఇవ్వనుంది. ఈమేరకు రాష్ట్ర గిరిజన సంక్షేమ శాఖ కేంద్రానికి ప్రతిపాదనలు పంపగా ప్రధాని కార్యాలయం సానుకూలంగా స్పందించినట్లు అధికారులు చెబుతున్నారు. నల్లమల, భద్రాచలంలోనూ.. చెంచుల సంస్కృతి ప్రతిబింబించేలా నల్లమల అటవీ ప్రాంతంలో, కోయ తెగల సంస్కృతిని చాటేలా భద్రాచలం ఐటీడీఏ పరిధిలో మ్యూజియాలను ఏర్పాటు చేయనున్నారు. ఇప్పటికే హైదరాబాద్ మాసబ్‌ట్యాంక్‌లోని మ్యూజియంకు మరమ్మతులు చేసి ఆధునిక హంగులతో నిర్మించాలని గిరిజన శాఖ నిర్ణయించింది. -
చరిత్ర విస్మరించిన యోధుడు రాంజీ
భారత ప్రథమ స్వాతంత్య్ర పోరాటం అంటేనే సహజంగా స్ఫురించేది 1857 సిపాయిల తిరుగు బాటు. మధ్య భారత దేశంలో గోండ్వానా ప్రాం తంలో భాగమైన ఆదిలాబాద్ జిల్లాలో ఆదివాసీల నాయకత్వంలోని రాంజీగోండు ఆధ్వర్యంలో రోిహల్లా తిరుగుబాటు (1836-60), కొమురం భీం నేతృ త్వంలో జోడెన్ ఘాట్ తిరుగుబాటు (1938-40) దేశంలోనే ఆదివాసీ తొలి చారిత్రక పోరాటాలుగా నిలిచాయి. రోహిల్లాల తిరుగుబాటుకు చరిత్రకారులు మన చరిత్రకారులు స్థానం కల్పించలేదు. గోండుల వీర యోధుడైన మార్సికోల్లా రాంజీ గోండ్‌ను స్మరించుకునే వారే కనబడరు. మధ్యభారతంలోని మహారాష్ట్ర, ఒడిశా, మధ్య ప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో నివసించే అనేకమంది గిరిజన తెగల సమూహాల్లో గోండ్వానా రాజ్యం బ్రిటిష్ పాలకుల రాక పూర్వమే ఏర్పడి ఉన్నది. గోండుల పాలన క్రీ.శ 1240-1750 వరకు సుమారు 5 శతాబ్దాలపాటు కొనసాగింది. 9 మంది గోండు రాజులలో చివరివాడైన నీల్కంఠ్షా (క్రీ.శ 1735- 49)ని మరాఠీలు బంధించి చంద్రాపూర్‌ను ఆక్రమిం చుకున్నారు. దీంతో గోండ్వానా ప్రాం తం మరాఠీల ఆధీనమైనా, వారు బ్రిటిష్ వారికి తలొగ్గి గోండ్వా నాను తెల్లదొరలకు అప్పగించారు. దీం తో గోండులపాలన అంతమై, ఆంగ్లే యుల, నైజాం పాలన ఆరంభమైంది. వీరి పీడనకు వ్యతిరేకంగా గిరిజనుల తిరుగుబాటు మొదలైంది. ఆదిలాబాద్ జిల్లాలోని మార్సికొ ల్లా రాంజీ 1836-1860 మధ్య కాలంలో నాటి జనగాం (అసిఫాబాద్) కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ సైన్యాలను ధీటుగా ఎదుర్కొన్న తొలి గిరి జన పోరాట యోధుడు. బ్రిటిష్ సైన్యంతో ఎదురొడ్డి ఝాన్షీ లక్ష్మిబాయి వీరమరణం పొందిన తర్వాత నానాసాహెబ్, తాంతియాతోపే, రావు సాహెబ్‌లు తమ బలగాలతో విడిపోయారు. తాంతియా అనుచ రులైన రోహిల్లా సిపాయిలు పెద్ద సంఖ్యలో మహా రాష్ట్రలోని ఔరంగాబాద్, బీదర్, పర్బనీ, ఆంధ్రప్ర దేశ్‌లోని ఆదిలాబాద్ జిల్లాలోకి ప్రవేశించారు. వీరు అజంతా, బస్మత్, లాథూర్, మఖ్తల్, నిర్మల్‌లను పోరాట కేంద్రాలుగా చేసుకున్నారు. వీరి నేతగా ప్రక టించుకున్న రంగారావు నిజాం ప్రభుత్వాన్ని పడ గొట్టి, బ్రిటిష్ వాళ్లను తరిమేయాలని పోరాటానికి పూనుకున్నాడు. సైనిక బలగాల శిక్షణలో ప్రజల్ని ఉత్తేజితుల్ని చేసేక్రమంలో బ్రిటి ష్ సైన్యానికి పట్టుబడ్డాడు. యావజ్జీవశిక్ష అనుభవిస్తూ అండమాన్ జైలులో 1860 లో మరణించాడు. రాంజీ నేతృత్వంలో తిరుగుబాటు తీవ్రమైంది. రోహిల్లా సిపాయిల తిరుగుబాటు ప్రధానంగా అసిఫాబాద్ తాలూకా నిర్మల్ కేంద్రంగా జరిగింది. అది ప్రధానంగా గోండులు, కోలాము, కోయ తెగల గిరిజనుల ప్రాంతం. రాంజీగోండ్ సారథ్యంలో తిరుగుబాటు ఉధృతంగా మారింది. ఈ తిరుగుబాటు తుది కీలక ఘట్టం 1860 మార్చి ఏప్రిల్‌లో జరిగింది. బానిస బతుకులు వెళ్లదీస్తున్న గోండు గిరిజనులు వెట్టికి ప్రతిఫలం ఆశించడాన్ని తెల్లదొరలు సహించలేకపోయారు. ఆదిలాబాద్ ఏజె న్సీ ప్రాంతాలు బ్రిటిష్ వారి దౌర్జన్యంతో అల్లకల్లో లంగా మారాయి. రాంజీ నాయకత్వంలో వెయ్యి మంది రోహిల్లాలు, గోండులు కలసి నిర్మల్ సమీ పంలోని కొండలను కేంద్రంగా చేసుకుని బ్రిటిష్ పాలకులను ముప్పుతిప్పలు పట్టారు. నిర్మల్ కలెక్టర్ ఆధ్వర్యంలో నిజాం బలగాలు వారిపై దాడులు చేశా యి. ఆధునిక ఆయుధాల ముందు ఆదివాసులు నిలవలేకపోయారు. తెగించి పోరాడుతున్న ఆది వాసులను నిర్దాక్షిణ్యంగా కాల్చిచంపారు. కడదాకా పోరాడిన రాంజీగోండుతో సహా వెయ్యిమందిని పట్టుకుని నిర్మల్ నడిబొడ్డున ఉన్న ఊడలమర్రి చెటు ్టకు 1860 ఏప్రిల్ 9న ఉరితీశారు. ఆ మర్రి చెట్టు వెయ్యి ఉరిల మర్రిచెట్టుగా ప్రసిద్ధి. తెల్లదొరల దురాగతాలకు చిహ్నంగా నిలిచిన ఆ మర్రిచెట్టును తర్వాతి కాలంలో అంటే 1995లో నరికివేశారు. రాంజీగోండ్ నాయకత్వంలో సాగిన ఇంతటి వీరోచిత పోరాటాన్ని పాలకులు నిర్లక్ష్యం చేశారు. తెలంగాణ పోరాట మూలాలను వెతుక్కుం టూ తనదైన చరిత్రను పునర్నిర్మించుకుంటున్న తరుణంలో రాంజీ చరిత్రను వెలుగులోకి తేవాలి. రాంజీ గోండ్ పోరాటాన్ని, త్యాగాల్ని భావితరాలకు అందించాలి. నిర్మల్‌లోని ఉర్ల మర్రి చెట్టు స్థానంలో రాంజీ గోండు స్మారక స్థూపాన్ని, అలాగే ట్యాంక్ బండ్‌పైన కూడా నిర్మించాలి. (ఏప్రిల్ 9, రాంజీగోండ్ 155వ వర్థంతి.) (గుమ్మడి లక్ష్మీనారాయణ, ఆదివాసీ రచయితల సంఘం) మొబైల్ : 9951430476