సాక్షి, హైదరాబాద్: ఆదివాసీ పోరాట యోధుడు రాంజీగోండ్ పేరిట ప్రత్యేకంగా ఓ మ్యూజియం ఏర్పాటు చేస్తున్నారు. హైదరాబాద్ నడిబొడ్డున అబిడ్స్‌లోని గిరిజన సంక్షేమశాఖ స్థలంలో కేంద్రమంత్రులు అర్జున్‌ముండా, జి.కిషన్‌రెడ్డిల చేతుల మీదుగా సోమవారం శంకుస్థాపన జరిపేందుకు రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ ఏర్పాట్లు చేసింది.
రూ.35 కోట్లపైగానే వ్యయం
రాంజీగోండ్ మ్యూజియం ఏర్పాటుకు రూ.35 కోట్లు ఖర్చు చేయనున్నారు. ఇప్పటికే కేంద్ర ప్రభు త్వం రూ.10 కోట్లు విడుదల చేసింది. మరిన్ని నిధులు ఇచ్చేందుకు కూడా సిద్ధంగా ఉంది. రూ.10 కోట్లు ఇచ్చి ఏళ్లు గడుస్తున్నా అడుగు ముందుకు పడలేదు. మొదట్లో బాపూఘాట్ వద్ద మ్యూజియం ఏర్పాటు చేయాలని భావించారు. కానీ భూ సమస్య కారణంగా ఆదిలోనే ఆగిపోయింది. దీంతో అబిడ్స్‌లో ఏర్పాటు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
ఈ మ్యూజియంలో ప్రధానంగా గిరిజన స్వాతంత్య్ర సమరయోధుల వివరాలు, చరిత్ర, గిరిజన సంస్కృతి, సంప్రదాయాలకు సంబంధించిన పూర్తి సమాచారం అందుబాటులోకి తెస్తారు. గిరిజన సంక్షేమశాఖ పరిధిలో ఈ మ్యూజియం నిర్వహణ ఉంటుంది. దీని నిర్మాణంలో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం కూడా ఉంది.
టీసీఆర్‌టీఐ భవన ప్రారంభోత్సవం కూడా...
మాసాబ్‌ట్యాంక్‌లోని దామోదరంసంజీవయ్య సంక్షేమభవన్ ఆవరణలో గిరిజన సాంస్కృతిక పరిశోధన శిక్షణ సంస్థ (టీసీఆర్‌టీఐ)భవనం నిర్మించారు. దీనికి కేంద్ర ప్రభుత్వమే పూర్తిగా నిధులు విడుదల చేసింది. నాలుగు అంతస్తుల్లో సుమారు 20వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించిన ఈ భవనానికి కేంద్రం ఇప్పటివరకు రూ.6.5 కోట్లు ఇచ్చినట్టు అధికారులు చెబుతు న్నారు.
గిరిజన సంక్షేమశాఖలో టీసీఆర్‌టీఐ ఒక భాగమే అయినా, కేంద్ర గిరిజన సంక్షేమశాఖ ఆధీనంలో కార్యక్రమాలు నిర్వహిస్తారు. సోమ వారం మధ్యాహ్నం 3 గంటలకు ఈ భవనాన్ని కేంద్రమంత్రులు అర్జున్‌ముండా, జి.కిషన్‌రెడ్డి ప్రారంభిస్తారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర గిరిజన సంక్షేమశాఖ మంత్రి సత్యవతి రాథోడ్ తో పాటు స్థానిక ప్రజాప్రతినిధులు పాల్గొంటారు.
Comments
Please login to add a commentAdd a comment